
నాసిక్ నుంచి చెన్నై వెళ్లే ఎక్స్ప్రెస్ వే రూట్ మ్యాప్
కర్నూలు వద్ద రోడ్డెక్కితే 6 గంటల్లో చెన్నైకి, ఎలాగంటే..
షోలాపూర్- చెన్నై ఎక్స్‌ప్రెస్ వే అందుబాటులోకి వస్తే జర్నీ టైం సగానికి సగం తగ్గినట్టే..
ఇప్పుడు మీరు హైదరాబాద్ నుంచో, కర్నూలు నుంచో చెన్నై పోవడానికి కనీస 12,13 గంటలు పడుతుందా? ఎటెటో తిరిగి వెళ్లాల్సి వస్తోందా? ఇకపై ఆ అవసరం ఉండదు. ఒక్కసారి షోలాపూర్- చెన్నై ఎక్స్‌ప్రెస్ వే అందుబాటులోకి వస్తే జర్నీ టైం సగానికి సగం తగ్గినట్టేనంటున్నారు రవాణా రంగ నిపుణులు. కర్నూలు దగ్గర చెన్నై ఎక్స్‌ప్రెస్ వే ఎక్కితే ఇక ఝం అని మద్రాసు చేరినట్టేనంటోంది కేంద్ర రవాణా శాఖ.
ఇంతకీ ఏమిటీ షోలాపూర్-చెన్నై ఎక్స్‌ప్రెస్ వే? ఎక్కడ మొదలవుతుందీ, ఎక్కడ ముగుస్తుందీ, Andhra pradesh లో ఏయే జిల్లాల మీదుగా పోతుందీ అనేది ఓ సారి చూద్దాం.
కేంద్ర ప్రభుత్వం చేపట్టిన చెన్నై- సూరత్ (ప్రస్తుతం నాసిక్ వరకు) ఎక్స్‌ప్రెస్‌వే లో భాగమిది. ఆంధ్రప్రదేశ్‌లో చాలా కీలకమైన రహదారి కాబోతోంది. తాజా ప్రణాళిక ప్రకారం, ఈ రహదారి రాష్ట్రంలో ఎక్కడ మొదలవుతుంది, ఏయే ప్రాంతాల గుండా వెళ్తుందో కింద చూడవచ్చు.
ఆంధ్రప్రదేశ్‌లో ఈ రహదారి ఎలా వెళుతుందంటే..
ఈ కారిడార్ కర్ణాటక నుంచి ఆంధ్రప్రదేశ్‌లోకి ప్రవేశించి, ఇక్కడ సుమారు 340 కిలోమీటర్ల మేర సాగుతుంది.
ప్రవేశం (Entry Point): కర్ణాటకలోని కల్బుర్గి/రాయచూర్ వైపు నుండి కర్నూలు జిల్లా ద్వారా ఆంధ్రప్రదేశ్‌లోకి ప్రవేశిస్తుంది.
ముగింపు (Exit Point): చిత్తూరు జిల్లా సత్యవేడు సమీపంలో తమిళనాడు (చెన్నై వైపు) సరిహద్దులోకి ప్రవేశిస్తుంది.
ఈ హై వే రూటు ఎలా సాగుతుందంటే...
మహారాష్ట్ర: నాసిక్, అహ్మద్‌నగర్ మీదుగా షోలాపూర్ (అక్కల్‌కోట్)
కర్ణాటక: షోలాపూర్ నుంచి కిందకు వచ్చి కర్ణాటకలోని కల్బుర్గి (గుల్బర్గా), యాదగిరి, రాయచూర్ జిల్లాల గుండా వెళ్తుంది.
తెలంగాణ: రాయచూర్ దాటిన తర్వాత, ఇది తెలంగాణలోని జోగులాంబ గద్వాల జిల్లా (మల్దకల్, గద్వాల ప్రాంతం) గుండా కొద్ది దూరం (సుమారు 65 కి.మీ) ప్రయాణిస్తుంది.
ఆంధ్రప్రదేశ్: తెలంగాణ సరిహద్దు దాటాక, కర్నూలు జిల్లాలోని జులేకల్ (Julekal) గ్రామం వద్ద ఆంధ్రప్రదేశ్‌లోకి ప్రవేశిస్తుంది.
ఆంధ్రప్రదేశ్‌లో ఏ యే జిల్లాల మీదుగా...
ఎక్కడ ఎంటర్ అవుతుంది?: కర్నూలు జిల్లా, సి.బెళగల్ మండలం సమీపంలోని జులేకల్ గ్రామం వద్ద ఏపీలోకి ప్రవేశిస్తుంది.
ముగింపు (ఎండ్ పాయింట్): చిత్తూరు జిల్లా సత్యవేడు లేదా తమిళనాడు సరిహద్దు వరకు సాగి, చివరికి చెన్నై వద్ద ముగుస్తుంది.
ప్రధానంగా వెళ్లే ఊళ్లు/ప్రాంతాలు..
ఈ ఎక్స్‌ప్రెస్‌వే ప్రధానంగా రాయలసీమ జిల్లాల గుండా వెళ్తుంది. 5 జిల్లాల మీదుగా సాగుతుంది.
కర్నూలు జిల్లా: జులేకల్, కర్నూలు నగరం (బైపాస్), కోడుమూరు, ఓర్వకల్లు, నంద్యాల వైపుగా.
నంద్యాల జిల్లా: బనగానపల్లె.
వైఎస్ఆర్ కడప జిల్లా: జమ్మలమడుగు, మైదుకూరు మీదుగా కడప నగరం వెలుపల నుంచి సాగుతుంది.
అన్నమయ్య జిల్లా: రాజంపేట, రైల్వే కోడూరు సమీప ప్రాంతాల మీదుగా వెళ్తుంది.
తిరుపతి జిల్లా: రేణిగుంట, తిరుపతి శివారు ప్రాంతాలు , శ్రీకాళహస్తి వైపుగా వెళ్లి చివరకు చెన్నై చేరుకుంటుంది.
గ్రీన్ ఫీల్డ్ అలైన్‌మెంట్ ప్రయోజనాలు..
ఇది గ్రీన్ ఫీల్డ్ రహదారి కాబట్టి, ఇది పాత హైవే (NH-44 లేదా NH-40) వెంబడి కాకుండా, సాధ్యమైనంత వరకు కొత్తగా, తక్కువ దూరంతో నిర్మిస్తున్నారు. ఇది పాత రహదారులను వెడల్పు చేయరు. పూర్తిగా కొత్తగా నిర్మిస్తున్న (Greenfield) 6 వరుసల రహదారి. దీనివల్ల ప్రయాణ సమయం ఇప్పుడున్న దానికంటే సగానికి తగ్గుతుంది.
ఉదాహరణకు ప్రస్తుతం కర్నూలు నుంచి చెన్నైకి ఉన్న దూరం సుమారు 460, 480 కిలోమీటర్లు. ఈ కొత్త ఎక్స్‌ప్రెస్‌వే నేరుగా (Straight alignment) ఉండటం వల్ల, ఈ దూరం సుమారు 30 నుంచి 50 కిలోమీటర్ల వరకు తగ్గే అవకాశం ఉంది. అంటే సుమారు 420,430 కిలోమీటర్లకు తగ్గుతుంది.
ప్రస్తుత హైవే పై ట్రాఫిక్ ఉండడం, ఊళ్ల మధ్యలో నుంచి వెళ్లడం, మలుపుల వల్ల కర్నూలు నుండి చెన్నై చేరడానికి 9 నుండి 10 గంటలు పడుతుంది. అదే ఈ 'యాక్సెస్ కంట్రోల్డ్' (Access-controlled) ఎక్స్‌ప్రెస్ వే అందుబాటులోకి వస్తే రోడ్డు మధ్యలో వాహనాలు అడ్డు రావు, గంటకు 100 - 120 కి.మీ వేగంతో వెళ్లడానికి అనుమతి ఉంటుంది. దీంతో కర్నూలు నుండి చెన్నైకి కేవలం 5 నుంచి 6 గంటల్లోనే చేరుకోవచ్చు. దీనివల్ల దాదాపు 3 నుంచి 4 గంటల ప్రయాణ సమయం ఆదా అవుతుంది.
---------ప్రాజెక్ట్ ప్రొఫైల్....
పేరు- షోలాపూర్–చెన్నై ఎక్స్‌ప్రెస్‌వే
వరుసలు (లేన్స్): 6 వరుసలు (భవిష్యత్తులో 8 వరుసలు)
అమలు సంస్థ: నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI)
మంత్రిత్వ శాఖ: కేంద్ర రహదారి రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ
మొత్తం పొడవు: సుమారు 1,000 కిలోమీటర్లు
ఆంధ్రప్రదేశ్‌లో ఎంతదూరం: సుమారు 340 కిలోమీటర్లు
డిజైన్ వేగం: గంటకు గరిష్టంగా 120 కిలోమీటర్లు
ప్రయాణ సమయం (కర్నూలు–చెన్నై):
ఇప్పుడు 9–10 గంటలు → భవిష్యత్తులో 5–6 గంటలు
అంచనా మొత్తం ప్రాజెక్ట్ వ్యయం: రూ.55,000నుంచి రూ.60,000 కోట్లు
ఆంధ్రప్రదేశ్‌లో అంచనా వ్యయం: రూ.17,000 – రూ.19,000 కోట్లు
ప్రాజెక్ట్ పూర్తి: 2026 చివరికి లేదా 2027 ప్రారంభంలో
ఆంధ్రప్రదేశ్ సెక్షన్లు 2026 నాటికే అందుబాటులోకి వచ్చే అవకాశం
..........
ఈ తగ్గుదలకు ప్రధాన కారణాలు..
రోడ్డు ప్రధాన నగరాల లోపలి నుంచి కాకుండా, బయటి నుంచి (Bypasses) వెళ్తుంది. దీనివల్ల సిగ్నల్స్ లేదా సిటీ ట్రాఫిక్ సమస్య ఉండదు. పాత రోడ్లతో పోలిస్తే ఇది చాలా సూటిగా ఉంటుంది. గ్రామాల దగ్గర అండర్ పాస్ లు నిర్మించడం వల్ల వాహనాలు ఎక్కడా ఆగాల్సిన అవసరం ఉండదు.
రాయలసీమ ప్రాంతం నుండి చెన్నై పోర్టుకు సరకు రవాణా చేసే లారీలకు, ప్రయాణికులకు ఇది చాలా పెద్ద ఉపశమనం కలిగిస్తుంది.
పూర్తయ్యే సమయం...
కేంద్ర రవాణా శాఖ, నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) లక్ష్యాల ప్రకారం ఈ ప్రాజెక్టును 2026 చివరికి లేదా 2027 ప్రారంభం నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఏపీలోని కర్నూలు - కడప - తిరుపతి మధ్య ఉన్న ప్యాకేజీలు 2026 నాటికే అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.
మధ్యలో ఎన్ని టోల్ గేట్లు ఉండవచ్చు?
సాధారణంగా ఎక్స్‌ప్రెస్‌వేల మీద టోల్ వసూలు పద్ధతి పాత హైవేల కంటే భిన్నంగా ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ సరిహద్దు (కర్నూలు) నుండి చెన్నై వరకు సుమారు 340 కిలోమీటర్ల మేర ఈ రోడ్డు సాగుతుంది. ప్రతి 60 కిలోమీటర్లకు ఒక టోల్ ప్లాజా చొప్పున లెక్కిస్తే, ఏపీ పరిధిలోనే 5 నుండి 6 టోల్ గేట్లు వచ్చే అవకాశం ఉంది.
ఈ ఎక్స్‌ప్రెస్‌వేపై "క్లోజ్డ్ టోలింగ్ సిస్టమ్" ఉండే అవకాశం ఉంది. అంటే మీరు ఎక్కడ రోడ్డు ఎక్కారో, ఎక్కడ దిగారో ఆ దూరాన్ని బట్టి మాత్రమే టోల్ వసూలు చేస్తారు. దీనివల్ల ప్రతి చోటా ఆగాల్సిన అవసరం ఉండదు.
ప్రధాన ప్లాజాలు: రాష్ట్ర సరిహద్దుల వద్ద (కర్ణాటక-ఏపీ, ఏపీ-తమిళనాడు), అలాగే ప్రధాన నగరాలైన కర్నూలు, కడప, తిరుపతికి వెళ్లే ఎగ్జిట్ పాయింట్ల వద్ద పెద్ద టోల్ ప్లాజాలు నిర్మిస్తారు.
120 కిలోమీటర్ల వేగంతో...
ఈ రోడ్డుపై గంటకు 120 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించవచ్చు, కాబట్టి టోల్ గేట్ల వద్ద రద్దీ లేకుండా 'ఫాస్టాగ్' (FASTag) లేదా కొత్తగా రాబోతున్న 'జీపీఎస్ ఆధారిత టోల్' పద్ధతిని అమలు చేయవచ్చు.
ప్రతి 40-50 కిలోమీటర్లకు ఒకచోట 'వేసైడ్ ఎమినిటీస్' (పెట్రోల్ బంకులు, హోటళ్లు, రెస్ట్ రూమ్స్) ఏర్పాటు చేస్తున్నారు.
ముఖ్యంగా ఈ మార్పు వల్ల సూరత్ వరకు వెళ్లకపోయినా, నాసిక్ వరకు నేరుగా అనుసంధానం ఏర్పడటం వల్ల మహారాష్ట్ర, గుజరాత్ నుండి దక్షిణ భారతదేశానికి సరకు రవాణా చాలా వేగంగా జరుగుతుంది.
కడప, తిరుపతి జిల్లాల్లోని పారిశ్రామిక ప్రాంతాలకు ఇది వెన్నెముకగా మారుతుంది.
కడప, కర్నూలు సెక్షన్ లో పనులు ప్రారంభం.
ఆంధ్రప్రదేశ్‌లో భూసేకరణ ప్రక్రియ దాదాపు చివరి దశకు చేరుకుంది. రాయలసీమ జిల్లాలైన కర్నూలు, నంద్యాల, వైఎస్ఆర్ కడప, చిత్తూరు (తిరుపతి) జిల్లాల్లో ఈ రహదారికి అవసరమైన భూసేకరణను రాష్ట్ర ప్రభుత్వం తన బాధ్యతగా తీసుకుని పూర్తి చేసింది. మరికొన్ని ప్రాంతాల్లో నోటిఫికేషన్లు జారీ చేసి, పరిహారం చెల్లింపులు కూడా చాలా వరకు పూర్తయ్యాయి.
ఏపీలోని చాలా సెక్షన్లకు (Packages) సంబంధించి ఇప్పటికే టెండర్లు ఖరారయ్యాయి. కొన్ని చోట్ల (ముఖ్యంగా కర్నూలు, కడప జిల్లాల్లో) ప్రాథమిక పనులు కూడా ప్రారంభమయ్యాయి.
"సీమ నడిబొడ్డున కొత్త శకం"గా "ఈ ఎక్స్‌ప్రెస్‌వే ను పోలుస్తున్నారు. ఇది కేవలం ఒక రోడ్డు మాత్రమే కాదు, వెనుకబడిన రాయలసీమ జిల్లాలను పారిశ్రామిక హబ్‌లుగా మార్చే ఒక ఆర్థిక కారిడార్ అంటున్నారు.
Next Story

