
క్షణికావేశం..కూల్‌డ్రింక్‌తో ముగిసిన చిన్నారి జీవితం
కృష్ణా జిల్లాలో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. అసలు ఏమి జరిగిందింటే..
అది ఒక సాదాసీదా ఆదివారం సాయంత్రం. అందరి ఇళ్లలాగే ఆ ఇంట్లోనూ చిన్నపాటి అలకలు, ముద్దులొలికే చిన్నారుల సందడి ఉంది. కానీ, భార్యాభర్తల మధ్య జరిగిన ఒక చిన్నపాటి వాగ్వివాదం, ఆ ఇంటి దీపాన్ని ఆర్పేస్తుందని ఎవరూ ఊహించలేదు. షాపింగ్‌కు వెళ్లాలన్న కోరిక, భర్త రాకలో ఆలస్యం వెరసి.. ఒక ఐదేళ్ల బాలుడి ప్రాణాలను బలితీసుకుంది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ దుర్ఘటన సమాజాన్ని నిర్ఘాంత పోయేలా చేసింది.
అసలేం జరిగింది?
కృష్ణా జిల్లా చల్లపల్లికి చెందిన మన్యం వెంకట సుబ్బారావు, భార్య లక్ష్మితో కలిసి భీమవరంలోని బలుసుమూడిలో నివసిస్తున్నారు. ఈ నెల 16న, సాయంత్రం షాపింగ్‌కు వెళ్దామని, త్వరగా ఇంటికి రావాలని భర్తకు చెప్పింది లక్ష్మి. అయితే, పని ఒత్తిడిలో సుబ్బారావు ఇంటికి వచ్చేసరికి ఆలస్యమైంది.
చిన్న విషయమే అయినా.. ఆ క్షణంలో కలిగిన విపరీతమైన కోపంతో లక్ష్మి ఒక ఘోర నిర్ణయం తీసుకుంది. ఇంట్లో ఉన్న కూల్‌డ్రింక్ బాటిల్‌లో ఎలుకల మందు కలిపింది. తాను కొద్దిగా తాగి, మిగిలిన బాటిల్‌ను వంటింట్లో పెట్టి వెళ్లి నిద్రపోయింది. ఆ బాటిలే తన కొడుకు పాలిట యమపాశం అవుతుందని ఆమె ఊహించలేకపోయింది.
తెలియక తాగిన పసివాడు..
అర్ధరాత్రి నిద్రలేచిన ఐదేళ్ల కుమారుడు మహారుద్ర కాంత్, దాహంతో వంటిట్లోకి వెళ్లాడు. అక్కడ ఉన్న కూల్‌డ్రింక్ బాటిల్‌ను చూసి, అందులో విషం ఉందన్న విషయం తెలియక గటగటా తాగేశాడు. లోపల విషం చిచ్చుపెడుతున్నా, ఏమీ ఎరగని ఆ పసివాడు వెళ్లి హాయిగా నిద్రపోయాడు.
విషాదాంతం..
తెల్లవారుజామున రుద్రకాంత్ వాంతులు చేసుకోవడంతో తల్లిదండ్రులు ఉలిక్కిపడ్డారు. బాటిల్‌లో ఉన్న విషం తన కొడుకు కడుపులోకి వెళ్ళిందని గ్రహించిన తల్లి లక్ష్మి హతాశురాలైంది. వెంటనే భీమవరం, ఆపై మెరుగైన వైద్యం కోసం ఏలూరులోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. వైద్యులు శాయశక్తులా ప్రయత్నించినప్పటికీ, ఆదివారం మధ్యాహ్నం ఆ చిన్నారి ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి.
పోలీసుల దర్యాప్తు
కన్నకొడుకును కోల్పోయిన తండ్రి వెంకట సుబ్బారావు ఫిర్యాదు మేరకు భీమవరం టూటౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. క్షణికావేశంలో తీసుకునే నిర్ణయాలు జీవితాంతం కోలుకోలేని దెబ్బ తీస్తాయని ఈ ఘటన మరోసారి నిరూపించింది.

