
నిందితుడు ఎరిపల్లి యోగి అలియాస్ గాంధీ
మూడేళ్ల చిన్నారిపై కామాంధుడి పైశాచికం!
విశాఖ నగర పరిధిలో ముక్కుపచ్చలారని మూడేళ్ల చిన్నారిపై ఓ కామాంధుడు అమానుషానికి ఒడిగట్టాడు.
కామాంధులకు కన్నూమిన్నూ కానడం లేదు. వయసుతో పనిలేకుండా, శిశువులని కూడా చూడకుండా పశువుల్లా ప్రవర్తిస్తున్నారు. లోకం తెలియని చిన్నారి బాలికలను సైతం చిదిమేస్తున్నారు. అంతేకాదు.. మరికొందరైతే అఘాయిత్యాలకు పాల్పడ్డాక నిర్దాక్షిణ్యంగా హతమారుస్తున్నారు. ఇటీవల కాలంలో ఇలాంటి ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. నాలుగు రోజుల క్రితం అన్నమయ్య జిల్లా మదనపల్లెలో ఏడేళ్ల చిన్నారిపై ఓ కిరాతకుడు అత్యాచారానికి పాల్పడి హత్య చేసిన ఘటన మరవకముందే తాజాగా విశాఖలోనూ మరో మృగాడు అభం శుభం తెలియని చిన్నారిపై ఘాతుకానికే ఒడిగట్టాడు. ఆ వివరాలివీ..
ప్రతీకాత్మక చిత్రం
మూడేళ్ల చిన్నారిపై అఘాయిత్యం..
విశాఖ నగరంలోని పెదగంట్యాడ మండలం గంగవరంలో ఉంటున్న దంపతులకు మూడేళ్ల 50 రోజుల వయసున్న కుమార్తె ఉంది. అప్పన్న ఆటో డ్రైవర్. ఆ ప్రాంతానికే చెందిన ఎరిపల్లి యోగి అలియాస్ గాంధీ (19) అప్పన్నకు స్నేహితుడు. క్యాటరింగ్ పనులు చేస్తుంటాడు. యోగి బుధవారం సాయంత్రం 4.15 గంటలకు అప్పన్న ఇంటికి వచ్చాడు. ఆ సమయంలో అప్పన్న ఇంటి వద్ద లేడు. దీంతో యోగి ఆ చిన్నారికి బిస్కెట్లు కొనిస్తానని చెప్పి తన వెంట తీసుకెళ్లాడు. కానీ ఎంతసేపటికీ తిరిగి రాకపోవడంతో వారిద్దరి కోసం ధనలక్ష్మి వెతికింది. చివరకు యోగి ఇంటి వద్ద ఏడుస్తున్న కూతురిని చూసింది. వెళ్లి చూడగా ఆ చిన్నారి లోదుస్తులు తడిగా ఉండడంతో పాటు ఆమె మర్మాంగం నుంచి వచ్చిన రక్తపు మరకలను గుర్తించింది. భయంతో ఇరుగు పొరుగు వారిని పిలవడంతో వారొచ్చి చూశారు. యోగీ ఇంటికి సమీపంలో ఉన్న ఖాళీ స్థలంలో చిన్నారిపై అఘాయిత్యానికి పాల్పడినట్టు వారు గుర్తించారు. ఇంతలో నిందితుడు యోగి అక్కడ నుంచి పరారయ్యాడు. చిన్నారి తల్లి ఇచ్చిన ఫిర్యాదుతో న్యూపోర్టు పోలీసులు రంగంలోకి దిగారు. బాధిత బాలికను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సంఘటన విశాఖ నగరంలో సంచలనంగా మారింది.
విశాఖలోని న్యూపోర్టు పోలీస్ స్టేషన్
ఇటీవల ఒకే తరహా ఘటనలు..
ఇటీవల కాలంలో ఒకే తరహా ఘటనలు జరుగుతున్నాయి. చిన్నారులు, బాలికలపై అత్యాచారాలకు దిగుతున్న కామాంధులు ఆ తర్వాత బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. వాటిని పరిశీలిస్తే..
అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలం కొప్పుగంటిపాలెంలో సురేష్ అనే యువకుడు జులై 2024లో మైనర్ బాలికపై అసభ్యంగా ప్రవర్తించి హత్య చేశాడు. అనంతరం పోలీసు కేసుల భయంతో నిందితుడు పురుగుల మందు తాగి అత్మహత్య చేసుకున్నాడు. అలాగే 2018లో గుంటూరు జిల్లా దాచేపల్లిలో ఓ మైనర్ బాలికపై సుబ్బయ్య అనే వ్యక్తి అఘాయిత్యానికి ఒడిగట్టాడు. స్థానికులు రోడ్డెక్కి ఆందోళన చేయడంతో సుబ్బయ్య చెట్టుకు ఉరేసుకుని చనిపోపయాడు.
కడప జిల్లాలో కానిపని చేసి కడతేరాడు..
కడప జిల్లా జమ్మలమడుగు సమీపంలోని మైలవరం మండలం కంబాలదిన్నె గ్రామంలో గత ఏడాది మే 23న మూడేళ్ల బాలికను రహమతుల్లా (30) అనే యువకుడు అరటిపండు ఇస్తానంటూ తన వెంట తీసుకెళ్లి అత్యాచారం చేసి హత్య చేశాడు. ఈ దురాగతంపై ఆగ్రహోదగ్రులైన స్థానికులు నిందితుడు రహమతుల్లా ఇంటిని కూల్చేశారు. పరారైన రహమతుల్లా కోసం గాలించిన పోలీసులకు శవమై కనిపించాడు.
తునిలో బాలికపై అఘాయిత్యానికి పాల్పడి..
కాకినాడ జిల్లా తుని మండలం పైడికొండ మామిడి తోటలో గత అక్టోబరులో అరవయ్యేళ్ల వృద్ధుడు నారాయణరావు పదమూడేళ్ల బాలికపై లైంగిక దాడికి తెగబడ్డాడు. దానిని స్థానిక వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టడం వైరల్‌గా మారింది. బాలిక తల్లి ఫిర్యాదుతో ఆయనపై పోక్సో కేసు నమోదైంది. పోలీసులు నిందితుడిని జడ్జి ఎదుట ప్రవేశపెట్టడానికి తీసుకెళ్తుండగా కాలకృత్యాలు తీర్చుకోవడానికని వెళ్లి చెరువులో పడి ఆత్మహత్య చేసుకున్నాడు.
ఈనెల 15న అన్నమయ్య జిల్లా మదనపల్లె పట్టణంలో కులవర్థన్ అనే కసాయి గంజాయి, మద్యం మత్తులో తల్లిదండ్రులు ఇంట్లో లేని సమయం చూసి ఎదురింట్లో ఉన్న చిన్నారిని తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. అనంతరం నీటి డ్రమ్ములో పడేసి చంపేశాడు. పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని రక్షక్ జీపులో స్టేషన్‌కు తీసుకెళ్తుండగా తప్పించుకుని పారిపోయాడు. ఆ మర్నాడు సమీపంలోని చెరువులో శవమై తేలాడు. కులవర్థన్ చెరువులోకి దూకి ఆత్మహత్య చేసుకున్నట్టు పోలీసులు ప్రాథమికంగా తేల్చారు.
Next Story

