
కోటిన్నర గెలిచిన కేజిన్నర కోడి
తాడేపల్లిగూడెం బరిలో హోరాహోరీగా జరిగిన పోరులో సేతువను చిత్తు చేసి అక్షరాల రూ. 1.53 కోట్లు తెచ్చిన డేగ కోడి.
అది కేవలం కేజిన్నర బరువున్న పుంజు. కానీ దాని కాలికి కట్టిన కత్తి కోటిన్నర విలువైన పందెపు గెలుపును శాసించింది. సంక్రాంతి రెండో రోజున పశ్చిమగోదావరి జిల్లాలో జరిగిన ఒక కోడిపందెం ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ’కాయ్ రాజా కాయ్‘ అంటూ సాగిన వేల కోట్లు చేతులు మారిన పందేల పర్వంలో... ఈ ఒక్క పందెం మాత్రం చరిత్ర సృష్టించింది. ఆరు నెలల పాటు కంటికి రెప్పలా కాపాడుకున్న ఒక ’డేగ‘ రకం పుంజు.. బరిలో మెరుపులు మెరిపిస్తూ ప్రత్యర్థిపై కత్తులు దూసి.. తన యజమానిని రాత్రికి రాత్రే కోటీశ్వరుడిని చేసింది.
హోరాహోరీ పోరు.. ’సేతువ‘ వర్సెస్ ’డేగ‘
తాడేపల్లిగూడెంలోని పైబోయిన వెంకటరామయ్య ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బరి.. అక్షరాల ఒక యుద్ధ రంగాన్ని తలపించింది. అక్కడ తలపడింది కేవలం రెండు కోళ్లు మాత్రమే కాదు, ఇద్దరు హేమాహేమీలైన పందెం రాయుళ్ల ప్రతిష్ట. ఒకవైపు గుడివాడ నుంచి వచ్చిన భారీ కాయం కలిగిన ’సేతువ‘ రకం కోడి. మరోవైపు రాజమండ్రికి చెందిన రమేష్ సాకిన పదునైన ’డేగ‘ రకం కోడి. పందెం మొదలవ్వకముందే బరి చుట్టూ ఉత్కంఠ నెలకొంది. ఇరుపక్షాల పందెం రాయుళ్లు తమ కోడి గెలుస్తుందంటే తమ కోడి గెలుస్తుందని పంతాలకు పోవడంతో.. అక్షరాల కోటి 53 లక్షల రూపాయల బెట్టింగ్ జరిగిపోయింది. కరెన్సీ నోట్ల వర్షం మధ్య బరిలో కత్తులు దూశాయి.
ఆరు నెలల తపస్సు.. నిమిషాల్లో గెలుపు
యజమాని రమేష్ తన డేగ పుంజును గత ఆరు నెలలుగా కంటికి రెప్పలా కాపాడుకున్నాడు. బాదం.. పిస్తా.. బలవర్ధకమైన కండపుష్టి ఆహారంతో దాన్ని ఒక వీరుడిలా.. యుద్ధతంత్రం తెలిసిన యోధుడిలా తీర్చిదిద్దాడు. బరిలోకి దిగగానే తనకంటే భారీగా ఉన్న సేతువపైకి ఈ డేగ మెరుపు వేగంతో విరుచుకుపడింది. గాలిలోకి ఎగిరి కాలికి కట్టిన కత్తితో శత్రువు గుండెల్లో గురి చూసి కొట్టింది. నిమిషాల వ్యవధిలోనే ప్రత్యర్థిని చిత్తు చేసి.. తన యజమానికి కోట్లాది రూపాయలను విజయ కానుకగా అందించింది. ఆరు నెలల ఓపికకు ఆరు నిమిషాల్లో దక్కిన ఈ భారీ విజయం చూసి బరి వద్ద ఉన్న వారంతా విస్తుపోయారు.
భుజాన ఎత్తుకున్న స్నేహితులు.. జాతరైన బరి
విజయం ఖాయమవ్వగానే రమేష్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. కేవలం కేజిన్నర బరువున్న తన పుంజు.. కోటిన్నర గెలిచి తనను రాత్రికి రాత్రే కోటీశ్వరుడిని చేయడంతో అక్కడున్న వారంతా అశ్చర్యపోయారు. స్నేహితులు.. స్థానికులు రమేష్‌ను భుజాన ఎత్తుకుని బరి చుట్టూ తిప్పుతూ కేకలు వేశారు. ఆ ప్రాంతమంతా జయహో ’డేగ‘ అంటూ మారుమోగిపోయింది. పెట్టిన తిండి రుణం తీర్చుకున్న పుంజు.. యజమానిని సింహాసనంపై కూర్చోబెట్టింది.
గోదావరి జిల్లాల్లో ’పందెం‘ పండుగ
ఒక్క తాడేపల్లిగూడెమే కాదు.. ఉమ్మడి గోదావరి జిల్లాల్లోని మురమళ్ల.. రావులపాలెం.. చేబ్రోలు.. నవుడూరు బరులన్నీ జనసంద్రమయ్యాయి. తెలుగు రాష్ట్రాలతో పాటు విదేశాల్లో స్థిరపడిన ఎన్‌ఆర్‌ఐలు.. ప్రజాప్రతినిధులు కూడా ఈ ’డేగ‘ పందెం గురించి ఆసక్తిగా ఆరా తీయడం విశేషం. నవుడూరు బరి వద్ద కిలోమీటర్ల మేర కార్లు బారులు తీరడం, కోట్లాది రూపాయల నగదు బ్యాగులు మారడం చూస్తుంటే సంక్రాంతి సంబరాలు ఏ రేంజ్‌లో ఉన్నాయో అర్థమవుతోంది. గోదావరి గాలిలో పౌరుషం, బరిలో కరెన్సీ నోట్ల వర్షం వెరసి ఈ ఏడాది సంక్రాంతి ఒక సిరుల జాతరగా చరిత్రలో నిలిచిపోనుంది.

