
మృత్యువులా మారిన మలుపు..డ్రైవర్ సజీవదహనం
ఇంధన ట్యాంకులు పగిలి నిమిషాల వ్యవధిలోనే మంటలు దావానలంలా వ్యాపించాయి.
కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గ పరిధిలోని కత్తిపూడి జాతీయ రహదారిపై గురువారం తెల్లవారుజామున పెను ప్రమాదం సంభవించింది. రెండు భారీ కంటైనర్లు బలంగా ఢీకొనడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగి, ఓ డ్రైవర్ వాహనంలోనే చిక్కుకుపోయి సజీవదహనమైన హృదయవిదారక ఘటన చోటుచేసుకుంది.
ప్రమాదం జరిగిందిలా..
పోలీసుల కథనం ప్రకారం.. భీమవరం నుంచి మూలపేటకు ఆక్వా మేత (Fish Feed) లోడుతో వెళ్తున్న ఒక కంటైనర్ కత్తిపూడి జంక్షన్ వద్ద మలుపు తిరుగుతోంది. సరిగ్గా అదే సమయంలో కోల్‌కతా నుంచి చెన్నైకి కాటన్ వేస్ట్ బండిల్స్ లోడుతో వస్తున్న మరో కంటైనర్ దానిని వేగంగా ఢీకొట్టింది. ఈ ఢీకొన్న తీవ్రతకు ఇంధన ట్యాంకులు పగిలి నిమిషాల వ్యవధిలోనే మంటలు దావానలంలా వ్యాపించాయి.
సజీవదహనమైన డ్రైవర్
ఈ ప్రమాదంలో కాటన్ లోడుతో ఉన్న కంటైనర్ ముందు భాగం (క్యాబిన్) పూర్తిగా అగ్నికి ఆహుతి అయ్యింది. అందులో ఉన్న డ్రైవర్ కమల్ షేక్ (43) బయటకు వచ్చే అవకాశం లేక క్యాబిన్ లోపలే మంటల్లో చిక్కుకుని సజీవదహనమయ్యాడు. మృతుడు కోల్‌కతాకు చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. మరో కంటైనర్‌లోని ఇద్దరు వ్యక్తులు గాయాలతో బయటపడగా, వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
సహాయక చర్యలు
మంటల ధాటికి రహదారి అంతా దట్టమైన పొగతో నిండిపోవడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. సమాచారం అందుకున్న అన్నవరం ఎస్సై శ్రీహరిబాబు, ప్రత్తిపాడు సీఐ సూర్య అప్పారావు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. అగ్నిమాపక సిబ్బంది గంటల తరబడి శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.

