క్యాన్సర్ రహిత ఏపీయే లక్ష్యం
x

క్యాన్సర్ రహిత ఏపీయే లక్ష్యం

చీపురుపల్లిలో హెచ్‌పీవీ వ్యాక్సినేషన్ ప్రారంభించిన సీఎం చంద్రబాబు.


మహిళల ఆరోగ్య పరిరక్షణే ధ్యేయంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. శనివారం విజయనగరం జిల్లా చీపురుపల్లిలో నిర్వహించిన ప్రజా వేదిక సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సర్వైకల్ క్యాన్సర్ నివారణకు ఇచ్చే హెచ్‌పీవీ (HPV) వ్యాక్సినేషన్ ప్రక్రియను అధికారికంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఆరోగ్యవంతమైన సమాజ స్థాపనే కూటమి ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు.

మహిళల ప్రాణాలకు రక్షణ కవచం
రాష్ట్రంలో సర్వైకల్ క్యాన్సర్ (గర్భాశయ ముఖద్వార క్యాన్సర్) ప్రధాన సమస్యగా మారిందని సీఎం ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో వేల సంఖ్యలో క్యాన్సర్ బాధితులు ఉన్నారు. 2025 నాటికి ఈ సంఖ్య 32 వేలకు పైగా పెరిగే అవకాశం ఉంది. అందుకే ముందస్తు జాగ్రత్తగా 14, 15 ఏళ్ల వయసున్న బాలికలకు ఈ వ్యాక్సిన్ ఇవ్వాలని నిర్ణయించాం. బయట రూ.4 వేలు ఖర్చయ్యే ఈ వ్యాక్సిన్‌ను ప్రభుత్వం పూర్తిగా ఉచితంగా అందిస్తోంది అని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 3.45 లక్షల మంది బాలికలకు ఈ రక్షణ కవచాన్ని అందిస్తున్నట్లు వెల్లడించారు.
సంక్షేమంలో సరికొత్త రికార్డు.. ఎన్టీఆర్ భరోసా
ఆరోగ్యంతో పాటు పేదల ఆర్థిక భరోసాకు తమ ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని చంద్రబాబు పేర్కొన్నారు. ప్రతి నెలా 1వ తేదీనే 67 లక్షల మందికి ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు అందిస్తున్నాం. దీని కోసం ఏడాదికి రూ.33 వేల కోట్లు వ్యయం చేస్తున్నాం. గతంలో నెల తప్పితే పెన్షన్ కట్ చేసేవారు, కానీ ఇప్పుడు మూడు నెలల పెన్షన్ ఒకేసారి తీసుకునే వెసులుబాటు కల్పించాం అని వివరించారు.
గత పాలనపై ఘాటు విమర్శలు - లడ్డూ అపచారం
వైఎస్సార్‌సీపీ హయాంలో జరిగిన అరాచకాలను సీఎం ఈ సందర్భంగా ఎండగట్టారు. దేవుడి పవిత్రతను కూడా దెబ్బతీసేలా తిరుమల లడ్డూ తయారీలో కెమికల్ నెయ్యి వాడారు. చేసిన తప్పును ఇతరులపై నెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. అలాగే, అసెంబ్లీకి రాకుండా ప్రతిపక్ష హోదా కోసం పట్టుబట్టడం హాస్యాస్పదం. 10 శాతం సీట్లు కూడా రాని వారికి హోదా ఎలా ఇస్తారు? అని ప్రశ్నించారు. రాష్ట్రంలో గంజాయి బ్యాచ్‌లకు, రౌడీయిజానికి చోటు లేదని హెచ్చరించారు.
ఉత్తరాంధ్ర అభివృద్ధికి బాటలు
ఉత్తరాంధ్ర యువతకు స్థానికంగానే ఉపాధి కల్పించేందుకు గూగుల్, టీసీఎస్, కాగ్నిజెంట్ వంటి దిగ్గజ సంస్థలను తీసుకువస్తున్నామని సీఎం తెలిపారు. భోగాపురం విమానాశ్రయం పనులు వేగంగా జరుగుతున్నాయని, గిరిజన యూనివర్సిటీని త్వరలోనే పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేసి, రైతులకు క్యూఆర్ కోడ్ భద్రతతో కూడిన కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీ చేస్తున్నామని చెప్పారు.
Read More
Next Story