
జాతీయ రహదారిపై ఘోర ప్రమాదం.. ఐదుగురు పోలీసులు మృతి..
ఒడిశా రాష్ట్రం ఝార్సుగూడలో NH-49పై SUV ట్రక్కును ఢీకొనడంతో ఐదుగురు పోలీసులు మృతి. మరో నలుగురికి తీవ్ర గాయాలు..
ఒడిశాలో విషాదం చోటుచేసుకుంది. ఝార్సుగూడలోని జాతీయ రహదారి - 49పై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఐదుగురు పోలీసులు ప్రాణాలు కోల్పోయారు. మరో నలుగురు గాయపడ్డారు. ఆదివారం తెల్లవారుజామున ఝార్సుగూడ సదర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఒడిశా ఆదర్శ్ విద్యాలయ సమీపంలో ఈ ఘటన జరిగింది. ఓ వివాహానికి హాజరై తిరిగి వస్తుండగా పోలీసులు ప్రయాణిస్తున్న SUV వాహనం ఎదురుగా వస్తున్న ట్రక్కును బలంగా ఢీకొట్టింది. దీంతో SUV ముందు భాగం పూర్తిగా నుజ్జునుజ్జయింది. ట్రక్కు కూడా దెబ్బతింది. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు.. గాయపడిన వారిని వెంటనే ఝార్సుగూడ జిల్లా ప్రధాన ఆసుపత్రికి తరలించారు. అనంతరం తీవ్రంగా గాయపడ్డ వారిని మెరుగైన చికిత్స కోసం ఇతర ఆసుపత్రులకు మార్చారు. ఈ ప్రమాదంలో ఐదుగురు అధికారులు అక్కడికక్కడే మృతిచెందినట్లు ఝార్సుగూడ అదనపు పోలీసు సూపరింటెండెంట్ మధు షికా తెలిపారు. ఇద్దరు తీవ్ర గాయాలతో బార్గఢ్‌లోని ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని, మరొకరి పరిస్థితి నిలకడగా ఉందని వివరించారు. ట్రక్ డ్రైవర్ కూడా గాయపడి చికిత్స పొందుతున్నాడని, కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించినట్లు తెలిపారు.
మృతులను APR సిబ్బంది కాశీరాం భోయ్, దేబదత్త సా, డ్రిల్ సబ్-ఇన్‌స్పెక్టర్ నిరంజన్ కుజుర్, APR హవల్దార్ లింగరాజ్ ధురువా, హోమ్ గార్డ్ భక్తబంధు మిర్ధాగా గుర్తించారు. ఈ ఘటన జిల్లాలో తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ఆర్మ్డ్ పోలీస్ రిజర్వ్‌కు చెందిన ఇద్దరు సభ్యులు, ఒక సార్జెంట్ సహా మరో ఇద్దరు సిబ్బందికి తీవ్ర గాయాలైనట్లు చెబుతున్నారు. ప్రస్తుతం వీరి పరిస్థితి విషమంగా ఉంది. ప్రమాదానికి కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ట్రక్ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని విచారణ కొనసాగిస్తున్నారు.

