
45 కోట్లు ఇమామ్, మౌజన్‌ల గౌరవవేతన బకాయిలు
విజయవాడ ఇఫ్తార్ విందు కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు
ఇమామ్, మౌజన్‌లకు ఇచ్చే గౌరవ వేతన బకాయిలు రూ.45 కోట్లు వెంటనే విడుదల చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. అమరావతిలో నూతనంగా హజ్ హౌస్ నిర్మిస్తామని హామీ ఇచ్చారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ముస్లింలకు 21 నెలల్లో అనేక సంక్షేమ పథకాలు అందించిందని వివరించారు. విజయవాడలోని ఏ ప్లస్ కన్వెన్షన్‌లో ప్రభుత్వం తరపున ఇచ్చిన ఇఫ్తార్ విందులో ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రార్థనల్లో పాల్గొన్నారు. ముస్లింలకు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ...”కడపలో అసంపూర్తిగా ఉన్న హజ్ హౌస్‌ను త్వరలో అందుబాటులోకి తీసుకొస్తాం. పవిత్ర రంజాన్ మాసంలో కఠోర ఉపవాస దీక్ష చేసిన ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు ఇస్తున్నాం. అన్ని జిల్లాల్లోనూ, నియోజకవర్గాల్లోనూ ప్రభుత్వం తరపున ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశామన్నారు.
రంజాన్ పండుగను పురస్కరించుకుని పేదలకు దానం చేస్తే సంతోషంగా ఉంటారని మహ్మద్ ప్రవక్త బోధించారు. పేదలకు సాయం చేయడమే ఖురాన్ ప్రవచించిన సూక్తి. ముస్లింలను ఆర్థికంగా, రాజకీయంగా అభివృద్ధిలోకి తేవటమే లక్ష్యంగా పని చేస్తున్నాం. ఎన్టీఆర్ భరోసా పింఛన్లు ముస్లింలలో 4.38 లక్షల మందికి ఇస్తూ ఏడాదికి రూ.3,511 కోట్లు ఖర్చు చేస్తున్నాం. 4.5 లక్షల మంది ముస్లిం విద్యార్దులకు తల్లికి వందనం ఇస్తున్నాం. పోస్ట్ మెట్రిక్ స్కాలర్ షిప్పులు 19,215 మందికి రూ.264 కోట్లు విడుదల చేశాం. దీపం-2.0 పథకం కింద 6.20 లక్షల కుటుంబాలకు రూ.158 కోట్లతో సిలిండర్లకు ఖర్చు చేస్తున్నాం. ఇమామ్‌లకు రూ.5 వేలు, మౌజన్లకు రూ.10 వేల చొప్పున గౌరవ వేతనంగా రూ.180 కోట్లు అందించాం. మరో రూ.45 కోట్ల బకాయిలు కూడా వెంటనే విడుదల చేయాలని అధికారులను ఆదేశించాను.”అని ముఖ్యమంత్రి ప్రకటించారు.
ముస్లింల మనోభావాలను కూటమి ప్రభుత్వం గౌరవిస్తుంది

