మదనపల్లె గురించి ఎవ్వరికీ తెలియని 22 చారిత్రక సత్యాలు
x

మదనపల్లె గురించి ఎవ్వరికీ తెలియని 22 చారిత్రక సత్యాలు

మదనపల్లె జిల్లా ఏర్పాటువుతున్న సందర్భంగాప్రత్యేక కథనం


1. 1800 సంవత్సరం కంటే ముందు మదనపల్లె (Madanapalle)ని మహమ్మదీయులు, మరాఠాలు, మైసూరు సుల్తాన్, పాలెగాళ్లు కసితీరా దోచుకున్నారు. ప్రతిదాని మీద శిస్తు వేసి కరువు లో కూడా కనికరం లేకుండా రైతులను హింసించారు. పెళ్లికొడుకు, పెళ్లికూతుర్ల మీద కూడా శిస్తు విధించిన చరిత్ర మదనపల్లెపాలకులకు ఉంది. మదనపల్లె పాలెగాళ్లు మరీ దుర్మార్గులు. వాళ్లు చేయని అకృత్యాలులేవు. 1800 సంవత్సరంలో నిజాం ప్రభువు తన పాలక కింద ఉన్న కడప, అనంతపురం, చిత్తూరు, కర్నూలు, బళ్లారి ప్రాంతాలను ఈస్టిండియా కంపెనీకి అప్పగించడంతో మదనపల్లెలో పాలెగాళ్ల ఆగడాలు ఆగిపోయాయి. మదనపల్లెకు మంచి రోజులు వచ్చాయి. ఈ మంచిరోజులను తెచ్చిన వాడు థామస్ మన్రో (Thomas Munro) . ఈ జిల్లాలను సీడెడ్ జిల్లాలు అనేవాళ్లు. అవే తర్వాత రాయలసీమ అయ్యాయి.ఆయన అయిదు జిల్లాలకు అధికారిగా 1800 నియమితుడయ్యాడు. ఆ సంవత్సరంతో మదనపల్లె అధునిక చరిత్ర మొదలవుతుంది.

2. థామస్ మన్రో సొంత ఇల్లు కట్టుకున్నది మొదట మదనపల్లెలోనే. 1801లో మదనపల్లెని సందర్శించి అక్కడి వాతావరణానికి, అందమయిన పరిసరాలకు ముగ్ధుడై అక్కడ ఇల్లు కట్టుకున్నాడు. 1807లోఇంగ్లండు వెళ్లేవరకు ఆయన తరచూ మదనపల్లె ఇంటికి వచ్చే వారు.

3. మన్రో దొర పాలెగాళ్లని అణచేయడంతో మదనపల్లె పరిసరాలు ప్రశాంతమయ్యాయి. ఫలితంగా మదనపల్లె పట్టణంగా పెరగడం మొదలయింది. అయితే, మదనపల్లె చరిత్ర నిండా కరువులు కాటకాలు చేసిన గాయాలెన్నో ఉన్నాయి. 1803లో ఒక భయంకరయమయిన కరువు వచ్చింది. 1804లో తుఫాన్ మదనపల్లెను అతలాకుతలం చేసింది.1000 చెరువులు తెగిపోయాయి.

బ్రిటిష్ ప్రభుత్వం కట్టించిన భవనం, ఇపుడిది సబ్ కలెక్టర్ కార్యాలయం


4.1866లో మరొక కరువు వచ్చి రెండేళ్లు పట్టి పీడించింది. ఈ భయంకర కరువును చూసి బ్రిటిష్ పాలకులు కూడా చలించిపోయి కరువు ఉపాధి కల్పన కింద ఈ ప్రాంతమంతా రోడ్లు వేయడం మొదలుపెట్టారు. 1874లో మరొక భయంకరమయిన తుఫాన్ వచ్చింది. 20 అంగుళాల వాన కురిసింది. 1876 మరొక కరువు వచ్చి రెండేళ్లు పీడించింది. అపుడు మదనపల్లె కడప జిల్లా ఉండింది. జిల్లా మొత్తం కరువు బారిన పడింది. మదనపల్లెయే తీవ్ర బాధితురాలు. మదనపల్లె ప్రాంతంలో కరువు గంజికేంద్రాలు ఏర్పాటు చేశారు. దీనికి బెంగాల్ నుంచి కూడా అధికారులు వచ్చి సహాయక చర్యల్లో పాల్గొన్నారు. కరువురోడ్లు పెద్దఎత్తున చేపట్టారు. చెరువుల మరమ్మతులు కూడా చేశారు.

5. ఆ భయంకరమైన కరువులో తినడానికి తిండిలేక అడవిలోని దేవదారు చెట్టు బెరడు, కలబంద గుజ్జు ఉడికించి తినేవారు. అది తిని చాలా మంది జబ్బుపడ్డారు.

6.1891-92లో మరొక కరువు వచ్చింది. అపుడు సబ్ కలెక్టర్ జె ఎల్ అట్కిన్సన్ కరువు పనుల కింద పెద్ద ఎత్తున రోడ్లు మరమ్మతులు ప్రారంభించి ప్రజలను ఆదుకున్నాడు. 1897, 1900 మరొక రెండు పెద్ద కరువులు వచ్చాయి.

7.1903లో తుఫాన్ వల్ల భారీ వర్షాలు కురిశాయి. రోడ్లు కొట్టుకుపోయాయి, ఇళ్లు కూలిపోయాయి. చెరువులు తెగిపోయాయి. అపుడు మదనపల్లెలో 18 అంగుళాల వాన, రాయచోటిలో 20 అంగుళాల వాన కురిసింది.

8. 1904 జనవరి 15న మదనపల్లెకు ప్లేగ్ సోకింది. దీనితో మదనపల్లెను మొత్తంగా ఖాళీ చేశారు. ఇలా టౌన్ మొత్తం మూడు నెలలపాటు నిర్మానుష్యంగా ఉండింది. 100 మంది సిపాయిలను రప్పించి ఊర్లోని ప్రతిఇంటిని శానిటైజ్ చేయాల్సివచ్చింది. అపుడు అటవీ అధికారిగా ఉన్న ఎఫ్ ఎ కాలరిడ్జి ఈ విషయాన్ని రికార్డు చేశారు. అదే సమయంలోనే బార్బర్ స్ట్రీట్ లో ఒక అగ్ని ప్రమాదం కూడా జరిగింది. ప్లేగ్ వ్యాధి వల్ల 186 మంది చనిపోయారు. మళ్లీ ఇలాంటి పరిస్థితి రాకుండా ఉండేందుకు ప్లేగ్ తర్వాత పట్టణంలో మురుగు వ్యవస్థను డెవెలప్ చేశారు. మొదటి మురుగు కాలువ కమ్మ వీధిలో పూర్తయింది. ప్రైవేటు స్కావెంజింగ్ మొదయింది. చక్కటి మాంసం మార్కెట్ ఏర్పాటయింది. మంచినీళ్ల సరఫరా కోసం లక్కిరెడ్డి చెరువును పునురుద్ధరించారు.

9. తర్వాత మదనపల్లిలో యూరోపియన్ కాలనీ మొదలయింది. మొదట అక్కడ ఒక్క మన్రో ఇల్లు మాత్రమే ఉండేది. ఆ తర్వాత అక్కడి వాతావరణం చూసి ముచ్చటపడి అనేక మంది మిషనరీలు, అధికారులు స్థిరనివాసం ఏర్పరుచుకున్నారు. కడప కలెక్టర్ హెచ్ లాకాన్ కూడా ఒక ఇల్లు ఏర్పాటుచేసుకున్నారు.

10. 1846లో కడప కలెక్టర్ గా ఉన్న జె ఎహ్ కొక్రేన్ కూడా ఇక్కడ అష్టభుజ గృహం నిర్మించేందుకు సన్నాహం చేశారు. ఆ నిర్మాణం జరుగుతుండగానే ఉయ్యాల వాడ నరసింహారెడ్డి కొవెలకుంట్ల ట్రెజరీ మీద దాడి చేసి దోచుకున్నాడనే వార్త వచ్చింది. 1861లో కలెక్టర్ గా వచ్చిన ఎఫ్ బి మోలోనీ ఈ భవనాన్ని కొంత నిర్మించుకున్నారు. 1903లో అప్పటి కలెక్టర్ ఎఫ్ ఎ కాలరిడ్జి మొదటి అంతస్తు నిర్మించుకున్నారు.

బ్రిటిష్ అధికారులు కట్టించిన బంగళా, ఇపుడిది ఇరిగేషన్ కార్యాలయం

11. తర్వాత మరిన్ని బంగాళాలు నిర్మాణమయ్యాయి. ఇందులో ప్రముఖమయినది కడప లండన్ మిషన్ కు చెందిన రెవరెండ్ ఎడ్వర్డ్ ఫోర్టర్ బంగళా.1860లో నాటి కలెక్టర్ ఎ వెడ్డర్బర్న్ సొంతంగా ఒక బంగళా నిర్మించుకున్నారు. తర్వాత కలెక్టర్ గా వచ్చిన హెచ్ జి స్మిత్ కు ఆయన అమ్మాడు. స్మిత్ దానిని మదనపల్లె తాశీల్దార్ అప్పారావుకు అమ్మాడు. అపుడు దాని ధర రు. 4500. తర్వాత పోలీస్ ఇన్స్ పెక్టర్ స్వాన్ ఒక బంగళా కట్టాడు. తర్వాత అది సబ్ కలెక్టర్ కార్యాలయంగా మారింది.

12. ఇక్కడొక విషయం చెప్పుకోవాలి. మొన్నామధ్య 2024లో మదనపల్లెలో ఒక ప్రభుత్వాఫీసును ఎవరో తగులబెట్టారు. ఒక కేసుకు సంబంధించిన ఫైళ్లు లేకుండా చేశారు. ఇలాంటి సంఘటనే 1884 లోకూడా జరిగింది. ఒక క్రిమినల్ కేసు అపుడు విచారణలో ఉంది. దానికి సంబంధించిన ఫైళ్లు సబ్ కలెక్టర్ ఆఫీసులోఉన్నాయి. వీటిని నాశనం చేసేందుకు ఆఫీసుకు ఎవరో నిప్పు పెట్టారు. అయితే అపుడు అక్కడి స్కూలు స్కౌట్ విద్యార్థులు మంటలు ఆర్పి రికార్డులను కాపాడారు.

13. 1859లో మదనపల్లె సభ్ కలెక్టర్ హెడ్ క్వార్టర్స్ అయింది. ఐసిఎస్ ఆఫీసర్ ఎఫ్ బి మోలోని మొదటి సబ్ కలెక్టర్. తర్వాత ఆయన కడప కలెక్టర్ అయ్యారు. దాదాపు 50 సంవత్సరాలు కడపలో ఉండిన ఆఫీసర్లకు సమ్మర్ కాంపుగా మదనపల్లె పనిచేసింది. మదనపల్లెలో పోస్టింగ్ తీసుకున్న మొదటి ప్రభుత్వ ఉన్నతాధికారి మేజర్ జె ఎఫ్ పామర్. ఆయన 1855లో మదనపల్లెకు ఇంజనీరుగా వచ్చారు. పదేళ్లు పనిచేశారు. మదనపల్లె నుంచి పలమనేరు, గుర్రంకొండ రోడ్డు నిర్మాణం ఆయనే పూర్తి చేశారు. తర్వాత ఈ రోడ్డును కడపదాకా విస్తరించారు. ఆరోజుల్లో దీనిని గొప్ప ఇంజనీరింగ్ మార్వెల్ గా చెప్పుకునేవారు. ఈ రోడ్డు వచ్చాకే ఈ వూర్ల మధ్య ఎద్దులబళ్లు తిరగడం ఈజీ మొదలయింది. పామర్ తర్వాత వచ్చిన మరొక శాశ్వత అధికారి సబ్ కలెక్టర్ మోలోని.1859లో సబ్ కలెక్టర్ బంగాళా వచ్చింది. తర్వాత అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసు, అసిస్టెంట్ ఇంజనీర్, పబ్లివర్క్స్ వోవర్ సీర్ కార్యాలయాలు వచ్చాయి. 1896లో అటవీ డివిజన్ అధికారిని నియమించారు. వీళ్లందరి రాకతో మదనపల్లెలో యూరోపియన్ కాలనీ విస్తరించింది.

14. 1896లో ఇంపీరియల్ ఫారెస్టు సర్వీస్ లేదు. అపుడు జంగిల్ కన్సర్వెన్సీ డిపార్ట్ మెంట్ ఉండింది. అది కలెక్టర్ ఆధ్వర్యంలో పనిచేసేది. అపుడే రోడ్ల పక్కన తోపులు నాటడం మొదలయింది. ఇపుడు మనకు రాయలసీమ లో కనిపించే తోపులు అకాలంలో పెంచినవే. 1858 లో ఈస్టిండియా నుంచి పరిపాలనను బ్రిటిష్ ప్రభుత్వం తీసుకున్నాక, ఆపైన 1877లో బ్రిటిష్ రాణి భారతదేశానికి కూడా రాణి బాధ్యతలు స్వీకరించాక ఈతోపుల విస్తరణ జరిగింది.

15. కరువు పనుల కింద పాకాల-ధర్మవరం రైల్వే లైన్ నిర్మాణం కూడా ఈ సమయంలోనే మొదలయింది. దీనికి హెడ్ క్వార్టర్స్ మదనపల్లె. మొదట ఇది విల్లుపురం-ధర్మవరం లైన్ గా మొదలైంది. పనులను నెల్లూరు స్టేట్ రైల్వే చేపట్టింది. తర్వాత 1888లో భారత ప్రభుత్వం తరఫున సౌత్ ఇండియన్ రైల్వేకి ఈ పనులను అప్పగించారు.1892 కి ఈ లైన్ పాక్షికంగా పూర్తయింది. 1905లో చిన్నతిప్ప సముద్రం రైల్వే స్టేషన్ పేరును మదనపల్లె రోడ్ రైల్వే స్టేషన్ గా నామకరణం చేశారు.1909లో హర్స్ లీ హిల్స్ కొండ రైల్వే స్టేషన్ వచ్చింది.

16. పుంగనూరు జమిందారీ మొదట కడప జిల్లాలో భాగంగా ఉండేంది. జిమిందారు మదనపల్లె స్కూల్లో చదువుకున్నాడు. తర్వాత పుంగనూర్ లో హైస్కూలు ఏర్పాటయింది. అందులో చేరిన మొదటి విద్యార్థి జమిందారే.

17. 1881లో మదనపల్లెలో ప్రభుత్వ హైస్కూల్ నిర్మాణం జరిగింది. ఇది అంతకు ముందు అనంతపురం లో ఉండింది. తర్వాత ఈ భవనంలోకి మార్చారు. తర్వాత ఈ స్కూల్ ని లోకల్ ఫండ్ కి అప్పచెప్పారు. కొన్నాళ్ల తర్వాత ఇది మురుగేషన్ మొదలియార్ అనే వ్యక్తి ప్రయివేటు యాజమాన్యం కిందికి మారింది. ఆయన దానిని మిడిల్ స్కూల్ నుంచి హైస్కూలు కి పెంచాడు.

19. మదనపల్లె చరిత్రలో మేడలు లేవు. మొదటి మేడ బచ్చిరావు పంతులు అనే వ్యక్తిది. ఆయన కడప కలెక్టర్ కార్యాలయంలో హెడ్ శిరస్తదారు. హెడ్ శిరస్తదారు అంటే చాలా పవర్ ఫుల్. జిల్లాను ఏలేది ఆయనే. ఆయన జీతం సంవత్సరానికి రు. 700.

20. 1900 సంవత్సరం దాకా మదనపల్లెలో ఉన్నవి మూడే ప్రాంతాలు. కమ్మరోడ్, బ్రాహ్మణ వీది, దక్కిని పేట రోడ్.

21. సర్ విలియ్ స్టీవెన్ సన్ మెయర్స్ జిల్లాల పునర్విభజన సిఫార్సుల ప్రకారం 1911లో మదన పల్లె సబ్ డివిజన్ ని పునర్వ్యవస్తీకరించారు. ఇందులో నుంచి రాయచోటిని విడదీసి కడప జిల్లాలో కలిపారు. కదిరిని తీసుకుపోయి అనంతపురం జిల్లాలో కలిపారు. మిగిలిన మదనపల్లెను చిత్తూరు జిల్లాలో విలీనం చేశారు. దీనితో మదనపల్లె ప్రాభవం పడిపోయింది. ఈ సబ్ డిబిజన్ లో పుంగనూరు జమిందారీ, వాయల్పాడు,మదనపల్లి లు మిగిలిపోయాయి.

22. 1910లో దివ్యజ్ఞాన సమాజానికి చెందిన అనీబిసెంట్ మదనపల్లెను సందర్శించారు. అక్కడ ఉపన్యాసాలు ఇచ్చి ఒక స్కూల్ నిర్మాణానికి నిధులు సేకరించారు. 1915లో స్కూల్ థియోసాఫికల్ సొసైటీ ఆధ్వర్యంలో స్కూలు సిద్ధమయింది.

23. మద్రాస్ ప్రెశిడెన్సీ లోనే అత్యంత ఆహ్లాకరమయిన ప్రాంతంగా పేరు పడటంతో 1800 సంవత్సరం నుంచి 1910 దాకా దాదాపు 70 బ్రిటిష్ ఉన్నతాధికారులు మదనపల్లెను మకాం చేసుకున్నారు.

24. 1859 లో సబ్ కలెక్టర్ కార్యాలయం ఏర్పాటయినప్పటినుంచి 1911 దాకా 36 మంది బ్రిటిష్ సబ్ కలెక్టర్లు మదనపల్లెలో పనిచేశారు


Read More
Next Story