
2018 డీఏ/డీఆర్ అరియర్స్ చెల్లింపులు
జేఏసీ అమరావతి చొరవకు ఆర్థిక శాఖ హామీ! బొప్పరాజు వెంకటేశ్వర్లు
డీఏ/డీఆర్ అరియర్స్ 2018 జూలై నెలకు సంబంధించిన చెల్లింపుల్లో ఎదురైన అడ్డంకులను తొలగించి, ఉద్యోగులు, పెన్షనర్ల సమస్యలను పరిష్కరించడంలో ఏపీ జేఏసీ అమరావతి తీసుకున్న నిరంతర చొరవకు ఆర్థిక శాఖ ఉన్నతాధికారులు స్పందించారు. గత ఏడాది అక్టోబర్ 20, 2025 నాటికి సి.ఎఫ్.ఎం.ఎస్‌లో ఆమోదం పొందిన బిల్లులు అందరికీ చెల్లింపులు జరిగినప్పటికీ, వివిధ కారణాల వల్ల బిల్లులు వెనక్కి వెళ్లిన ఉద్యోగులు, పెన్షనర్ల సమస్యను జేఏసీ నాయకత్వం సీరియస్‌గా తీసుకుంది.
ఈ మేరకు జనవరి 20, 2026న ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్‌కు రాతపూర్వకంగా లేఖ రాసి, బిల్లులు వెనక్కి పంపిన కారణాలను స్పష్టంగా తెలియజేయాలని కోరింది. ఆ తర్వాత అనేక సార్లు ఉన్నతాధికారులను, ఆర్థిక మంత్రిని కలిసి తిరిగి బిల్లులు సబ్మిట్ చేసేందుకు క్రింది స్థాయి ట్రెజరీ అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇవ్వాలని జేఏసీ నాయకులు డిమాండ్ చేశారు.
బుధవారం సచివాలయంలో ఆర్థిక శాఖ ఉన్నతాధికారులతో జేఏసీ అమరావతి రాష్ట్ర చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు, సెక్రటరీ జనరల్ పలిశెట్టి దామోదర రావు ఆధ్వర్యంలో రాష్ట్ర కమిటీ ప్రతినిధులు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా గతంలో వివిధ కారణాల వల్ల చెల్లింపులు అందని సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఆర్థిక శాఖ కార్యదర్శి అల్లాడి గౌతమ్ (IR&AS) స్పందిస్తూ సర్వీసులో ఉన్న ఉద్యోగుల 2018 డీఏ అరియర్స్ బిల్లులపై ఈ నెలాఖరులోపు స్పష్టమైన ఆదేశాలు జారీ చేస్తామని హామీ ఇచ్చారు.
అదేవిధంగా, రిటైర్డ్ ఉద్యోగుల (పెన్షనర్లు) విషయంలో వివిధ కారణాల వల్ల అందని సుమారు 35,000 మంది పెన్షనర్లకు మే 1వ తేదీ నుంచి నేరుగా చెల్లింపులు చేస్తామని ఆర్థిక శాఖ అధికారులు స్పష్టంగా తెలిపారు. ఈ విషయాలను రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఉద్యోగులు, పెన్షనర్లు గమనించాలని జేఏసీ నాయకులు కోరారు.
ఉద్యోగులు, పెన్షనర్ల ఆర్థిక సమస్యల పరిష్కారానికి ఏపీ జేఏసీ అమరావతి నాయకత్వం నిరంతరం కృషి చేస్తుందని, ఇలాంటి చొరవలు కొనసాగుతాయని జేఏసీ రాష్ట్ర నాయకత్వం స్పష్టం చేసింది.

