17 రోజులు అసెంబ్లీ  సమావేశాలు..మధ్యలో ఆటలు
x

17 రోజులు అసెంబ్లీ సమావేశాలు..మధ్యలో ఆటలు

ఫిబ్రవరి 24, 25, 26 తేదీల్లో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ప్రత్యేకంగా క్రీడాపోటీలు నిర్వహించనున్నారు.


ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్‌ చింతకాయల అయ్యన్నపాత్రుడు అధ్యక్షతన జరిగిన బిజినెస్ అడ్వైజరీ కమిటీ (BAC) సమావేశం ముగిసింది. ఈ భేటీలో అసెంబ్లీ సమావేశాల కాలపరిమితిని ఖరారు చేశారు. తాజా నిర్ణయం ప్రకారం, అసెంబ్లీ సమావేశాలు మార్చి 7 వరకు కొనసాగనున్నాయి. మొత్తం 17 రోజుల పాటు సభ కార్యకలాపాలు సాగనున్నాయి. ఒకవేళ చర్చించాల్సిన అంశాలు ఎక్కువగా ఉంటే, ఈ గడువును మరింత పొడిగించే అవకాశం కూడా ఉందని బీఏసీ స్పష్టం చేసింది.

ఫిబ్రవరి 14న బడ్జెట్ ముహూర్తం.. చర్చల షెడ్యూల్ ఇలా

రాష్ట్ర ప్రజలంతా ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్న 2026-27 ఆర్థిక సంవత్సర వార్షిక బడ్జెట్‌ను ఫిబ్రవరి 14న ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నారు. అయితే, బడ్జెట్ సమర్పణ తర్వాత సభకు స్వల్ప విరామం లభించనుంది. ఫిబ్రవరి 15 ఆదివారం కావడంతో పాటు, 16న మహా శివరాత్రి పర్వదినం తర్వాతి రోజు కావడంతో ఆ రెండు రోజులు సభకు సెలవు ప్రకటించారు. తిరిగి ఫిబ్రవరి 17, 18 తేదీల్లో బడ్జెట్‌పై సుదీర్ఘంగా చర్చ జరగనుంది. ఈ చర్చల అనంతరం, సభ్యులు లేవనెత్తిన అంశాలు , సందేహాలపై ఫిబ్రవరి 18న ఆర్థిక మంత్రి సభలో అధికారికంగా సమాధానం ఇవ్వనున్నారు.

రాజకీయాల మధ్యలో ఆటపాటలు.. ప్రజాప్రతినిధులకు క్రీడాపోటీలు

ఈసారి అసెంబ్లీ సమావేశాల్లో కేవలం రాజకీయ విమర్శలు, సీరియస్ చర్చలే కాకుండా, ప్రజాప్రతినిధుల మధ్య సమన్వయం, ఆహ్లాదాన్ని పెంపొందించేలా ఒక ఆసక్తికరమైన నిర్ణయం తీసుకున్నారు. ఇందులో భాగంగా ఫిబ్రవరి 24, 25, 26 తేదీల్లో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ప్రత్యేకంగా క్రీడాపోటీలు నిర్వహించనున్నారు. అంతేకాకుండా, మార్చి 6వ తేదీన అమరావతి వేదికగా ప్రత్యేక సాంస్కృతిక వేడుకలను కూడా ఏర్పాటు చేశారు. ఇక సభా షెడ్యూల్ విషయానికొస్తే, మార్చి 1, 2, 3 తేదీల్లో అసెంబ్లీకి వరుస సెలవులు ప్రకటించారు.

సభా సమయాలు.. కీలక చర్చలు

సమావేశాల నిర్వహణకు సంబంధించి బీఏసీ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ప్రతిరోజూ ఉదయం 9 గంటల నుంచే సభ ప్రారంభించి, మధ్యాహ్నం 2 గంటల వరకు సమావేశాలు నిర్వహించనున్నారు. ముఖ్యంగా, ఉదయం 10 గంటలకల్లా ప్రశ్నోత్తరాల సమయాన్ని ముగించి, ప్రజలకు సంబంధించిన తక్షణ సమస్యలపై చర్చించేందుకు ఆ వెంటనే 'జీరో అవర్' చేపట్టాలని నిర్ణయించారు. వివిధ ప్రభుత్వ శాఖలకు సంబంధించిన నిధుల కేటాయింపులు, అంటే 'డిమాండ్ ఫర్ గ్రాంట్స్'పై ఏకంగా 8 రోజుల పాటు సుదీర్ఘంగా చర్చించనున్నారు. వీటితో పాటు, ప్రభుత్వం ఇప్పటికే తీసుకువచ్చిన ఆరు కీలక ఆర్డినెన్స్‌లకు ఈ బడ్జెట్ సమావేశాల్లోనే సభ అధికారికంగా ఆమోదం తెలపనుంది.

Read More
Next Story