ఒడిశా: ఐసీయూలో అగ్నిప్రమాదం - 10 మంది రోగులు మృతి
x

ఒడిశా: ఐసీయూలో అగ్నిప్రమాదం - 10 మంది రోగులు మృతి

దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఘి.. మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షల ఎక్స్‌గ్రేషియా..


Click the Play button to hear this message in audio format

ఒడిశా రాష్ట్రం కటక్‌లోని ఎస్‌సీబీ హాస్పిటల్‌లో సోమవారం తెల్లవారుజామున అగ్నిప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 10 మంది రోగులు మృతి చెందారు.

ట్రామా కేర్ ఐసీయూలో అగ్ని ప్రమాదం..

ఆసుపత్రిలోని ట్రామా కేర్ ఐసీయూ, దాని పక్కనున్న మరో ఐసీయూలో మొత్తం 23 మంది రోగులు చికిత్స పొందుతున్నారు. ఉన్నట్టుండి అగ్ని ప్రమాదం సంభవించడంతో ఏడుగురు రోగులు అక్కడికక్కడే మృతి చెందారు. తీవ్ర గాయాలయిన మరో ముగ్గురిని ఆసుపత్రికి తరలించే లోపు కన్నుమూశారు. రోగులను రక్షించే ప్రయత్నంలో 11 మంది ఆసుపత్రి సిబ్బంది గాయపడినట్లు సమాచారం.

సీఎం సమీక్ష..

ఘటనా సమాచారం తెలుసుకున్న వెంటనే ఒడిశా ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఘి ఆసుపత్రికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. అగ్నిప్రమాదానికి షార్ట్ సర్క్యూట్ కారణమై ఉండొచ్చని భావిస్తు్న్నారు.

బాధిత కుటుంబాలకు పరిహారం..

మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.25 లక్షల ఎక్స్-గ్రేషియా ప్రకటించారు సీఎం. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు.

న్యాయ విచారణ ఆదేశం..

ఘటనపై పూర్తి స్థాయి న్యాయ విచారణ (జ్యుడిషియల్ ప్రోబ్) జరపాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇకపై అగ్ని ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని ఫైర్ సర్వీస్ డైరెక్టర్ జనరల్‌కు సీఎం ఆదేశాలు జారీ చేశారు. దర్యాప్తు ఆధారంగా బాధ్యులపై చర్యలు తీసుకుంటామని చెప్పారు.

రోగుల తరలింపు..

అగ్నిప్రమాదం జరిగిన వెంటనే ఫైర్ సర్వీస్ సిబ్బంది, పోలీసులు, ఆసుపత్రి సిబ్బంది కలిసి ఐసీయూలో ఉన్న రోగులను బయటకు తరలించి ఆసుపత్రిలోని ఇతర వార్డులకు మార్చారు.

ఈ ఘటనపై ఒడిశా మాజీ ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

వేసవి ప్రారంభం కావడంతో ఇలాంటి అగ్నిప్రమాదాలు పెరుగుతుండటంపై నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో భద్రతా ప్రమాణాలు మరింత కట్టుదిట్టంగా అమలు చేయాల్సిన అవసరం ఉందని సూచిస్తున్నారు.

Read More
Next Story