
డేటింగ్ యాప్‌తో వల..
కిడ్నాప్ చేసి రూ.7 లక్షలు దోచుకున్న గ్యాంగ్
ఢిల్లీలో డేటింగ్ యాప్‌నుపయోగించి కిడ్నాప్, దోపిడీకి పాల్పడిన గ్యాంగ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో బాధితుడి వయసు 34 ఏళ్లు కాగా.. ప్రధాన నిందితురాలి వయసు 20 ఏళ్లు పేరు హర్లీన్ కౌర్ అలియాస్ జెన్నీ. ఈమెతో పాటు నలుగురు పురుషులను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిని నబోత్ (30), సంజయ్ అలియాస్ జోయి (28), రిషబ్ (25), సాహిల్ చౌహాన్‌గా గుర్తించారు.
ఎలా జరిగింది?
డేటింగ్ యాప్ ద్వారా బాధితుడితో జెన్నీ పరిచయం పెంచుకుంది. ఓ సారి కలుద్దామని దక్షిణ ఢిల్లీలోని నెహ్రూ ప్లేస్‌కు రమ్మని చెప్పింది. బాధితుడు అక్కడికి రాగానే, జెన్నీ సహచరులు బాధితుడిని బలవంతంగా కారులోకి ఎక్కించి కిడ్నాప్ చేశారు. అనంతరం దాడి చేసి స్పృహ కోల్పోయే వరకు కొట్టారు. గొంతు కోసేందుకు కూడా ప్రయత్నించినట్లు బాధితుడు ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఆ తరువాత నిందితులు బాధితుడిని బెదిరిస్తూ యూపీఐ, ఏటీఎం, క్రెడిట్ కార్డు ద్వారా సుమారు రూ.7 లక్షలను బలవంతంగా ట్రాన్స్‌ఫర్ చేయించారు. రాత్రంతా అతన్ని గురుగ్రాం, దక్షిణ ఢిల్లీ ప్రాంతాల్లో తిప్పినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటన మార్చి 2న జరిగింది.
బాధితుడి ఫిర్యాదు మేరకు కల్కాజీ స్టేషన్ పోలీసులు కేసు నమోదు చేశారు. డిజిటల్ లావాదేవీల ఆధారంగా పోలీసులు నిందితులను గుర్తించి అరెస్ట్ చేశారు. విచారణలో ఈ గ్యాంగ్ గతంలో ఇలాగే మరికొంత మందిని టార్గెట్ చేసినట్లు బయటపడింది. ఒక వైద్యుడితో సహా మరో ఇద్దరిని మోసం చేసినట్లు సమాచారం.

