కర్ణాటకలో ఎల్పీజీ గోదాములకు పోలీసుల పహారా..
x

కర్ణాటకలో ఎల్పీజీ గోదాములకు పోలీసుల పహారా..

గ్యాస్ కొరతతో పెరుగుతున్న దొంగతనాలు, బ్లాక్ మార్కెట్ విక్రయాలు..


Click the Play button to hear this message in audio format

ఇజ్రాయిల్, అమెరికా - ఇరాన్ దేశాల మధ్య యుద్ధ పరిస్థితుల కారణంగా గ్యాస్ దిగుమతులు నిలిచిపోయాయి. దీంతో కర్ణాటక రాష్ట్రంలో వంట గ్యాస్, కమర్షియల్ గ్యాస్ సిలిండర్లు కొరత తీవ్రమైంది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కొంతమంది సిలిండర్ దొంగతనాలు, బ్లాక్ మార్కెట్ విక్రయాలకు పాల్పడుతున్నారు. ఫలితంగా రాష్ట్ర ప్రభుత్వం గ్యాస్ గోదాముల వద్ద భద్రతను కట్టుదిట్టం చేసింది. గోదాముల వద్ద అదనంగా పోలీసులను మోహరించింది. రాత్రిపూట ప్రత్యేక పహారా ఏర్పాటు చేసింది. గ్యాస్ సరఫరా వ్యవస్థను పర్యవేక్షించేందుకు ఆహార, పౌర సరఫరాల శాఖ అధికారులు పోలీసులతో కలిసి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు.

బ్లాక్ మార్కెట్‌లో రెట్టింపు ధరలు..

కొన్ని గ్యాస్ ఏజెన్సీలు కావాలని సిలిండర్లను దాచిపెట్టి కృత్రిమ కొరత సృష్టిస్తున్నాయనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ కారణంగా కొన్ని ప్రాంతాల్లో సాధారణ ధర కంటే రెట్టింపు ధరలకు సిలిండర్లు అమ్ముతున్నట్లు అధికారులు గుర్తించారు. దీనిని అరికట్టేందుకు అధికారులు గ్యాస్ గోదాములపై ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తున్నారు.

రోజూ గోదాములకు వచ్చిన సిలిండర్ల సంఖ్య, వినియోగదారులకు పంపిణీ చేసిన సిలిండర్ల సంఖ్య మధ్య తేడాలను పరిశీలిస్తున్నారు. అక్రమంగా సిలిండర్లు నిల్వ ఉంచడం, బ్లాక్ మార్కెట్‌లో అమ్మడం లేదా గృహ వినియోగ సిలిండర్లను వాణిజ్య వినియోగానికి మళ్లించడం వంటి చర్యలు చేసిన ఏజెన్సీల లైసెన్సులు రద్దు చేస్తామని అధికారులు హెచ్చరించారు.

గోదాముల వద్ద గట్టి భద్రత..

ఇటీవల వరకు గ్యాస్ గోదాముల తనిఖీలు సాధారణంగా పౌర సరఫరాల శాఖ అధికారులు మాత్రమే నిర్వహించేవారు. అయితే ప్రస్తుతం పరిస్థితులు మారడంతో పోలీసులు కూడా వారితో కలిసి తనిఖీల్లో పాల్గొంటున్నారు. అక్రమంగా నిల్వ ఉంచిన సిలిండర్లు కనిపిస్తే వెంటనే కేసులు నమోదు చేస్తున్నారు.

సిలిండర్ దొంగతనాలు..

గ్యాస్ కొరత కారణంగా సిలిండర్ దొంగతనాలు కూడా గణనీయంగా పెరిగాయి. ఇళ్ల బయట ఉంచిన సిలిండర్లు, గ్యాస్ డిస్ట్రిబ్యూటర్ల వాహనాలు, అలాగే గోదాముల వద్ద నుంచి సిలిండర్లు దొంగిలిస్తున్నట్లు పోలీసులకు ఫిర్యాదులు అందుతున్నాయి. దీనితో అనుమానాస్పద వాహనాలు, వ్యక్తులపై కఠినంగా తనిఖీలు చేపడుతున్నారు.

ప్రజలపై ప్రభావం..

గ్యాస్ కొరత కారణంగా సాధారణ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో పెళ్లిళ్లు, ఫంక్షన్లు వాయిదా పడుతున్నాయి. అనేక ఫంక్షన్ హాల్స్ తాత్కాలికంగా మూతపడిన పరిస్థితి ఏర్పడింది. ఈ సంక్షోభం కారణంగా కొత్త రకాల నేరాలు కూడా పెరుగుతున్నాయని అధికారులు తెలిపారు. సరఫరా సమస్యను పరిష్కరించేందుకు ప్రభుత్వం సరఫరాదారులతో చర్చలు జరుపుతోందని, పరిస్థితిని సాధారణ స్థితికి తీసుకురావడానికి చర్యలు కొనసాగుతున్నాయని వెల్లడించారు.

Read More
Next Story