
తమిళనాడులో బర్డ్ ఫ్లూ కలకలం, ఆంధ్రాలో కలవరం
తమిళనాడులోని 14 జిల్లాలలో బర్డ్ ఫ్లూ వ్యాప్తి కలకలం రేపుతోంది. ఈ వార్త ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లోని పౌల్ట్రీ రంగంలో కలవరం రేపింది.
తమిళనాడులో బర్డ్ ఫ్లూ వ్యాప్తి కలకలం రేపుతోంది. ఆ రాష్ట్రంలోని 14 జిల్లాలకు బర్డ్ ఫ్లూ విస్తరించిందని ఆరోగ్యశాఖ ప్రకటించడంతో, ఆంధ్రప్రదేశ్‌లోని పౌల్ట్రీ రంగంలో ఆందోళన నెలకొంది. ముఖ్యంగా సరిహద్దు ప్రాంతాల్లో ఉన్న పౌల్ట్రీ ఫారాల యజమానులు అప్రమత్తం అయ్యారు.
ఇటీవలే ఆంధ్రప్రదేశ్–తమిళనాడు సరిహద్దు ప్రాంతాల్లోని ఉమ్మడి చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో బర్డ్ ఫ్లూ సోకి వేలాది నాటు కోళ్లు మృతిచెందిన ఘటనలు కలకలం రేపాయి. ఈ సంఘటనల తర్వాతే తమిళనాడులో పరిస్థితి మరింత స్పష్టమైంది.
తమిళనాడులోని అడయార్ ప్రాంతంలో జనవరి 5న వరుసగా కోళ్లు, కాకులు మృతిచెందడం మొదలైంది. వాటి నుంచి సేకరించిన నమూనాలను జాతీయ పశువైద్య పరిశోధన సంస్థకు పంపించారు. పరీక్షల అనంతరం కాకుల మృతికి బర్డ్ ఫ్లూ వైరస్ కారణమని అధికారులు నిర్ధారించారు.
ఈ నేపథ్యంలో అడయార్ పరిసర ప్రాంతాలతో పాటు తిరువళ్లూర్, తిరువణ్ణామలై, కడలూరు తదితర ప్రాంతాలు కలిపి మొత్తం 14 జిల్లాల్లో కాకులు మృతిచెందుతున్న ఘటనలు నమోదవుతున్నాయి. సమీపంలోని పుదుచ్చేరి ప్రాంతంలో కూడా ఇలాంటి ఘటనలు చోటుచేసుకోవడంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది.
ఈ విషయంపై ఆరోగ్యశాఖ అధికారులు మాట్లాడుతూ, ప్రస్తుతం రాష్ట్రంలోని 14 జిల్లాల్లో కాకుల మృతికి బర్డ్ ఫ్లూ కారణమని గుర్తించామని తెలిపారు. అయితే ఇప్పటివరకు ఈ వైరస్ ఇతర పక్షులకు లేదా మనుషులకు సోకినట్లు ఆధారాలు లేవని స్పష్టం చేశారు.
తమిళనాడులో పౌల్ట్రీ ఫారాలు...
తమిళనాడులో అధికారికంగా సుమారు 2,900 పౌల్ట్రీ ఫారాలు ఉండగా అనధికార వర్గాల సమాచారం ప్రకారం 5,600కి పైగా పౌల్ట్రీ ఫారాలు ఉండొచ్చని పేర్కొంటాయి. కోయంబత్తూరు, నామక్కల్, పోలాచ్చి ప్రాంతాల్లో ఎక్కువ ఫారాలు ఉన్నాయి. రాష్ట్రంలో దాదాపు 20,000కు పైగా బ్రాయిలర్ కోళ్ల రైతులు ఈ రంగంలో పనిచేస్తున్నారు. తమిళనాడులో ప్రతి సంవత్సరం కోట్లాది బ్రాయిలర్ కోళ్లు ఉత్పత్తి అవుతాయని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. అందువల్ల, తమిళనాడులో బర్డ్ ఫ్లూ వ్యాప్తి జరిగితే వేలాది ఫారాలు, లక్షల కోళ్ల ఉత్పత్తిపై ప్రభావం పడే అవకాశం ఉంటుంది. అందుకే ఆంధ్రప్రదేశ్ సరిహద్దు జిల్లాల్లో కూడా అధికారులు అప్రమత్తంగా ఉంటున్నారు.
ఇక ఆంధ్రప్రదేశ్ లో పరిస్థితి ఎలా ఉందంటే...
భారత్‌లో ఉత్పత్తి అయ్యే గుడ్లలో సుమారు 17–20% వరకు ఆంధ్రప్రదేశ్ నుంచే వస్తాయి. రాష్ట్రంలో రోజుకు 5 కోట్లకు పైగా గుడ్లు ఉత్పత్తి అవుతున్నాయని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. రాష్ట్రంలో దాదాపు 25,000 వరకు చిన్న-పెద్ద పౌల్ట్రీ ఫారాలు ఉన్నాయని ప్రభుత్వ అంచనాలు చెబుతున్నాయి. ఈ రంగంలో లక్షల మంది రైతులు, కార్మికులు ఉపాధి పొందుతున్నారు. 2025 నాటికి ఆంధ్రప్రదేశ్‌లో సుమారు 4.2 లక్షల టన్నుల పౌల్ట్రీ మాంసం ఉత్పత్తి అయినట్లు డేటా చెబుతోంది. చిత్తూరు, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, కృష్ణా, ప్రకాశం జిల్లాలలో ఎక్కువగా కోళ్ల ఫారాలు ఉన్నాయి.
ఆంధ్రప్రదేశ్‌లో పౌల్ట్రీ రంగం దేశంలోనే అతిపెద్ద వ్యవసాయ అనుబంధ రంగాలలో ఒకటి. గుడ్ల ఉత్పత్తిలో ముందుండే ఈ రాష్ట్రంలో వేలాది ఫారాలు ఉండటంతో, తమిళనాడు వంటి పొరుగు రాష్ట్రాల్లో బర్డ్ ఫ్లూ వ్యాప్తి వార్తలు వస్తే ఇక్కడి రైతుల్లో ఆందోళన పెరుగుతోంది.
ప్రజలు కూడా జాగ్రత్తలు పాటించాలని అధికారులు సూచించారు. ముఖ్యంగా జ్వరంతో పాటు ఇతర అనుమానాస్పద లక్షణాలు కనిపిస్తే వెంటనే సమీప ఆసుపత్రులకు వెళ్లి పరీక్షలు చేయించుకోవాలని విజ్ఞప్తి చేశారు.
Next Story

