
కొండపల్లి బొమ్మలకు ‘యూరోపియన్’ ఫిదా.. గొబ్బెమ్మల పాటలకు స్టెప్పులు!
గుంటూరు గోంగూర పచ్చడి, నాటుకోడి పులుసు, ఉలవచారు, నెల్లూరు చేపల పులుసుతో కూడిన అచ్చమైన ఆంధ్రా భోజనం అరిటాకులో ఆయనకు వడ్డించారు.
తెలుగువారి కళా వైభవం, ప్రపంచ ప్రఖ్యాత కొండపల్లి హస్తకళల అద్భుత శైలికి యూరోపియన్ యూనియన్ (EU) అంబాసిడర్ హెర్వే డెల్ఫిన్ ముగ్ధులయ్యారు. శుక్రవారం ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశ, జాయింట్ కలెక్టర్ ఎస్. ఇలక్కియాతో కలిసి ఆయన కొండపల్లిలోని 'ఎక్స్‌పీరియన్స్ సెంటర్'ను సందర్శించారు. కొండపల్లి వీధులు సంక్రాంతి ముగ్గులు, హారతులు, సంప్రదాయ వేడుకలతో ఖండాంతర స్నేహానికి వేదికగా మారాయి.
పొనికి కర్ర ముక్కకు ప్రాణం పోసే కొండపల్లి కళాకారుల వేళ్ల కొనల్లో అద్భుతమైన మ్యాజిక్ ఉందని హెర్వే డెల్ఫిన్ ప్రశంసించారు. సంక్రాంతికి ముందే కొండపల్లికి పండగ శోభను తెచ్చిన ఆయన పర్యటనలో ఒక అరుదైన దృశ్యం ఆవిష్కృతమైంది. గిరిజన, గ్రామీణ మహిళలతో కలిసి రాయబారి హెర్వే డెల్ఫిన్, జిల్లా కలెక్టర్ లక్ష్మీశ గొబ్బెమ్మల పాటలకు స్టెప్పులు వేయడం అందరినీ ఆకట్టుకుంది. బొమ్మల తయారీలోని శతాబ్దాల నాటి చరిత్రను, సహజ రంగుల వెనుక ఉన్న పర్యావరణ హితాన్ని చూసి అంబాసిడర్ ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ.. 'ప్రతి బొమ్మ ఒక కథ చెబుతోంది' అని కొనియాడారు.
సాదాసీదా పొనికి కర్రను అపురూప శిల్పంగా మార్చే ప్రక్రియను రాయబారి స్వయంగా పరిశీలించారు. కళాకారుల అంకితభావాన్ని మెచ్చుకుంటూ, ఈ వారసత్వాన్ని కాపాడుతున్న తీరు అద్భుతమన్నారు. ఐరోపా దేశాలకు, తెలుగు సంస్కృతికి మధ్య ఈ పర్యటన ఒక గొప్ప 'సాంస్కృతిక వారధి'గా నిలుస్తుందని ఆయన పేర్కొన్నారు.
పర్యటన అనంతరం గుణదల పార్క్ హయత్ హోటల్‌లో రాయబారికి అచ్చమైన ఆంధ్రా భోజనం అరిటాకులో వడ్డించారు. గుంటూరు గోంగూర పచ్చడి, నాటుకోడి పులుసు, ఉలవచారు, నెల్లూరు చేపల పులుసుతో ఆయనకు భోజనం వడ్డించారు. పూతరేకులు, బొబ్బట్లు యూరప్ డెజర్ట్‌లకు ఏమాత్రం తీసిపోవు., ఆంధ్రా వంటకాల్లోని ఆత్మీయత అద్భుతం అని ఆయన కితాబిచ్చారు. ఏపీ సుదీర్ఘ తీరప్రాంతాన్ని ఆర్థిక శక్తి కేంద్రంగా మార్చేందుకు 'బ్లూ వ్యాలీ' కార్యక్రమంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో చర్చించినట్లు రాయబారి వెల్లడించారు. సముద్ర ఆధారిత పరిశ్రమలు, ఇంధన రంగాల్లో ఐరోపా సాంకేతికత, పెట్టుబడుల సహకారం ఉంటుందని తెలిపారు. త్వరలో ఢిల్లీలో జరిగే ఈయూ-ఇండియా సమ్మిట్‌లో ప్రధాని మోదీతో కలిసి ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్‌పై సంతకాలు చేసే అవకాశం ఉందని తెలిపారు. ప్రస్తుతం ఉన్న 6,000 ఐరోపా కంపెనీల పెట్టుబడులను రెట్టింపు చేస్తామని, తద్వారా భారతీయులకు లక్షలాది ఉద్యోగాలు లభిస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. గత ఏడాది 9 లక్షల మంది భారతీయులకు ఐరోపా వీసాలు లభించాయని, విద్యార్థులకు స్కాలర్‌షిప్‌ల్లో ప్రాధాన్యత ఉంటుందని వెల్లడించారు.

