
తమిళ హీరోలు తగ్గారు… మనవాళ్లు మాత్రం ఒప్పుకోరా!?
టాలీవుడ్ స్టార్ సిస్టమ్ రియాలిటీ!
రీసెంట్ గా తమిళనాడు నిర్మాతలు అందరూ కలిసి హీరోల రెమ్యునరేషన్స్ పై ఓ పెద్ద రివల్యూషన్ మొదలుపెట్టిన సంగతి తెలిసిందే. కానీ ఆ అల టాలీవుడ్ వరకూ వస్తుందా అంటే రాదనేది సమాధానం. అయితే ఎందుకు అలా జరగదు..ఏం తెలుగు హీరోలు కూడా అది బెస్ట్ ఆప్షన్ అయ్యినప్పుడు ఓకే చెప్పి ఇండస్ట్రీని బ్రతికించవచ్చు కదా అనేది ఇప్పుడు కేవలం తెలుగు సిని పరిశ్రమలోనే కాదు...సాధారణ సినిమా లవర్ దాకా డిస్కషన్ పాయింట్ గా మారింది.
అసలు మొదలిక్కడ
తమిళ ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ (TFPC) ఇటీవల ఒక సంచలన నిర్ణయం తీసుకుంది — స్టార్ హీరోలు, టెక్నీషియన్లు, వర్కర్లు అందరూ కలిసి “ప్రాఫిట్-లాస్ షేర్ మోడల్” లో భాగం కావాలని కోరింది.
సింపుల్‌గా చెప్పాలంటే, సినిమా లాభం వస్తే అందరూ పంచుకోవాలి, నష్టమైతే అందరూ భరించాలి! అని తేల్చి చెప్పింది. ఇదేమీ కొత్త విషయం కాదు. చాలా కాలంగా తెలుగు నిర్మాతలు అంటున్నారు. హిందీ నిర్మాతలు అంటున్నారు. అయితే హీరోలు ఎవరూ ఎక్కడా దీన్ని ఒప్పుకుని ముందుకు తీసుకెళ్లినట్లు కనపడటం లేదు.
అయితే తమిళనాడులో మాత్రం కాస్తంత పాజిటివ్ గానే పరిస్దితులు ఉన్నట్లు తెలుస్తోంది. రజనీకాంత్, కమల్ హాసన్, విజయ్, సూర్య, అజిత్, ధనుష్ వంటి టాప్ స్టార్లు కూడా ఈ చర్చల్లో భాగమయ్యారని వినికిడి. తమిళ ఇండస్ట్రీలో ఇది ప్రొడ్యూసర్ సర్వైవల్ మోడల్గా చూస్తున్నారు — ఫైనాన్షియల్‌గా ఇండస్ట్రీని నిలబెట్టే ప్రయత్నం గా చెప్తున్నారు. ఈ మోడల్ గురించి అందరూ మాట్లాడుతున్నారు. ఇండస్ట్రీ ఇలా చేస్తేనే బ్రతుకుతుందని చెప్తున్నారు.
కానీ ఈ మోడల్ టాలీవుడ్‌లో సాధ్యమా?
“కాదు!” అంటోంది తెలుగు సినిమా పరిశ్రమ. అందుకు వారు చెప్పే కారణాలు వేరేగా ఉన్నాయి.
“మన హీరోల మార్కెట్ మైండ్‌సెట్ వేరు!”
“మన దగ్గర ఇండస్ట్రీ డిమాండ్ & సప్లై మీద నడుస్తుంది. ఎవరి మార్కెట్ ఉంటే వాళ్లు పెద్ద ఫీజు తీసుకుంటారు. నిర్మాతలు కూడా ఆ కాంబినేషన్ కోసం ఆమోదిస్తారు. కానీ కొందరు అనుభవం లేని నిర్మాతలు తప్పు మోడల్‌తో వస్తున్నారు. వాళ్ల వల్ల మొత్తం బిజినెస్ ఎకానమిక్స్ కూలిపోయింది,” అని తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ జనరల్ సెక్రటరీ టి. ప్రసన్నకుమార్ అంటున్నారు. అయితే పెద్ద హీరోలు తమ రేట్లు తగ్గించుకోవటమో లేక షేర్ మోడల్ కు వస్తే బాగుంటుందనో చెప్పటం లేదు.
వాస్తవానికి ఇప్పుడు ప్రభాస్, మహేష్ బాబు, ఎన్టీఆర్, రామ్ చరణ్, పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్ లాంటి హీరోలు ఒక్క సినిమాకు ₹75 నుంచి ₹150 కోట్లు తీసుకుంటున్నారు. హీరోయిన్లు రష్మికా, శ్రీలీల, సాయి పల్లవి, మృణాల్ ఠాకూర్ లాంటి వారు ₹2–4 కోట్లు. ఇలాంటి పరిస్దితుల్లో సినిమా చేస్తే బడ్జెట్‌లో 60–70% ఖర్చు కేవలం ఫీజులకు వెళ్ళిపోతున్న స్థితి.
అయితే డబ్బు ఖర్చుపెడతాం కానీ రికవరీలు ఏవి అనేది వారి ప్రశ్న. “ఇన్ని కోట్లు తీసుకునే హీరోలు ..సరైన ఓపెనింగ్స్ కూడా రాబట్టలేరు. కానీ సినిమా సైన్ చేయాలంటే మినిమం 15–25 కోట్లు డిమాండ్ చేస్తున్నారు. వాటికి ఓకే చేసి నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు సినిమా తీసాక ఓపినింగ్స్ రాక, టాక్ రాక, రివ్యూ లు బాగోలేక, థియేటర్స్ దగ్గర జనం లేక వీకెండ్ కూడా వర్కవుట్ కాని పరిస్దితుల్లో బాగా నష్టపోతున్నారు. కానీ ఎవ్వరూ సిస్టమ్ మార్చే ప్రయత్నం చేయట్లేదు.
“తమిళ మోడల్” టాలీవుడ్‌లో ఎందుకు వర్క్ అవ్వదు?
స్టార్ పవర్ బిజినెస్ మోడల్:
తమిళనాడులో సినిమా బిజినెస్ కలెక్టివ్ బ్రాండ్ విలువ మీద నడుస్తుంది. కానీ టాలీవుడ్‌లో సినిమా బిజినెస్ హీరో ఇమేజ్ మీద ఆధారపడింది. సినిమా హిట్ అయ్యిందంటే అది కథ వల్ల కాదు — “హీరో వలన” అనే పర్సెప్షన్. దీనివల్ల హీరోలు కాస్ట్-షేరింగ్ లేదా లాస్-షేరింగ్ మోడల్‌లోకి రావడానికి ఒప్పుకోరు. వారికి అవసరం కూడా లేదనేది ఓ వాదన.
మార్కెట్ ట్రాన్స్పరెన్సీ లేకపోవడం:
తెలుగు సినిమాల్లో బిజినెస్ ఫిగర్స్ ఎప్పుడూ స్పష్టంగా లేవు. నిజమైన నష్టం ఎంత? లాభం ఎంత? — ఎవరూ చెప్పరు. ఇలాంటి పరిస్థితిలో “ప్రాఫిట్ షేర్” అనే పదం ఎవరినీ నమ్మించదు.
స్టార్‌ల ఆర్థిక లైఫ్‌స్టైల్:
ప్రతి సినిమా తర్వాత స్టార్‌లకు బంగ్లాలు, లగ్జరీ కార్లు, ఫార్మ్ హౌజులు — ఇవి నార్మల్ అయిపోయాయి. కానీ నిర్మాతల దగ్గర ఆర్థిక భారం మాత్రం పెరుగుతూనే ఉంది. ప్రముఖ నిర్మాత, సీనియర్ అయిన సి.కల్యాణ్ చెప్పిన మాటే దీని ముసుగు తీయింది:
“మూడువేల మంది ప్రొడ్యూసర్లలో ఇరవైమంది మాత్రమే యాక్టివ్‌గా ఉన్నారు. సినిమాలు తీస్తున్నారు. మిగతావారు అప్పుల్లో మునిగిపోయారు.”
OTT & Pan-India మిథ్:
“Pan-India” అనే మాయాజాలం ఇప్పుడు బ్లఫ్‌గా మారింది. OTT వలన హిందీ డబ్బింగ్ మార్కెట్ కూడా చచ్చిపోయింది.ప్రొడ్యూసర్లు పెద్ద కలలు కంటున్నారు కానీ నేటి రియాలిటీ ఏమిటంటే —“స్టార్ సినిమాలకే కలెక్షన్లు రావడం లేదు.”
అంటే పరిష్కారం ఏమిటి?
ఫీజు కంట్రోల్ మెకానిజం: నిర్మాతల కౌన్సిల్ ఒక క్యాప్ సిస్టమ్ తీసుకురావాలి — ఒక సినిమాకు గరిష్టంగా ఎంత ఫీజు ఇవ్వొచ్చో ఫిక్స్ చేయాలి.
ప్రాఫిట్ లింక్డ్ మోడల్: స్టార్‌లకు సినిమా కలెక్షన్లపై పర్సంటేజ్ ఇవ్వడం. ఇది హాలీవుడ్ తరహాలో “బ్యాక్ ఎండ్ డీల్” లాగా ఉంటుంది.
ప్రొడ్యూసర్ యూనిటీ: ప్రస్తుతం ప్రతి నిర్మాత ఒక్కొక్క హీరో కోసం తమకంటూ కొన్ని రూల్స్ పెట్టుకుంటున్నాడు. కానీ అందరూ కలిసి ఒకే మాటపై ఉన్నప్పుడు మాత్రమే ఇది సాధ్యం.
ఫైనల్ గా ..:
“టాలీవుడ్ స్టార్‌లు తమ రెమ్యునరేషన్స్ తగ్గించుకోరు — ఎందుకంటే వాళ్లు తాము ఇండస్ట్రీని నడుపుతున్నామనే భ్రమలో ఉన్నారు. కానీ ఇలాగే కొనసాగితే, రేపు ఇండస్ట్రీనే ఉండకపోవచ్చు.” అనేది చాలా మంది సీనియర్స్ అనే మాట. అది నిజం కూడా.

