
The Omen: 50 యేళ్లుగా వెంటాడుతున్న సినిమా
నన్ను వెంటాడిన సినిమాలు-8 (ఫిల్మ్ క్రిటిక్ రామ్ సి మూవీ కాలమ్)
-రామ్.సి
నేను చిన్నప్పటి నుండి హారర్ సినిమాలకు దూరం. భయమని కాదు, కానీ ఎందుకో చెప్పలేను. ఆ కోవలో చాల తక్కువే చూసినా Exorcist, Evil Dead లు ఉన్నా, నాకెందుకో ‘ది ఒమెన్’ (The Omen 1976) చాల ప్రత్యేకం. హారర్ల జాబితాలో ప్రపంచ వ్యాప్తంగా ఇది మేటి ఆరాధన (cult) క్లాసిక్. చూసిన ప్రతి సారి , ఎదో కొత్త అనుభవం దొరికే అవకాశం. నిత్య శోధనకు, ఆలోచనలకూ ఈ సినిమా నాకు నెలవు. దృశ్యంలో ఉండే భయం కన్నా ఆలోచనలో రూపుదిద్దుకొనేదే అసలైన భయం అని తెలుసుకున్న సినిమా ఇది.
నా మొదటి ఇంగ్లీష్ సినిమా హీరో గ్రెగెరి పెక్ (Greogery Peck) నటించిన సినిమా. పెద్ద హీరో హారర్ సినిమాలు నటించడం బహు అరుదు. ఈ సినిమాకు కథ ,కథనం, సంగీతం, నటన నాలుగు ప్రాణాలైతే, వెన్నులో గగ్గుర్పాటు కల్పించే అనుభూతి పంచవ ప్రాణం. నేటికీ భయపడుతూనే చూస్తుంటాను. ఈ సినిమా కదా వస్తువు మూలం బైబిల్ లోని సాతాన్ ను భూమి పై కాపాడే ప్రయత్నంలో భాగంగా ఓ పెద్ద కూటమి గుట్టుగా పనిచెయ్యడం, అలా కాపాడనుకొంటు క్రీస్టు వ్యతిరేక (anti-Christ)గా దేవునికి వ్యతిరేకంగా సాతాను రాజ్యాన్ని విశ్వమంతా స్థాపించడమే ధ్యేయంగా సాగుతుండడం మనకు తెలియని ఊపిరి అందని మలుపులతో, భయం మన పక్కన ఆసీనమై ఉన్నట్టు కలిగే అనుభూతి వరణనాతీతం.
(Richard Donner) దర్శకత్వం వహించిన The Omen హారర్ చరిత్రలో ఒక చిరస్థాయిగా నిలిచిన చిత్రం. ఇది కేవలం ఒక భయానక కథ కాదు, ఇది ఓ నమ్మకంపై, అంధ విశ్వాసాలపై మనలో ఉన్న లోతైన అనిశ్చితిని, అనుమానాలను, ప్రశ్నలను ఎత్తిచూపే సినిమాటిక్ అనుభవం. కథలో రాబర్ట్ థార్న్ (Robert Thorn) లండన్ లో అమెరికన్ రాయబారి, పురిటిలో మృతిచెందిన బిడ్డను భార్యకు తెలియకుండా, అదే ఆసుపత్రిలో చనిపోయిన ఇంకొక ఆవిడ శిశువును డాక్టర్ల సలహాతో తనకు పుట్టినట్టుగా భార్యను నమ్మిస్తాడు. ఆ శిశువే Damien, అతని చుట్టూ ఆరంభంలోనే ఓదార్పుగా కనిపించినా, కొద్ది రోజుల్లోనే అనేక అసాధారణ సంఘటనలతో అతని గురించి సందేహాలు మొదలవుతాయి.
దామియెన్ (Damien) ఆయాగా పనిచేసే ఆవిడ బర్త్‌డే పార్టీలో ఆత్మహత్య చేసుకోవడం, “It’s all for you, Damien!” అంటూ గట్టిగ అరిచి చనిపోయే దృశ్యంతో భయం జూలు విదలుచుకొంటుంది, ఆ తరువాత ఆ భయం ప్రతి సంఘటనతో దాదా పుట్టిస్తూనే ఉంటుంది. చర్చికి తీసుకెళ్తే డామియెన్ భయంతో కేకలు వేయడం, జూలో జంతువులు అతడిని చూసి భయపడటం ఇవన్నీ అతను సాధారణ బాలుడు కాదన్న సందేశాన్ని ఇచ్చే విధంగా ఉంటాయి. నిజంగా అతను ఎవరో తెలుసుకునే ప్రయత్నంలో రాబర్ట్ తన కొడుకును నమ్మాలా లేక ప్రపంచాన్ని రక్షించాలా అన్న ఆత్మకలహానికి లోనవుతాడు.
అతని కోసం కొత్తగా వచ్చిన ఆయా, తరువాత అతని సంరక్షణకు ఎక్కడి నుంచి వస్తుందో ఓ కుక్క, ఇతని నిజానిజాలను శోదిస్తూ మరణించే ఫొటోగ్రాఫర్, చర్చి ఫాదర్, చివరికి మరో సారి తల్లవబోతున్న దత్తత తల్లినే హతమార్చడం, ప్రతి సారి శాతాన్ లక్షణం బయటికొక రకంగా, లోపల ఇంకోలా ఉంటూ అతని అసలు రూపం తెలిసిన వారు ఒకరి తరువాత ఒకరు అంతమొందడం పట్టు బిగిస్తూ జరిగే తీరు పూర్తి వెండితెర భయానకం కావ్యం.
ఈ కథలోని ఆలోచన భయాన్ని మరింత భయంకరంగా మార్చేది, ఈ కథనానికి సంబంధించిన బిబిలిక్ ప్రాఫెసీ (Biblical prophecy)లను ఆధారంగా తీసుకొని, శిశువుగా జన్మించిన యాంటి క్రిస్ట్ కథను తెరకెక్కించిన శైలి అద్భుతం. శాతాన్ చిహ్నం 666 అనే సంఖ్యను Damien శరీరంపై గుర్తించడంతో, అతడు మానవుడే కాదు అన్న నిజం వెలుగులోకి వస్తుంది. ఈ భయం తనను తానే నిర్మించుకుంటూ, మానవ సంబంధాలను విచ్ఛిన్నం చేస్తూ ముందుకు సాగుతుంది. ఇందులో సంగీతం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది. లాటిన్ చోరల్ మ్యూజిక్ ఆధారంగా రూపొందించిన ఈ నేపథ్య సంగీతం సినిమాకు ఒక భక్తి మిశ్రమ భయంలా అనిపించే వాతావరణాన్ని కలిగిస్తుంది.
చివర్లో Robert తండ్రైన ప్రపంచాన్ని శాతాన్ నుండి ప్రపంచాన్ని రక్షించడానికి డామియెన్ ను చంపడానికి సిద్ధపడినప్పటికీ, అది జరగపోగా, అతను చనిపోవడం విచారకరం.డామియెన్ తల్లి తండ్రులను కోల్పోయి సానుభూతి పొంది, క్లైమాక్స్ లో అమెరికన్ ప్రెసిడెంట్ చేయి పట్టుకొని, అధికారం వైపు పట్ల పయనించే విధంగా చూపిస్తారు. చివరి షాట్‌లో డామియెన్ అధ్యక్షుడి పక్కన నిలబడి కెమెరాకి చిరునవ్వు చిందిస్తాడు. ఆ చిన్న నవ్వే , ప్రపంచ సినిమా మొత్తంలోనే అత్యంత భయానక దృశ్యం.
ది ఒమెన్ ఎందుకు శాశ్వతంగా నిలిచింది అంటే, అది చూపే భయం తాత్కాలికంగా కాదు, అది మన విశ్వాసాలను కుదించే భయం. డామియెన్ అనే చిన్నారి రూపంలో శాతాన్ సమాజంలోకి అడుగుపెడతాడనే భావన , అతను ఎక్కడో పెరుగుతున్నాడని, ఇది కేవలం ఒక కథ కాదని, అది మన ఆత్మలోనికి జారిపోతుంది. ఈ సినిమా భయం చూపించదు, కానీ మనల్ని భయపడేలా చేస్తుంది. వెంటాడుతూనే ఉంది.