‘పుష్ప -2’: నార్త్ లో వివాదం, అసలు కారణం ఏంటి
x

‘పుష్ప -2’: నార్త్ లో వివాదం, అసలు కారణం ఏంటి

కర్ణి సేన రాజ్‌పుత్ నాయకుడు రాజ్ షెకావత్ ఆదివారం ‘పుష్ప 2’ నిర్మాతలకు వార్నింగ్ ఇచ్చారు. ఎందుకు?


అల్లు అర్జున్ హీరోగా మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన పుష్ప 2 చిత్రం థియేటర్‌లో అదరగొడుతోన్న సంగతి తెలిసిందే. మరోసారి 'పుష్ప రాజ్' నార్త్ బెల్ట్ కు ఫుల్ గా ఎక్కేసాడు. ప్రపంచ వ్యాప్తంగా కేవలం నాలుగు రోజుల్లో రూ.829 కోట్లు వసూళ్లు చేసి ఆశ్చర్యపరచింది. ముఖ్యంగా హిందీలో పుష్ప 2 వసూళ్లు భారీ స్థాయిలో వస్తున్నాయి. తెలుగుతో సమానంగా ఓ రకంగా ఎక్కువగానే పుష్ప 2 హిందీ కలెక్షన్స్ వస్తున్నాయి అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. తాజాగా ఈ మూవీ నిర్మాతలకు బెదిరింపులు వచ్చినట్లు సమాచారం. అది నార్త్ లోని ఓ వర్గం నుంచి కావడం చెప్పుకోదగ్గ విషయం. ఆ వివాదం ఏమిటి..ఆ వివాదం వెనక అసలు కారణం ఏమిటనే చర్చ ఇప్పుడు మీడియాలో జరుగుతోంది.

పుష్ప 2 లో అల్లు అర్జున్ 'పుష్ప రాజ్'గా, రష్మిక మందన్న 'శ్రీవల్లి'గా, ఫహద్ ఫాసిల్ 'భన్వర్ సింగ్ షెకావత్'గా నటించారు. అయితే పుష్ప 2 చిత్రంలో ‘షెకావత్’ పాత్రను నెగిటివ్‌గా చూపించారనేదే అసలు వివాదం. ‘క్షత్రియ’ కమ్యూనిటీని కించపరిచేలా పుష్ప 2 సినిమాలో ‘షెకావత్’ పాత్ర ఉందని ఆరోపిస్తూ కర్ణి సేన రాజ్‌పుత్ నాయకుడు రాజ్ షెకావత్ ఆదివారం ‘పుష్ప 2’ నిర్మాతలకు వార్నింగ్ ఇచ్చారు.

నార్త్ లో సంచలనం సృష్టిస్తున్న పుష్ప 2 ది రూల్ లో ఫహద్ ఫాసిల్ పోషించిన భన్వర్ సింగ్ షెకావత్ పాత్రకు పెట్టిన పేరు తమకు అభ్యంతరకరంగా ఉందంటూ క్షత్రియ సామజిక వర్గానికి చెందిన నాయకుడు ఒకరు విడుదల చేసిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. ఈ విషయమై అంతటా భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తక్షణమే దర్శక నిర్మాతలు క్షమాపణ చెప్పాలంటూ, సంవత్సరాల తరబడి తమ వర్గానికి ఇలాగే అన్యాయం జరుగుతోందంటూ, తమ వాళ్ళను విలన్లుగా చూపిస్తున్నారంటూ ఏకంగా దాడికే పిలుపు ఇప్పుడు సమస్యగా మారింది.

వారు విడుదల చేసిన వీడియోలో సినిమాలో ‘షెకావత్’ అనే పదాన్ని పదే పదే ఉపయోగించడం వల్ల సమాజాన్ని అవమానించారని ఆరోపించారు. ‘‘ఈ సినిమాలో క్షత్రియులను ఘోరంగా అవమానించారు. ‘షెకావత్’ కమ్యూనిటీ తప్పుగా చూపించబడింది. భావ ప్రకటనా స్వేచ్ఛ పేరుతో క్షత్రియులను అవమానిస్తున్న ఈ పరిశ్రమ మళ్లీ అదే పని చేసింది. సినిమా నిర్మాతలు ‘షెకావత్’ అనే పదాన్ని సినిమా నుంచి తొలగించాలి, లేకుంటే కర్ణి సేన.. పుష్ప 2 మూవీ నిర్మాతలపై దాడి చేస్తుంది. అవసరమైతే ఎంతకైనా తెగిస్తుంది’ అని వీడియోలో పేర్కొన్నారు.

అయితే ఈ విషయంలో నిర్మాతల నుంచి ఇంకా ఎలాంటి రెస్పాన్స్ రాలేదు. మరోవైపు పుష్ప 2 బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ గా కొనసాగుతోంది. అయితే ఈ వివాదం వెనక అసలు కారణాలను ఇప్పుడు మీడియా వెలికి తీసే ప్రయత్నం చేస్తోంది. ఈ వివాదం వెనక కొన్ని ఆలోచించాల్సిన విషయాలు, గమనించాల్సిన అంశాలు కొన్ని ఉన్నాయి అని అంటున్నారు. పుష్ప 2 చిత్రం విడుదలైన మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా 294 కోట్ల రూపాయల రాబట్టి దుమ్ము దులిపేయటమే అందుకు కారణం అంటున్నారు.

అంతేకాదు కలెక్షన్లతో పుష్ప 2 హిందీ భాషలో షారుఖ్ ఖాన్ ‘జవాన్’ మొదటి రోజు రికార్డును బద్దలు కొట్టేయటం బాలీవుడ్ లో చాలా మందికి అకారణ కోపం తెప్పిస్తోందని చెప్తున్నారు. ఈ క్రమంలో ఈ మూవీ ఆల్ టైమ్ అతిపెద్ద దేశీయ ఓపెనర్‌గా నిలిచింది. ఇక నాలుగో రోజు ఈ సినిమా రూ.829 కోట్లు వసూళ్లు రాబట్టింది. ఇప్పుడు రూ.1000 కోట్ల దిశగా పరుగులు పెడుతోంది.

భన్వర్ సింగ్ షెకావత్ పాత్ర పుష్ప 1 ది రైజ్ లోనూ ఉంది. అప్పుడు ఎవరూ ఏమీ మాట్లాడలేదు. అప్పుడు రాని సమస్య ఇప్పుడే ఎందుకు వచ్చిందనేది అల్లు అర్జున్ అభిమానుల ప్రశ్న. ఒక సౌత్ డబ్బింగ్ సినిమా ఆల్ ఇండియా రికార్డులు బద్దలు కొడుతున్నందుకు వచ్చిన వివాదమే ఇది అంటున్నారు. నార్త్ లో మన వాళ్ల సినిమా హిట్ అయ్యినప్పుడల్లా ఇలాంటి వివాదం ఏదో ఒకటి తీసుకురావటం అలవాటుగా మారింది అంటున్నారు. పోనీ జనం ‘షెకావత్’ కమ్యూనిటీ ని తప్పుగా చూపించారని సినిమా చూడటం మానటం లేదు కదా. సినిమాని సినిమాగా చూడకపోవటం, అందులో ఏదో ఒకటి ఎత్తి చూపి వివాదం చేసి తమ అక్కసు చూపించుకోవటం నార్త్ లో ఉండే కొందరికి ఆనవాయితీగా మారిందనేది సోషల్ మీడియా చెప్తున్న విశ్లేషణ. అయితే ఈ వివాదం కలెక్షన్స్ పెంచడానికి ఉపకరిస్తుందా లేక కొత్త సమస్యలు తెచ్చిపెడుతుందా అనేది వేచి చూడాల్సి ఉంది.

Read More
Next Story