
‘ధురంధర్’ 1000 కోట్ల సెన్సేషన్ వెనుక మాస్టర్ ప్లాన్ ఇదే!
టాలీవుడ్ నిర్మాతలారా గమనించండి!
ప్రస్తుతం టాలీవుడ్‌లో ఒక విచిత్రమైన పరిస్థితి నెలకొంది. సినిమా హిట్ అయిందా లేదా అన్న దానికంటే, డిజిటల్ రైట్స్ ఎన్ని కోట్లకు అమ్ముడయ్యాయి అనే దానిపైనే నిర్మాతలు ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. కానీ, ఈ ధోరణి మెల్లమెల్లగా థియేటర్ వ్యవస్థను సమాధి చేస్తోందనే విషయం గుర్తించలటం లేదు. అయితే తాజాగా బాలీవుడ్ బ్లాక్ బస్టర్ ‘ధురంధర్’ ఈ విషయాన్ని కళ్ళు తెరిపించేలా లెక్కలతో సహా చూపించి నిరూపించింది. కేవలం ఓటిటి రేట్ల కోసం కక్కుర్తి పడితే బాక్సాఫీస్ వద్ద వచ్చే వందల కోట్ల లాభాలను ఎలా కోల్పోతామో ఈ సినిమా ఒక ప్రాక్టికల్ లెసన్‌లా నేర్పింది.
నిర్మాతల భయం.. ఓటిటి సంస్థల పెత్తనం!
గత రెండేళ్లుగా థియేటర్ కలెక్షన్లు అంచనాలకు అందడం లేదు. దీంతో నిర్మాతలు సేఫ్ సైడ్ ఉండటం కోసం సినిమా విడుదలకు ముందే ఓటిటి సంస్థలతో ఒప్పందాలు చేసుకుంటున్నారు. ఈ క్రమంలో ఓటిటి సంస్థలు పెడుతున్న కండిషన్లకు తలొగ్గి, సినిమా రిలీజైన 4 వారాలకే స్ట్రీమింగ్ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు. ఇది సినిమా లాంగ్ రన్‌ను నిలువునా ముంచేస్తోంది. 'నెల రోజుల్లో ఫోన్‌లోకి వచ్చేస్తుంది కదా' అనే ప్రేక్షకుల మైండ్‌సెట్ వల్ల, కంటెంట్ బాగున్నా సరే రెండో వారం నుంచి థియేటర్లు ఖాళీ అవుతున్నాయి.
ధురంధర్ స్ట్రాటజీ: ఎందుకు వర్కవుట్ అయింది?
డిసెంబర్ 5న విడుదలైన ‘ధురంధర్’ సినిమా నిజానికి స్లోగా స్టార్ట్ అయింది. మన తెలుగు సినిమాలాగా ఇది గనుక 4 వారాల విండో పెట్టుకుని ఉంటే, నెగెటివ్ టాక్ రాగానే జనం ఓటిటి కోసం వెయిట్ చేసేవారు. కానీ ఈ సినిమా టీమ్ 8 వారాల గ్యాప్ నిబంధనను కచ్చితంగా అమలు చేసింది.
8 వారాల గ్యాప్.. 1100 కోట్ల లాభం!
‘ధురంధర్’ సక్సెస్ వెనుక ఉన్న అసలు రహస్యం ఏంటో తెలుసా? థియేటర్ రిలీజ్ మరియు ఓటిటి రిలీజ్ మధ్య ఉన్న 8 వారాల గ్యాప్. ఒకవేళ ఈ సినిమా మన తెలుగు సినిమాలాగా 4 వారాల్లోనే ఓటిటిలోకి వచ్చి ఉంటే, రెండో వారానికే కలెక్షన్లు పడిపోయేవి. కానీ 8 వారాల వరకు ఓటిటిలో రాదనే నమ్మకంతో జనం థియేటర్లకు క్యూ కట్టారు. ఫలితంగా ఈ సినిమా ఏకంగా 1100 కోట్లు కొల్లగొట్టింది. అదే ఓటిటి డీల్ మీద ఆధారపడి ఉంటే నిర్మాతకు ఇందులో సగం లాభం కూడా వచ్చేది కాదు.
ఓటిటి సంస్థల కొత్త రూల్.. నిర్మాతలకు ముప్పు!
ఇక్కడ ఇంకో షాకింగ్ అప్‌డేట్ ఏంటంటే.. ఇప్పుడు ఓటిటి సంస్థలు కూడా తెలివిగా వ్యవహరిస్తున్నాయి. 'సినిమా థియేటర్లో ఆడితేనే పూర్తి డబ్బులు ఇస్తాం.. లేదంటే కోత విధిస్తాం' అనే పెర్ఫార్మెన్స్ బేస్డ్ మోడల్‌ను తెరపైకి తెచ్చాయి. దీనివల్ల నిర్మాతలకు ఉన్న ఏకైక 'సేఫ్టీ నెట్' కూడా పోయింది. అంటే ఇప్పుడు సినిమా థియేటర్లో ఆడటం నిర్మాతలకు అనివార్యంగా మారింది.
తెలుగు నిర్మాతలు నేర్చుకోవాల్సింది ఇదే!
కేవలం ఓటిటి రేట్ల కోసం కక్కుర్తి పడి త్వరగా స్ట్రీమింగ్ చేస్తే లాంగ్ రన్ దెబ్బతింటుందని ‘ధురంధర్’ నిరూపించింది. కంటెంట్ బాగుంటే 8 వారాల గ్యాప్ ఇవ్వడం వల్ల థియేటర్ల ద్వారా వచ్చే లాభం ఓటిటి డీల్ కంటే ఎన్నో రెట్లు ఎక్కువగా ఉంటుంది. ఇకనైనా మన నిర్మాతలు ఈ 8 వారాల నిబంధనను కచ్చితంగా అమలు చేస్తేనే థియేటర్ వ్యవస్థ బతుకుతుంది.
అన్నట్టు, బాక్సాఫీస్ ను షేక్ చేసిన ఈ ‘ధురంధర్’.. రిలీజైన 8 వారాల తర్వాత, అంటే జనవరి 30, 2026 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. మన తెలుగు పెద్ద సినిమాలు కూడా ఇదే 8 వారాల గ్యాప్ ఫార్ములాను పాటిస్తే, బాక్సాఫీస్ వద్ద పాత రికార్డులన్నీ తిరగరాయడం ఖాయం.

