2025 సంక్రాంతి విజేత ఎవరు ?
x

2025 సంక్రాంతి విజేత ఎవరు ?

తెలుగులో ప్రతి స్టార్ హీరో తన సినిమా సంక్రాంతికి రిలీజ్ అయితే బాగుంటుందని కలలు కంటారు.

తెలుగులో ప్రతి స్టార్ హీరో తన సినిమా సంక్రాంతికి రిలీజ్ అయితే బాగుంటుందని కలలు కంటారు. ఎందుకంటే పండగ మూడ్ ...సినిమా రిజల్ట్ తో సంబంధం లేకుండా చాలా సార్లు పాజిటివ్ గా భాక్సాఫీస్ కు ఆనందం కలిగిస్తూంటుంది. తెలుగు పరిశ్రమకు సంబంధించి ఇదే బిగ్గెస్ట్ సీజ‌న్. ప్రతి ఏడాది మాదిరిగానే, ఈసారి కూడా మూడు పెద్ద సినిమాలు సంక్రాంతి బరిలో నిలిచాయి. సంక్రాంతి సందడి మెల్లిగా తగ్గి ఎవరి పనుల్లో వారు పడుతున్నారు. ఈ నేపథ్యంలో ఈ సీజన్ లో విడుదలైన సినిమాల్లో ఏది విజేత అనేది చూద్దాం.

ఈ సంక్రాంతికి విడుదలైన మూడు సినిమాల్లో రెండు దిల్ రాజుకి చెందినవే కావడం విశేషం. 'గేమ్ ఛేంజర్', 'సంక్రాంతికి వస్తున్నాం' చిత్రాలకు ఆయనే నిర్మాత. అలాగే 'NBK109' మూవీకి నైజాంలో డిస్ట్రిబ్యూటర్‌గా వ్యవహరించారు. అయితే గేమ్ ఛేంజర్ చిత్రం డబ్బులు పోగొడితే..సంక్రాంతికి వస్తున్నాం చిత్రం డబ్బులు భారీగా తెచ్చిపెడుతోంది. దాంతో ఇలా పోయిన డబ్బుని అలా రికవరీ చేస్తున్నారు దిల్ రాజు. ఎక్కువ శాతం ఈ రెండు సినిమాలను ఒకే డిస్ట్రిబ్యూటర్స్ పంపిణీ చేయడంతో పెద్దగా నష్టాలు లేనట్లే. కానీ దిల్ రాజు కు మాత్రం గేమ్ ఛేంజర్ తో బాగా పోయినట్ల అంటోంది ట్రేడ్.

దిల్ రాజుకి 2024 వ ఏడాది పెద్దగా కలిసి రాలేదనే చెప్పాలి. ఆయన నిర్మాతగా 'ఫ్యామిలీ స్టార్', 'లవ్ మీ', 'జనక అయితే గనుక' సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో టాక్ అందుకోలేకపోయాయి. అలానే నైజాంలో మహేష్ బాబు, త్రివిక్రమ్‌ కాంబోలో వచ్చిన 'గుంటూరు కారం' మూవీకి డిస్ట్రిబ్యూషన్‌ బాధ్యతలు తీసుకున్నారు. అది కూడా ఆశించిన ఫలితాన్ని అందించలేదు. దాంతో దిల్‌ రాజుకు 'గేమ్ ఛేంజర్', 'సంక్రాంతికి వస్తున్నాం', 'NBK109' విజయాలు చాలా కీలకంగా మారాయి. ప్రధానంగా భారీ బడ్జెట్‌ సినిమా 'గేమ్ ఛేంజర్' సక్సెస్‌ అవ్వడం ముఖ్యం అనుకున్నారు. కానీ ఆ సినిమా అసలు వర్కవుట్ కాలేదు.

ఇక సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకువచ్చిన ‘డాకు మహారాజ్‌’ (Daaku Maharaj) హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది.ఈ మూవీ టీమ్ కూడా ఈ హిట్‌ను సెలబ్రేట్‌ చేసుకుంటోంది. అయితే అనుకున్న స్థాయిలో ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ముందుకు వెళ్లడం లేదు. అయితే బాబీ దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా నటించిన ‘డాకు మహారాజ్‌’ తొలిరోజు రూ.56 కోట్లు వసూలు చేసినట్లు టీమ్‌ అధికారికంగా ప్రకటించింది. దీంతో బాలకృష్ణ కెరీర్‌లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాల లిస్ట్‌లో ‘డాకు మహారాజ్‌’ చేరింది.

అయితే బాలకృష్ణ సినిమా అంటే మాస్‌ ఎలివేషన్స్‌తో పాటు డైలాగులకు ప్రాధాన్యం ఉండటం కలిసొచ్చింది. ‘డాకు మహారాజ్‌’లోనూ బాలయ్య మార్క్‌ డైలాగులు అభిమానుల్లో జోష్‌ నింపుతున్నాయి. భాను భోగ‌వ‌ర‌పు, నందు మాట‌లు ఆక‌ట్టుకుంటాయి. ‘సింహం న‌క్క‌ల‌ మీద‌ కొస్తే వార్ అవ్వ‌దు’.. ‘వార్నింగ్ చంపేవాడు ఇవ్వాలి, చ‌చ్చేవాడు కాదు’.. త‌ర‌హా డైలాగులు సోషల్‌ మీడియాలో షేర్‌ అవుతున్నాయి. కానీ ఫ్యామిలీలు ఈ సినిమాకు దూరంగా ఉండటం మైనస్ గా మారింది.

అయితే వీటిన్నటికి అతీతంగా వెంకటేష్ అయితే తన కెరీర్‌లో ఎప్పుడూ లేనంత దూకుడు చూపిస్తున్నాడు. సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో మొదటి రోజే 35 కోట్లకు పైగా షేర్ వసూలు చేసాడు. అనిల్ రావిపూడి మ్యాజిక్‌కు వెంకీ ఇమేజ్ తోడు కావడంతో సంక్రాంతికి వస్తున్నాం దూకుడు మామూలుగా లేదిప్పుడు. ఈ సినిమాకు వస్తున్న కలెక్షన్లు చూస్తుంటే రూ.100 కోట్ల షేర్‌తో పాటు రూ.200 కోట్ల గ్రాస్ వచ్చేలా కనిపిస్తుంది.

దాంతో సంక్రాంతికి వస్తున్నాం చిత్రం ఈ సంక్రాంతికి విన్నర్ గా నిలిచింది. 2025 సంక్రాంతి పండగను వెంకటేష్ పూర్తిగా టేకోవర్ చేసుకున్నారు. వెంకటేష్ ఈ మధ్యన కాస్తంత వెనుకబడిన తనకు సరైన సినిమా పడటంతో రప్ఫాడించాడు. ఇప్పుడు ఈ సీనియర్ హీరో సంక్రాంతి పండుగ పై దండయాత్ర చేస్తున్నారు. చాలా రోజుల తర్వాత 60 ప్లస్ హీరో టాలీవుడ్‌ను ఏలటం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.

బయ్యర్లు, డిస్ట్రిబ్యూటర్లు ఈ సినిమాను తమకు నిజమైన బొనాంజా గా భావిస్తున్నారు. మొదటిరోజు నుండి ఎక్కడా తగ్గకుండా వసూళ్లను నమోదు చేస్తూ బయ్యర్లకు సురక్షిత లాభాలను తెస్తోంది. ఫ్యామిలీ ఎంటర్టైనర్‌గా ఆడియెన్స్‌ను థియేటర్లకు చేరువ చేసిన ఈ చిత్రం, తెలుగు సినిమాకు మరో బిగ్ హిట్ అని చెప్పవచ్చు. బయ్యర్లకు లాభాల పంటను అందించిన "సంక్రాంతికి వస్తున్నాం" సినిమా భాక్సాఫీస్ కు పండగ.

Read More
Next Story