మణిరత్నం – ఎక్కడ దారి తప్పారు?
x

మణిరత్నం – ఎక్కడ దారి తప్పారు?

శైలిని కోల్పోయిన శిల్పి

“ఒక డైరెక్టర్ తన శైలిని కోల్పోయినప్పుడు , ఆ సినిమాను ప్రేక్షకుడు కోల్పోతాడు.”. ఈ విషయం ఫిల్మ్ మేకర్స్ చాలా మంది చెప్తారు. నమ్ముతారు. అయితే ఆ శైలిని ఎప్పుడు కోల్పోయారు అనేది ఆ సినిమా రిలీజైన తర్వాత చాలా కాలానికి కానీ తెలియదు. మరికొంతమందికి ఎప్పటికీ తెలియకపోవచ్చు.

ప్రతీ శుక్రవారం ఎన్నో సినిమాలు రిలీజ్ అవుతూంటాయి. అరుదుగా కొన్ని హిట్ అవుతాయి. మిగతావన్నీ పరాజయం బాట పడుతూంటాయి. అయితే రిలీజైన సినిమాల్లో చాలా భాగం అవి రిలీజైనట్లు కూడా తెలియదు. తెలిసినా పట్టించుకోరు. కాని కొందరి దర్శకులు సినిమాలకు అభిమానులు ఉంటారు. ఆ సినిమా కోసం ఎదురుచూస్తారు. రిలీజ్ కు ముందు మాట్లాడతారు. ప్లాఫ్ అయినా హిట్ తర్వాత కూడా మాట్లాడుతూంటారు. విశ్లేషణలు కూడా చేస్తూంటారు. అలాంటి దర్శకులులో మణిరత్నం కూడా ఒకరు. ఏనుగు చచ్చినా బ్రతికినా వెయ్యే అన్నట్లు ఆయన సినిమా హిట్టైనా, ఫెయిలైనా విశ్లేషణలు జరుగుతూనే ఉంటారు.

మణిరత్నం సినిమా అంటే?

ఇది కేవలం తెరపై కథ చెప్పే పని కాదు. అది పాత్రల మానసిక ప్రపంచాన్ని వెతుకుతూ, సౌండ్‌ట్రాక్‌ ల మధ్య నడుస్తూ, కెమెరా కంట తడిలో తేలేలా రూపొందించబడుతూండేవి. ఇద్దరు మనుషుల మధ్య ప్రేమ ఎంత అందంగా, ఎంత సహజంగా, తేలిగ్గా పుడుతుందో చూపించే మాస్టరీ…అదే మణి రత్నం USP. మనిషి ఆలోచనలు, భయాలు, ప్రేమలు… ఇవన్నీ మౌనంగా ఎమోషన్ ద్వారా పలికేలా రూపొందిస్తారు. అలాగే వైవాహిక సమస్య, ప్రేమలో ఉండే అభిప్రాయ భేదాలు, రాజకీయ నమ్మకాలు… ఇవన్నీ సాధారణ అంశాలే. కానీ ఆయన వాటిని మనసులో నడిచే యుద్ధాలుగా చిత్రిస్తారు.

మణిరత్నం సినిమాల్లో కథ కంటే పాత్రల జర్నీ ముఖ్యమై ఉంటుంది. ఆయన సినిమాలు ఎప్పుడూ పెయింటింగ్‌లా కనిపిస్తాయి. ప్రతీ ఫ్రేమ్ భావాన్ని మాత్రమే కాదు, భావోద్వేగాన్ని కూడా పలుకుతుంది. ఆయన పాత్రలు ఎప్పుడూ రెండు ప్రపంచాల మధ్య చిక్కుకుంటారు. ఆయన సినిమా చూసాక ఎంత బలమైన కథ చెప్పారు అనుకునే కంటే, ఏ భావోద్వేగాన్ని రగలించి,మనలో మిగిల్చారు అనేది గుర్తుండి పోయే విషయం

'గీతాంజలి'లో జీవితం మీద ప్రేమ, 'నాయకన్‌'లో న్యాయవ్యవస్థ పై నమ్మకం కోల్పోయిన మనిషి పోరాటం, 'రోజా'లో దేశభక్తి – ఇవన్నీ చాలా కాలం పాటు వెంటాడుతూనే ఉంటాయి. అయితే కొన్ని సార్లు ఆయన జడ్జిమెంట్ తప్పుకుంది. ఆయన ఊహ ఉప్పెనలా మనని తాకదు. అలా మణిరత్నం తాజా చిత్రం 'Thug Life' చాలా మంది అభిమానులను నిరుత్సాహపరిచింది.

ఒకప్పుడు ‘నాయకన్’, ‘దళపతి’, ‘బోంబే’ వంటి చిత్రాలతో భారతీయ సినిమా శైలిని మార్చిన మణిరత్నం నుంచి వచ్చిన ‘Thug Life’ చిత్రం, ఆయన స్థాయికి ఏ మాత్రం సరిపడనది. అయితే ఎక్కడుంది లోపం.

The Dark Knight (2008) సినిమాలో ఓ డైలాగు ఉంటుంది. "You either die a hero or live long enough to become the villain.( మీరు ఒక హీరోగా చనిపోవచ్చు, లేక కాలం గడిచే కొద్దీ విలన్ అవ్వచ్చు) . మణిరత్నం వంటి చాలా మంది సీనియర్ దర్శకులు పరిస్దితి ఇలాగే తయారవుతోంది. అందుకు రకరకాల కారణాలు ఉండవచ్చు.

సాధారణంగా సీనియారటి పెరిగే కొలిది తమను తామే అనుకరించుకునే పరిస్దితి క్రియేటర్స్ లో ఎక్కువ అవుతూంటుంది. ‘నా గతం నా ప్రూఫ్’ అని భావిస్తూ అదే స్టైల్‌ మళ్లీ మళ్లీ తేవడం కోసం తపస్తు చేస్తూ తలకిందులవుతూంటారు. ఓ రకంగా కాలానికి తగినట్లు అప్డేట్ కాకపోవటమే ఈ పరిస్దితి అని విశ్లేషించాలి. తమను తాము వదులుకోలేక. కొత్తదనాన్ని ఆహ్వానించలేక సతమతమవుతూంటారు.

ఇక మరి కొందరు సీనియర్స్ కు మరో కొత్త సమస్య. వారని నిరంతరం భయపెట్టేది. Audience fear – “ఆడియన్స్ కోరేదే ఇవ్వగలుగుతున్నామా , ఈ కాలం యూత్ ట్రెండ్ ని పట్టుకోగలుగుతున్నామా లేదా ” అనే భయం. సీనియర్ దర్శకులుగా మాకు అనుభవం ఉంది. కానీ ఇప్పటి తరాన్ని మా అనుభవంతో మెప్పించగలమా అనేది నిరంతర ఆలోచన.

ఈ రెండు భయాలతో చాలా మంది సీనియర్స్ సతమవుతున్నారని చాలా సార్లు వాళ్ల సినిమాలు నిరూపించాయి. మరి మణిరత్నం ఏ జోన్ లో ఉన్నారు అనేది ‘Thug Life’ నుంచి చూస్తే ..ఫస్టాప్ అంతా మణిరత్నం మెరుపులు కనిపిస్తూంటాయి. ఆయన్ని ఆయన నమ్ముకుని ముందుకు వెళ్లారు. అదే సెకండాఫ్ కు వచ్చేసరికి ఇప్పటి జనరేషన్ తమిళ దర్శకులు లోకేష్ కనకరాజ్, జైలర్ డైరక్టర్ నేశన్ తొంగిచూస్తారు. ముఖ్యంగా నేరేషన్, ట్విస్ట్ లు ...లోకేష్ కనకరాజు కథా నిర్మాణాన్ని గుర్తు చేస్తుంది. అలాగే కొన్ని సీన్స్ నేశన్ కనిపిస్తారు.

దాంతో అటు తనవైపు ఉండలేక, ఇటు ఇప్పటి జనరేషన్ కు ఏదో కావాలి,వారిని మెప్పించాలని కంగారుపడి జోడించినట్లు అనిపిస్తూంటుంది. ఇది అటూ, ఇటూ కాని పరిస్దితి. పూర్తిగా మణిరత్నం స్టైల్ లో వెళ్లిపోయి సినిమా తీస్తే ఖచ్చితంగా రెట్రో మణిసార్ ని చూసామని అందరూ ఆనందపడేవాళ్లు. తనను తాను వదిలేయకుండా ఉంటే బాగుండేదేమో. అయితే ఇది మణిరత్నం కావాలని చేసిందా లేక కమల్ ఏమన్నా విక్రమ్ లాంటి సినిమా కావాలని ఇన్పూలియన్స్ చేసారా రెండూ కాకుండా తెలియకుండానే ట్రెండ్ ప్రబావం పడిందా, ఇప్పటి తరం దర్శకుల కథన శైలిని అనుసరించాలనే తాపత్రయం మణిరత్నంను తాను కాదు అనే స్థితిలోకి నెట్టేసిందా అనిపిస్తుంది...ఏమో. Mani sir, You are not Lokesh or nelson. You are the reason Lokesh,Nelson started

ఏదైమైనా మణిరత్నం సినిమాల్లో ప్రకృతి ఆరాధన, మంచు కురసే వేళలు, పక్షులు గుసగుసలు, తొలి ముద్దు అనుభూతులు. ఉదయపు సంద్యా రాగాలు, పుష్పాలు వికసించేటప్పుడు వినిబడే సన్నని సంగీతాలు, అనంతమైన మానవ భావోద్వేగాలు, అత్యంత గాఢమైన పాత్రల వ్యక్తీకరణలు, ఒకటిటేమిటి తర్కానికి అందని సృజనాత్మకత ఎంతో కనపడేది. ఓ కవిత్వం తెరపై పరుచుకునేది. మణిరత్నం తన భావోద్వేగాన్ని తెరపై షాట్స్ ద్వారా మరో మనందరికి అందచేసేవారు. అదే ఈ థగ్ లైఫ్ లో మిస్సైంది. వ్యక్తిగత అనుభవం, మానవ సహజమైన భావోద్వేగం లేదు.

మళ్ళీ తలుచుకోవాలి మాస్టారు...

“Don’t chase trends. Build legacies.”

– Christopher Nolan

మీ సినిమా ఒక మూడున్నర గంటల ప్రయాణం కాదు. ఒక భావజాలం. ఒక ఆశయం. ఒక ఆత్మ.

మిమ్మల్నిని అనుకరించే దర్శకులున్నారు.

మీ కోసం ఎదురుచూసే ప్రేక్షకులున్నారు.

మళ్లీ ‘మణిరత్నం’గా మిగలి రండి

మిమ్మల్ని మిస్సవ్వడమే... ఇప్పటి మా అసంతృప్తికి మూలకారణం.

Read More
Next Story