
తెరపైకి తిరిగొచ్చిన ఏఎన్నార్ మ్యాజిక్
ఉచిత ప్రదర్శనలు ఎక్కడంటే?
తెలుగు తెరపై భావ వ్యక్తీకరణకు, నటనకు కొత్త నిర్వచనం ఇచ్చిన మహానటుడు – నట సామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు గారు. ఆయన చలాకీతనం, సంభాషణలలోని ఆత్మీయత, హావభావాల లోతు, సున్నితమైన పాత్రలకు అందించిన మానవీయత ఆయనను చిరస్థాయిగా నిలిపాయి. ఆయన తెరపై కనిపించడం అంటే ఒక మ్యాజిక్. అలాగే విషాదాంత ప్రేమకథలంటే తెలుగులో ఎప్పటికీ గుర్తొచ్చే ఒకే ఒక్క పేరు అక్కినేని నాగేశ్వరరావు. ట్రాజెడీ ప్రేమకథలంటే లైలా-మజ్ను, సలీమ్-అనార్కలీ, దేవదాసు-పార్వతి కథలు గుర్తొస్తాయి. ఈ మూడింటిలోనూ ఏఎన్నార్ నటనతో అదరగొట్టేశారు. బ్లాక్ బస్టర్ హిట్స్ కొట్టేశారు. అలాగే అటు విషాదాంత ప్రేమకథలైనా.. ఇటు నవలా చిత్రాలైనా సరే అక్కినేని నాగేశ్వరరావు తన మార్క్ చూపించారు. 'ప్రేమాభిషేకం' లాంటి విషాదంత ప్రేమకథ అయితే ఎప్పటికీ రాదేమో? అనే స్దాయిలో చేసి చరిత్రలో ట్రాజెడీ కింగ్‌గా నిలిచిపోయారు.
ఇప్పుడు అదే మ్యాజిక్ మళ్లీ పెద్ద తెరపైకి ఈ తరాన్ని అలరించటానికి రాబోతోంది. ఆయన 101వ జయంతి సందర్భంగా అభిమానులకు ఒక ప్రత్యేక బహుమతి. ఏఎన్నార్ నటించిన రెండు అమూల్యమైన రత్నాలు ‘డాక్టర్ చక్రవర్తి’ (1964), ‘ప్రేమాభిషేకం’ (1981) తెలుగు రాష్ట్రాల్లోని ఎంపిక చేసిన థియేటర్లలో ఉచితంగా ప్రదర్శించబడుతున్నాయి. ఈ చిత్రాల రీ-రిలీజ్ సెప్టెంబర్ 20, 2025 నుంచి మొదలుకానుంది. టికెట్లను మాత్రం ముందుగానే – సెప్టెంబర్ 18 నుంచే BookMyShowలో బుక్ చేసుకోవచ్చు.
డాక్టర్ చక్రవర్తి – వైద్యుడి హృదయం, నటుడి మాస్టరీ
1964లో విడుదలైన డాక్టర్ చక్రవర్తి తెలుగు సినిమాకి ఒక సరికొత్త హుందాతనాన్ని ఇచ్చింది. ఒక వైద్యుడి కర్తవ్యాన్ని, ఆత్మగౌరవాన్ని, మానవీయతను ఏఎన్నార్ తన సహజమైన నటనతో సజీవం చేశారు. ఆయన డైలాగ్ డెలివరీలోని ఆ మృదుత్వం, పాత్రలోని నైతిక స్థైర్యం ప్రేక్షకుల హృదయాలను తాకాయి. ఈ సినిమాతో ఆయన తన మొదటి ఫిల్మ్‌ఫేర్ అవార్డు (సౌత్) అందుకున్నారు. కేవలం కమర్షియల్ విజయం మాత్రమే కాదు, కళాత్మకంగా కూడా ఈ చిత్రం తెలుగు చిత్రసీమలో ఒక మైలురాయి అయింది.
ఇందులోని పాటలు – ఈ మౌనం ఈ బిడియం , నీవు లేక వీణ పలుకలేనన్నది , మనసున మనసై బ్రతుకున బ్రతుకై – ఇవన్నీ దశాబ్దాలుగా ఎవర్‌గ్రీన్ క్లాసిక్స్‌గా నిలిచిపోయాయి.
ప్రేమాభిషేకం – కన్నీటి రాగం, శాశ్వతమైన మధురస్పర్శ
1981లో వచ్చిన ప్రేమాభిషేకం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇది కేవలం సినిమా కాదు, ఒక తరం భావోద్వేగాల ప్రతిరూపం. ఏఎన్నార్ చూపిన ప్రతి చూపు, పలికిన ప్రతి మాట ప్రేక్షకుల గుండెల్లో శాశ్వత ముద్ర వేసింది. చక్రవర్తి సంగీతం జోడించడంతో ఈ చిత్రం మరింత అద్భుతంగా మారింది. అప్పట్లో ఈ సినిమా 500 రోజులకు పైగా థియేటర్లలో విజయవంతంగా ప్రదర్శించబడింది – ఆ రికార్డు ఇప్పటికీ గర్వించదగినదే.
ఎక్కడ ప్రదర్శిస్తారు?
విశాఖపట్నం – క్రాంతి థియేటర్
విజయవాడ – స్వర్ణ ప్యాలెస్
ఒంగోలు – కృష్ణ టాకీస్
హైదరాబాద్ – పలు కేంద్రాల్లో, త్వరలో పూర్తి జాబితా ప్రకటించనున్నారు.
ఇది కేవలం ఉచిత ప్రదర్శన కాదు, ఒక తరతరాల్ని కలిపే వేడుక . ఏఎన్నార్‌ని తెరపై చూసి మురిసిన సీనియర్ సిటిజన్లు, ఆయన గొప్పతనాన్ని వినిపించుకున్న కొత్త తరం – ఇరువురికీ ఇది ఒక అపూర్వ అనుభవం కానుంది.
సూటిగా చెప్పాలంటే, సినిమా అంటే ఒక కల అని నమ్మిన నట సామ్రాట్ గారి కలలే మళ్లీ తెరపైకి రాబోతున్నాయి.