విశాల్ ‘మద గజ రాజా’ మూవీ రివ్యూ
ఎప్పుడో పన్నెండేళ్ల క్రితం షూటింగ్ పూర్తి చేసుకున్న సినిమా రిలీజ్ అయితే అసలు ఇప్పటి జనం చూస్తారా..
ఎప్పుడో పన్నెండేళ్ల క్రితం షూటింగ్ పూర్తి చేసుకున్న సినిమా రిలీజ్ అయితే అసలు ఇప్పటి జనం చూస్తారా..పట్టించుకుంటారా అంటే చూస్తారు..సూపర్ హిట్ కూడా చేస్తారు అని తమిళంలో ఈ సినిమా రిజల్ట్ నిరూపించింది. తమిళ స్టార్ హీరో విశాల్ 12 ఏళ్ల క్రితం నటించిన చిత్రం ‘మద గజ రాజా’ (Madha Gaja Raja )కొన్ని కారణాల వల్ల విడుదల వాయిదా పడుతూ.. వచ్చింది. ఆ క్రమంలో 12 ఏళ్లు గడిచిపోయాయి. ఇప్పుడు ఆ సినిమాకు అడ్డంకిగా ఉన్న సమస్యలు అన్ని క్లియర్ చేస్తూ ఈ ఏడాది జనవరి 12 తమిళ్‌లో రిలీజ్ చేసారు. పెద్ద విజయం సాధించింది.
చిత్రం ఫ్లాప్ లో ఉన్న విశాల్ కు చాలా కాలం తర్వాత రూ. 50 కోట్ల కలెక్షన్స్‌ని రాబట్టింది. తెలుగులోనూ అదే టైమ్ లో రిలీజ్ చేద్దామనుకున్నారు కానీ థియేటర్స్ సమస్యతో కుదరలేదు. ఇప్పుడు అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని రీసెంట్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తమిళంలో జరిగినట్లే... ఇక్కడ కూడా ఈ మూవీ సూపర్ హిట్‌గా నిలిచిందా?తెలుగు ప్రేక్షకులకు ‘మద గజ రాజా’ తెలుగు ప్రేక్షకులను మెప్పించాడా లేదా? రివ్యూలో చూద్దాం.
స్టోరీ లైన్
కేబుల్ ఆపరేటర్ అయిన మదగజరాజా అలియాస్ ఎంజీఆర్(విశాల్) తన తండ్రికి తోడుగా తన సొంత ఊళ్లూనే ఉంటాడు. తండ్రి స్థానిక పోలీసు స్టేషన్‌లో ఎస్సై. అగ్గిపెట్టె ఆంజనేయులు కూతురు మాధవి(అంజలి)ని చూసి తొలి చూపులోనే ప్రేమలో పడిపోతాడు. కానీ ఆ ప్రేమ కథ ముందుకు వెళ్ళదు. ఈ లోగా తన కుమార్తె పెళ్లికి రమ్మంటూ చిన్నప్పుడు స్కూల్లో పాఠాలు చెప్పిన మాస్టార్ నుంచి ఫోన్ వస్తుంది. ఈ పెళ్లి లో చిన్నప్పటి స్నేహితులంతా కలుస్తారు. అలాగే ఆ పెళ్లి లో సమస్య ఉంటే వీళ్లంతా కలిసి తీరుస్తారు.
ఇక పెళ్లి అనంతరం తిరిగి ఎవరి ఇళ్లకు వాళ్ళు వెళ్లే క్రమంలో తన స్నేహితులకు వ్యక్తిగతంగా , ప్రొఫెషనల్ గా సమస్యలు ఉన్నట్లు రాజాకు తెలుస్తుంది. అంతేకాదు ఈ సమస్యలకు మూలం హైదరాబాద్ లో ఉన్న బిగ్ షాట్ కాకర్ల విశ్వనాథ్(సోనూసూద్) అని తెలుసుకుంటాడు. కాకర్ల విశ్వనాథ్(సోనూసూద్) కు మీడియా బలంతోపాటు పొలిటికల్ గా కూడా మంచి పట్టు ఉంటుంది. ముఖ్యమంత్రులను మార్చేసే సత్తా ఉంటుంది. అలాంటి వాడి వలన తన స్నేహితులకు ఇబ్బంది ఎదురైందని తెలుసుకున్న మదగజరాజా అలియాస్ ఎంజీఆర్(విశాల్) సీన్ లోకి దూకుతాడు. అప్పుడు ఏమైంది. కాకర్ల విశ్వనాథ్ ని సామాన్యుడైన మదగజరాజా ఎలా ఎదిరించాడు...చివరకు తన స్నేహితులకు న్యాయం చేయగలిగారా వంటి విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
విశ్లేషణ
ఇలాంటి కథలు తెలుగు,తమిళ తెరకు కొత్తేమీ కాదు. అయితే ఈ మధ్య కాలంలో ఇలాంటి సినిమాలు రావటం లేదు. అయితే ఇందులో సంతానం కామెడీ తమిళంలో బాగా పట్టింది. కథ ఎలా ఉన్న దర్శకుడు సుందర్ సి కు ఉన్న క్రేజ్ తో నడిచిపోయింది. అంజలి, వరలక్ష్మి శరత్ కుమార్ లు అందాల ప్రదర్శన చూడడానికి ,సంతానం వన్ లైనర్స్ వినడానికి క్యూలు కట్టారు. మనకు ఇక్కడ విశాల్ కు అంత సీన్ లేదు. ఆయన సినిమాలను జనం పట్టించుకోవటం మానేసి చాలా కాలం అయ్యింది.
దాంతో మినిమం ఓపినింగ్స్ కూడా వచ్చే అవకాశం లేకుండా పోయింది. అయితే సినిమా గొప్పగా లేకపోయినా కామెడీతో నడిచిపోయింది. అరిగిపోయిన అరవ కథ అయినా ఫన్ సీన్స్ ఎంగేజ్ చేశాయి., అయితే లాజిక్ వెతికితే మాత్రం సీన్స్ మొత్తం కూలిపోతాయి. ఫస్టాఫ్ లో సంతానం కామెడీ, సెకండాఫ్ లో మినిస్టర్ అత్తిలి సత్తిబాబు(మనోబాల)కామెడీ నవ్విస్తాయి. సినిమాలో కొన్ని సీన్స్ ఓవర్ డోస్ అనిపించినా కామెడీ తో కాలక్షేపం అయిపోతాయి.
12 ఏళ్ల క్రితం సినిమా కావడంతో టెక్నికల్ గా మాట్లాడుకోకపోవటమే మంచిది.
చూడచ్చా
సినిమాలో కథ,కథనం, లాజిక్ వంటివి పట్టించుకోకుండా కామెడీ సినిమాగా చూస్తే టిక్కెట్ గిట్టుబాటు అనిపిస్తుంది.