' ఫ్యామిలీ స్టార్' మూవీ రివ్యూ '
విజయ్ దేవర కొండ, మృణాల్ ఠాకూర్ కలిసి నటించిన ఫ్యామిలీ ఓరియెంటెడ్ మూవీ ‘ఫ్యామిలీ స్టార్’. ఇంతకీ ఈ సినిమా ఎలా ఉందంటే..
ఒకప్పుడు ఒక టికెట్ మీద రెండు లేదా మూడు సినిమాలు చూపించేవారు. ఆ ప్రక్రియ ఈ మధ్యలో కనిపించడం లేదు. “ఫ్యామిలీ స్టార్” ఆ ప్రక్రియను మరోసారి తెరమీదకు తెచ్చింది. ఈ సినిమా చూస్తున్నంత సేపు రెండు మూడు సినిమాలు ప్రేక్షకులకు గుర్తు రావడం వాళ్ళ తప్పు కాదు. అలాగే కొత్తగా తీయబడిన సన్నివేశాలు చాలామంది ప్రేక్షకులు ఏ సినిమాలో వచ్చిందో అని చర్చించుకోవడం కనిపించింది. ఈ సినిమా మెగాస్టార్ చిరంజీవి సూపర్ హిట్ సినిమా " గ్యాంగ్ లీడర్" ను కచ్చితంగా గుర్తుకు తెస్తుంది. అంతవరకు అయితే బాగానే ఉండేది.
హ్యాంగోవర్ నుంచి బయటపడలేదు
దర్శకుడు పరుశురాం.. విజయ్ దేవరకొండ హీరోగా తీసిన సూపర్ డూపర్ హిట్ సినిమా "గీత గోవిందం" హ్యాంగ్ ఓవర్ నుంచి ఇంకా బయటపడినట్లు లేదు. కాకపోతే ఇక్కడ పాత్రలు మారుతాయి అంతే! అక్కడ అమ్మాయిని అబ్బాయి కన్విన్స్ చేసుకోవాలి. ఇక్కడ అబ్బాయిని అమ్మాయి కన్విన్స్ చేసుకోవాలి.. అంతే తేడా. అక్కడ మాత్రం అమ్మాయికి, అబ్బాయి పెట్టిన ముద్దు సినిమా నడవడానికి కారణమైతే, ఇక్కడ అబ్బాయి మీద అమ్మాయి ఒక పుస్తకం రాయడం సినిమా నడవడానికి కారణమైంది. (ఇక్కడ కూడా అమ్మాయి ముద్దు(లు) పెడుతుంది. కానీ దాని వల్ల పెద్దగా ఉపయోగం లేదు).
అదైనా కొద్దిసేపు ఉండి ఉంటే బాగుండేది. సినిమా ఇంటర్వెల్ నుంచి అలాగే ఉంటే, ప్రేక్షకులకు బోర్ కొట్టే అవకాశం ఉంది. అయితే ఇక్కడ ఒక విషయం చెప్పాలి. ఈ సినిమా కొంత భాగం బోర్ కొట్టకుండా ఉండడానికి కారణం, కొత్త రకమైన చిత్రీకరణ. ఏ సినిమాకైనా క్లైమాక్స్ ఓ స్థాయిలో ఉంటే అది హిట్ సినిమా అవుతుంది. కనీసం కొంతవరకు చూడటానికి అవకాశం ఉంటుంది. అయితే సినిమాకు క్లైమాక్స్ ఒక మైనస్ పాయింట్‌గా నిలిచింది. సినిమాలో లాజిక్ వెతకడం కష్టం గానీ, మరీ ఇంత సాధారణమైన, సాగదీయబడిన క్లైమాక్స్ ఉంటే సినిమా అంతగా ప్రేక్షకులకు ఎక్కదు. ఈ సినిమా నిడివి కూడా ఎక్కువే (163 నిమిషాలు!). ఇంటర్వెల్‌కు కొంతసేపటి తర్వాత సినిమా అయిపోయింది. అయినా నడవడానికి కారణం, హీరోయిన్ ఒక చిన్నమాట చెప్పకపోవడం! హీరో మీద ఒక పుస్తకం రాసిన హీరోయిన్, దాని ఎందుకు రాసిందో చెప్పకపోవడం వల్ల సినిమా దాదాపు 40 నిమిషాలు సాగదీయబడింది.
భారీ అంచనాలు, ప్రేక్షకుల ఊహగానాల మధ్య "ఫ్యామిలీ స్టార్" విడుదలైంది. అర్జున్ రెడ్డి(2017) సినిమా ద్వారా ఒక సంచలనం సృష్టించిన విజయ్ దేవరకొండ, "సీతారామం" సినిమాతో తెలుగు తెరకు పరిచయమై.. " హాయ్ నాన్న" సినిమాతో టాలెంటెడ్ నటిగా ప్రూవ్ చేసుకున్న మృణాల్ ఠాకూర్ జంటగా తీసిన ఈ సినిమా ఈ వేసవికి మొదటి పెద్ద సినిమా. విజయ్ దేవరకొండ కెరీర్‌లో "గీత గోవిందం(2018)" అనే ఒక భారీ హిట్ సినిమా తర్వాత ఈ మధ్యకాలంలో ఆ స్థాయి సినిమా రాలేదు. 2023లో విజయ్, సమంత జంటగా వచ్చిన " ఖుషి" ఓ మాదిరిగా అనిపించినప్పటికీ, 2022 లో పూరి జగన్నాథ్ " లైగర్" సినిమా విజయ్ దేవరకొండ సినీ కెరీర్‌లో బాక్సాఫీస్ దగ్గర భారీగా దెబ్బతిన్న సినిమా. ఈ నేపథ్యంలో సూపర్ హిట్ సినిమా గీత గోవిందం దర్శకుడు పరుశురాంతో మరోసారి విజయ్ దేవరకొండ హీరోగా వచ్చిన సినిమా "ఫ్యామిలీ స్టార్". దిల్ రాజు వంటి సక్సెస్ ఫుల్ నిర్మాత ఆధ్వర్యంలో రూపొందిన ఈ సినిమా ప్రచార కార్యక్రమాలు కూడా పెద్ద ఎత్తున చేయడం జరిగింది.
"ఈ సినిమాను మొదట నాతో కలిసి దాదాపు 50 మంది చూడటం జరిగింది. అందరికీ బాగా నచ్చింది. నేను ఫస్ట్ ఆఫ్ మాత్రమే చూశాను. ఆ తర్వాత ఈ సినిమా ప్రమోషన్ మీద, ప్రచారం మీద దృష్టి పెట్టాను" అని ఈ సినిమా గురించి విడుదలకు ముందు విజయ్ దేవరకొండ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది. దర్శకుడు పరుశురాం ‘గీత గోవిందం’ హిట్ తర్వాత మహేష్ బాబుతో "సర్కారు వారి పాట (2022)" అనే ఓ మాదిరి హిట్ సినిమా తీశాడు. గతంలో రవితేజతో "ఆంజనేయులు(2009)", "సారొచ్చారు(2012)" అనే ఓ మాదిరి హిట్ సినిమాలు తీసిన నేపథ్యం ఉంది.
ఈ సినిమాకు ముందు "గోవర్ధన్" అని పేరు పెట్టాలనుకున్నారట! అయితే ప్రతి ఫ్యామిలీలో ఒక స్టార్ ఉంటాడు కాబట్టి, ఫ్యామిలీ స్టార్ అని పెడితే బాగుంటుందని నిర్ణయించుకున్నారట. అయితే ఈ సినిమాలో, ఫ్యామిలీ ఓరియెంటెడ్ సినిమాల్లో బాగా హిట్ అయిన చిరంజీవి సినిమా " గ్యాంగ్ లీడర్" ఛాయలు ఉన్నాయని మొదట్లో ఊహాగానాలు వచ్చాయి. పైగా ఇది ఎమోషన్స్, రొమాన్స్‌కి పెద్దపీట వేస్తూ, యాక్షన్‌కి, కామెడీకి కూడా ప్రాధాన్యతనిచ్చామని ప్రమోషన్స్‌లో చెప్పుకొచ్చారు ఈ సినిమా టీం సభ్యులు. మృణాల్ ఠాకూర్, విజయ్ దేవరకొండ కెమిస్ట్రీ చాలా బాగుంటుందని ప్రచారం చేశారు ఈ సినిమా సృష్టికర్తలు. కెమిస్ట్రీ మాట పక్కన పెడితే, ఫిజిక్స్ బ్యాలెన్స్‌డ్‌గా లేదు, మ్యాథమెటిక్స్ లెక్క తప్పింది అని చెప్పుకోవచ్చు.
రొటీన్ కథ- క్రియేటివ్ కథనం
ట్రైలర్లు, ప్రెస్ మీట్‌లు, ప్రచార కార్యక్రమాలు మీద పెట్టిన దృష్టి, సినిమా మీద పెట్టినట్లు అనిపించదు. కథ పరంగా చూడాలంటే ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబం, ముగ్గురు అన్నదమ్ముల కథ(ఇలాంటి సినిమాలు చాలా వచ్చాయి) ఒక అన్న తాగుబోతు. ఎందుకు తాగుబోతు అయ్యాడు అన్నది చాలా హాస్యాస్పదమైన కారణం ఉంది. ఇంకో అన్న ఏం చేస్తున్నాడో తెలియదు. ఒక బామ్మ ఉంటుంది. పిల్లలు ఉంటారు. మధ్యతరగతి కుటుంబం. ఆ కుటుంబంలోకి ఒక అమ్మాయి వస్తుంది. ముందు పట్టించుకోని హీరో, తర్వాత ఆమెను ప్రేమిస్తాడు. అలా అయితే సినిమా అయిపోతుంది కాబట్టి, ప్రేమకు విఘ్నం కలిగించడం అవసరం కనుక, అమ్మాయి ఆ మధ్యతరగతి కుటుంబం మీద ఒక పుస్తకం రాస్తుంది (ఆంత్రోపాలజిస్ట్ మరి) అదే మిగతా సినిమాకు కారణం అవుతుంది.
మెరిసిన మృణాల్.. మురిపించిన రోహిణి
అయినప్పటికీ, సినిమా కొంతవరకు చూడగలిగేలా ఉండటానికి ప్రధాన కారణం మృణాల్ ఠాకూర్, ఆ తర్వాత కొంత మేరకు ఈ పాత్రకు సూటబుల్ అయిన విజయ్ దేవరకొండ. మరికొంత కారణం బామ్మ పాత్రలో వేసిన రోహిణి హట్టంగడి(సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు??)! మృణాల్ ఠాకూర్ ఫ్రెష్‌గా, అందంగా కనపడటమే కాకుండా బాగానే నటించింది. ఇక ఇలాంటి మొండి, రఫ్ పాత్రలు విజయ్ దేవరకొండ కొట్టిన పిండే కాబట్టి, బాగానే చేశాడు. సర్ప్రైజ్ ప్యాకేజీ రోహిణి హట్టంగడి, ఆమెతో తీసిన సన్నివేశాలు కొన్ని క్రియేటివ్‌గా ఉన్నాయి, కొన్ని నవ్విస్తాయి. మరికొన్ని రిలీఫ్ ఇస్తాయి. ఒకటి రెండు పాటలు కూడా వినదగ్గవిగా, చూడదగ్గవిగా ఉన్నాయి. కాసేపు కనిపించే పాత్రలో జగపతిబాబు ఏం చేయగలడు? వెన్నెల కిషోర్‌ని ఈ సినిమాలో కామెడీకి పెట్టుకున్నారు గాని, పెద్దగా అవకాశం ఇవ్వలేదు. .
కొంతవరకు పేలిన మాటల తూటాలు
ఈ సినిమాలో మరోసారి ఊహించని ఆశ్చర్యకరమైన ప్యాకేజీ డైలాగులు! దర్శకత్వం సంగతి సరేగాని, డైలాగ్ రైటర్‌గా పరుశురాం విజయం సాధించాడు. " జీవితంలో ఒకేసారి వచ్చే ఎగ్జామ్ రాశాను. ఫెయిల్ అయ్యాను. అదే ప్రేమ" అని అమ్మాయి చెప్పడం. " లిఫ్ట్ ఉంది కదా అని ఎక్కడం, సిగరెట్లు ఉన్నాయి కదా అని కాల్ చేయడం, మందు ఉంది కదా అని తాగేయడం" మంచిది కాదు అని అబ్బాయి చెప్పడం. "మధ్యతరగతి వాళ్ళని గెలికితే, మధ్యాహ్నానికి సీన్ అంతా మారిపోతుంది", " ఐ లవ్ యు అంటే ఒక కుటుంబానికి చెప్పినట్టు" విజయ్ దేవరకొండ చెప్పే డైలాగు, ఈ సినిమా గురించి స్పష్టంగా చెబుతుంది.
చివరగా చెప్పాలంటే నిడివి తగ్గించి, క్లైమాక్స్‌ను మార్చి ఉంటే, సినిమా ఎక్కువ మంది చేసేలా ఉండేదేమో. ఇవన్నీ పట్టించుకోకుండా ఉండగలిగితే, అలా సెలవు రోజున, ఏ సినిమాలు లేనప్పుడు దీన్ని కొంతవరకు చూడొచ్చు.
తారాగణం: మృణాల్ ఠాకూర్, విజయ్ దేవరకొండ, జగపతిబాబు, వెన్నెల కిషోర్ అజయ్ ఘోష్, దివ్యాంశ కౌశిక్, రోహిణి హట్టంగడి, వాసుకి, అభినయ, జబర్దస్త్ రాంప్రసాద్, కోట జయరామ్
కథ,కథనం,మాటలు, దర్శకత్వం: పరశురామ్
సంగీతం: గోపీ సుందర్
ఛాయాగ్రహణం: కె.యు. మోహనన్
ఎడిటర్: మార్తాండ్ కె. వెంకటేష్
కళ దర్శకత్వం: ఎ.ఎస్. ప్రకాష్
నిర్మాతలు: దిల్ రాజు,శ్రీ హన్సిత రెడ్డి,శిరీష్
నిర్మాణసంస్థలు: దిల్ రాజు ప్రొడక్షన్స్,శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్
విడుదల తేదీ: 2024 ఏప్రిల్ 5