9 అవార్డ్ లతో  ‘మంజుమ్మల్‌ బాయ్స్‌’ రికార్డ్ !
x

9 అవార్డ్ లతో ‘మంజుమ్మల్‌ బాయ్స్‌’ రికార్డ్ !

చిన్న సినిమా పెద్ద విజయ గాథ

మలయాళ చిత్రసీమలో సంచలన విజయాన్ని అందుకొని తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం ‘మంజుమ్మల్‌ బాయ్స్‌’. ఆ మధ్యన విడుదలైన ఈ స‌ర్వైవ‌ల్ థ్రిల్ల‌ర్ తెలుగులోనూ హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది. ఆ తర్వాత ఓటీటీ ప్రేక్షకులను అలరించింది. 2006లో జరిగిన వాస్తవ సంఘటనలను ఆధారంగా చేసుకుని చిదంబరం దీనిని తెరకెక్కించారు. సౌబిన్ షాహిర్, గణపతి, ఖలీద్ రెహమాన్, శ్రీనాథ్ భాసి, జార్జ్ మ‌రియ‌న్‌, లాల్ జూనియ‌ర్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఇప్పుడీ చిత్రం మరోసారి వార్తల్లోకి ఎక్కింది.

2024లో సంచలనం సృష్టించిన మలయాళ సర్వైవల్ డ్రామా మంజుమ్మెల్ బాయ్స్ మళ్లీ దుమ్మురేపింది. కేరళ ప్రభుత్వ 55వ రాష్ట్ర అవార్డుల్లో ఈ సినిమా ఒక్కటే తొమ్మిది అవార్డులు దక్కించుకుని చరిత్ర సృష్టించింది! మలయాళంలోనే కాదు, తెలుగులో–తమిళంలో కూడా బ్లాక్‌బస్టర్ క్రేజ్ సంపాదించిన ఈ సినిమా… ఇప్పుడు అవార్డ్స్ రేస్‌లో కూడా క్లీన్ స్వీప్!

కేరళ ఫిషరీస్, కల్చర్ & యువజన శాఖ మంత్రి సాజీ చెరియన్ విజేతలను ప్రకటించారు.

⭐ మంజుమ్మెల్ బాయ్స్ దక్కించుకున్న అవార్డ్స్

ఉత్తమ చిత్రం

ఉత్తమ దర్శకుడు – చిదంబరం

ఉత్తమ కథ/స్క్రీన్ ప్లే – చిదంబరం

ఉత్తమ సహాయ నటుడు – సౌబిన్ షాహిర్

ఉత్తమ ఆర్ట్ డైరెక్టర్ – అజయన్ చలిస్సెరి

ఉత్తమ సినిమాటోగ్రఫీ – శైజు ఖాలిద్

ఉత్తమ శబ్ద రూపకల్పన – శిజిన్, అభిషేక్

ఉత్తమ సౌండ్ మిక్సింగ్ – ఫజల్, శిజిన్

ఉత్తమ గేయ రచయిత – వేదన్

క‌థేంటంటే: కేర‌ళ‌లోని కొచ్చికి చెందిన కుట్ట‌న్ (షౌబిన్ షాహిర్‌), సుభాష్ (శ్రీనాథ్ భాషి)తో పాటు స్నేహితులంద‌రూ సొంత ఊళ్లోనే చిన్నాచిత‌కా ఉద్యోగాలు చేసుకుంటూ జీవ‌నం సాగిస్తుంటారు. ఈ గ్యాంగ్‌కు మంజుమ్మ‌ల్ బాయ్స్ పేరుతో ఓ అసోసియేష‌న్ ఉంటుంది. వీరంతా క‌లిసి ఓసారి కొడైకెనాల్ ట్రిప్‌నకు వెళ్తారు. ఈ విహార‌యాత్ర‌కు సుభాష్ తొలుత రాన‌ని చెప్పినా.. కుట్ట‌న్ బ‌ల‌వంతం మీద ఆఖ‌రి నిమిషంలో కారెక్కుతాడు. ఈ మంజుమ్మ‌ల్ బ్యాచ్ కొడైకెనాల్‌లోని అంద‌మైన ప్ర‌దేశాల‌న్నీ చూశాక ఆఖ‌రిలో గుణ కేవ్స్ చూడ‌టానికి వెళ్తారు.

ఆ గుహ‌లు బ‌య‌ట నుంచి చూడ‌టానికి ఎంత ర‌మ‌ణీయంగా ఉంటాయో.. అంతే ప్ర‌మాద‌క‌రం కూడా. ఎందుకంటే అక్క‌డ వంద‌ల అడుగుల లోతున్న ఎన్నో ప్ర‌మాద‌క‌ర‌మైన లోయ‌లుంటాయి. వాటిలో డెవిల్స్ కిచెన్ కూడా ఒక‌టి. దాదాపు 150 అడుగుల‌కు పైగా లోతున్న ఆ లోయ‌లో 13మందికి పైగా పడిపోయారు.. వీరిలో ఏ ఒక్క‌రూ ప్రాణాల‌తో తిరిగి రాలేదు. అందుకే గుణ కేవ్స్‌లోని ఆ ప్ర‌మాద‌క‌ర లోయ‌లున్న ప్రాంతాలున్న చోటుకు వెళ్ల‌డాన్ని అట‌వీశాఖ వారు.. పోలీసులు నిషేధించారు.

కానీ, మంజుమ్మ‌ల్ బాయ్స్ అక్క‌డున్న అట‌వీ సిబ్బంది కళ్లుగ‌ప్పి.. ఫెన్సింగ్ దాటి గుణ కేవ్స్‌లోని ఆ ప్ర‌మాద‌క‌ర‌మైన ప్ర‌దేశానికి వెళ్తారు. మ‌రి ఆ త‌ర్వాత ఏమైంది? ఆ లోయ నుంచి సుభాష్‌ను ప్రాణాల‌తో కాపాడి తీసుకురావ‌డానికి తోటి మిత్రులంతా ఏం చేశారు? అన్న‌ది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.

Read More
Next Story