మళయాళ క్లాసిక్ హారర్:   భార్గవి నిలయం OTT మూవీ రివ్యూ!
x

మళయాళ క్లాసిక్ హారర్: 'భార్గవి నిలయం' OTT మూవీ రివ్యూ!

అనగనగా ఓ బూజు పట్టిన పాడు పెట్టిన ఓ పాత ఇల్లు. దాదాపు ఆ ఇల్లు ఊరు చివరే ఉంటుంది. చుట్టూ చెట్లు, మొక్కలు కాస్త ఎక్కువే ఉండి భయానిక వాతావరణం క్రియేట్ చేస్తూంటాయి.

అనగనగా ఓ బూజు పట్టిన పాడు పెట్టిన ఓ పాత ఇల్లు లేదా బంగ్లా. దాదాపు ఆ ఇల్లు ఊరు చివరే ఉంటుంది. చుట్టూ చెట్లు, మొక్కలు కాస్త ఎక్కువే ఉండి భయానిక వాతావరణం క్రియేట్ చేస్తూంటాయి. దానికి తోడు అలాంటి ఇంటికి ఎదురుగా కానీ ప్రక్కన కానీ మరో ఇల్లు ఉండదు. ఓ సుముహార్తాన వెతుక్కుంటూ వచ్చి ఆ ఇంట్లోకి అద్దెకు ఓ వ్యక్తి రావటం జరుగుతుంది. తమకు సంభందించిన సరంజామా అక్కడే ఉండటంతో ఆల్రెడీ ఓ ఆడ దెయ్యం కాలక్షేపం చేస్తూంటుంది. ఆమెకో ప్లాష్ బ్యాక్ సెకండాఫ్ లో హీరోకు చెప్పటానికి రెడీ చేసి పెట్టుకుంటుంది. ఆ ప్లాష్ బ్యాక్ లో చాలా సార్లు రివేంజ్ ఎలిమెంట్స్ ఉంటాయి.

ఇవన్నీ ఎన్ని సినిమాల్లో చూడలేదు అంటారా. అదీ నిజమే దాదాపు హారర్ సినిమా పుట్టినప్పటినుంచి ఇదే థీమ్, ఇదే స్కీమ్ కొనసాగుతోంది. దాంతో మనకు దెయ్యాలు, పాత బంగ్లాలు బాగా అలవాటు అయ్యిపోయాయి.మన మైండ్ లో ఆ అందమైన ఆడ దెయ్యాలు తిష్ట వేసేసుకున్నాయి. ఎంతలా అంటే ఎక్కడైనా పాత ఇల్లు కనపడితే అందులో దెయ్యాలు కాపురం ఉంటున్నాయేమో అని అనుమానం వచ్చి కళ్లు చిలకరించి మరీ చూసే స్దాయిలో. ఈ సినిమా కూడా దాదాపు అదే సెటప్. కాకపోతే ఓ మార్మికత, ఓ కవితాత్మకమైన అందం కలగలిపిన హారర్ రొమాంటిక్ చిత్రం ఇది. ట్విస్ట్ ఏమిటంటటే ఈ సినిమా 1964లో ఇదే టైటిల్ తో మళయాళంలో వచ్చిన సినిమాకు రీమేక్.

విజయనిర్మాత పాత చిత్రానికి రీమేక్

1964లో విడుదలై ఎ విన్సెంట్ దర్శకత్వం వహించిన మలయాళ సినిమా మొట్టమొదటి హర్రర్-రొమాంటిక్-ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ భార్గవి నిలయం (ది అబోడ్ ఆఫ్ భార్గవి). ప్లాట్ లైన్ ఏమీ గందరగోళానికి గురిచేసే పజిల్ కాదు. మళయాళీలకే మాత్రమే కాకుండా తెలుగువారికి కూడా అత్యంత ఇష్టమైన రచయిత వైకోమ్ ముహమ్మద్ బషీర్ కథతో రూపొందిన సినిమా ఇది. అప్పట్లో ఈ సినిమాలో దెయ్యం గా మారిన భార్గవిగా మన తెలుగు నటి, దర్శకురాలు విజయనిర్మల నటించారు. పెద్ద హిట్టైంది. క్లాసిక్ గా నిలిచిపోయింది. ఇందులో దెయ్యానికి విషాద కథ. ఇంతకాలానికి మళయాళీలు మళ్లీ ఆ సినిమాను రీమేక్ చేసారు. ఈ సినిమా ఇప్పుడు ఆ స్దాయిలో ఆడిందా లేదనే చెప్పాలి. అయితే పాత క్లాసిక్ సినిమా అభిమానులు, బషీర్ అభిమానులు వెళ్లి మరీ చూసి వచ్చారు. మిగతా వాళ్లు లైట్ అన్నారు. మనవాళ్లు ఇప్పుడు ఓటిటి రైట్స్ తీసుకుని తెలుగులోకి తెచ్చారు.

ఇంతకీ ఈ చిత్రం కథేంటి అంటారా..

సముద్రతీరంలోని ఒక చిన్న గ్రామం . చాలా ప్లెజెంట్ గా కనిపించే ఆ గ్రామానికి ఒక రచయిత బషీర్ (టొవినో థామస్) వస్తాడు. అద్దె తక్కువని ఓ పాడుబడిన బంగ్లాలో అద్దెకి దిగుతాడు. తాను ఉండటానికి వీలుగా ఆ బంగ్లాను నీట్ గా సర్దుకుంటాడు. అయితే అందరికీ ఎడ్రస్ ఇచ్చినా ఎవరూ ఆ ఇంటి వైపు రారు. ముఖ్యంగా ఆ ఇంటివైపు రావడానికి పోస్ట్ మెన్, హోటల్ కుర్రాళ్లు భయపడటం అతను గమనిస్తాడు. దాంతో అసలు విషయం ఏంటని ఆ ఊళ్లోనే ఉంటున్న తన స్నేహితులను కలుస్తాడు. బషీర్ భార్గవి నిలయంలో అద్దెకు దిగాడని తెలియగానే స్నేహితులు కంగారు పడిపోతారు.

'భార్గవి నిలయం' లో ఏమి జరిగింది

బషీర్ కు ఆసక్తి ఎక్కువ అవుతుంది. విషయం ఏంటని రెట్టించి అడుగుతాడు. దాంతో వాళ్లు గతంలో ఆ ఇంట్లో భార్గవి అనే ఒక యువతి ఉండేదని, ఆమెకి నాట్యంలో మంచి ప్రావీణ్యం ఉందని చెబుతారు. ఆ పక్కనే ఉన్న ఇంట్లో శశికుమార్ (రోషన్ మాథ్యూ) అనే గాయకుడు ఉండేవాడని అంటారు. వాళ్లిద్దరూ ప్రేమించుకున్నారని, అయితే భార్గవిని శశికుమార్ మోసం చేయడంతో.. ఆ ఇంట్లోని బావిలో దూకేసి భార్గవి ఆత్మహత్య చేసుకుందని.. అప్పటి నుంచి ఆమె దెయ్యమై తిరుగుతుందని అంటారు. అందుకే ఇంట్లో ఉండటం ఎంతమాత్రం మంచిది కాదని, అసలు అటువైపు వెళ్లొద్దని స్నేహితులు చెబుతారు.

అయినా బషీర్ వినిపించుకోకుండా ఆ ఇంటికి ఉంటాడు .మ‌రో ఇంటికి మార‌డానికి అవ‌స‌ర‌మైన డ‌బ్బు త‌న వ‌ద్ద లేకపోవ‌డంతో భార్గ‌వి ఆత్మ‌తో స్నేహం చేస్తూ అదే పాడుబ‌డ్డ ఇంటిలో ఒంట‌రిగా ఉంటుంటాడు బ‌షీర్‌. భార్గ‌వి గురించి క‌థ రాయాల‌ని నిర్ణయించుకుండా బ‌షీర్‌. ప్రేమ‌లో విఫ‌ల‌మై భార్గ‌వి ఆత్మ‌హ‌త్య చేసుకుంద‌ని ఊరివాళ్లు బ‌షీర్‌తో చెబుతారు. వారు చెప్పింది నిజ‌మేనా? భార్గవిని ప్రాణంగా ప్రేమించిన శివ‌కుమార్ (రోష‌న్ మాథ్యూ) ఎలా అదృశ్యం అయ్యాడు? ఈ ప్రేమ జంట జీవితంలోని మిస్ట‌రీని బ‌షీర్ ఎలా బ‌య‌ట‌పెట్టాడు? అనేది మిగతా కథ.

పాత చిత్రానికి రీమేక్ అనగానే ఖచ్చితంగా పోలికలు వస్తాయని దర్శకుడుకి తెలుసు. హీరో టొవినో థామస్ కు తెలుసు. అయినా ధైర్యం చేసారంటే వాళ్ల లెక్కలు వాళ్లకు ఉన్నాయనుకోవాలి. పాత సినిమాతో పోల్చి చూస్తే ఇబ్బంది వస్తుందేమో కానీ ప్రస్తుతానికి అయితే ఈ సినిమా రెగ్యులర్ దెయ్యం సినిమాలకు భిన్నంగా ఉంటుంది. ఓ కొత్త ప్రపంచాన్ని ఆవిష్కరిస్తుంది. ఈ కథలో వచ్చే లవ్ స్టోరీ చూస్తుంటే మనకు చంద్రముఖి దెయ్యం కథ గుర్తుకు రావటం సహజం. అయితే ఇప్పటికే బోలెడు హారర్ సినిమాలు చూసిన మనకు ఈ సినిమా కొత్త ఎక్సపీరియన్స్ ని కథా పరంగా అయితే ఇవ్వదు. హార‌ర్ ఎలిమెంట్స్‌, థ్రిల్స్‌, ట్విస్ట్‌లు ఈ సినిమాలో త‌క్కువే. అవన్నీ దృష్టిలో పెట్టుకుని బషీర్ కథను ఎలా ప్రెజెంట్ చేసారు అన్న ఏంగిల్ లోనే సినిమాని చూడాలి. సినిమా అంతా కూడా స్లో పేస్ లోనే సాగుతుంది. రెండు గంటల పైన లెంగ్త్ అనవసరం అనిపిస్తుంది. చాలా చోట్ల ల్యాగ్ అనిపిస్తుంది. అందుకు కారణం పాత్రల ఇంపాక్ట్ కోసం‌ డీటేయిలింగ్ ఎక్కువగా ఇవ్వటమే.

చూడచ్చా

మీరు వైకోమ్ ముహమ్మద్ బషీర్ అభిమానులు అయితే ఈ సినిమా నచ్చుతుంది. మిగతా వాళ్లకు స్లో మోషన్ లో సాగే హారర్ ఫిల్మ్ గా అనిపిస్తుంది. కాబట్టి మీ ప్రయారిటీస్ ని బట్టి చూసుకోవటమే.

ఎక్కడ చూడచ్చు

ఆహా లో తెలుగులో ఈ సినిమా ఉంది.

Read More
Next Story