
“బాఘీ 4” రివ్యూ
హల్యూసినేషన్, యాక్షన్ లేదా ఆడియన్స్ టార్చర్?
ఓ ట్రైన్ యాక్సిడెంట్ తో కోమాలోకి వెళ్లి బయటికి వచ్చిన రోనీ (టైగర్ ష్రాఫ్) కాస్త వింతగా ప్రవరిస్తూంటాడు. అతను ఎప్పుడూ అలీషా (Harnaaz Sandhu) అని కలవరిస్తూ ఉంటాడు. అయితే రోనీ సోదరుడు జీతు(శ్రేయాస్ తల్పాడే), అతన్ని ట్రీట్ చేస్తున్న డాక్టర్ మాత్రం అసలు అలీషా అనే అమ్మాయి ఎవరూ లేరని, అదంతా భ్రమన అని రోనీ లేనిపోనివి ఊహించుకుంటున్నాడని చెప్తారు. అలాగే యాక్సిడెంట్ తర్వాత తనకి డెల్యుషనల్ ఇష్యూస్ ఉన్నాయని, Post-traumatic stress disorder(PTSD)తో ఇబ్బంది పడుతున్నారని వివరిస్తారు. చుట్టూ ఉన్నవాళ్లందరూ ఒకటికి రెండుసార్లు నొక్కి చెప్పడంతో దాదాపుగా నమ్మేస్తాడు రోనీ. అయితే ఊహించని విధంగా కొందరు దుండగుల చేతిలో జీతూ చనిపోతాడు.
అప్పుడు రోనీ యాక్టివేట్ అవుతాడు. ఈ లోగా అలీషాకి చెందిన ఒక పెయింటింగ్ దొరుకుతుంది రోనీకి. దాంతో కథ మరో మలుపు తిరుగుతుంది. రోనీ డీప్ గా తవ్వటం మొదలెడతాడు. తనకు అసలు యాక్సిడెంట్ ఎలా అయ్యింది...తన సోదరుడు జీతూని చంపిన వాళ్లు ఎపరు..ఎందుకు చంపారు ? వారికి రోన్ని తో ఏం సంబంధం..? జీతూ ని వారు ఎందుకు చంపారు..? నిజంగా అలీషా ఉందా లేదా భ్రమేనా..ఉంటే ఆమె ఏం అయింది? అనేవి కనుక్కుంటాడు.
ఆ క్రమంలో చాకో (సంజయ్ దత్) అనే ఓ పరమ దుర్మార్గుడైన విలన్ గురించి తెలుస్తుంది. అతనికి తమ జీవితాలతో ఏమిటి లింక్ ఇలాంటి ప్రశ్నలకు జవాబులు రోనీతో పాటు మనమూ కనుక్కుంటూ ముందుకు వెళ్తాము. ఆ క్రమంలో బయిటకు వచ్చిన విషయాలేంటి రోనీకి ఇన్నాళ్లపాటు అలీషా లేదు అని నమ్మించడానికి చుట్టూ ఉన్నవాళ్లు ఎందుకు ప్రయత్నిస్తున్నారు? అలీషా ఏమైంది? దీన్నంతటినీ నడిపిస్తుంది ఎవరు? వంటి ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే “బాఘీ 4” చిత్రం చూడాల్సిందే.
విశ్లేషణ
కన్నడ దర్శకుడు హర్ష హిందీ డెబ్యూగా చేసిన సినిమా ఇది. ఈ దర్శకుడు ఇంతకు ముందు తెలుగులో గోపిచంద్ తో ''భీమా' అనే సినిమా చేసారు. ఇప్పుడు ఈ సినిమా చేసారు. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏమిటంటే... ఈ సినిమా అతను ఒరిజనల్ గా రాసుకున్న కథ కాదు. అది దాదాపు 12 ఏళ్ల క్రితం తమిళంలో భరత్ హీరోగా శశి దర్శకత్వంలో వచ్చిన తమిళ చిత్రం Ainthu Ainthu Ainthu (2013) కి రీమేక్. అప్పట్లో ఈ సినిమా ఐదు ఐదు ఐదు (2013) అనే పేరుతో తెలుగులో డబ్బింగ్ అయ్యింది.
సర్లే ఆ విషయం ప్రక్కన పెడితే..ఈ సినిమా చేయటంలో దర్శకుడు ఉద్దేశ్యం...యాక్షన్ సినిమాలు హిందీలో బాగా ఆడతాయి అనే కావచ్చు. అయితే 12 క్రింత నేరేషన్ ఇప్పటికి వర్కవుట్ అవుతుందని అనుకుని ప్లే చేయటం మాత్రం ఆశ్చర్యం. ఒరిజనల్ సినిమాలో పాయింట్ తీసుకుని మారతున్న స్క్రీన్ ప్లే ప్రకారం మార్చుకుని రెడీ చేసి ప్రెజెంట్ ఉంటే సమస్య రాకపోను. కానీ అలా చేయలేదు. ఏవో నార్త్ కు తగినట్లు గా కొన్ని మార్పులు చేశాడు తప్పితే పెద్దగా అప్గ్రేడ్ చేయలేదు. దాంతో ఇంట్రస్టింగ్ గా మొదలైన కథ, ఇంటర్వెల్ దగ్గరకి బోర్ కొట్టేస్తుంది. సెకండాఫ్ లో వచ్చే ట్విస్ట్ తప్ప సినిమా మొత్తానికి ఎగ్జైట్ చేసే అంశం ఒక్కటి కూడా లేకపోవటంతో విసిగించేస్తుంది.
దానికి తోడు సినిమాకి ఏమాత్రం సంబంధం లేకుండా ట్యాంకర్ల కొద్ది రక్తం పారడం, వందల మంది జనాలు గొడ్డలి గాట్లతో అచేతనంగా పడి ఉండడం కామన్ గా తెరపై జరిగిపోతూంటుంది. ఇంట్రస్టింగ్ స్క్రీన్ ప్లే లేనప్పుడు ఏదీ ఎలివేట్ కాదు అనే విషయం మర్చిపోయారు. తెరమొత్తం రక్తసిక్తమైన యాక్షన్ సీన్స్ మినహా సినిమాలో చెప్పుకోదగ్గ అంశాలేమీ లేవు.
వాస్తవానికి తమిళం ఐదు ఐదు ఐదు టైంలో ఆ ట్విస్ట్‌లు అప్పట్లో సూపర్‌గా వర్కౌట్ అయ్యాయి. కానీ ఈ నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ యుగంలో… ఆడియన్స్ ఇప్పటికే మైండ్-బ్లోయింగ్ థ్రిల్లర్స్ చూసి అలవాటు పడిపోయారు. అలాంటప్పుడు ఈ కాలంలో బాఘీ 4 ట్విస్ట్‌లతోనే షాక్ అవుతారని అనుకోవడం? ప్యూర్ ఫూలిష్‌నెస్!
టెక్నికల్ గా...
సినిమాకి మొత్తం 9 పాటలు ఉంటే… వాటిని 11మంది మ్యూజిక్ డైరెక్టర్లు కంపోజ్ చేశారు. కానీ దురదృష్టవశాత్తు, అందులో 2 పాటల మినహా మిగతా 7 పాటలు ఏమాత్రం ఆకట్టుకోలేదు. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఎలాంటి ఎక్సైట్మెంట్ ఇవ్వలేదు.కెమెరా, ఎడిటింగ్, ఆర్ట్, టెక్నికల్ టీమ్ మొత్తంగా… సబ్‌పార్ అవుట్‌పుట్ ఇచ్చారు. డైరెక్టర్ ఏ. హర్ష ఓ మూస దర్శకుడు అని తేలిపోయింది. CGI టైగర్‌లో స్వాగ్ కంటే ఎక్కువ గ్లిచ్‌లు ఉన్నాయి.
నటీనటుల గురించి పెద్ద గొప్పగా చెప్పుకునేటంత విషయాలు ఏమీ లేవు. టైగర్ ష్రాఫ్ ఇంక నటన నేర్చుకోడు అని క్లారిటీ వచ్చేసింది. సంజయ్ దత్ ఏ సినిమాలో విలన్ గా చేసినా పెద్ద మార్పేమీ చూపించడని అర్దమైంది.
ఫైనల్ థాట్
బాఘీ 4 ఓపెనింగ్ షాట్‌లోనే ట్రక్ ఒక కారును ఢీకొడుతుంది. ఫుల్ స్పీడ్‌లో కార్ డ్రైవ్ చేస్తున్న హీరో రక్తమోడుతూ, గాయాలతో, కారు తలకిందులై రైల్వే ట్రాక్‌పై పడిపోతాడు. అదే టైంలో ట్రైన్ నేరుగా అతడి వైపు దూసుకొస్తుంది. ఇది అంతా POV (పాయింట్ ఆఫ్ వ్యూ) షాట్‌లో చూపిస్తారు. అంటే మనం కుర్చీలో కూర్చుని ఉన్న ప్రేక్షకులమని మర్చిపోయి, కారు డ్రైవ్ చేస్తున్న హీరోగా అనిపించేలా కెమెరా ప్లేస్ చేస్తారు. దాంతో మనమే ట్రక్ తో ఢీ కొట్టించుకున్నట్టూ, రైలు తొక్కేసినట్టూ ఫీల్ అవ్వాలన్న ఉద్దేశ్యంతోనే ఈ స్టార్ట్.
కానీ అసలు విషయం ఏంటంటే — ఆ ఫీల్ అక్కడితో ఆగదు.. ఈ సినిమా మిగతా భాగం అంతా కూడా అలాగే అనిపిస్తూ ఉంటుంది ! ట్రక్ మననే ఢీ కొట్టినట్టూ, ట్రైన్ మళ్లీ మళ్లీ దూసుకొచ్చినట్టూ… మళ్లీ మళ్లీ అదే అనుభూతి కంటిన్యూ అవుతూనే ఉంటుంది.
ఇది సినిమా కాదు, సర్వైవల్ టెస్ట్!