శివం భజే మూవీ రివ్యూ
x

" శివం భజే" మూవీ రివ్యూ

ఈ మధ్యకాలంలో ప్రాచుర్యం పొందిన థ్రిల్లర్ సినిమాల కోవలో విడుదలైన మరో థ్రిల్లర్ " శివం భజే". ఈ థ్రిల్లర్ ఎలా ఉందంటే..


ఈ మధ్యకాలంలో ప్రాచుర్యం పొందిన థ్రిల్లర్ సినిమాల కోవలో ఈ గురువారం (1.8.24) విడుదలైన మరో థ్రిల్లర్ " శివం భజే". అయితే ఇది కొంచెం వైవిధ్యమైన పాయింట్ తో తీసిన భక్తిరస థ్రిల్లర్ అని నిర్మాత మీడియా తో చెప్పాడు. రాజు గారి గది సీరియల్ సినిమాల్లో నటించిన అశ్విన్ బాబు(ప్రముఖ యాంకర్ ఓంకార్ తమ్ముడు) ప్రధాన పాత్రలో,దర్శకుడు అప్సర్ భాషలో చెప్పాలంటే, ఇంతవరకు రాని కథతో తీసిన సినిమా ఇది. హిడింబా సినిమా తర్వాత అశ్విన్ బాబు మరో వైవిధ్యమైన పాత్రలో నటించాడు.

శివం భజే అని పేరు పెట్టారంటే, శివుడి నేపథ్యంలో తీసిన సినిమా అని అర్థమవుతుంది. " శివుడి ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు" అనే సూత్రం మీద ఈ సినిమా తీశామని దర్శక నిర్మాతలు చెప్పుకున్నారు. ఈ భక్తిరస ప్రధాన థ్రిల్లర్ సినిమాలో కథ ఎలా ఉందో చూద్దాం.

ఓ మాదిరి భక్తిరస థ్రిల్లర్ " శివం భజే"

సినిమాలో హీరో చందు (అశ్విన్ బాబు) ఒక రికవరీ ఏజెంట్. తన స్నేహితుడు ఆపిల్ రెడ్డి(హైపర్ ఆది) తో కలిసి ఒక బ్యాంకు తరఫున లోన్స్ రికవరీ చేస్తుంటాడు. ఆ క్రమంలో శైలజ(దిగంగన సూర్యవంశం) ప్రేమలో పడతాడు. ఒక సందర్భంలో అనుకోకుండా కళ్ళు పోగొట్టుకుంటాడు. ఆ తర్వాత ఆర్గాన్ డొనేషన్ ద్వారా కళ్ళు మళ్లీ వస్తాయి. ఈ క్రమంలో ఏం జరిగింది? చైనా, పాకిస్తాన్ కుట్రలో చందు పాత్ర ఏమిటి? చివరికి ఏం జరుగుతుంది అన్నది స్థూలంగా ఈ సినిమా కథ.

పాయింట్ కొత్తది- కథనం పాతది

దర్శకుడు తన సినిమా కథను బాగానే రాసుకున్నాడు. కథనం కూడా కొంతవరకు బాగానే ఉంది. దర్శక నిర్మాతలు చెప్పినట్లు ఈ సినిమాల్లో చాలా మలుపులు ఉన్నాయి. ప్రధానమైన మలుపు కొంచెం కొత్తదే. కానీ చాలా చోట్ల ఈ భక్తిరస సినిమా రొటీన్ గా సాగుతుంది. భక్తిరస ప్రధాన సినిమా అయినప్పటికీ, కథనం కొంచెం స్లోగా ఉన్నందువల్ల, అంత రక్తి కట్టలేదు. ఈ మధ్యకాలంలో వస్తున్న సినిమాల కన్నా ఈ సినిమా నిడివి ఆశ్చర్యకరంగా తక్కువే ఉన్నప్పటికీ, కథనము నత్తనడక గా నడవడం వల్ల, నిడివి ఎక్కువ అనిపిస్తుంది. హైపర్ ఆదితో కామెడీ ట్రాక్ అన్నది అక్కడక్కడ నవ్వుల పూలు పూయించినప్పటికీ, సినిమాకు బలహీనతగా మారింది. మంచి పాయింట్ తో కథ రాసుకున్నప్పటికీ, సినిమాకు వచ్చేసరికి అనుభవలేమి, క్లారిటీ స్క్రీన్ ప్లే లేకపోవడం వల్ల, సినిమా ఓ మోస్తారు థ్రిల్లర్ గా మారిపోయింది. అది కూడా చాలా వరకు పాయింట్ కొత్తగా ఉండటంవల్ల జరిగింది.

ఈ సినిమా లో కొంచెం ప్లస్ పాయింట్ లు ఉన్నాయి. అందులో సినిమాలో ఉన్న కొన్ని మలుపులు, కొన్ని సన్నివేశాలు. ముఖ్యంగా ఇంటర్వెల్ లో వచ్చే ట్విస్ట్. " జీనోం" ట్రాన్స్ ప్లాంటేషన్ అనే అంశం మీద ఆధారపడిన ఈ కొత్త రకమైన పాయింట్ కోసం దర్శకుడు చాలా రీసెర్చ్ చేసినట్లు అనిపిస్తుంది.సినిమాకు అది కూడా కొంత బలమైంది

సినిమాకు బలం సంగీతం ఫోటోగ్రఫీ

ఈ డివోషనల్ థ్రిల్లర్ కు మరొక బలమైన అంశం నేపథ్య సంగీతం. సినిమాటోగ్రఫీ కూడా సినిమాకు బాగా ఉపకరించింది. ఇకపోతే నటీనటుల్లో అశ్విని బాబు కొంతవరకు తన పాత్రకు న్యాయం చేశాడు. ఇక్కడ సర్ప్రైజ్ ఎలిమెంట్ హిందీ నటుడు ఆర్భాస్ ఖాన్ డిఫరెంట్ షేడ్స్ ఉన్న ఏసీపి పాత్రకు సరిపోయాడు. ఇక హీరోయిన్ దిగంగనా కొంతమేరకు పరవాలేదు. కొంచెం సేపే ఉన్నప్పటికీ డాక్టర్ పాత్రలో బ్రహ్మాజీ హాస్యంతో కూడిన సీరియస్ నెస్ ను ప్రదర్శించాడు. ఇక మురళీ శర్మ కూడా ఆ పాత్రకు సరిగ్గా సరిపోయాడు. హైపర్ ఆదికి ఇది ఒక రొటీన్ వ్యవహారమే. కొన్నిచోట్ల సీరియస్ గా కూడా నటించి, తన నటన టాలెంటును ప్రదర్శించాడు. ఈ క్రైమ్ సినిమాకి ఉపయోగపడిన మరో అంశం ఫైటింగులు. అశ్విన్ బాబు నటనతో పాటు, ఫైటింగ్ లో కూడా కొంత మెరిశాడు.

కొంచెం ఓపిక ఉంటే చూడొచ్చు

ఈ సినిమాకు బలం, బలహీనత కూడా దర్శకుడే. ఒక కొత్త పాయింట్‌తో కథ రాసుకున్నప్పటికీ, స్క్రీన్ ప్లే లో కొన్ని జాగ్రత్తలు తీసుకొని ఉంటే, సినిమా మరింత పకడ్బందీగా తయారయ్యేది. కొన్ని సన్నివేశాలు ఎక్కువగా లాగ తీయబడటం వల్ల, సినిమా సీరియస్ నెస్ ను దెబ్బతీసేయ్. అందులో హీరో హీరోయిన్ల ప్రేమ సన్నివేశాలు, కామెడీ ట్రాక్ లు ఉన్నాయి.

చివరగా చెప్పాలంటే దర్శకుడి చేతిలో ఈ సినిమా కొంతవరకే చక్కగా రూపుదిద్దుకుంది. కొంచెం చేయి తిరిగిన దర్శకుడు అయి ఉంటే మరింత ఆసక్తికరంగా, థ్రిల్లింగ్ గా ఉండేదేమో. అయితే ఈ మధ్యకాలంలో వస్తున్న చాలా థ్రిల్లర్ సినిమాలతో పోలిస్తే, ఈ సినిమా కాస్త మెరుగైన సినిమానే. పైన చెప్పిన ప్లస్ పాయింట్ల కోసమైనా ఈ సినిమా కొంచెం ఓపికతో చూడొచ్చు.

నటీనటులు: అశ్విన్ బాబు, అర్బాజ్ ఖాన్, దిగంగన సూర్యవంశీ, హైపర్ ఆది, మురళీ శర్మ, సాయి ధీనా, బ్రహ్మాజీ, తులసి, దేవి ప్రసాద్, అయ్యప్ప శర్మ, షకలక శంకర్, కాశీ విశ్వనాథ్, ఇనయ సుల్తానా

దర్శకత్వం: అప్సర్

సంగీతం: వికాస్ బాడిసా

సినిమాటోగ్రఫీ: దాశరధి శివేంద్ర

ఎడిటర్: ఛోటా కె ప్రసాద్

నిర్మాతలు: మహేశ్వర రెడ్డి మూలి

నిర్మాణ సంస్థ: గంగా ఎంటర్టైన్మెంట్స్

విడుదల: 01 ఆగస్టు 2024

Read More
Next Story