తిరువీర్ మోక్షపటం  OTT మూవీ రివ్యూ!
x

తిరువీర్ 'మోక్షపటం' OTT మూవీ రివ్యూ!

తెలుగులో క్రైమ్ కామెడీ థ్రిల్లర్ సినిమాలు తక్కువే. ప్రతీ సీజన్ లోను ఒకటి అలా అప్పుడప్పుడు పలకరిస్తుంటాయి.

తెలుగులో క్రైమ్ కామెడీ థ్రిల్లర్ సినిమాలు తక్కువే. ప్రతీ సీజన్ లోను ఒకటి అలా అప్పుడప్పుడు పలకరిస్తుంటాయి. థియోటర్ లో వీటికి చెప్పుకోదగ్గ డిమాండ్ ఉండదు. దాంతో చాలా వరకు మొక్కుబడిగా థియేటర్ రిలీజ్ చేసి ఓటీటీలోకి తీసుకువస్తుంటారు. అలా కాకుండా డైరెక్ఠ్ గా ఓటీటీలోకి వచ్చే సినిమాలు ఉంటాయి. అలాంటి ఓ చిత్రం మోక్షపటం. మసూద ఫేమ్ తిరువీర్ నటించిన ఈ చిత్రం రీసెంట్ గా ఓటీటీలోకి వచ్చింది. రాహుల్ వనజ రాజేశ్వర్ తెరకెక్కించిన ఈ సినిమాలో రువీర్, పూజా కిరణ్, తరుణ్ పొనుగోటి, జెన్నిఫర్ ఇమ్మూన్యుయేల్, షాంతి రావు తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. ఈ క్రైమ్ థ్రిల్లర్ ఎలా ఉంది..సినిమా కథేంటి, చూడదగ్గ కంటెంటేనా వంటి విషయాలు రివ్యూలో చూద్దాం.

స్టోరీ లైన్

పాస్ పోర్ట్ ఆఫీస్ లో పనిచేసే అర్జున్ (తిరువీర్) కాస్త డబ్బు కక్కుర్తి ఎక్కువ. దాంతో డబ్బుకోసం అతను నకిలీ పాస్ పోర్టులు కూడా తయారు చేస్తూ ఉంటాడు. అతనికి 'మేఘన' అనే లవర్ ఉంటుంది. ఆమె కన్నింగ్ టైప్. లగ్జరీ లైఫ్ కు అలవాటుపడిన ఆమె, ఎదుటివారిని మోసం చేయడానికి ఎంతమాత్రం ఆలోచన చేయదు. ఆమెకి 'షాను'తగులుతుంది. 'షాను' కు కావాల్సినంత డబ్బుంది .. అయితే ఆమె ఆస్తిపాస్తులు భర్త చేతిలో ఉంటాయి. అతనుకి ఆమె మీద బోలెడంత అనుమానం.

ఇక 'గాయత్రి' ఒక మిడిల్ క్లాస్ మహిళ. ఆమె భర్త 'మహేశ్' క్యాబ్ డ్రైవర్. వాళ్ల ఒక్కగానొక్క కొడుకుని బాగా చదివించాలని పెద్ద స్కూల్లో చేర్పిస్తారు. ఆమెకు ఇంట్లో అత్తగారి మతిమరుపుతో ఇబ్బందులు. తాము ఎంతో కష్టపడి దాచుకున్న 10 లక్షలను స్నేహితుడికి ఇచ్చినందుకు, భర్త మహేశ్ పై తరచూ రుసరుసలాడుతూ ఉంటుంది. ఇల్లు గడవడం కోసం ఒక స్టార్ హోటల్లో పనిచేస్తూ ఉంటుంది.

మరో ప్రక్కన తన స్నేహితుడిని నకిలీ పాస్ పోర్టుతో విదేశాలకి పంపించడం కోసం .. తాను చేసిన అప్పు తీర్చడం కోసం అర్జున్ ప్రయత్నిస్తూ ఉంటాడు. మరో ప్రక్క హోటల్లో పెద్దమొత్తంలో డబ్బు ఉన్న ఒక బ్యాగ్ గాయత్రి కంటపడటంతో, ఆమె దానిని రహస్యంగా ఇంటికి తీసుకుని వెళుతుంది. అక్కడ నుంచి అసలు కష్టాలు మొదలవుతాయి. డబ్బు కోసం తప్పుడు మార్గంలో ప్రయాణం పెట్టుకున్న వీరి జీవితాలు ఎలాంటి మలుపు తిరుగుతాయనేది అసలైన కథ.

ఎలా ఉంది

‘ఒక మిస్టరీ బ్యాగ్ గాయత్రి లైఫ్ ను ఛేంజ్ చేసింది. అది ఆమెకు అదృష్టం తెచ్చిపెట్టిందా? లేదా మరిన్ని ఇబ్బందుల్లోకి నెట్టిందా’? అనే స్టోరీ లైన్ చుట్టూ తయారు చేసిన సినిమా మోక్షపటం. అర్దాంతరంగా ఎదిగిపోవాలనుకోవటం, అత్యాశ, దొంగతనం వంటి నేపధ్యంలో వచ్చే కథలు దాదాపు ఒకటే దారిలో వెళ్తాయి. ఇది వరకూ చాలా సినిమాల్లో చూసినదే. అయితే పాత్రల మధ్య వున్న డ్రామాని ఆసక్తికరంగా మలచడంలో చెప్పుకోదగ్గ పనితీరు కనబరిచాడు దర్శకుడు. సంఘర్షణ పాతదే అయినా డ్రామాని చివరి వరకూ ఒడిసిపట్టుకోవడం ఈ సినిమా లో ప్రత్యేకత.కేవలం నాలుగు కీలకమైన పాత్రల మధ్య ఇంత సినిమాని రన్ చేయడం అంత తేలికకాదు.

అలాగని సన్నివేశాలు మరీ అంత గొప్పగా వుండవు కానీ మరీ తీసిపారేసినట్లుగా కూడా వుండవు.ఒక సస్పెన్స్ థ్రిల్లర్ లా మొదలై క్రైమ్ ని జతేసుకుని ముందుకు వెళ్తుంది. స్క్రిప్టు పరంగా చూస్తే నేరేష‌న్ స్లోగా ఉండ‌డం, ఒకే పాయింట్ చుట్టూ క‌థ న‌డ‌వ‌డం వ‌ల్ల కాస్త బోర్ కొడుతుంది. పైగా క‌థ‌లో ఊహించ‌ని మ‌లుపులేం ఉండ‌వు. ఇది కొత్త క‌థ కాదు. మ‌నం ఎప్పుడో ఒక‌ప్పుడు చూసిన క‌థే. ఇదే పాయింట్ తో ఇది వ‌ర‌కు చాలా సినిమాలొచ్చాయి. దురాశ మ‌ధ్య త‌ర‌గ‌తి మ‌నిషిని ఎంత దూరం తీసుకెళ్లింది? అనే విషయం చెప్పాలనుకోవటం బాగుంటుంది.

టెక్నికల్ గా ..

చిన్న సినిమా ఇది. బ‌డ్జెట్ ప‌రిమితులు ఉంటాయి. కానీ వాళ్లు బ‌డ్జెట్ కు ప‌రిప‌డా క‌థ‌ని ఎంచుకొన్నార‌నిపిస్తుంది. డైరక్టర్ మొదటి చివ‌రి షాట్ వ‌ర‌కూ పాత్ర‌ని ఒకేలా న‌డ‌ప‌డం సినిమాటిక్ ప్ర‌పంచానికి కాస్త దూరంగా వాస్త‌వికంగా అనిపించే ప్రయత్నం చేసారు. తిరువీర్ డబ్బింగ్ లో జాగ్రత్తలు తీసుకోవాల్సింది. ఆయన మాట్లాడుతున్నప్పుడు డబ్బింగ్ సినిమా చూసిన ఫీలింగ్ కలుగుతుంది.

మిగతా నటీనటులు పరిధిమేర కనిపించారు. కెమరాపనితనం, మ్యూజిక్ డీసెంట్ గానే వున్నాయి. కొన్ని డైలాగ్స్ బావున్నాయి. అయితే టెక్నికల్ గా అవుట్ స్టాండింగ్ అని అయితే చెప్పలేం. నిర్మాణ విలువలు సోసోగా ఉన్నాయి. దర్శకుడి ఆలోచన బావున్నప్పటికీ అందులోని ఎమోషన్స్ ప్రేక్షకుడు ఆశించిన స్థాయిలో తెరపై పండకపోవడం కాస్త వెలితిగానే వుంటుంది.

నచ్చుతుందా

ఈ సినిమాలో ఫ్రెష్ నెస్ లేదు కానీ.. క్రైమ్ & థ్రిల్లింగ్ కంటెంట్ ని ఇష్టపడేవారికి నచ్చే ఛాన్స్ వుంది. స్టార్ కాస్టింగ్ లో ఆకర్ష‌ణ లేక‌పోవొవ‌చ్చు. కానీ మ‌ధ్య‌త‌ర‌గ‌తి మంద‌హాసాన్ని, ఆశ‌కీ దూరాశ‌కూ మ‌ధ్య ఊగిస‌లాడుతున్న జీవ‌న చిత్రాన్నీ ఈ చిన్న క‌థ‌లో చూపించగ‌లిగారు.

ఎక్కడ చూడచ్చు

ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహాలో ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతోంది.

Read More
Next Story