Sonu Sood | ముఖ్యమంత్రి పదవి ఆఫర్ చేశారు. నేను వద్దన్నా
x

Sonu Sood | 'ముఖ్యమంత్రి పదవి ఆఫర్ చేశారు. నేను వద్దన్నా'

‘హ్యూమన్స్ ఆఫ్ బాంబే’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో సోను సూద్.


హిందీ చిత్ర పరిశ్రమలో నటుడు సోను సూద్ పేరు తెలియని వారుండరు. తమిళం, తెలుగు సినిమాల్లో కూడా నటించారు. అయితే ‘అరుంధతి’ సినిమాలో ఈయన నటనకు విశేష ప్రేక్షకాదరణ లభించింది. సినిమాల్లోనే కాకుండా సామాజిక కార్యక్రమాల్లోనూ సోను సూద్ ముందుంటారు. అవసరమైన వారికి సాయం చేయడంలో ఎప్పుడూ ముందువరుసలో ఉంటారు.

కరోనా లాక్‌డౌన్ సమయంలో సోను సూద్ పేరు దేశవ్యాప్తంగా వినిపించింది. స్వస్థలాలకు చేరుకునేందుకు ఇబ్బంది పడుతున్న వారి కోసం ఆయన ప్రత్యేకంగా విమానాలు, బస్సులు ఏర్పాటు చేయించారు. ప్రస్తుతం థాయిలాండ్ టూరిజం విభాగానికి బ్రాండ్ అంబాసిడర్‌గా, గౌరవ సలహాదారుడిగా కొనసాగుతున్నారు.

ఈ నేపథ్యంలో ‘హ్యూమన్స్ ఆఫ్ బాంబే’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో సోను సూద్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు నెట్టింట్లో వైరలయ్యాయి. "నాకు ముఖ్యమంత్రి పదవి ఆఫర్ చేశారు. నేను తిరస్కరించినపుడు, డిప్యూటీ సీఎంగా ఉండమన్నారు."అని పేర్కొన్నారు.

ఇంకా ఆయన ఏం చెప్పారంటే..

"పోలిటిక్స్‌లోకి ప్రజలు రెండు కారణాల వల్ల వస్తారు. ఒకటి డబ్బు కోసం. రెండోది అధికారం కోసం. ఈ రెండింటి పట్ల నాకు ఆసక్తి లేదు. నేను ఇప్పటికీ ప్రజలకు సాయపడుతున్నా. దాని కోసం ఎవరి అనుమతి తీసుకోనక్కర్లేదు.’’

"నేను రాజకీయాల్లోకి వస్తే.. నాకు ఢిల్లీలో అన్ని సౌకర్యాలున్న భవంతి, మంచి హోదా, భారీ భద్రత, ప్రభుత్వ ముద్రతో లెటర్‌హెడ్ వస్తాయని చాలా మంది చెప్పారు. వారు నాకు ముఖ్యమంత్రి పదవి ఇస్తామన్నారు. నేను తిరస్కరించా. డిప్యూటీ సీఎంగా ఉండమన్నారు. దానికి నో చెప్పా. ఆఫర్ ఇచ్చిన వారు దేశంలో అత్యంత శక్తివంతమైన వ్యక్తులు.’’

"వారు నన్ను కలవడం, ప్రపంచంలో మార్పు తేవాలని ప్రోత్సహించడం బాగుంది. కానీ నేను నా స్వేచ్ఛ కోల్పోకుండా ఉండటానికి రాజకీయాలకు దూరంగా ఉండాలని అనుకున్నాను. అందుకు ఆఫర్‌ను తిరస్కరించా. దానర్థం నాకు రాజకీయాలు సరిపడవని కాదు. నిజాయతీగా పనిచేసే నాయకులను ఎప్పుడూ గౌరవిస్తా" అని పేర్కొన్నారు.

సోను సూద్ సోదరి మాళవిక సూద్ 2022లో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆమె మోగా నియోజకవర్గం నుంచి రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి, ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) అభ్యర్థి అమన్‌దీప్ కౌర్ అరోరా చేతిలో ఓడిపోయారు.

Read More
Next Story