
విజయ్ వివరణ తో ట్రైబల్ చల్లబడతారా..
విజయ్ దేవరకొండ ట్రైబల్ వ్యాఖ్య ఎంత కాకరేపింది !
పదం జారితే… పబ్లిక్ ఇమేజ్ ఉరితీయబడే కాలం ఇది. ముఖ్యంగా ప్రతీ విషయం ఆచి,తూచి మాట్లాడాల్సిన సమయం ఇది. ఇలాంటి సమయంలో విజయదేవరకొండ మాట్లాడిన మాట ఓ వివాదానికి తెర లేపింది.
విజయ్ దేవరకొండ పేరు వింటే... ఎవరికైనా గుర్తొచ్చేది –
స్పష్టత, స్వేచ్ఛ, ధైర్యం.
ఇక వివాదాలు? అతనికి అవేమీ కొత్తకాదు. అవి కొంతమందికి డెబేట్‌గా కనిపిస్తాయి, విజయ్ ఫాలోవర్స్‌కి అయితే "స్టేట్‌మెంట్" లా అనిపిస్తాయి.
హీరోగా చేసిన తొలి సినిమా పెళ్లి చూపులు తోనే సక్సెస్ పంథాలోకి దూసుకుపోయిన విజయ్ దేవరకొండ.. "సైలెంట్‌గా ఉండాలి" అనే సలహాలను ఎప్పుడూ వినలేదు. ఎవరేమన్నా గట్టిగా స్పందించాడు. ఎమోషన్ లో మాట్లాడాడు. అదే అతని స్టైల్. అదే అతని బ్రాండ్. అదే అతని ఫాలోయింగ్ కూడా.
కానీ ఈసారి… అతని మాటే బ్లాస్ట్ అయ్యింది.
రీసెంట్‌గా సూర్య హీరోగా వచ్చిన ఓ రెట్రో ఈవెంట్‌లో పాల్గొన్న విజయ్, ఉగ్రవాద దాడులపై మాట్లాడుతూ అనుకోకుండా "ట్రైబల్స్" గురించి నోరు జారాడు. అతని ఉద్దేశ్యం భిన్నమైతేనేం, పదజాలం మాత్రం స్పష్టంగా దెబ్బతీసింది.
ఆ కామెంట్ వెంటనే వైరల్ అయ్యింది. ట్విట్టర్ లో ట్రెండ్ గా మారింది. ట్రైబల్ ఆర్గనైజేషన్స్ మండిపడేలా చేసింది.
ఇంతకీ విజయ్ దేవరకొండ ఏమన్నారు?
పహల్గాం ఉగ్రదాడి గురించి మాట్లాడుతూ.. ఇండియా పాకిస్తాన్‌పై దాడి చేయాల్సిన అవసరం లేదు.. అక్కడి ప్రజలకే విరక్తి వచ్చి పాక్ ప్రభుత్వంపై తిరగబడతారు. 500 ఏళ్ల క్రితం ట్రైబల్స్ కొట్టుకున్నట్లు.. బుద్ధి లేకుండా, కనీస కామన్ సెన్స్ లేకుండా ఇలాంటి పనులు చేస్తున్నారు. మనమంతా ఐకమత్యంగా ఉండాలి’ అని విజయ్ అన్నారు.
ఆ వ్యాఖ్య సోషల్ మీడియాలో ఒక్కసారిగా వైరల్ అయ్యింది. నెటిజన్లు మండిపడ్డారు. ట్రైబల్ సంఘాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి. చివరకు ఇది ఓ పోలీస్ కేసు అయ్యింది.
''విజయ్ దేవరకొండపై ఎస్సీ, ఎస్టీ కేసు పెట్టాలి'' అని కంప్లైంట్ లో కోరారు. కేసు నమోదు చేసే విషయంపై న్యాయ సలహా తీసుకుని తదుపరి చర్యలు చేపడతామని చెప్పారు ఎస్ఆర్ నగర్ పోలీసులు.
ఇదే ఘటనపై కీసర పోలీస్ స్టేషన్‌లో నేషనల్ బంజరా మిషన్ ఇండియా(ఎన్బీఎంఐ) మేడ్చల్ జిల్లా అధ్యక్షుడు రవిరాజ్ రాథోడ్ ఫిర్యాదు చేశారు.
విజయ్ దేవరకొండ – ప్రెస్ నోట్ ఇచ్చి క్షమాపణ చెప్పాల్సిన పరిస్థితి ఎదురైంది. ఈ వివాదం… చిన్న పొగ నుంచి పెద్ద అగ్నిలా మారుతోందనిపించిన విజయ్ దేవరకొండ, వెంటనే స్పందించాడు.
ఆ ప్రెస్ నోట్ లో ..
.‘‘ ‘రెట్రో ఈవెంట్లో నేను మాట్లాడిన మాటలతో కొంత మంది హర్ట్ అయ్యారనే విషయం నా దృష్టికి వచ్చింది. నేను ఆ విషయంపై సిన్సియర్‌గా క్లారిటీ ఇవ్వాలని అనుకుంటున్నాను. ఎవ్వరినీ ఉద్దేశ్యపూర్వకంగా హర్ట్ చేయాలని అలా మాట్లాడలేదు. ఏ సమాజాన్ని, ముఖ్యంగా మన షెడ్యూల్డ్ తెగలను బాధపెట్టడం లేదా లక్ష్యంగా చేసుకోవడం అనే ఉద్దేశ్యం నాకు లేదు. వారిని నేను ఎంతో గౌరవిస్తాను. వారు మన దేశంలో అంతర్భాగంగా భావిస్తాను.
మనమందరం కలిసికట్టుగా ముందుకు సాగాలి. ఐక్యంగా నిలబడాలి. నేను ఏ సమూహంపై ఉద్దేశపూర్వకంగా ఎప్పుడూ వివక్ష చూపలేదు. నేను ఉపయోగించిన "తెగ" అనే పదం, వందల ఏళ్ల కిందట సమాజం, ప్రజలు గుంపులుగా వ్యవస్థీకృతమై ఉండేవాళ్లని నా ఉద్దేశం. వారందరూ నా కుటుంబ సభ్యులు, నా సోదరులే అని అనుకుంటాను.
నేను చేసిన వ్యాఖ్యల వల్ల ఎవరైనా బాధపడి ఉంటే విచారం వ్యక్తం చేస్తున్నాను. శాంతి, పురోగతి మరియు ఐక్యత గురించి మాట్లాడటమే నా ఏకైక లక్ష్యమని’’ నోట్ ద్వారా విజయ్ వివరణ ఇచ్చారు.
ఇక విజయ్ దేవరకొండ వివరణని బట్టి చూస్తే ఆయన ఉద్దేశం తప్పు కాదు.
కానీ ఒక పదం — "ట్రైబల్స్" — పూర్తిగా వివాదానికి తలుపులు తెరిచింది.
ఇదే ఈ రోజుల్లో మీడియా కమ్యునికేషన్‌లో పొంచి ఉన్న పెద్ద ప్రమాదం.
"సోషల్ మీడియా కాలంలో… పదాలు తుపాకులు. నువ్వు ట్రిగ్గర్ నొక్కలేకపోయినా, ఎవరైనా నొక్కేస్తారు!"
మరి విజయ్ ఇచ్చిన ఈ వివరణతో సమస్య సద్దుమణుగుతుందా లేదా అనేది తెలియాల్సి ఉంది.