2024లో తెలుగు సినిమా ఎలా సాగింది!
నార్త్, సౌత్ తేడా లేకుండా కలక్షన్ల వర్షం కురిపిస్తున్న సెన్సేషన్ ఓ వైపు... మూడో రోజుకే సినిమాల వెబ్ సైట్లలో అందుబాటులో ఉండటం ఇంకో వైపు.
నార్త్, సౌత్ తేడా లేకుండా కలక్షన్ల వర్షం కురిపిస్తున్న సెన్సేషన్ ఓ వైపు...
మూడో రోజుకే సినిమాల కాపీలు వెబ్ సైట్లలో అందుబాటులో ఉండటం ఇంకో వైపు..
పట్టుమని నాలుగు రోజులు కూడా థియేటర్ లు నిండని సందర్బం మరో వైపు...
2024 లో తెలుగు సినిమా పరిస్థితి ఇది. ఇందులో ఏది నిజం? నిజంగానే తెలుగు సినిమా స్థాయి ఈ సంవత్సరంలో పెరిగిందా? తగ్గిందా? కలక్షన్ల లెక్కలను నిజంగా నమ్మొచ్చా? ఈ 2024 లో తెలుగు సినిమా ఎదుర్కున్న ఆటుపోట్లు ఏంటి? ఈ స్టోరీ లో మీ కోసం.
జనవరిలో 'గుంటూరు కారం','సైంధవ','నా సామి రంగా'లాంటి సినిమాలు మొదలుకుని మొన్నటి 'పుష్ప-2' వరకూ కూడా ఎన్నో పెద్ద సినిమాలు తెలుగులో వచ్చాయి. ఎప్పటినుండో ఉన్న సక్సెస్ ఫార్ములానే నమ్ముకుని పండుగలకే పెద్ద స్టార్స్ సినిమాలు వచ్చాయి. రాజమౌళి తెలుగు సినీ పరిశ్రమకు పరిచయం చేసిన 'ప్రమోషన్స్ ఆల్వేస్ ఫస్ట్ 'అన్న సూత్రం కూడా ఈ సంవత్సరం బాగానే పని చేసింది. కానీ సినిమాటిక్ ఫీల్ కోసం తప్ప 'మంచి సినిమా'అన్న నమ్మకంతో థియేటర్ కు ప్రేక్షకులను రప్పించిన సినిమాలు ఈ సంవత్సరంలో పెద్దగా లేకపోవడం మాత్రం పెద్ద డిసప్పాయింట్ మెంట్.
అలాగే మంచి కథలతో బాగా చేసే హీరోలు కూడా 'స్టార్ డం'కోసం కథను పక్కన పెట్టి వన్ మ్యాన్ షో సినిమాలు చేయడంతో అభిమానులను పక్కన పెడితే సగటు ప్రేక్షకులను థియేటర్ లకు రప్పించడంలో కూడా తెలుగు సినిమా ఈ సంవత్సరంలో ఫెయిల్ అయ్యింది.
కుదేలైన బాలీవుడ్ మార్కెట్ టాలీవుడ్ కి కలిసి వచ్చిందా?
2019 నుండి కూడా బాలీవుడ్ మార్కెట్ కొంత కుదేలవ్వడం తెలుగు సినిమా మార్కెట్ కి ఎంతో కలిసొచ్చింది. రిమేక్ సినిమాలకు, పాత కథలకు కాలం చెల్లిపోయిందని ఇక్కడి ప్రేక్షకులు తేల్చేశారు. అప్పుడే ఓటిటి ఆడియన్స్ పెరిగిపోవడం తెలుగు సినిమా వైపు భారతీయ ప్రేక్షకులందరూ దృష్టి మరల్చేలా చేసింది. కానీ ఈ 2024 లో బాలీవుడ్ లానే తెలుగు సినిమా కూడా చేతులు కాల్చుకుంది.
అభిమానాలు పని చేయడం లేదా?
తెలుగు రాష్ట్రాల్లో హీరోల అభిమానుల శాతం ఎక్కువ. కొంత దీని వల్ల కూడా జెన్యూన్ గా సినిమా బావుందో లేదో తెలిసే అవకాశం కూడా మొన్నటివరకు కొంత క్లిష్టంగా ఉండేది. కానీ ఇప్పుడు పెరిగిన సోషల్ మీడియా వల్ల ప్రేక్షకుల నిర్మొహమాటమైన అభిప్రాయాలూ కూడా బయటకు వస్తున్నాయి.
అందుకే ఈ అభిమానంతో చూసే ఫ్యాక్టర్ కొంత ఉన్నా, సక్సెస్ ని నిర్ణయించే సగటు ఫ్యామిలీ ఆడియన్స్ కి సినిమా నచ్చిందో, లేదో కూడా ఇప్పుడు తెలిసిపోతూ ఉండటంతో ఓ సినిమా నిజంగా సక్సెస్ అయ్యిందా లేదా అనే కచ్చితత్వం అయితే ఇప్పుడు ఉంది.
ఇక ఈ సంవత్సరం వచ్చిన సినిమా రకాలను గమనిస్తే :
హీరో సెంట్రిక్ సినిమాలు:
పెద్ద స్టార్ ల సినిమాలంటే హీరోల కోసం రాసే కథలే. కానీ ఆ స్టార్ డం ని నిర్ణయించే అవకాశం ప్రేక్షకులకు ఇచ్చే సహనం, వ్యవధి రెండు మన హీరోలకి లేవు. అందుకే ఒకటి, రెండు సినిమాల హిట్ల తర్వాత దాదాపుగా హీరోలందరూ తమ కోసం రాసిన కథల్లోనే నటించడానికి ఆసక్తి చూపిస్తున్నారు.
ఆ మార్పు స్పష్టంగా ఈ సంవత్సరం సినిమాల్లో కనిపిస్తుంది. కథనే నమ్ముకుని కష్టపడి పైకొచ్చిన సుహాస్,శ్రీవిష్ణు,విశ్వక్ సేన్ లాంటి వాళ్లు కూడా ఇదే రూట్ లోకి వచ్చారు.ఈ సంవత్సరంలోనే 'గామి' లాంటి అద్భుతమైన సినిమా చేసిన విశ్వక్ 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి', 'మెకానిక్ రాకీ 'లాంటి పక్కా వన్ మ్యాన్ షో సినిమాలు చేశాడు. ఇప్పటివరకు ఒక దశాబ్దం నుండి కథలనే నమ్ముకున్న శ్రీవిష్ణు, సుహాస్ లు కూడా కొంత ఇదే మార్గాన్ని అనుసరించినట్టు వారి ఇటీవల సినిమాలు చూస్తే అనిపిస్తుంది.'అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ 'లాంటి మంచి సినిమాతో ఈ సంవత్సరం ఓపెన్ చేసిన సుహాస్ తర్వాత చేసిన 'ప్రసన్న వదనం', 'జనక అయితే గనక'లోనూ ;శ్రీ విష్ణు 'స్వాగ్ 'లోనూ ఈ 'స్టార్ డం'కోసం పడే తాపత్రయం కనిపిస్తుంది.
వీళ్ళను పక్కన పెడితే దాదాపు రెండు దశాబ్దాల నుండి తనదైన శైలిలో మెప్పించిన అల్లరి నరేష్ కూడా ఈ 'స్టార్ డం 'స్థాయిని నెక్స్ట్ లెవల్ కి తీసుకువెళ్ళడానికి చేసిన 'బచ్చలమల్లి'లాంటి సినిమాలు కూడా బెడిసికొట్టాయి.
ఇక ఇప్పటికే స్టార్ మార్క్ సాధించిన రవి తేజ, గోపీచంద్ లాంటి హీరోలు ఈ 2024 లో రెండు సినిమాలు చేసినా ఏ ప్రయోజనం లేకుండా పోయింది. విజయ్ దేవరకొండ, సుధీర్ బాబు లాంటి వాళ్లు కూడా ఇదే స్టార్ స్టోరీ ఫార్ములా పట్టుకున్నా, ఫెయిల్ అయ్యింది. మొత్తం మీద 'హీరోల కోసం రాసే కథలు'మాకొద్దని ప్రేక్షకులు గట్టిగా చెప్పిన సంవత్సరం ఇది.
కల్కి, దేవర, పుష్ప-2 పరిస్థితి ఏంటి?
తెలుగు సినిమాలో ఫ్యాన్స్ వల్ల సినిమా కథ పక్కన పెట్టి కొంత కలక్షన్స్ వసూళ్ళు చేసే సినిమాలు కొన్ని ఉంటాయి. అవే కల్కి, దేవర, పుష్ప-2.
హీరో మీద ఒక మంచి అభిప్రాయం ఉంటే ఆ సినిమా హీరో పట్ల అభిమానంతో పని లేకుండా ఆ హీరో సినిమాను చూసే అవకాశాలు ఎక్కువ ఉంటాయని నిరూపించిన హీరో ప్రభాస్. వయసు తెచ్చే హుందాతనం ఇతని కథల్లో కనిపిస్తుంది. అందుకే 'కల్కి 'పెద్ద గొప్ప కథ కాకపోయినా, మల్టీ స్టారర్ ఫార్ములా,డీసెంట్ టేకింగ్ తో సూపర్ హిట్ కొట్టింది.
ఇక 'దేవర'డిజాస్టర్ సినిమానే. అయినా అభిమానాలు, మిశ్రమ స్పందనల వల్ల వచ్చిన కూతుహలం వల్ల కొంత పర్లేదనిపించింది.
ఇక 'పుష్ప-2' మాత్రం ఈ స్టార్ డం బాగా నెత్తికెక్కిన సినిమా. పక్కా హీరో కోసం రాసిన కథ.కృత్రిమ ప్రచారం, కథ లేని సినిమా,జుగుప్స కలిగించే హీరోయిజం తో పక్కా బోల్తా పడిన సినిమా ఇది.
ఒక్క వారం పక్కన పెడితే మొదటిరోజు నుండే ఖాళీ థియేటర్ లు దర్శనమిచ్చిన సినిమా ఇది. అలాగే తమ పబ్లిసిటీ కోసం ఎంతవరకైనా దిగజారుతూ, తమను తాను ఆకాశంలో తారల్లా ఊహించుకునే సెలబ్రిటీలను నేలకు దించిన సినిమా కూడా ఇదే.
ఇప్పటివరకు టాలీవుడ్ పరిశ్రమ వల్ల ప్రభుత్వానికి వచ్చే ఆదాయం వల్ల కావచ్చు, లేదా ఇంకేదైనా కారణం వల్లా కావచ్చు ;సినిమా స్టార్స్ ను తెలంగాణ ప్రభుత్వాలు కూడా గతంలో నెత్తిన పెట్టుకున్నాయి. కానీ ఇప్పుడు సంధ్య థియేటర్ ఘటన నుండి మాత్రం సీన్ మారిపోయింది.
'Noone is above the law' అనే బలమైన హెచ్చరికను ఇప్పటి తెలంగాణ ప్రభుత్వం ఈ ఘటన పట్ల తీసుకుంటున్న చర్యలతో స్పష్టమౌతుంది. సినిమా పరంగానూ, నిజంగానూ కూడా హీరోలు ప్రేక్షకులను ఎలా చూస్తారో స్పష్టం చేసిన ఘటన ఇది. అలాగే ఇటూ ప్రేక్షకులనూ కూడా 'జాగ్రత్త బ్రదర్!మీరు అభిమానులో, పిచ్చోళ్ళో తేల్చుకోండి 'అని సున్నితంగా మందలించిన వైనం కూడా ఇదే!
చిన్న సినిమాలు :
ఈ 2024 లో మంచి కథలతో వచ్చిన చిన్న సినిమాలు కూడా ఉన్నాయి.'35-చిన్న కథ కాదు', 'కమిటీ కుర్రోళ్ళు', 'ఆయ్', 'మ్యూజిక్ షాప్ మూర్తి', 'మత్తు వదలరా-2', 'హనుమాన్' ఈ కోవకి చెందినవే.
ఇక్కడ కూడా అదే పబ్లిసిటీ స్టంట్' ఫార్ములా.'హనుమాన్ 'సినిమా ఒక్క హిట్టుతోనే ఆ హీరో స్టార్ డం స్టోరీల వైపే దృష్టి కేంద్రికరిస్తున్నాడు.
'35-చిన్న కథ కాదు' మంచి కథ, ప్రమోషన్స్ వల్ల ప్రేక్షకులకు దగ్గర అయ్యింది.'మత్తు వదలరా-2' మొదటి భాగం హిట్ అవ్వడం వల్ల దీనికి లైన్ క్లియర్ అయ్యి, ప్రమోషన్స్ సాయంతో బ్లాక్ బస్టర్ అయ్యింది.ఇక 'కమిటీ కుర్రోళ్ళు'గొప్ప కథనం లేకపోయినా, ఫీల్ గుడ్ స్టోరీ కావడం, నిహారిక కొణిదెల లాంటి నిర్మాత నుండి రావడం, భారీ ప్రమోషన్స్ వల్ల హిట్ టాక్ తెచ్చుకుంది. 'ఆయ్' హీరో కూడా ఇప్పటికే స్టార్ హీరో అయిన ఎన్ టీ ఆర్ బంధువు కావడంతో కొత్త హీరో అయినా మంచి కథ కావడంతో హిట్ అయ్యింది.
కానీ 'మ్యూజిక్ షాప్ మూర్తి', 'పేకమేడలు 'లాంటి సినిమాలు మంచి కథలతో వచ్చి, తర్వాత ఓటిటిలలో హిట్ టాక్ తెచ్చుకున్నా, ప్రమోషన్స్ -పబ్లిసిటీ లేకపోవడంతో థియేటర్ లలో మాత్రం చతికిలపడ్డాయి.
వివాదాలు -సినిమాలు:
సినిమాల హిట్ల కోసం ఎన్నో ఫార్ములాలు సినీ పరిశ్రమ కనుక్కుంటూనే ఉంది. అందులో ఒకటే వివాదాలు ఉన్నప్పుడే సినిమాలు విడుదల చేయడం.అదే ఫార్ములాలోనే రాజ్ తరుణ్ నడిచాడు. లావణ్య వివాదం నడుస్తున్నప్పుడే 'పురుషోత్తముడు', 'తిరగబడరా సామి ',ఆ వేడి చల్లారే లోపే 'భలే ఉన్నాడే 'లాంటి సినిమాలతో వచ్చాడు. కానీ ప్రయోజనం లేకుండా పోయింది.
రీ -రిలీజ్ లు:
కలక్షన్లు వచ్చినా రాకపోయినా వచ్చాయని చెప్పుకుంటూ, ప్రతి సినిమాకు సక్సెస్ మీట్లు పెట్టుకోవడం ఇప్పుడు స్ట్రైట్ ఫార్ములా.
అందుకే థియేటర్ లు కూడా ఒక కొత్త సూత్రాన్ని కనుగొన్నాయి. అదే పాత సినిమాల్లో హిట్ అయిన వాటిని, అభిమానుల శాతం ఎక్కువ ఉన్న హీరోల సినిమాలను రిరిలీజ్ చేయడం. ఈ రిరిలీజ్ లు చిన్న సినిమాలు థియేటర్ లలో ఉన్నప్పుడే రిలీజ్ అవ్వడం మాత్రం చిన్న సినిమాల కలక్షన్ లను దెబ్బ తీసింది. ఫ్యాన్ డం ని పక్కా సొమ్ముగా మార్చుకునే ఫార్ములా ఇది, బాగా వర్కవుట్ అయ్యింది. ఈ సంవత్సరంలో ఎన్నో రిరిలీజ్ ల వల్ల ఎన్నో మంచి చిన్న సినిమాల గురించి ప్రేక్షకులకు తెలియకుండా పోయింది.
ఏదేమైనా ఏదో ఒక మెలికతో, సినిమా ప్రేమికులను దోచుకోవడానికి ఏదో ఒక మార్గం కనిపెట్టబడుతూనే ఉంటుంది!
ప్రేక్షకులు ఏం ఆలోచిస్తున్నారు?
సినిమా వచ్చిన వారానికే పైరసి కాపీలు లేకపోతే నెలలో ఓటిటిలలో విడుదల ఉండగా థియేటర్ కి వెళ్ళి చూసేంత మంచి సినిమాలు ఉన్నాయా అన్న ఆలోచన ఇప్పటి ప్రేక్షకుల్లో కనిపిస్తుంది. అందుకే ఎంతో బావుందన్న టాక్ వస్తే తప్ప తెలుగు సినిమా థియేటర్ లు నిండటం లేదు.
ఈ సంవత్సరం అలా థియేటర్ లు నిండిన సినిమా మాత్రం 'కల్కి'నే. దానికి కారణం ఫ్యామిలీ ఆడియన్స్, పిల్లలను ఇద్దరినీ ఆకట్టుకునే సాధారణ స్టోరీ ఫార్ములా, అంతే. అసలు మంచి సినిమాలే లేకపోవడం, రాకపోవడం కూడా దీనికి కలిసి వచ్చింది.ఇప్పటి ప్రేక్షకులను మాయ చేయడం అంత ఈజీ కాదు అని నిరూపించిన సంవత్సరం కూడా ఇది. ఒక 5-6 సినిమాలు పక్కన పెడితే పెద్దగా మ్యాజిక్ లు ఏ సినిమాలోనూ జరిగిపోలేదు.
తెలుగు సినిమా ఆటుపోట్లు :
ఇక సీరియస్ గా తెలుగు సినిమాకి 2024 లో ఎన్నో సవాళ్ళు ఎదురయ్యాయి. కథల్లో కొత్తదనం లేకపోవడం, బలహీనమైన స్క్రీన్ ప్లే, కథలు ప్రిడిక్టబుల్ గా ఉండటం, ఓటిటి లలో వస్తున్న అనేక సినిమాల వల్ల పెరిగిన ప్రేక్షకుల అంచనాలను అందుకోలేకపోవడం లాంటి అనేక సమస్యలు ఈ 2024 లో తెలుగు సినిమాకి ఎదురయ్యాయి.వీటిని త్వరలోనే అధిగమించకపోతే మాత్రం బాలీవుడ్ సినిమాలను తిరస్కరించిన ప్రేక్షకులు ఈ సినిమాలను వద్దనుకోవడానికి అట్టే సమయం పట్టదు.