సుహాస్ “గొర్రె పురాణం” రివ్యూ
x

సుహాస్ “గొర్రె పురాణం” రివ్యూ

సుహాస్ ఉన్నాడంటే ఓ సారి అటు ఓ లుక్కేద్దాం అనుకునే ఓ వర్గం మెల్లిగా బిల్డ్ అవుతోంది. సుహాస్ ఎంచుకుంటున్న వైవిద్యమైన స్టోరీలు, అతని నటన అందుకు కారణం.


సుహాస్ ఉన్నాడంటే ఓ సారి అటు ఓ లుక్కేద్దాం అనుకునే ఓ వర్గం మెల్లిగా బిల్డ్ అవుతోంది. సుహాస్ ఎంచుకుంటున్న వైవిద్యమైన స్టోరీలు, అతని నటన అందుకు కారణం. అయితే సుహాస్ లాంటి చిన్న స్దాయి ఇప్పుడిప్పుడే తనకంటూ మార్కెట్ క్రియేట్ చేసుకుంటున్న ఈ నటుడుకి వైవిధ్యమే అవసరమే కానీ అది విజయం తెచ్చి పెట్టేలా ఉండాలి. అంతేకానీ ఏదో వెరైటీగా ఉంది చేసాము, తోచింది తీసే దర్శకులతో ముందుకు వెళ్లిపోవటం సరికాదు. జనాలకు కూడా నచ్చాలి. తాజాగా అతను ప్రధాన పాత్రలో “గొర్రె పురాణం” అనే సినిమా వచ్చింది. ఈ సినిమా టైటిల్ ,పోస్టర్ ఏదో కొత్త జానర్ ఎటమ్ట్ చేసారనే ఫీల్ అయితే తెచ్చింది. అయితే సుహాస్ లాంటి హీరోలకు భీబత్సమైన ఓపినింగ్స్ ఉండవు. సినిమా బాగుంది అని టాక్ వస్తేనే థియేటర్స్ దగ్గర జనం కనపడతారు. ఇంతకీ ఈ సినిమా ఎలా ఉంది. ఈ పురాణం నచ్చి, ఎంకరేజ్ చేసేదేనా?

స్టోరీ లైన్

మర్డర్ చేసి జైలుకు వచ్చిన వ్యక్తి రవి(సుహాస్) . అతని పెట్టిన సెల్ లోనే ఓ గొర్రె ని కూడా పెడతారు. జైల్లో గొర్రెని పెట్టడమేంటి అంటే దానికో కథ ఉంటుంది. ఆ గొర్రె కూడా ఓ కేసులో అరెస్టై జైలుకు వచ్చి ఉంటుంది. ఇంతకీ గొర్రె చేసిన తప్పు ఏమిటి, దాని ప్లాష్ బ్యాక్ ఏమిటీ అంటే... రఫిక్‌ వచ్చే బక్రీద్‌ పండగ కోసం ఓ గొర్రెను కొనుక్కుంటాడు. పండగ రోజు దాన్ని బలి ఇచ్చి బిర్యాని చేసుకుందామని ఆలోచన. అయితే అది అతని కూతురుకి నచ్చదు. దాంతో తండ్రి లేనప్పుడు చూసి ఆ గొర్రెను వదిలేస్తుంది ఆ పిల్ల. దాన్ని పట్టుకోవాలని రఫిక్‌ గ్యాంగ్‌ ప్రయత్నించగా.. అటు ఇటు తిరిగి పరుగెత్తి గ్రామ దేవత పోచమ్మ గుళ్లోకి వెళ్తుంది.

దాంతో ఆ పోచమ్మ తల్లే ఈ గొర్రెను మన దగ్గరకు పంపించింది అని చెప్పి.. నరహింహా(రఘు కారుమంచి) దాన్ని ఆ గుళ్లోనే బలి ఇవ్వాలని చెబుతాడు. ఈ విషయం రఫిక్ కు తెలుస్తుంది. దాంతో ఈ గొర్రె మాదంటే.. మాది అంటూ రెండు మతాల ప్రజలు గొడవకు దిగే పరిస్దితికి వస్తుంది. పెద్ద పంచాయితీ ఇష్యూ అవటంతో మీడియాకు తెలుస్తుంది. అది హిందూ,ముస్లిం గొడవగా రూపు మార్చుకుంటుంది. ఈ విషయం వైరల్ అవుతుంది. మీడియా కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంసం గా మారుతుంది. దాంతో హిందు,ముస్లిం గొడవలకు దారి తీసేలే ఉందాని దాన్ని అరెస్ట్ చేసి జైలుకు పంపుతారు. అదీ దానికి జరిగిన కథ .

ఇంతకీ ఆ గొర్రె కథ చివరకు ఎలా కొలిక్కి వచ్చింది. కోర్టు జడ్జి(పొసాని కృష్ణ మురళి) ఎలాంటి తీర్పు ఇచ్చాడు. గొర్రె న్యూస్‌ ఇంత వైరల్‌ కావాడానికి గల కారణం ఏంటి? దీని వెనుక దాగి ఉన్న రాజకీయ కుట్ర ఏంటి? జైలు ఖైది రవి(సుహాస్‌)కి ఈ గొర్రె కథకు మధ్య ఉన్న సంబంధం ఏంటి? అసలు రవి జైలుపాలు ఎలా అయ్యాడు? గొర్రె అతనికి ఎలా సహాయం చేసింది? అనే విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

ఎలా ఉంది

పైన చెప్పుకున్నంత నీట్ కథ అయితే లేదు. మొత్తం చూసిన తర్వాత కాసేపు ఆలోచించి ఈ కథ చెప్పగలుగుతాము. అలాగే ఇంటర్వెల్ ముందు దాకా సుహాస్ సీన్ లోకి రాడు. గొర్రె చుట్టూనే ఎక్కువ కథ నడిపారు. గొర్రెని అడ్డం పెట్టి బయిట జరుగతున్న డైవర్షన్ పోలిటిక్స్ పై పెద్ద సెటైర్ వేద్దామని దర్శకుడు ప్రయత్నించాడు. కానీ అనుకున్న స్దాయిలో ఆ సెటైర్ పండలేదు. గొర్రె కథ కొంత దూరం వెళ్లాక ఆగిపోయింది. డైరక్టర్ కు ఏం చేయాలో అర్దం కాని సిట్యువేషన్ క్రియేట్ అయ్యిందని అర్దమైంది. ఇలాంటి కథలకు ఎక్కువ ఫన్, ఎంటర్నైన్మెంట్ అవసరం. నవ్వించే సీన్స్ సినిమాలో పెద్దగా లేవు. సుహాస్ కు చెప్పుకోదగ్గ పాత్ర కాదు.

దర్శకుడు ఎత్తుకున్నది అవుట్ ఆఫ్ భాక్స్ పాయింటే కానీ, డైరక్షన్ సరిగ్గా చేయకపోవటంతో అది సరిగ్గా ఎగ్జిక్యూట్ కాలేదు. కొన్ని సీన్స్ అక్కడక్కడా నవ్వించాయి కానీ అదే సినిమాని చివరిదాకా చూడటానికి సరిపోదు. తరుణ్ భాస్కర్ వాయిస్ ఓవర్ ఇవ్వటం వరకూ కొంత బాగుంది. గొర్రె చుట్టూ మీడియా సర్కస్ జరగటం చాలా ప్రెడిక్టబుల్ గా అనిపిస్తుంది. అక్కడేమీ లేదు కదా ఎందుకింత రచ్చ చేస్తున్నారనిపిస్తుంది. సుహాస్ ప్లాష్ బ్యాక్ లో ఎమోషన్ కనెక్టివిటీ మిస్సవటం కూడా సినిమాని ఇబ్బందుల్లో తోసేసింది.

టెక్నికల్ గానూ సినిమా అంతంత మాత్రంగా ఉంది. కెమెరా వర్క్ ఏదో మ్రొక్కుబడికి చేసినట్లు అనిపిస్తుంది. బ్యాక్ గ్రౌండ్ స్కోర్, మ్యూజిక్ నాశిరకంగానే ఉంటాయి. అలాగే చాలా సీన్స్ చుట్టేసినట్లు అనిపిస్తుంది. బడ్జెట్ లిమిటేషన్స్ కావచ్చు. ఎడిటర్ ఓ గంట సినిమా ఎడిట్ చేయచ్చు అనే స్దాయిలో బోర్ కొట్టింది.

చూడచ్చా

టైటిల్ ని ,సుహాస్ ని చూసి ఏదో భారీ కామెడీ అని ఊహించుకుంటే బోల్తా పడతారు. ఓటిటిలో వచ్చినప్పుడు లాగ్ లను కర్శర్ తో లాగేస్తూ బాగున్నచోట ఆగి చూడదగ్గ సినిమా.

Read More
Next Story