సుధీర్ బాబు ‘హరోం హర’ మూవీ రివ్యూ
సుధీర్ బాబు మీడియాకు చెప్పిన " జేమ్స్ బాండ్ ఇన్ కుప్పం" లాంటి సినిమా "హరోం హర" ఈ శుక్రవారం (14.6.24) అనేక చిన్న సినిమాల మధ్య విడుదలైన ఒక మోస్తారు పెద్ద సినిమా.
సుధీర్ బాబు మీడియాకు చెప్పిన " జేమ్స్ బాండ్ ఇన్ కుప్పం" లాంటి సినిమా "హరోం హర" ఈ శుక్రవారం (14.6.24) అనేక చిన్న సినిమాల మధ్య విడుదలైన ఒక మోస్తారు పెద్ద సినిమా. ఈ సినిమాకు పోటీ అంటూ ఏదైనా ఉంటే ఇదే రోజు విడుదలైన తమిళ పాపులర్ స్టార్ విజయ్ సేతుపతి తెలుగులోకి డబ్ చేయబడిన "మహారాజ" సినిమా మాత్రమే.
సుధీర్ బాబు పూర్తిస్థాయి యాక్షన్ సినిమా
ఈ మధ్యకాలంలో సుధీర్ బాబు డిఫరెంట్ సినిమాలను చేస్తూ వస్తున్నాడు. ఈసారి పూర్తిగా యాక్షన్ తో కూడిన సినిమా చేయాలనుకుని దీంట్లో నటించాడు. ఈ మధ్య కొన్ని నిజ జీవిత సంఘటనల మీద ఆధారపడి రాసుకున్న కల్పిత కథలతో చాలా సినిమాలు వచ్చాయి, వస్తున్నాయి కూడా. ఇది చిత్తూరు జిల్లా "కుప్పం"(!) లో 1980 ప్రాంతంలో జరిగిన కథగా చెప్పుకోవచ్చు. దర్శకుడు జ్ఞాన సాగర్ మొదటి సినిమా "సెహరి". పూర్తిస్థాయి కామెడీ సినిమా. ఇప్పుడు ఈ దర్శకుడు ఫుల్ లెన్త్ యాక్షన్ ఓరియెంటెడ్ సినిమా మీద నమ్మకంతో దీన్ని తీశాడట. వైవిధ్యమైన ప్రేమ కథల సినిమాల హీరోగా పాపులర్ అయిన సుధీర్ బాబుకి కథ వినిపించడానికి వెళ్ళినప్పుడు, ప్రేమ కథ చెబుతాడేమో అని ఎక్స్పెక్ట్ చేసిన సుధీర్ బాబు ఒక యాక్షన్ సినిమా కథ చెప్పినప్పుడు కొంత షాక్ కి గురయ్యాడట! అయితే దీన్ని ఒక ఛాలెంజ్‌గా తీసుకొని సుధీర్ బాబు ఈ సినిమా చేశాడు. ఈ సినిమా ట్రైలర్లు, టీజర్లు చాలా ఆసక్తికరంగా అనిపించాయి. తెలుగులో వచ్చిన టాప్ టెన్ యాక్షన్ సినిమాల్లో " హరోం హర" తప్పకుండా ఉంటుంది అని సుధీర్ బాబు ఆత్మవిశ్వాసం వెలిబుచ్చిన సినిమా ఎలా ఉందో ఒకసారి చూద్దాం.
వైవిధ్యమైన కథనంతో, ఒక సాధారణ సినిమా కథ
కల్పిత సంఘటనల మీద ఆధారపడిన కథ కాబట్టి, కథ కూడా అలాగే ఉంటుంది. కర్ణాటక, తమిళనాడు, ఆంధ్ర ప్రదేశ్ మూడు సరిహద్దుల ప్రాంతం లో ఉన్న చిన్న ఊరు కుప్పం. ఆ ఊరు మీద తమ్మిరెడ్డి (లక్కి లక్ష్మణ్) అతని తమ్ముడు బసవ(రవి కాలే), కొడుకు శరత్ రెడ్డి (అర్జున్ గౌడ), ఆధిపత్యం చలాయిస్తుంటారు. ఊరి ప్రజలంతా వారి ముందు తలెత్తుకొని కూడా నిలబడ కూడదు. అంత దుర్మార్గం ఉన్న ఊరికి ఒక కాలేజీ ల్యాబ్ లో అసిస్టెంట్ గా పని చేయడానికి వస్తాడు సుబ్రహ్మణ్యం(సుధీర్ బాబు). అక్కడ ఒకసారి తమ్మిరెడ్డి మనుషుల్ని చితకొడతాడు. దాంతో తమ్మిరెడ్డి కుటుంబంతో శత్రుత్వం ఏర్పడుతుంది. ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా ఎలాగైనా డబ్బులు సంపాదించడం కోసం సస్పెండ్ అయిన పోలీస్ ఆఫీసర్ పళని(సునీల్) తో కలిసి తుపాకులు తయారు చేసే ఫ్యాక్టరీ పెట్టి డబ్బులు సంపాదిస్తాడు. తను కాలేజీలో పరిచయమైన దేవి(మాళవిక శర్మ) అనే ఒక అమ్మాయి తో ప్రేమలో పడతాడు, పెళ్లి చేసుకుంటాడు. అతని తండ్రి జయప్రకాష్ ఊరంతా అప్పులు చేసి ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, తాను సంపాదించిన డబ్బులతో అప్పులు తీరుస్తాడు. చివరికి తమ్మి రెడ్డి తో సహా అతని కుటుంబ సభ్యులందరికీ చంపేసి ఊరిని కాపాడుతాడు. ఇది స్థూలంగా హరోం హర కథ.
ఇలాంటి కథలతో తెలుగులో ఎన్నో సినిమాలు వచ్చి ఉండొచ్చు. అయితే ఇంతకు ముందే చెప్పినట్లు ఈ సినిమా సాధారణమైన కథన అయినప్పటికీ, దీని దర్శకుడు తన ప్రతిభతో కొంతవరకు చూడదగ్గ సినిమాగా మలిచాడు. అయితే ఈ సినిమాలో మామూలు ఫైట్లతో మొదలైన యాక్షన్, తుపాకులతో, గన్ లతో, రైఫిళ్ళతో, బాంబులతో, మిషన్ గన్ తో చివరికి రాకెట్ లాంచర్ తో ముగుస్తుంది. ఈ సినిమా టాప్ టెన్ తెలుగు యాక్షన్ మూవీస్ లలో పేరు సంపాదించే అవకాశం ఉంది.
మొదటి సగంలో అలరించిన సినిమా
ఈ సినిమా నిడివి కూడా రెండున్నర గంటల పైగా ఉంది. ఈ సినిమా మైనస్ పాయింట్ లలో ఇది ఒకటి. అంతసేపు యాక్షన్ ప్రేక్షకులు చూడలేరు. రెండో మైనస్ పాయింట్ సినిమా రెండో సగం దారి తప్పడం. సినిమా సస్పెండెడ్ పోలీస్ ఆఫీసర్ సునీల్ ను మరో పోలీస్ ఆఫీసర్ సుబ్రమణ్యం ఆచూకీ చెప్పమని అరెస్ట్ చేసి స్టేషన్ కి తీసుకెళ్లినప్పుడు సినిమా ఆసక్తికరంగా అనిపిస్తుంది. దాని తర్వాత కూడా కొంతవరకు బాగానే నడుస్తుంది. దానికి కారణం సుబ్రహ్మణ్యం కి తండ్రితో ఉన్న అనుబంధాన్ని చూపే రెండు మూడు సన్నివేశాలు, మరో కొత్త యువ నటి మాళవిక శర్మ, సుబ్రహ్మణ్యం మధ్య వచ్చే సన్నివేశాలు. ఒకటి రెండు ఫైట్లు. అందులో మొదటిది హీరో ఇంట్రడక్షన్ టు విలన్స్. రెండవది శరత్ రెడ్డిని థియేటర్లో ఎదుర్కొనేది, అలాగే మార్కెట్లో బసవన్న చంపే ఫైట్. ఆ తర్వాత సినిమా అన్ని తెలుగు యాక్షన్ సినిమాల లాగే సా..గుతుంది. చివరికి ప్రేక్షకుల ఓపికకు పరీక్ష పెట్టి, ఎలా ముగియాలో అలాగే ముగిస్తుంది.
మెరిసిన సుధీర్- మెప్పించినసునీల్, మాళవిక లు
ఇంతకుముందు చెప్పినట్లు ఈ సినిమా చూడదగ్గదిగా ఉండే పాజిటివ్ పాయింట్ లు కొన్ని చూద్దాం. ఇందులో మొదటిది తన జోనర్ గాని యాక్షన్ సినిమాలో సుధీర్ బాబు నటన. ఇంతకు ముందు సుధీర్ బాబు మీడియాతో మాట్లాడుతూ " నేను నటనలో ఎప్పుడు ఫెయిల్ కాలేదు" అన్నాడు. ఇది చాలా వరకు నిజం. సుదీర్ బాబు సినిమాలు ఫెయిల్ అయ్యాయి కానీ సుధీర్ బాబు కాదు. ఈ సినిమాతో ఆ స్టేట్మెంట్ నిజమే అనిపిస్తుంది. సుధీర్ బాబు ఈ సినిమాలో చేసిన ఫైట్లు చాలా తక్కువ తెలుగు సినిమాల్లో వచ్చాయి. ఫైటింగ్ లోనే కాకుండా, యాక్టింగ్ లో కూడా ఈ సినిమా లో సుధీర్ బాబు తన ప్రతిభను చూపించాడు. యాక్షన్ కొరియోగ్రఫీ బాగుంది.
ఇక రెండో పాజిటివ్ పాయింటు మొదటిసారి సునీల్ ఇంతవరకు చేయని ఒక డిఫరెంట్ పాత్రలో తన నటన కౌశల్యాన్ని చూపించాడు. ఈ సినిమాకు వీరిద్దరి నటన ప్రధానమైన బలం. మిగతా రౌడీ పాత్రధారులంతా వారి వారి స్థాయిల్లో విలనిజాన్ని పండించారు. ఇక ఈ సినిమాలో ఇన్స్పెక్టర్ పాత్రధారి అక్షర గౌడ కు భవిష్యత్తు ఉంది. మరో ముఖ్యమైన పాత్రలో నటించిన మాళవిక శర్మ చక్కని నటన ప్రదర్శించి, మరికొన్ని తెలుగు సినిమాల్లో మెరిసే అవకాశాన్ని కల్పించుకుంది.
సరైన నేపథ్య సంగీతం- ఆర్ట్ డిజైనింగ్
ఈ సినిమాకు మరో ప్లస్ పాయింట్ చైతన్ భరద్వాజ్ సంగీతం.ముఖ్యంగా నేపథ్య సంగీతం సినిమా బ్యాక్ గ్రౌండ్ కు చక్కగా సరిపోయింది. ఒకటి రెండు పాటలు కూడా బాగానే ఉన్నాయి. ఈ సినిమా కొన్నిచోట్ల దర్శకుడు రాసుకున్న డైలాగులు కూడా బాగున్నాయి." సింహం భయపడితే అందరూ సింహాన్ని సేద్యానికి వాడుకుంటారు.. అదే సింహం భయపెడితే అడవికి రాజు అని ఒళ్ళు దగ్గర పెట్టుకుంటారు" అనే డైలాగుతో పాటు అవసరమైన చోట మంచి డైలాగ్ లు ఉన్నాయి. అలాగే 1980 కుప్పం నేపథ్యాన్ని చక్కగా చూపించగలిగింది ఆర్ట్ డైరెక్టర్ రామాంజనేయులు.
కొత్తవాడైనప్పటికీ దర్శకుడు ఈ సినిమాను చాలా వరకు అనుకున్న విధంగానే తీసుకోగలిగాడు. అయితే సుదీర్ఘమైన క్లైమాక్స్, సినిమా నిడివి కొంచెం తగ్గించి ఉంటే మరింత బాగుండేది. చివరగా చెప్పాలంటే ఈ మధ్యకాలంలో వచ్చిన చాలా యాక్షన్ సినిమాల కంటే ఈ సినిమా కొంచెం బెటర్. యాక్షన్ తో పాటు సుధీర్ బాబు, సునీల్ ల నటన, ఈ సినిమాను పర్వాలేదు చూడొచ్చు అనే స్థాయికి తీసుకెళ్ళింది. యాక్షన్ సన్నివేశాలు ఇష్టపడే ప్రేక్షకులకు ఈ సినిమా బాగా నచ్చుతుంది. మిగతా ప్రేక్షకులకు అంతగా నచ్చకపోయినా కొంతవరకు చూడొచ్చు
నటీనటులు: సుధీర్ బాబు ,మాళవిక శర్మ, సునీల్, జయప్రకాష్, కేశవ్ దీపక్, రవి కాలే, లక్కీ లక్ష్మణ్, అర్జున్ ,అక్షర గౌడ్
కథ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్, దర్శకత్వం: జ్ఞానసాగర్ ద్వారక
సంగీతం: చైతన్ భరద్వాజ్
కళా దర్శకుడు: ఎ. రామాంజనేయులు
సినిమాటోగ్రఫీ: అరవింద్ విశ్వనాథన్
ఎడిటర్: రవితేజ గిరిజాల
నిర్మాత: సుమంత్ జి నాయుడు
నిర్మాణ సంస్థ: శ్రీ సుబ్రమణ్యేశ్వర సినిమాస్
విడుదల: జూన్ 14, 2024