
'శుభం' రివ్యూ
కొత్తవాళ్లతో, కొత్త పాయింట్ తో తీసిన ఈ సినిమా ఎలా ఉంది, కథేమిటి, సమంతకు నిర్మాతగా ఇదొక శుభారంభం ఇస్తుందా!
టాలీవుడ్ టాప్ హీరోయిన్ సమంత ఇప్పుడు కెమెరా వెనకకు వెళ్లింది. 'ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్' అనే పేరుతో నిర్మాణ సంస్థ ప్రారంభించి, తన తొలి సినిమా ‘శుభం’ ని తీసుకువచ్చింది. కొత్తవాళ్లతో, కొత్త పాయింట్ తో తీసిన ఈ సినిమా ఎలా ఉంది, కథేమిటి, సమంతకు నిర్మాతగా ఇదొక శుభారంభం ఇస్తుందా!
స్టోరీ లైన్
పల్లెటూర్లకి డీటీహెచ్ వచ్చి, కేబుల్ టీవీలు దూరమవుతున్న రోజుల్లో కథ జరుగుతుంది. భీమిలిలో లోకల్ కేబుల్ నెట్‌వర్క్ నడిపే ముద్దుబంతి శ్రీను (హర్షిత్ రెడ్డి), బ్యాంకులో పని చేసే శ్రీవల్లి (శ్రియ కొంతం) ను పెళ్లి చేసుకుంటాడు. పెళ్లంటే ఓ కొత్త జీవితం ప్రారంభం కదా అని చాలా ఊహించుకున్నాడు కానీ... ప్రారంభ టైటిల్స్ కూడా పూర్తవకుండానే సమస్య మొదలైపోతుంది.
అతని మొదటి రాత్రి శ్రీను ఎన్నో కలలతో, సైలెంట్ మ్యూజిక్‌తో శోభనం గదిలోకి అడుగుపెడతాడు... కానీ శ్రీవల్లి చేతిలో రిమోట్‌తో సోఫాలో కూర్చొని “జన్మ జన్మాల బంధం” సీరియల్ చూస్తూంటుంది. శ్రీను సీరియల్ బ్రేక్ ఇద్దమనుకుని ఆపు చేస్తే – ఆమె ముఖంలో సీరియల్ కన్నా భయంకరమైన స్మైల్... భయపడిపోతాడు, వణికిపోతాడు.
మరుసటి రోజు అదే పరిస్దితి. అంతేకాదు తన ఫ్రెండ్స్ భార్యలందరూ అదే టైంలో, అదే ఛానెల్ లో అదే సీరియల్ చూస్తూ మీద ఆత్మలు అవహించిన వారిలాగా ప్రవర్తిస్తున్నారు. చూపులు మారిపోతున్నాయి, మాటలు నిశ్శబ్దంగా— డేంజర్ మ్యూజిక్ ప్లే అవుతోంది.
సీరియల్ చూడటాన్ని అడ్డుకుంటే, భర్తలపైనా దాడులకు తెగబడి మరీ భయపెడుతుంటారు. తర్వాత ఎంక్వైరీ చేస్తే ఊళ్లో అందరి మగాళ్ల పరిస్దితి ఇదే అని, తొమ్మిది దాటితే సీరియల్ వారికి సింహస్వప్నంగా మారిందని అర్దం చేసుకుంటారు. సీరియల్ పూర్తయ్యాక అంతా మామూలుగా ఏమీ జరగనట్లే ఉంటూంటారు.
దాంతో ఈ ఆత్మల సమస్యలకి పరిష్కారం చెప్పమని మాయ మాతా శ్రీ (సమంత) దగ్గరికి పరుగెడతారు. అప్పుడు ఆమె " శుభాంతం మీ చేతుల్లోనే ఉంది!" అని తేల్చేస్తుంది. ఇంతకీ ఆమె చెప్పిన ఆ శుభాంతం ఏమిటి.. అసలు ఎందుకిలా జరుగుతోంది? అసలు ఆత్మల నుంచి ఆ ఊరి మహిళలకి విముక్తి లభించిందా లేదా? జన్మజన్మల బంధం సీరియల్‌కీ, ఆత్మలకీ సంబంధం ఏమిటి? అన్నది కథ.
విశ్లేషణ
"శుభం" – సమంత నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టిన తొలి చిత్రం. ఇది ఓ దెయ్యం కథ రూపంలో వచ్చిన సోషల్ సెటైర్. ప్రవీన్ కండ్రేగుల దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం... ప్రత్యేకంగా ఒక జానర్ కు పరిమితం కాకుండా అనేక జానర్ల మిశ్రమంగా రెడీ చేసారు. కామెడీ, హారర్, సెటైర్, ఎమోషన్ — అన్నీ కలిపి వండిన వంటకం ఇది.
సాధారణ దెయ్యం సినిమా అనుకునేలోపే, ఇది సామాజికంగా ఓ ముఖ్యమైన విషయాన్ని చర్చిస్తుంది . మహిళలు కూడా తమ ఇష్టాల్ని అనుసరించే స్వేచ్ఛను పొందాలి, నిర్ణయాలలో భాగస్వాములవ్వాలి, కేవలం ఇల్లును నడిపించే పాత్రకే పరిమితం కాకూడదు అనే విషయాలు చర్చించారు.
కథ మొదట "అల్ఫా మేల్" అనే భావనతో మొదలవుతుంది. ఆ తరవాత ఆత్మల కోణంలోకి మెల్లిగా ప్రవేశిస్తుంది. ఓ దశలో Cinema Bandi తరహా నేటివ్ టచ్ కనిపిస్తుంది. చివరికి ఓ గమ్మత్తైన మెసేజ్‌తో ముగుస్తుంది.
2 గంటల సినిమా గడిచేలోపే, ప్రేక్షకుడికి కొన్ని మంచి నవ్వులు, కొంచెం ఆలోచన, కొద్దిగా భయం అన్నీ అందిస్తుంది. సమంత చేసింది అతిథి పాత్రే అయినా... ఆ 5-8 నిమిషాల స్క్రీన్ టైం ఆసక్తికరంగా ఉంటుంది.
అయితే ఇంటర్వల్ తర్వాత సినిమా కొద్దిగా డల్ అవుతుంది. ముఖ్యంగా సీరియల్ రీక్రియేషన్ సన్నివేశాలు కొంచెం హాస్యాస్పదంగా మారినా, చివర్లో మళ్లీ ట్రాక్‌లోకి వస్తుంది.
టెక్నికల్ గా
హారర్ ఎలిమెంట్స్ ఉన్నా ఇది హారర్ చిత్రం కాదు. అలాగే ఓ సెటైర్ మూడ్ తేవటానికి టెక్నికల్ టీమ్ బాగానే వర్క్ చేసింది. వసంత్ మరింగంటి రాసిన కథలో మూడ్ ఉందే కానీ, మేజర్ డ్రైవ్ మాత్రం సిట్యువేషన్ల నుంచే వస్తుంది. డైలాగ్స్ కన్నా కాన్సెప్ట్ ఓనర్సిప్ ఎక్కువ. ఈ సినిమాకే ఉత్సాహం ఇచ్చి నడిపించిన అసలైన శక్తి అంటే... అదే వివేక్ సాగర్ సంగీతం. ఆయన మార్క్ ఫంకీ టచ్ సినిమాని నిలబెట్టింది.
కొన్ని సన్నివేశాల్లో పూర్తిగా మౌనం – సంగీతం లేకుండా ఇచ్చిన స్పేస్ కూడా సినిమాకి మంచి పేస్‌ను తీసుకువచ్చింది. అలాగే క్లింటన్ సిరీజో ఇచ్చిన పాటలు కూడా బాగున్నాయి. సినిమాటోగ్రఫీ విషయంలో మృదుల్ సుజిత్ సేన్ ఇంకొంచెం బాగా వర్క్ చేయాల్సింది. విజువల్స్ మరింత లైవ్‌గా, కలర్‌ఫుల్‌గా ఉండాల్సింది. ఇపుడు చూస్తే పెద్ద స్క్రీన్‌పై చిన్న బడ్జెట్ షార్ట్ ఫిలిం చూసిన ఫీలింగ్ కలుగుతుంది. ఎడిటింగ్ డిపార్ట్‌మెంట్‌లో ధర్మేంద్ర కాకర్ల తన స్టైల్‌కు తగ్గట్టు డీసెంట్‌గా డెలివర్ చేశాడు.
టెక్నికల్‌గా చూస్తే ప్రత్యేకంగా నిలిచింది ఆర్ట్ డైరెక్షన్. గ్రామీణ నేపథ్యాన్ని నమ్మదగినట్లుగా ప్రదర్శించడంలో ప్రొడక్షన్ డిజైన్ బాగా పని చేసింది.
'Cinema Bandi'తో పరిచయమైన దర్శకుడు ప్రవీణ్, ఈ సినిమాతో తన టాలెంట్‌ను మరోసారి నిరూపించుకున్నాడు. సామాజిక వ్యాఖ్యానాన్ని వినోదాత్మకంగా చెప్పాలంటే ఎలా చెప్పాలో 'శుభం' మంచి ఉదాహరణ.
ఎవరెలా చేసారు.
నటులెవ్వరూ అప్‌సెట్ చేయలేదు. హర్షిత్ రెడ్డి హీరోగా న్యాచురల్ స్క్రీన్ ప్రెజెన్స్‌తో ఆకట్టుకున్నాడు. శ్రియ కొంతం నెగిటివ్ షేడ్స్ ని బాగా ప్రెజెంట్ చేసింది. గవిరెడ్డి శ్రీనివాస్ "అల్ఫా మేల్" స్టయిల్‌లో నవ్వులు పండిస్తాడు. శ్రావణి లక్ష్మి, చరణ్ పెరి, షాలినీ కొందేపూడి – అందరూ పాత్రలకు న్యాయం చేశారు. సమంత, తక్కువ సమయంలో కాస్త స్టార్ పవర్ జోడించి మూడ్‌ని మార్చేస్తుంది.
ఫైనల్ గా...
సెకండాఫ్ డ్రాగ్ ని కాస్త భరించగలిగితే ఇది మంచి సినిమానే. అలాగే ఫ్యామిలీలతో ఓ లుక్కేసే సినిమానే.
నటీనటులు: హర్షిత్‌రెడ్డి, గవిరెడ్డి శ్రీనివాస్, చరణ్ పెరి, శ్రియ కొంతం, శర్వాణి లక్ష్మీ, షాలిని కొండెపూడి, వంశీధర్ గౌడ్;
సంగీతం: క్లింటన్ సిరీజో (నేపథ్యం: వివేక్ సాగర్);
సినిమాటోగ్రఫ్రీ: మృదుల్ సుజిత్ సేన్;
ఎడిటింగ్: ధర్మంద్ర కాకర్ల;
కథ: వసంత్ మరింగంటి;
నిర్మాత: ట్రాలాలా మూవీంగ్ పిక్చర్స్;
విడుదల: 09-05-2025