శోకసంద్రంలో సంగీత ప్రపంచం: ఆశా భోస్లే కన్నుమూత
x

శోకసంద్రంలో సంగీత ప్రపంచం: ఆశా భోస్లే కన్నుమూత

ప్రముఖ గాయని ఆశా భోస్లే కన్నుమూశారు. భారతీయ సంగీతానికి ఆమె చేసిన సేవలు చిరస్మరణీయం.


Click the Play button to hear this message in audio format

సంగీత ప్రపంచం శోకసంద్రంలో మునిగింది. ప్రముఖ గాయని ఆశా భోస్లే ఆదివారం కన్నుమూశారు. ఆమె వయస్సు 92 సంవత్సరాలు. వృద్ధాప్య సమస్యలు, అవయవాల వైఫల్యం కారణంగా ఆమె తుదిశ్వాస విడిచినట్లు వైద్యులు తెలిపారు.

కొద్ది రోజులుగా అస్వస్థతతో బాధపడుతున్న ఆశా భోస్లేను శనివారం సాయంత్రం ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో చేర్పించారు కుటుంబ సభ్యులు. ఛాతీలో ఇన్ఫెక్షన్, తీవ్రమైన నీరసం కారణంగా ఆమె ఆరోగ్యం మరింత క్షీణించినట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు.

ఎనిమిది దశాబ్దాలకు పైగా సాగిన తన గాన ప్రయాణంలో ఆశా భోస్లే అసాధారణ ప్రతిభను చాటుకున్నారు. ప్రేమగీతాలు, గజల్స్, క్లాసికల్, పాప్, కబరే—ఏ శైలిలోనైనా ఆమె తన ప్రత్యేక ముద్ర వేశారు. ఆమె ఆలపించిన పాటలు తరతరాలకు గుర్తుండేలా నిలిచిపోయాయి.

‘అభీ నా జావో ఛోడ్ కర్’, ‘పియా తు అబ్ తో ఆజా’, ‘దిల్ చీజ్ క్యా హై’, ‘ఇన్ ఆంఖోం కీ మస్తీ’, ‘దునియా మే లోగోం కో’, ‘జారా సే ఝూమ్ లూం మే’ వంటి ఎన్నో గీతాలు ఆమె గాన మాధుర్యానికి నిదర్శనాలు. ఆమె గాత్రం వినిపించిన ప్రతి పాటలో భావ వ్యక్తీకరణ ప్రత్యేకంగా నిలిచింది.

భారతీయ భాషలతో పాటు పలు విదేశీ భాషల్లో కూడా ఆమె 12వేలకు పైగా పాటలు పాడారు. మీనా కుమారి నుంచి మధుబాల, జీనత్ అమన్ నుంచి కాజోల్ వరకు అనేక తరాల కథానాయికలకు ఆమె గాత్రదానం చేశారు. దక్షిణాది సినీ పరిశ్రమలోనూ ఆమెకు ప్రత్యేక స్థానం ఉంది.

లతా మంగేష్కర్ సోదరి..

ఆమె ప్రముఖ గాయని లతా మంగేష్కర్ చెల్లెలు. ఇద్దరూ కలిసి భారతీయ సంగీతాన్ని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లారు.

పురస్కారాల విషయానికి వస్తే, ఆశా భోస్లే అనేక జాతీయ, అంతర్జాతీయ అవార్డులు అందుకున్నారు. పద్మ విభూషణ్ కూడా అందుకున్నారు. 2023లో తన 90వ పుట్టినరోజు సందర్భంగా దుబాయ్‌లో నిర్వహించిన ‘ASHA@90’ లైవ్ కాన్సర్ట్‌లో పాల్గొని అభిమానులను అలరించారు.

ఆమె మరణంతో ఒక యుగానికి తెరపడింది. కానీ ఆమె గానం మాత్రం ఎప్పటికీ సంగీత ప్రియుల హృదయాల్లో మార్మోగుతూనే ఉంటుంది.

ఆశా భోస్లే గీతాపాలన చిత్రాలు..

• “పియా తూ అబ్ తో ఆజా” – Caravan (1971)

• “దమ్ మారో దమ్” – Hare Rama Hare Krishna (1971)

• “చురా లియా హై తుమ్నే జో దిల్ కో” – Yaadon Ki Baaraat (1973)

• “యే మేరా దిల్” – Don (1978)

• “ఇన్ ఆంఖోంకి మస్తీ” – Umrao Jaan (1981)

• “దిల్ చీజ్ క్యా హై” – Umrao Jaan (1981)

• “మేరా కుచ్ సామాన్” – Ijaazat (1987)

• “తన్హా తన్హా” – Rangeela (1995)

• “రాధా కైసే న జలే” – Lagaan (2001)

సీఎం చంద్రబాబు నివాళి..

ప్రముఖ గాయని ఆశా భోస్లే మరణంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎక్స్ వేదికంగా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. భారతీయ సంగీతానికి ఆమె చేసిన సేవలు అమూల్యమని, ఎనిమిది దశాబ్దాల పాటు కోట్లాది హృదయాలను తన స్వరంతో అలరించిన మహానుభావురాలని కొనియాడారు.

ఆమె గాత్రం తరతరాలకు స్ఫూర్తినిచ్చిందని, సంగీత ప్రపంచంలో ఆమె స్థానం ఎప్పటికీ చిరస్థాయిగా నిలిచిపోతుందని తెలిపారు. ఈ విషాద సమయంలో ఆమె కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ, ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.

Read More
Next Story