
‘శివంగి’ మూవీ రివ్యూ
ఇంతకీ ఈ సినిమా ఎలా ఉంది. కథేంటి?
కాన్సెప్టు ఓరియెంటెండ్ సినిమాలు, అదీ హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాలు దాదాపు తగ్గిపోయాయి. వాటిల్లో స్టార్ హీరోయిన్స్ నటించిన పనిగట్టుకుని థియేటర్ కు వెళ్ళి వారి సినిమాలు చూడటం లేదు. అంతగా బాగుంటే ఓటీటీలో వచ్చినప్పుడు చూసుకుందాంలే అన్నట్లు ఉంటున్నారు జనం. అలా క్రితం సంవత్సరం మార్చిలో రిలీజై...ఇప్పుడు ఓటీటీలోకి వచ్చిన చిత్రం శివంగి. వరలక్ష్మీ శరత్ కుమార్, ఆనంది ప్రధాన పాత్రల్లో ఉండటంతో మంచి బజ్ క్రియేట్ అయ్యింది. ఇంతకీ ఈ సినిమా ఎలా ఉంది. కథేంటి?
స్టోరీ లైన్
సాఫ్ట్ వేర్ ఉద్యోగస్దురాలైన సత్యభామ (ఆనంది)కి పెళ్లయిన మొదటి రాత్రే భర్త యాక్సిడెంట్ తో మంచాన పడతాడు. సంసారానికి పనికిరాడని తెలిసిన కంటికి రెప్పలా చూసుకుంటుంది. అతనికి ఆపరేషన్ చేయించి తిరిగి మామూలు మనిషిని చేయాలని కష్టపడుతూంటుంది. ఫస్ట్ యానివర్సరీ రోజున భర్తకి ఆపరేషన్ కి రంగం సిద్ధం చేసుకుంటుంది. అయితే అదే రోజున రకరకాల ఊహించని సమస్యలు ఒక్కసారిగా ఆమెను చుట్టుముడుతాయి.
భర్త ఆపరేషన్ కోసం అవసరమైన ఇరవై లక్షలు ఇన్సూరెన్స్ కు అప్లై చేస్తుంది. అయితే ఆఫీస్ లో బాస్ కిరణ్ (జాన్ విజయ్) ఆమెను లైంగికంగా వేధిస్తూంటాడు. అంతేకాకుండా ఆ ఇన్సూరెన్స్ డబ్బులు చేతికి రాకుండా క్లెయిమ్ రిజెక్ట్ అయ్యేలా చేస్తాడు.
దాంతో ఈ విషయం తెలుసుకున్న సత్యభామ అత్త,మామలు మండిపడతారు. నా కొడుకుకి.. ‘ఆపరేషన్ చేయించేస్తానని గొప్పలు చెప్పావ్. అసలు నువ్వు మా ఇంట్లో అడుగు పెట్టడం వల్లే మాకు ఈ దరిద్రం’ అని తిట్టిపోస్తారు. అప్పటికప్పుడు డబ్బులు అదీ అంత పెద్ద మొత్తం అంటే ఏం చేయాలో అర్థం కాదు.
ఇక అదే సమయంలో గతంలో సత్యభామకు దూరమైన లవర్ 'అర్జున్' లైన్ లోకి వస్తాడు. ఈ టెన్షన్ ఉండగానే సత్యభామకి తల్లీదండ్రులు నుంచి ఓ ఫోన్ వస్తుంది. ఊహించని విధంగా వాళ్లు వరదల్లో చిక్కుకుంటారు. సాయం కోసం కూతురుకు కాల్ చేస్తారు. ఎక్కడో పల్లెటూరులో విపత్కకర పరిస్థితుల్లో చిక్కుకున్న పేరెంట్స్‌ను హైదరాబాద్‌లో ఉన్న సత్యభామ ఎలా కాపాడగలిగింది?
ఇలా సరిగ్గా పెళ్లయిన మొదటి వార్షికోత్సవాన భర్తకి ఆపరేషన్ కి రంగం సిద్ధం చేసుకున్న సత్యభామకు అనుకోని అవాంతరాలు ఒకదాని తర్వాత ఒకటి తగులుతూ ఉంటాయి. వాటిని సత్యభామ ఎలా ఎదుర్కొంది? ఓ కేసు విచారణలో భాగంగా సత్యభామ చెప్పిన మాటలు పోలీసు అధికారి సారికా సింగ్ (వరలక్ష్మీ శరత్‌కుమార్) నమ్మిందా? అసలు ఆ కేసు ఏంటి? అనేది “శివంగి” (Shivangi) కథాంశం.
విశ్లేషణ
ట్రైలర్, టీజర్, ప్రమోషన్స్ లో వరలక్ష్మీ శరత్ కుమార్ ని చూసి, ఆమె శివంగి పాత్ర వేసిందేమో అనుకుంటాము. అయితే సినిమా ప్రారంభమైన కాసేపటికే అర్థమవుతుంది. అది ఆమె కథ కాదని, వరలక్ష్మీ శరత్ కుమార్ కు ఓటీటీ మార్కెట్ ఉందని, దాన్ని క్యాష్ చేసుకోవడానికి ఆమె చేత ఓ చిన్న పాత్ర చేయించి, దాన్ని హైలెట్ చేస్తూ ప్రమోషన్స్ చేసారని. ఈ కథలో ఆమెది గెస్ట్ రోల్ లాంటిదే. ఆమె వైపు నుంచి కథ నడవదు. మధ్యలో వచ్చి వెళ్లిపోతుంది. ఇది మొత్తం ఆనంది కథగానే నడుస్తుంది. సినిమాలో దాదాపు ముప్పాతిక భాగం ఆమే తెరపై కనబడుతుంది.
కథ చాలా చిన్న లైన్ ని బేస్ చేసుకుని నడుస్తుంది. ఎక్కువ శాతం ఒకే లొకేషన్, ఒకే పాత్ర అన్నట్లు తీసారు. అయితే ఉన్నంతలో కాస్తంత ఇంట్రెస్టింగ్ స్క్రీన్ ప్లేనే రాసుకున్నారు. స్త్రీ తలుచుకుంటే ఏమైనా చేయగలదు అనే విషయాన్ని మెసేజ్ లో చెప్పాలని ప్రయత్నం చేసాడు. అయితే అంతసేపు కేవలం ఆనందిని తెరపైనే చూస్తూ కూర్చోవటం కాస్తంత ఇబ్బందే. దానికి తోడు లొకేషన్స్ ఛేంజ్ లేకపోవటంతో సినిమా చూస్తున్నంత సేపు సీరియల్ చూసిన ఫీలింగ్ కలుగుతుంది.
ఓ క్రైమ్ తో మొదలయ్యే ఈ సినిమాలో ఎక్కువగా ఫ్లాష్‌బ్యాక్ సీన్స్ ఉంటాయి. అలాగే సత్యభామ భర్త, అత్తామామ, ఫ్రెండ్స్.. వీళ్లంతా తెరపై కనిపించరు గానీ ‘వినిపిస్తారు’. గతానికి సంబంధించిన ఎపిసోడ్స్‌లో సత్యభామ పాత్రనే చూపించారు. ఏదో ఏకపత్రాభినయం చూస్తున్నట్లు అనిపిస్తుంది.
టెక్నికల్ గా
‘వంగే వాళ్ళు ఉంటే… మింగే వాళ్ళు ఉంటారు… నేను వంగే రకం కాదు… మింగే రకం…’ అంటూ ఆ మధ్యన సోషల్ మీడియాలో ఓ డైలాగ్ విపరీతంగా వైరల్ అయింది. ఆ డైలాగ్ ఈ సినిమాలోదే. ఇలా సింగిల్ లొకేషన్ లో ఎక్కువ శాతం జరిగే సినిమాలకు కెమెరా వర్క్, ఆర్ట్ డిపార్ట్మెంట్ బాగా పని చేయాలి.
ఆ రెండు కూడా ఈ సినిమాకు బాగానే సెట్ అయ్యాయి. అలాగే ఈ సినిమాకు మరో ప్లస్ గా నిలచింది ఎంగేజ్ చేసేలా బ్యాగ్రౌండ్ స్కోర్. ఎడిటింగ్ క్రిస్పీ గా ఉంది. నిర్మాణ విలువలు బాగున్నాయి. దర్శకుడు, కెమెరా మెన్ అయిన భరణి ధరన్ ఈ సినిమాని చాలా జాగ్రత్తగా డీల్ చేసాడు.
నటీనటుల్లో సినిమాలో ఎక్కువ శాతం కనపడేది సత్యభామగా ఈ సినిమాలో నటించిన ఆనంది. ఆమె బాగానే చేసింది. ఇక వరలక్ష్మీ శరత్ కుమార్ కు పోలీస్ పాత్రలు రొటీన్ అయిపోయాయి. జాన్ విజయ్, కోయా కిషోర్ స్క్రీన్ టైమ్ తక్కువైనా తన మార్క్ చూపించారు.
చూడచ్చా
అసభ్యత, అశ్లీలం లేదు కాబట్టి ఫ్యామిలీతో కూర్చుని ఈ సినిమా చూడొచ్చు. ఓ చిన్న థ్రిల్లర్ చూసిన ఫీల్ వస్తుంది. ఆడవాళ్లకు నచ్చే అవకాశం ఉంది
ఎక్కడుంది
ఆహా ఓటీటీ లో తెలుగులో ఉంది