‘శంబాల’ మూవీ రివ్యూ
x

‘శంబాల’ మూవీ రివ్యూ

భయమా... నమ్మకమా… చివరికి ఏది గెలిచింది?

1980 లో జరిగే ఓ డార్క్, మిస్టీరియస్ పీరియడ్ కథ. శంబాల అనే వెయ్యేళ్ల చరిత్ర ఉన్న ఊరు. ఆ ఊరిలో ఒక్కరోజు ఆకాశం నుంచి ఓ ఉల్క జారి క్రింద పడుతుంది. ఆ క్షణం నుంచి ఆ ఊరి జీవితం తలకిందులవుతుంది. కారణం తెలియని హత్యలు, ఆత్మహత్యలు, అనూహ్య మార్పులు… అన్నింటికీ అదే ఉల్క కారణమని ఊరి ప్రజల గట్టి నమ్మకం. వాళ్లు దాన్ని భయంతో “బండ భూతం” అని పిలుస్తారు.

ఈ భయాల మధ్యకి అడుగుపెడతాడు దేవుడ్ని కాదు, సైన్స్‌ని మాత్రమే నమ్మే జియాలజిస్ట్ విక్రమ్ (ఆది సాయికుమార్). ఊరిలో జరుగుతున్న వింత సంఘటనలపై నివేదిక ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం అతన్ని శంబాలకు పంపిస్తుంది. పోలీస్ హనుమంతు (మధునందన్) అతనికి సాయం చేస్తుంటాడు. కానీ ఇక్కడ సమస్య ఒక్కటే — విక్రమ్‌ లాజిక్ మాట్లాడుతాడు… శంబాల ప్రజలు భయాన్ని నమ్ముతారు.

ఉల్క పడినప్పటి నుంచి రాములు (రవివర్మ) అనే వ్యక్తి విచిత్రంగా ప్రవర్తిస్తుంటాడు. అతని ఆవు పాలు కూడా రక్తంలా మారడం ఊరంతా కలకలం రేపుతుంది. “ఆవుని బలి ఇస్తేనే ఊరికి శాంతి” అని చెబుతాడు అక్కడ స్వామిజీ. ఆయన ఆదేశాలు, సర్పంచ్‌లో ఆదేశాల మేరకు ఆవుని చంపేయాలని నిర్ణయంచుకుంటారు. కానీ రాములు తల్లి దాన్ని రక్షిస్తుంది. అయినా వెంబడిస్తారు. అంతలోనే విక్రమ్‌ అది చూసి ఆవుని రక్షిస్తాడు. అక్కడితో కథ ఆగదు. రాములు క్రమంగా వికృతగా మారిపోతాడు. అడ్డొచ్చిన వాళ్లను హత్య చేస్తూ ఊరిని భయాందోళనలోకి నెట్టేస్తాడు. ఒక దశలో విక్రమ్‌పైనే దాడి చేస్తాడు. ఇది నిజంగా ఉల్క ప్రభావమా? లేదా మనిషి లోపలి చీకటే బయటపడుతోందా?

ఈ గందరగోళంలోకి దేవి (అర్చన అయ్యర్) ప్రవేశిస్తుంది. ఆమె పాత్ర కథను ఇంకో దిశకు మళ్లిస్తుంది. సైన్స్, నమ్మకం, భయం — ఈ మూడింటి మధ్య చిక్కుకున్న విక్రమ్‌ చివరకు ఏ నిర్ణయం తీసుకున్నాడు? లాజిక్ గెలిచిందా… లేక దేవుడికి మొక్కాడా? ఉల్క వెనుక ఉన్న అసలు నిజం ఏమిటి? ఆ ఊళ్లో వింత చావుల వెనుక ఉన్న కథేంటి? ,బండ భూతం నిజంగానే ఉందా? ఆ అనర్థాల వెనుక ఉన్న రహస్యం ఏంటి? ఆ సమస్యకు విక్రమ్ పరిష్కారం చూపించాడా? లేదా? వంటి ప్రశ్నలకు సమాధానాలు దొరకాలంటే సినిమా చూడాల్సిందే.

అనాలిసిస్

ప్రస్తుత బయిట నడుస్తున్న ట్రెండ్ ని, ప్రేక్షకుల మైండ్‌సెట్‌ని దర్శకుడు సరిగ్గా రీడ్ చేసి ఈ స్క్రిప్టు రెడీ చేసారనిపిస్తోంది. పీరియాడికల్ డ్రామాలు, మిస్టిక్ థ్రిల్లర్లు, మైథాలజీ–సైన్స్ మిక్స్ కథల మీద ఇప్పుడు ఆడియన్స్‌కి ఆసక్తి ఉంది. శంబాల కూడా అదే స్పేస్‌లోకి అడుగుపెట్టింది. అయితే హారర్, పురాణాలు, దేవుళ్లు, శాస్త్రం, సైన్స్ – ఇవన్నీ ఒకే కథలో కలపడం రిస్కీ ఛాయిస్ . చిన్న తప్పు జరిగినా కథ గందరగోళంగా మారుతుంది. అయితే ఈ విషయంలో దర్శకుడు చాలా వరకూ ఆ అడ్డంకులను దాటాడు. అందుకు స్క్రిప్టు విషయంలో తీసుకున్న కొన్ని జాగ్రత్తలు కలిసొచ్చాయి.

మొదట్లో కథా ప్రపంచం (World Building) – శంబాల అనే ఊరిని చాలా జాగ్రత్తగా ఎస్టాబ్లిష్ చేయడం ప్లస్ అయ్యింది. ఊరి చరిత్ర ఊరి నమ్మకాలు, దేవత, పురాణాల నేపథ్యం, ఉల్క (బండ భూతం) చుట్టూ ఉన్న భయం ఇవన్నీ కథ మొదట్లోనే ప్రేక్షకుడిని ఆ ఊరి లోపలికి లాగుతాయి. సాయికుమార్ వాయిస్ ఓవర్‌తో వచ్చే ఇంట్రో, AI విజువల్స్ – టోన్‌ని బాగా సెట్ చేశాయి. మొదటి 15–20 నిమిషాలు స్క్రిప్ట్ ఎదర ఏం జరగబోతోందా అనే క్యూరియాసిటీ మీదే నడుస్తుంది. ఇక్కడ దర్శకుడు ఆడియన్స్‌ను “ఇదేదో కొత్తగా ఉందే” అనే మూడ్‌లోకి తీసుకెళ్లగలిగాడు.

డేవిడ్ లించ్ (David Lynch) చెప్తాడు:

“The mystery is not meant to be solved. It’s meant to be experienced.”

ఇక Science Vs God – ఈ స్క్రిప్టు ఐడియాకు బేస్. ఇలాంటి కథలని డీల్ చేయటానికి సాధారణంగా రెండు మార్గాలుంటాయి: మొదటిది సైన్స్ వైపు నిలబడి లాజికల్ ఎక్స్‌ప్లనేషన్ ఇవ్వడం. రెండవది దేవుడు / నమ్మకం వైపు నిలబడి మైథాలజీని గెలిపించడం, శంబాల స్పష్టంగా రెండో దారినే ఎంచుకుంది. రెండు కలపాలనే ప్రయత్నం అయితే చెయ్యలేదు. ఇక్కడ దర్శకుడు చేసిన ముఖ్యమైన స్క్రిప్ట్ నిర్ణయం – కథను “భూతం నిజమా, కాదా ?” అనే ప్రశ్న దగ్గర ఆపకుండా, మనిషి లోపల ఉన్న ఆరు శత్రువులే (అరిషడ్వర్గాలు) అసలు భూతం అనే పాయింట్ దగ్గరకి తీసుకెళ్లడం. కామ, క్రోధ, లోభ, మద, మోహ, మత్సర్య – ఈ ఆరు గుణాల్ని ఆరు పాత్రల రూపంలో ఇంట్రడ్యూస్ చేయడం, పాట ద్వారా అవి ఎస్టాబ్లిష్ కావడం – స్క్రిప్ట్ లెవెల్‌లో ఇది చాలా స్ట్రాంగ్ ఐడియా. ఇక్కడే శంబాలకి “సాధారణ హారర్” నుంచి ఫిలాసఫికల్ మిస్టిక్ థ్రిల్లర్ గా మారే అవకాశం వచ్చింది.

స్క్రీన్ ప్లే పరంగా చూస్తే... ఫస్ట్ హాఫ్ – ఆసక్తి ఉన్నా, స్ట్రక్చర్ తడబాటు. ఫస్ట్ హాఫ్‌లో పెద్ద సమస్య రిపిటేషన్. ఒకే విషయం, ఒకే భయం, ఒకే వాదన (సైన్స్ vs శాస్త్రం). ఇవి సీన్స్ గా తిరిగి తిరిగి వస్తూండటంతో కథ ముందుకు కదలకుండా అక్కడక్కడే తిరుగుతున్న ఫీలింగ్ వస్తుంది. ముఖ్యంగా ప్రీ–ఇంటర్వెల్ భాగం అనవసరంగా లాగారు. హత్యలు హీరో కళ్లముందే జరుగుతున్నా, అతని రియాక్షన్ బలహీనంగా ఉండటం ఆశ్చర్యపరుస్తుంది. “ అన్ని హత్యలు జరుగుతూంటే కేవలం ఒక్క సైంటిస్ట్‌ని రీసెర్చ్ చేసి ఆపమని పంపారా?” అనే లాజిక్ స్క్రిప్ట్ నమ్మకాన్ని కొద్దిగా దెబ్బతీస్తుంది. అయితే, చెరుకు తోట సీక్వెన్స్, రవివర్మ – మీసాల లక్ష్మణ్ పాత్రల్లో భూత ప్రవేశం ఎపిసోడ్స్ – హారర్ టోన్‌ను బలంగా నిలబెట్టాయి.

ఇక సెకండ్ హాఫ్ నుంచే దర్శకుడు తన అసలు పాయింట్ బయటపెడతాడు. ఊరి దేవత కథ, ఉల్క వెనుక ఉన్న పురాణ రహస్యం, స్పైనల్ కార్డ్‌లోని నర్వ్ కాన్సెప్ట్, అరిషడ్వర్గాల చివరి నాలుగు దశలు ఇవి అన్నీ ఇక్కడ పర్పస్‌తో వస్తాయి . స్క్రీన్‌ప్లే కూడా ఇక్కడే బిగుస్తుంది. ముఖ్యంగా ఆలయం ముందు జరిగే సీక్వెన్స్, ప్రీ–క్లైమాక్స్ ట్విస్ట్, చిన్నపాపను కాపాడే సన్నివేశం – కథకు ఎమోషనల్ యాంకర్ ఇచ్చాయి. “మనలో చెడు లేకపోతే, ఆ భూతం మనల్ని ఏం చేయలేదు. ఇక్కడ జయించాల్సింది భూతాన్ని కాదు… మన మనసుని.” ఈ డైలాగ్‌ స్క్రిప్ట్ కోర్ థీమ్ . మొత్తం కథ అక్కడికే లీడ్ అవుతుంది. ఇక క్లైమాక్స్ లో ఆలోచన ఉంది, కానీ ఇంపాక్ట్ తక్కువైంది. ఇక్కడే “ఇంకాస్త బెటర్‌గా చెప్పొచ్చు కదా” అనే అసంతృప్తి మిగులుతుంది.

టెక్నికల్ గా...

సింపుల్‌గా చెప్పాలంటే — టెక్నికల్ గా ‘శంబాల’ మిక్స్ ఫీలింగ్ ఇస్తుంది. ఇలాంటి సినిమాకు ప్రాణం బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ . శ్రీచరణ్ పాకాల ఇచ్చిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కొన్ని చోట్ల ఇంపాక్ట్ ఇస్తుంది కానీ ఎక్కువసార్లు లౌడ్‌గా అనిపిస్తుంది. భయాన్ని సైలెన్స్‌తో క్రియేట్ చేయాల్సిన సన్నివేశాల్లో మ్యూజిక్ ఓవర్‌గా వెళ్లింది. అయితే సినిమా మొదట్లో వచ్చే పాట మాత్రం హైలైట్. ఆరు కీలక పాత్రలను పరిచయం చేసే విధానం, వాటి స్వభావాన్ని లిరిక్స్‌తో చెప్పడం బాగా వర్క్ అయ్యింది.

ప్రవీణ్ కె. బంగారి సినిమాటోగ్రఫీ మంచి ప్లస్. ముఖ్యంగా నైట్ సీన్స్ చాలా బాగా వచ్చాయి. శంబాల ఊరి వాతావరణాన్ని కెమెరా బాగా పట్టుకుంది. ఎడిటింగ్ దగ్గరే సినిమా కొంచెం తగ్గింది. ఫస్ట్ హాఫ్‌లో కొన్ని సన్నివేశాలు లాగినట్టుగా అనిపిస్తాయి. కనీసం పది నిమిషాలు కట్ చేసి ఉంటే సినిమా ఫ్లో ఇంకా బెటర్‌గా ఉండేది. బడ్జెట్ పరిమితులు కూడా కనిపిస్తాయి. ఊరి బ్యాక్‌స్టోరీని యానిమేటెడ్, AI విజువల్స్‌తో చెప్పడం సరే కానీ ఇంకాస్త క్వాలిటీ ఉంటే సినిమా లుక్ మరింత రిచ్‌గా ఉండేది.

నటనల విషయానికి వస్తే...

విక్రమ్ పాత్రలో ఆది సాయికుమార్ బాగానే నటించాడు. ఎక్కువ సన్నివేశాల్లో కాన్ఫిడెంట్‌గా కనిపిస్తాడు. అర్చనా అయ్యర్‌కు సెకండాఫ్‌లో మంచి స్కోప్ దొరికింది. ఆ అవకాశాన్ని డీసెంట్‌గా ఉపయోగించుకుంది. మధునందన్ తన కీలక పాత్రలో అన్ని ఎమోషన్స్‌ను ఈజ్‌గా హ్యాండిల్ చేశాడు. రవివర్మ భయానక పాత్రలో సరిగా సెట్ అయ్యాడు. సీనియర్ నటి అన్నపూర్ణమ్మ అనుభవంతో పాత్రకు వెయిట్ ఇచ్చింది. హర్షవర్ధన్, ప్రవీణ్ ఇద్దరూ తక్కువ సీన్స్‌లోనే గుర్తుండిపోయేలా చేశారు. చిన్నపాప పాత్రలో నటించిన చైల్డ్ ఆర్టిస్ట్ కూడా తన పని బాగా చేసింది.

ఫైనల్ థాట్

శంబాల ఒక పరిపూర్ణ సినిమా కాదు. కానీ పరిపూర్ణంగా ఆలోచించిన సినిమా. ఇటీవల ఆది సాయికుమార్ చేసిన సినిమాల కంటే ఇది స్పష్టంగా ఒక మెట్టు పైన ఉందనే చెప్పాలి. మిస్టిక్, మైథాలజీ, సైన్స్–నమ్మకాల మధ్య ఘర్షణ ఇష్టపడే ప్రేక్షకులకు – ఇది డిస్కషన్ లోకి నెట్టే సినిమా. మిస్టిక్ థ్రిల్లర్స్, డిఫరెంట్ కాన్సెప్ట్ సినిమాలు ఇష్టపడేవాళ్లకు ‘శంబాల’ ఒకసారి చూసేలా ఉంటుంది. కొత్తదనం కోసం ప్రయత్నించిన నిజాయితీ మాత్రం ఈ సినిమాకి పెద్ద ప్లస్.

Read More
Next Story