'రుద్రవీణ' నే చూడలేదు...ఈ ‘డ్రై డే’లు ఓ లెక్కా?
‘రుద్రవీణ’ను గుర్తు చేసిన డ్రైడే. ప్రేక్షక దేవుళ్లను రుద్రవీణే మెప్పించలేకపోయింది. మరి అదే థీమ్‌తో వచ్చిన డ్రైడే పరిస్థితి ఏంటో..
ఓ సినిమా చూస్తుంటే సిమిలర్ కాన్సెప్టు ఉండే మరో సినిమా గుర్తుకు రావడాన్ని మనం చాలా సార్లు గమనించే ఉంటాం. అరే ఇది ఫలానా సినిమాలా ఉందే అనిపిస్తుంది. అది గొప్ప సినిమా అయితే అటువైపే మనస్సు పోతుంది. ఇలా డ్రై డే అనే ఈ సినిమా చూస్తుంటే ...అప్పట్లో చిరంజీవి, శోభన కాంబినేషన్‌లో కె.బాలచందర్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'రుద్రవీణ' యధాలాపంగా గుర్తు వచ్చింది. ముందు డ్రై డే గురించి కాస్త ‘డ్రై’గా మాట్లాడుకుని అప్పుడు 'రుద్రవీణ' మధురానుభూతిని గుర్తు చేసుకుందాం.
అప్పడెప్పుడో ప్రముఖ రచయిత , దర్శకుడు, నిర్మాత అయిన చక్రపాణి ఓ మాట అన్నారు. 'మెసేజ్ ఇవ్వడానికి సినిమా తీసే కన్నా, టెలిగ్రామ్ పంపితే చౌక కదా!' అని. ఆ మాటలు ఆయన ఛలోక్తి విసిరినా అందులో రవ్వంతైనా అబ్బద్దం లేదని చాలా సినిమాలు అప్పుడు ఇప్పుడు ఎప్పుడూ ప్రూవ్ చేస్తూనే ఉన్నాయి. మెసేజ్ కోసం టైమ్, డబ్బు ఖర్చు పెట్టి సినిమా చూడటానికి ఎవరూ ఆసక్తి చూపడం లేదు. అయినా ఉత్సాహవంతులు మెసేజ్‌లతో మసాజులు చేస్తూనే ఉన్నారు. లోపల మెసేజ్ ఉందని తెలియక ...ట్రైలర్ చూసి ఏదో కొత్త సినిమా చూడబోతున్నామని ఉత్సాహపడి దెబ్బతినటం ఆ తర్వాత తిట్టుకోవటం పరిపాటిగా జరుగుతూనే ఉంది. తాజాగా ఆ లిస్ట్‌లోకి ‘డ్రై డే’అనే చిత్రం చేరింది.
"డ్రై డే" అనేది సాధారణంగా మద్యం అమ్మకం నిషేధించబడిన రోజు. జనవరి 26, ఆగస్ట్ 15, అక్టోబర్ 2 తేదీల్లో దేశవ్యాప్తంగా లిక్కర్ హాలీడే కాబట్టి ఆ రోజుల్లో డ్రై డే నడుస్తుంది. అలాగే దేశంలోని వివిధ రాష్ట్రాల్లో వివిధ సమయాల్లో ప్రత్యేకంగా హాలిడేలను ప్రకటిస్తుంటారు. ఆయా రోజుల్లో ఆ రాష్ట్రం పరిధిలో డ్రై డే ఉంటుంది. అదే డ్రై డే ని ఓ పల్లెటూళ్లో ఒకడు అమలు చేయాలని మొదలెడితే వచ్చే పర్యవసానాలు ఏమిటనేది పాయింట్‌గా ఈ సినిమా కథ రాశారు. 2023 డిసెంబర్‌లో వచ్చిన ఈ సినిమాను అమేజాన్ వాడు ఇన్నాళ్లకు తెలుగులోకి డబ్ చేసి వదిలాడు. తెలుగులో పెట్టాక వదులు తామా… అసలు అందులో మేటర్ ఏముందో ఓ లుక్కేయాలి కదా .
ఈ చిత్రం కథ చూస్తే .. జోగేందర్ అనే కల్పిత గ్రామం. అక్కడ మద్యం ఏరులై పారుతుంటుంది. లోకల్ పొలిటిషన్ ప్రజలను ఆకట్టుకోవడానికి మందుని చాలా చీప్ రేటుకు మంచినీళ్లలా అందిస్తుంటాడు. జనం కూడా తెల్లారగానే ముందే మందు షాప్ దగ్గర క్యూలో నిలబడాలనే నియమం పెట్టుకుని దాన్ని స్ట్రిక్ట్‌గా అమలు చేస్తుంటారు. యథాతథంగా ఆ ఊరి ఆడవాళ్లు తమ భర్తల చేత మద్యం మాన్పించే ప్రయత్నాలు చేసి విసిగి వేసారి ఉంటారు.
ఇలాంటి సెటప్‌లో ఆ పొలిటిషన్ దగ్గర గన్ను (జితేంద్ర కుమార్) ఓ గూండాకు నమ్మినబంటుగా, అనుచరుడుగా పని చేస్తుంటాడు. వాడి పని తినటం, తాగటం, అన్నట్లు సాగుతుంటుంది. వాళ్లావిడకు కడుపు రగిలిపోతూ ఉంటుంది. కానీ ఏం చెయ్యలేదు. ఆమెకు ఓ రోజు టైమ్ వస్తుంది. ఆమె గర్భవతి అవుతుంది. అప్పుడు భర్తతో ఓ మాట చెప్తుంది.
నువ్వు తాగుడు మాని, గౌరవంగా బ్రతకటం మొదలెట్టకపోతే అబార్షన్ చేయించుకుంటానంటుంది. నీలాంటి తాగుబోతు తన బిడ్డకు తండ్రిగా ఉండటం ఇష్టం లేదంటుంది. అదే సమయంలో ఓ రోజు మనవాడిని వాళ్ల బాస్ అదే పొలిటీషన్.. అవమానిస్తాడు. అప్పుడు గన్ను అటు భార్య మాటకు విలువిచ్చినట్లు ఉంటుంది.. ఇటు తనను అవమానం చేసిన వారికి బుద్ది చెప్పినట్లు ఉంటుందని ఆలోచించి కార్పొరేటర్ అవ్వాలని ఫిక్స్ అవుతాడు. కానీ అతనికి ఓట్లు ఎవరు వేస్తారు. అప్పుడు అక్కడ లోకల్ జనాలకు ఏం కావాలో అర్థం చేసుకుంటాడు. అంతే ఓ స్ట్రాటజీ అమలు చేస్తాడు. అదే.. మద్యపాన నిషేధం. ఒకే దెబ్బకు రెండు పిట్టలు. అటు తనకు పబ్లిసిటీ వస్తుంది.. మరో పక్క తన మాజీ బాస్‌ని దెబ్బకొట్టినట్లు అవుతుంది అని ప్లాన్ చేస్తాడు.
అక్కడ లోకల్‌గా మధ్యపాన నిషేధం వచ్చేదాకా తాను నిరాహార దీక్ష చేస్తానని ప్రకటించి దీక్షలో కూర్చుంటాడు. తనే స్వయంగా తాగుబోతు కావటంతో మొదట చాలా ఇబ్బందిగా ఉంటుంది. అలవాటైన తాగుడు మానేయడంతో ఆ సిమ్‌టమ్స్ వస్తూంటాయి. అయినా పట్టుదలగా కూర్చుంటాడు. మెల్లిమెల్లిగా ఆ ఊరు ఆడవాళ్లు అతన్ని గుర్తించి తమ గ్రామం పాలిట దేవదూతలా ఫీలై అతనికి సపోర్ట్ చేయడం మొదలెడతారు. అప్పుడు ఏమైంది.. చివరికి మన గన్ను.. కార్పోరేటర్ అయ్యాడా., లోకల్ పొలిటిషన్ ఊరుకున్నాడా.. అనేది మిగతా కథ. స్టోరీ లైన్‌గా బాగున్నా ఈ కథని దర్శకుడు, రచయిత, నటుడు సౌరబ్ శుక్లా సరిగ్గా డీల్ చేయలేకపోయారు. ఎక్కువ మెసేజ్‌లతో నింపేసాడు. సెటైర్‌గా తీద్దామనుకున్న ఈ సినిమా గురించి ఇంతకు మించి డిస్కస్ చేయడానికి కూడా వీలు లేనంత విసుగ్గా తయారైంది.
ఈ సినిమాతో పోలిక కాదు.. సినిమాలో మధ్యపాన నిషేధం అనగానే అప్పట్లో చిరంజీవి నటించిన రుద్రవీణ సినిమా గుర్తు వస్తుంది హీరో సూర్యం తన ఊరిలో మద్యపానాన్ని మాన్పించడానికి తన ప్రేమను, పెళ్లిని పణంగా పెడతాడు. చిరంజీవి తమ సొంత సంస్థ ‘అంజనా ప్రొడక్షన్స్’ పతాకంపై తొలి చిత్రంగా ‘రుద్రవీణ’ను నిర్మించారు. ఈ సినిమా సైతం అవార్డులకే పరిమితమయింది కానీ, ప్రేక్షకుల రివార్డులు పొందలేక పోయింది.
ఆ సినిమా కథ ప్రకారం... సంగీత విద్వాంసులు ‘బిలహరి’ గణపతి శాస్త్రి చిన్నకొడుకు సూర్యనారాయణ శాస్త్రి.. సాటి మనిషికి సాయం చేయడంలోనే ఆనందముందనే అతను వరాలయ్య అనే లాయర్ కూతురు లలిత శివజ్యోతితో ప్రేమలో పడతాడు. ఆ అమ్మాయిది తమ కులం కాదని వారి పెళ్ళికి గణపతి శాస్త్రి ఒప్పుకోడు. తమ పెళ్ళిని ఆమోదించని తండ్రితో విభేదించి లలితను పెళ్ళాడాలనుకుంటాడు సూర్యం. అయితే అంతకు ముందే ఆ ఊరిలో తాగుబోతులకు, మద్యం దుకాణం దారుకు తగిన బుద్ధి చెప్పి ఉంటాడు సూర్యం.
ఆ విషయం తెలిసి, గణపతి శాస్త్రి ఎలాగైనా తన కొడుకు పెళ్ళి లలితతో జరగకూడదని, వారిని రెచ్చగొడతాడు. వారు వెళ్ళి, సూర్యం పెళ్ళిలో గొడవ చేస్తారు. మీకేం కావాలని సూర్యం అడిగితే... మీరు ఈ పెళ్ళి చేసుకోకపోతే తాము మందు ముట్టమని తాగుబోతులు అంటారు. అలాగే మద్యం షాపువాడు కూడా... పెళ్ళి మానేస్తే ఈ ఊళ్ళోనే కాదు, చుట్టుపక్కల ఎక్కడా తమ వాళ్ళ మద్యం దుకాణాలు ఉండకుండా చేస్తానని సవాల్ చేస్తాడు. అందుకు సూర్యం, లలిత అంగీకరిస్తారు. వారి నిర్ణయంతో ఊరిలోని తాగుబోతుల్లో మార్పు వస్తుంది. ఆ ఊరి జనం కలసి మెలిసి వ్యవసాయం చేసుకుంటూ ఊరిని సమష్టిగా అభివృద్ధి చేసుకుంటారు. ఇంత ఉదాత్తమైన కథను చిరంజీవి, శోభన, జెమినీ గణేశన్ వంటి హేమా హేమీలతో బాలచందర్ చేస్తేనే ఆదరించలేదు.
ఆ సినిమాలో పాటలన్నీ సూపర్ హిట్టే. ఇప్పటికీ ఎక్కడో చోట వినపడుతూనే ఉంటాయి. “లలిత ప్రియకమలం…”, “నమ్మకు నమ్మకు ఈ రేయిని…”, “తరలిరాద తనే వసంతం…”, “చెప్పాలని ఉంది…”, “చుట్టూ పక్కల చూడరా చిన్నవాడా…”, “నీతోనే ఆగేనా సంగీతం…”, “తులసీ దళములచే…”, “రండి రండి…”, “మానవసేవయే…” అంటూ సాగే పాటలు అలరించాయి.
ఈ సినిమాకు ఉత్తమ సంగీత దర్శకునిగా ఇళయరాజాకు నంది అవార్డుతో పాటు నేషనల్ అవార్డు కూడా లభించింది. ఉత్తమ సంభాషణల రచయితగా గణేశ్ పాత్రో, ఉత్తమ శబ్ధగ్రాహకునిగా పాండురంగం, ప్రత్యేక జ్యూరీ అవార్డుతో నాగబాబు.. నంది అవార్డులు అందుకున్నారు. ఇందులోని “చెప్పాలని ఉంది… గొంతు విప్పాలని ఉంది…” అంటూ సాగే పాటను పాడిన ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం జాతీయ స్థాయిలో ఉత్తమ గాయకునిగా నిలిచారు. అలాగే ఈ సినిమాకు ‘ఉత్తమ జాతీయ సమైక్యతా చిత్రం’ విభాగంలో ప్రదానం చేసే ‘నర్గీస్ దత్ అవార్డు’ లభించింది.
అయితే మరో విషయం ‘రుద్రవీణ’ గురించే… ఈ చిత్రం తెలుగులో ఆశించిన స్థాయిలో ఆకట్టుకోక పోవడంతో ఇదే కథతో కె.బాలచందర్ తమిళంలో కమల్ హాసన్ హీరోగా ‘ఉన్నై ముడియుమ్ తంబి’ చిత్రాన్ని తెరకెక్కించారు. అయితే అక్కడా జస్ట్ ఓకే అనిపించిందంతే!
ఇదంతా చదివాక.. రుద్రవీణ మళ్లీ చూడాలనిపిస్తోందా.. అయితే చూసేయండి… ఈ సారి ఇంకా బాగా నచ్చుతుందేమో.
‘డ్రై డే’ ఎక్కడ స్ట్రీమింగ్ అవుతోంది ?
అమేజాన్ ప్రైమ్‌లో తెలుగులో