
రివ్యూ: రవితేజ 'మాస్ జాతర'
మాస్ మ్యాడ్‌నెస్ మిస్!
తెలంగాణ పోలీస్ డిపార్ట్‌మెంట్‌లో నిజాయితీకి మరో పేరు లక్ష్మణ్ భేరి (రవితేజ). అన్యాయం కళ్లపడితే పట్టాల్ని పక్కనపెట్టి రూల్స్‌ని రాస్తాడు. వాళ్ల అంతుచూస్తూంటాడు. వరంగల్‌లో ఓ మంత్రి కొడుకు అడ్డంగా తిరిగితే… సూటిగా బుద్ధి చెప్పిన భేరి… వెంటనే అల్లూరి జిల్లాలోని అడవివరంకి ట్రాన్స్‌ఫర్!
అడవివరం ...ఒక పచ్చని అడవి… భయంతో నిండిన గాలి… అక్కడ చట్టం IPS కాదు… ఇక్కడి చక్రవర్తి– శివుడు (నవీన్ చంద్ర). అక్కడ లోకల్ జనం పండించేది పంట కాదు… గంజాయిని . పత్తి గింజలా పెట్టుబడి, కానీ వేల కోట్లు రాబడే శివుడి షీలావతి గాంజా రూట్ — అడవివరం నుంచి నేరుగా కోల్‌కతా వరకూ!
అక్కడ అడుగు పెట్టిన క్షణం నుంచే లక్ష్మణ్‌కు టార్గెట్ క్లియర్ — “ఇక్కడ పోలీస్ యూనిఫాం విలువ బుల్లెట్‌కన్నా తక్కువ.” డీఎస్పీలు, ఎస్పీలు, సీరియర్ అధికారులు — ఎవరు చూసినా శివుడి హద్దులో తలదించుకుని నడుస్తున్నారు. కానీ భయపడటం లక్ష్మణ్ రక్తంలోనే లేదు. రైలు బోగీల్లో దాగిన గంజా ట్రాక్స్ గుర్తిస్తాడు. స్మగ్లింగ్ రూట్లను బ్లాక్ చేస్తాడు. శివుడి సామ్రాజ్యానికి పగుళ్లు మొదలవుతాయి.
కానీ శివుడు ఊరుకుంటాడా...జాతర రోజే లక్ష్మణ్ ని బలి ఇస్తానని ప్రతిజ్ఞ చేస్తాడు. ఈ లోగా శివుడు అమ్మాలని చూసిన ఒక భారీ గంజాయి లోడ్‌ను లక్ష్మణ్ చాకచక్యంగా మాయం చేస్తాడు. అప్పుడు ఏమైంది..లక్ష్మణ్ ఏం చేసాడు.. అలాగే టీచర్ గా పనిచేసే తులసి (శ్రీలీల) పాత్రలో దాగి ఉన్న ట్విస్ట్ ఏమిటి..కథలో హనుమాన్ భేరి (రాజేంద్ర ప్రసాద్) పాత్ర ఏమిటి? వంటి విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
ఎలా ఉంది
వింటేజ్ రవితేజను చూపాలన్న తాపత్రయంతో వింటేజ్ కథనే తెచ్చి మన ముందు పెట్టారు. ఎప్పుడైతే స్టోరీ లైన్ లోనే పాతదనం కొట్టిమిట్టాడుతుందో అప్పుడే సీన్స్, డైలాగులు అన్ని పాత వాసన కొట్టేస్తూంటాయి. దాంతో దర్శక,రచయితలలో ఎంత టాలెంట్ ఉన్నా , ఎంత ప్రతిభా ప్రదర్శన చేద్దామనుకున్నా అవన్నీ పాతదనం, రొట్టకొట్టడు అనేదాంట్లో కొట్టుకుపోతాయి. అదే ఈ సినిమాకు జరిగింది. ఈ ఓటిటి యుగంలో మాస్ సినిమా వంకతో మాసిన సినిమాని చూపెట్టడం కుదరదు. అలాగే ఇలాంటి కథకు స్క్రీన్ ప్లే చేయటమూ చాలా కష్టమే. ఎందుకంటే రొటీన్ కథ, సీన్స్ అని ఖచ్చితంగా రాసేవాళ్లకు తెలుస్తూంటుంది. దాన్ని దాటాలనే ప్రయత్నంలో ఇంకా ఏమోమో వేరేవి జరిగిపోతూంటాయి.
ఇది చాలదన్నట్లు రొటీన్ టెంప్లేట్ లోనే ఈ కథను చెప్పారు. ‘క్రాక్’, ‘పవర్’, ‘విక్రమార్కుడు’.. లను గుర్తు చేసేలా సీన్స్ రాసుకున్నారు. సీనియర్స్ ఓ మాట చెప్తూంటారు... పాత కథను కొత్తగా, కొత్త కథను తెలిసిన విధానంలో చెప్పమంటారు. కానీ ఈ సినిమాలో హీరో ఎలివేషన్స్, కామెడీ , ఫైట్స్, పాటలు,ఇలా వరసగా ఓ పద్దతి ప్రకారం టెంప్లేట్ లో వచ్చేస్తూంటాయి.
అవి చూసేటప్పుడు ఓకే అనిపించినా, వింటేజ్ మూమెంట్స్ నోస్టాల్జియా ని గుర్తు చేసినా , చూడటం పూర్తి చేసాక, ఏం చూసాము అంటే ఏమీ గుర్తుకు రాని పరిస్దితి తెస్తాయి. మేకర్స్ అనుకోవచ్చు...రవితేజ సినిమాల్లో ఇంకా కొత్తదనం వెతకటం ఏమిటి అని...కానీ ఎంటర్టైన్మెంట్ కు రకరకాల ఆప్షన్స్ ఉన్న ఈ రోజుల్లో కొత్తదనం ఎంతోకొంత ఉండాల్సిందే. ప్రతీ రొటీన్ కథా థమాకా లా భాక్సాఫీస్ దగ్గర అద్బుతాలు సృష్టించదు.
టెక్నికల్ గా..
సినిమాకు పెద్ద ప్లస్ పాయింట్ విధు అయ్యన్న సినిమాటోగ్రఫీ. ప్రతి ఫ్రేమ్ జాగ్రత్తగా చెక్కినట్లు అనిపిస్తుంది. ఆయన వర్క్ తో మిగతా డిపార్టమెంట్ లు పోటీ పడలేకపోయాయి. ఇక దర్శకుడుగా భాను కు రొటీన్ కథ సహకరించలేదు కానీ కొన్ని చోట్ల డైరక్టర్ టచ్ స్పార్క్ మెరుస్తూంటుంది. మంచి కథ పడితే కమర్షియల్ డైరక్టర్ అవుతాడు అనిపిస్తుంది. ఇక ఈ సినిమాలో నందు డైలాగులు ఈ కాలం ప్రేక్షకుడికి తగినట్లు బాగున్నాయి.
ట్విట్టర్ లో ఫ్యాన్ వార్స్ మీద రాసిన డైలాగులు బాగా వర్కవుట్ అయ్యాయి. అయితే అవి క్రింద వర్గానికి ఎంతవరకూ రీచ్ ఉంటుందో చూడాలి. కామెడీతో పాటు,ఎమోషన్ బాగా రాసారు. ఇక ఈ సినిమాకు ప్లస్ అవుతాడు అనుకున్న భీమ్స్ సిసిరోలియో పెద్ద మైనస్ అయ్యారు. పాటలు కానీ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కూడా లౌడ్ గా వినిపించింది. ఎడిటింగ్ విషయానికి వస్తే మరికాస్త షార్ప్ ఎడిటింగ్ అవసరం అనిపించింది. ప్రొడక్షన్ వాల్యూస్ బ్యానర్ కు తగినట్లు బాగున్నాయి.
నటీనటుల్లో ...
రవితేజ ఎనర్జీకు కేరాఫ్ ఎడ్రస్..ఇడియట్ నాటి రోజులను తలపించాలని చూసారు. కొంతవరకూ సక్సెస్ అయ్యారు. శ్రీలీల గ్లామర్ పరంగా ఓకే,రాజేంద్రప్రసాద్ ట్రాక్ అనుకున్న స్దాయిలో పేలలేదు. విలన్ గా నవీన్ చంద్ర కొత్తగా అనిపించాడు.
ఫైనల్ థాట్
మాస్ జాతర.. మాస్ కమర్షియల్ సినిమాలు చూస్తూ ఎంజాయ్ చేసేవాళ్లకు నచ్చుతుంది. టైటిల్ జస్టిఫై అవుతుంది. రవితేజ అభిమానులు వింటేజ్ రవితేజను చూసి ఎంజాయ్ చేస్తారు. మిగతా వాళ్లకు...అక్కడక్కడా కొన్ని ఎపిసోడ్స్ నవ్విస్తాయి..కనెక్ట్ అవుతూంటాయి..అంతే.

