బుల్లి తెర శ్రీరాముడు అరుణ్ గోవిల్ జీవితంలో అరుదైన ఘట్టాలు
రాముడి పాత్రకు ఎంపిక చేసే ముందు అరుణ్ గోవిల్ కు ఓ కండీషన్ పెట్టి దూరదర్శన్ రామాయణ్ దర్శకుడు రామానంద్ సాగర్ ఓకే చేసారు. ఆ కండిషన్ ఏమిటి, దాని పర్యవనాసారాలేమిటి?
-జోశ్యుల సూర్యప్రకాశ్
1987-1988నాటి దూరదర్శన్ పాపులర్ సిరీస్ ‘రామాయణం’లో అరుణ్ రాముడిగా నటించిన సంగతి తెలిసిందే. సీతగా దీపిక చిఖాలియా, లక్ష్మణుడిగా సునీల్ లాహిరి కనిపించారు. అప్పట్లో ఈ సిరీస్ విశేషమైన ప్రేక్షకాదరణ పొందింది. హిందీలో రూపొందించిన ఈ సీరియల్ పలు భాషల్లోకి అనువాదమై భారత్‌తోపాటు ఓవర్సీస్‌లోనూ అభిమానాన్ని కూడగట్టుకున్న విషయం తెలిసిందే.
ఆ సిరీస్ ప్రసారమై ఏళ్లు గడుస్తున్నా.. ఆ నటులను అభిమానులు ఇంకా గుర్తుచేసుకుంటూనే ఉంటారు. అందులో రాముడు, లక్ష్మణుడు, సీత పాత్రలను పోషించినవారిని నిజమైన దేవుళ్లుగా ఆరాధించే అభిమానులు ఇప్పటికి కూడా ఉన్నారు. అంతలా వారు ఆ పాత్రలో లీనమై కనిపిస్తారు. ముఖ్యంగా ‘రామాయణ్’ (1987) లో శ్రీరాముడి పాత్ర పోషించి, విశేష గుర్తింపు పొందిన నటుడు అరుణ్ గోవిల్. శ్రీరాముడు అంటే అరుణ్ అనేంతగా ప్రతిభ చూపారాయన. అలా బుల్లితెర ప్రేక్షకుల్ని ఎంతగానో అలరించిన ఆయన మొదట ఆ పాత్రకు రిజెక్ట్ అయ్యారు. అయితే ఓ కండీషన్ తో రామానంద్ సాగర్ ఓకే చేసారు. అప్పుడేం జరిగింది...దర్శకుడు రామానంద్ సాగర్ ఏమి కండీషన్ పెట్టారో గుర్తు చేసుకుందాం.
స్కూల్ రోజుల నుంచి అరుణ్ గోవిల్ కు నటన అంటే చాలా ఇష్టం. కాలేజీ రోజుల్లో నాటకాలు కూడా వేసారు. అదే సమయంలో తన సోదరుడుతో కలిసి బిజినెస్ కూడా చేసేవారు. బిజినెస్ చేసేటప్పుడు కూడా నాటకాల్లో నటనను మరవలేదు.1977లో బాలీవుడ్ లో తన మొదటి చిత్రం పహేలీ చేసారు. 'సావన్ కో ఆనే దో', 'అయ్యాష్', 'భూమి', 'హిమ్మత్వాలా', 'దో ఆంఖేన్ బరాహ్ హాత్' మరియు 'లవ్ కుష్' వంటి చిత్రాలలో సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్నారు.. అయితే టీవీల్లో ప్రవేశించింది మాత్రం రామానంద్ సాగర్ షో విక్రమ్ భేతాల్ (1985)తోనే.
ఇక ఆ తర్వాత రామానంద్ సాగర్...రామాయణ కథతో ఓ సీరియల్ చేయబోతున్నారని తెలిసి సంప్రదించారు. ఆడిషన్ ఇవ్వమంటే ఇచ్చారు. ఆడిషన్ లో అద్బుతంగా సెట్ అయ్యారు రాముడు పాత్రకు అనుకున్నారు. కానీ రామానంద్ సాగర్ రిజెస్ట్ చేసారు. ఎందుకంటే రాముడు పాత్ర వేసేవారు చాలా నియమ నిష్టలు ఉండాలి అని. అరుణ్ గోవిల్ అప్పటికే చైన్ స్మోకర్. దాంతో వద్దన్నారు. కానీ అరుణ్ గోవీల్ హామీ ఇచ్చిన తర్వాత ఓకే చేసారు. 1987లో షూటింగ్ ప్రారంభమైంది.
అయితే సిగరెట్ల విషయంలో రామానంద్ సాగర్ కు ఇచ్చిన మాటను అరుణ్ గోవిల్ నిలబెట్టుకోలేకపోయారు. షూటింగ్ బ్రేక్ లో ...ప్రక్కకు వెళ్లి సిగరెట్లు కాల్చేవారు. అయితే మొదట్లో ఎవరూ పట్టించుకోలేదు కానీ...టీవీలో రావటం మొదలయ్యాక సమస్య వచ్చింది. రామాయణానికి ఊహించని ఆదరణ లభించడంతో అందులోని నటులు చాలా పాపులర్ అయ్యారు .
రాముడిగా నటించిన అరుణ్ గోవిల్ ని ఎవరైనా బయిట చూసినప్పుడు, వెంటనే వెళ్లి అతని పాదాలను తాకేవారు. ప్రజలు అతనిలో రాముడిని చూడటం ప్రారంభించారు. ఆ విషయం గుర్తు చేసుకుంటూ అరుణ్ గోవిల్ చెప్పారు. "షూటింగ్‌కి విరామం దొరికిన వెంటనే సెట్‌లో తెర వెనుకకు వెళ్లి సిగరెట్ తాగడం మొదలుపెట్టాను. ఒక అపరిచితుడు నా దగ్గరకు వచ్చి చాలా కోపంగా నా వంక చూసాడు. తర్వాత తన భాషలో నాతో ఏదో చెప్పడం ప్రారంభించాడు. ఆ వ్యక్తి మిమ్మల్ని రాముడిగా భావిస్తున్నామని, మీరు ఇక్కడ సిగరెట్ తాగుతున్నారని చెప్పారు. నేను అతని మాటలతో కదిలిపోయాను. అప్పటి నుంచి రోజు వరకు నేను ఎప్పుడూ సిగరెట్ ముట్టుకోలేదు" అని చెప్పారు
ఈ మధ్యన కూడా అరుణ్ గోవిల్ ఓ విమానాశ్రయంలో కనిపించగా.. ఆయన్ను చూసిన ఓ భక్తురాలు పరవశించిపోయింది. ఆయన్ను రాముడిగానే భావిస్తూ పాదాభివందనం చేసింది. భావోద్వేగానికి గురై దండం పెట్టుకుంటూ పలుమార్లు ఆయన పాదాలకు నమస్కరించింది. విమానాశ్రయంలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. రాముడంటే రాముడే... ఆయన వేషం వేసినా ఆయన్నే మనం చూస్తాం ఆరాధిస్తాం...
ఇత హిందీ, భోజ్‌పురి, ఒరియా, తెలుగు తదితర భాషల్లో అరుణ్ నటించారు. సీరియల్, సినిమా.. మాధ్యమం ఏదైనా తన మార్క్ చూపించి మెప్పించారు. నాగార్జున హీరోగా తెరకెక్కిన ‘గోవిందా గోవిందా’ చిత్రంలో శ్రీ మహా విష్ణువు పాత్ర పోషించి, తెలుగు ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నారు. నటుడిగానే కాకుండా నిర్మాత, రాజకీయవేత్తగానూ తనదైన ముద్రవేశారు.
రామానంద్ సాగర్ దర్శకత్వం వహించి, నిర్మించిన ఈ టీవీ సిరీస్ 1987లో మొదట దూరదర్శన్‌లో ప్రసారమైంది. ఈ సిరీస్‌ను అభిమానులు విశేషంగా ఆదరించారు. ఆపై 33ఏళ్ల తర్వాత 2020లో కొవిడ్ లాక్‌డౌన్‌లో తిరిగి ప్రసారం చేయగా.. ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా వీక్షించిన వినోద కార్యక్రమంగా ప్రపంచ రికార్డును నెలకొల్పింది. 2020 ఏప్రిల్ 16న ప్రసారమైన ఈ సిరీస్‌ను ఏకంగా 7.7కోట్ల మంది వీక్షించారు.