శభాష్ “టైగర్ నాగేశ్వరరావు”.. నీ ప్రయోగం చరిత్ర గుర్తిస్తుంది
మనలో చాలా మందిమి మాట్లాడటం, వినటం రెండూ చేయగలం. అయితే వినలేని, మాట్లాడలేని బధిరుల పరిస్థితేంటి? వారు సినిమాలు చూడాలంటే...? ఇలాంటి వారి కోసం పుట్టినదే..
మనలో చాలా మందిమి మాట్లాడటం, వినటం రెండూ చేయగలం. అయితే వినలేని, మాట్లాడలేని బధిరుల పరిస్థితేంటి? వారు సినిమాలు చూడాలంటే...? ఇలాంటి వారి కోసం పుట్టినదే సంకేత భాష (sign language). ప్రపంచవ్యాప్తంగా 7 కోట్ల మందికిపైగా బధిరులు (deaf people) ఉన్నారు. వారు 300కు పైగా సంకేత భాషల్ని (sign languages) వాడుతున్నారు. కొన్ని న్యూస్ ఛానెళ్లు కూడా బధిరుల కోసం ప్రత్యేక బులిటెన్లు ఇస్తున్నాయి. అలాగే ఇప్పుడు సినిమాలను సైతం వారి సంకేత భాషలోకి మార్చి అందించటం మొదలైంది. ఇది ఖచ్చితంగా ఆహ్వానించాల్సిన ఓ కొత్త ప్రయత్నం.
ఓటిటిలు వచ్చాక మాగ్జిమం సినిమాలు ఈ రోజు ఇతర భాషల్లోకి డబ్బింగ్ అవుతున్నాయి. తమిళ, మళయాలం, హిందీ, ఇంగ్లీష్, తెలుగు ఇలా ప్రధాన భాషల్లోకి సినిమాలు వెళ్తున్నాయి. ఇలా ఒక చోట తయారైన సినిమా భాషతో సంబంధం లేకుండా ప్రపంచవ్యాప్తంగా అందరికీ అందుబాటులోకి వస్తోంది. అయితే ఒక భాషని మాత్రం పట్టించుకోవటం లేదు. అదే ఇండియన్ సైన్ లాంగ్వేజ్.
Deaf Community ని మనం అంతా విస్మరిస్తున్నాం. అయితే ఇప్పుడిప్పుడే అవగాహన వస్తోంది. మిగతా భాషలతోపాటు ఈ సంకేత భాషకు కూడా ప్రయారిటీ ఇస్తూ హిందీలో ఇప్పటికే కొన్ని సినిమాలు ఆ భాషలోకు మార్చి అందిస్తున్నారు. ఇతర భాషల లాగానే ఈ భాషని సినిమా వాళ్లు గుర్తించాల్సిన సమయం వచ్చింది. వాళ్లకి మనకి ఉన్న ఆ గ్యాప్‌ని పూడ్చాలి. వారికి మన సినిమాలు చూసే అవకాశం, గౌరవం కలిపించాలి.
Koshish (1972), Black (2005), Iqbal (2005), Barfi! (2012), Bajrangi Bhaijaan (2015) వంటి సూపర్ హిట్ బాలీవుడ్ సినిమాల్లో ఇంతకు ముందు సైన్ లాంగ్వేజ్‌ని కథలో భాగంగా చూపించారు. అయితే బధిరులు కోసం సైన్ లాంగ్వేజ్‌లో సినిమాలు రిలీజ్ చేయటం మాత్రం ఇప్పుడిప్పుడే జరుగుతోంది.
క్రితం సంవత్సరం వచ్చిన 83 అనే సినిమాను సూడా సైన్ లాంగ్వేజ్‌లో రిలీజ్ చేశారు. 1983లో భారత క్రికెట్ జట్టు (Indian Cricket Team) తొలి ప్రపంచకప్ అందుకోవడం ఆధారంగా రూపొందించిన చిత్రం 83. క్రికెట్ దిగ్గజం కపిల్‌దేవ్ (Kapil Dev) జీవితం ఆధారంగా ఈ చిత్రం రూపొందిన ఈ చిత్రంలో కపిల్ పాత్రలో రణ్‌వీర్ సింగ్ (Ranveer Singh), ఆయన భార్య రోమి భాటియాగా దీపిక పదుకొణె(Deepika Padukone) నటించారు. హార్డీ సంధు, తాహీర్ రాజ్ భాసిన్, జీవా తదితరులు కీలకపాత్రలు పోషించారు . కబీర్ ఖాన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం క్రికెట్ అభిమానులను అలరించింది. ఇప్పుడు తెలుగులోనూ ఓ చిత్రం సైన్ లాంగ్వేజ్‌లో వచ్చి అందరి మన్ననలు పొందుతోంది.
మాస్ మహారాజ్ రవితేజ హీరోగా నటించిన రీసెంట్ చిత్రం “టైగర్ నాగేశ్వరరావు”ని సైన్ లాంగ్వేజ్‌లో రిలీజ్ చేశారు. దర్శకుడు వంశీతో చేసిన ఈ భారీ చిత్రం నిజ జీవిత సంఘటనల ఆధారంగా తెరకెక్కింది. ఈ చిత్రం రిలీజ్ సమయంలోనే మేకర్స్ ఈ సినిమాని పాన్ ఇండియా భాషలతో పాటుగా మరో ఇండియన్ భాషలో కూడా రిలీజ్ చేస్తున్నట్టుగా తెలిపారు. అదే “ఇండియన్ సైన్ లాంగ్వేజ్”.
ఈ వినూత్న ప్రయత్నానికి అప్పుడు చిత్ర యూనిట్‌కు మంచి ప్రశంసలు వచ్చాయి. అయితే ఇప్పుడు ఈ సైన్ లాంగ్వేజ్ వెర్షన్ ఓటిటి రిలీజ్‌కి వచ్చేసింది. ఈ సినిమా అన్ని భాషలు ఓటిటి హక్కులు సొంతం చేసుకున్న ప్రముఖ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియోలోనే ఇప్పుడు ఇది కూడా అందుబాటులోకి వచ్చింది. మరి ఈ వెర్షన్‌లో సినిమా ఎలా ఉందో తెలియాలి అంటే ఓసారి ప్రైమ్ వీడియోలో చూడవచ్చు. ఇక ఈ భారీ చిత్రంలో నుపుర్ సనన్, గాయత్రీ భరద్వాజ్‌లు నటించగా అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ వారు నిర్మాణం వహించారు.
టైగర్ నాగేశ్వరరావు (TNR) ఇండియన్ సైన్ లాంగ్వేజ్ (Indian Sign Language)లో విడుదలైయ్యే మొదటి భారతీయ తెలుగు చిత్రం. భారతీయ సినిమాలో ఇది నిజంగా స్వాగతించదగిన మార్పు. అలాగే మొదటి పాన్ ఇండియా సినిమాతోనే ఇలాంటి ప్రయత్నం చేసి రవితేజ రికార్డ్‌ని క్రియేట్ చేయబోతున్నారు అని నిర్మాతలు చెప్తున్నారు.
సంకేత భాషలో చేతులు, చేతి వేళ్లతోపాటూ కళ్లు ముఖ కవళికలు, శరీర హావభావాలు కూడా కీలకం. కనుబొమ్మలను కదపడం ద్వారా మాట్లాడతారు. అవును, కాదు అనే సమాధానాలకు కనుబొమ్మల్ని ఉపయోగిస్తారు. అలాగే ప్రతి సంకేతంలో సాధారణంగా ఐదు అంశాలుంటాయి. వాటిలో ఒక్కటి మారినా... మొత్తం అర్థం మారిపోతుంది. చేతి కదలికలో వచ్చే చిన్న తేడా కూడా మొత్తం అర్థాన్ని మార్చగలదు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఈ అంశాలను దృష్టిలో పెట్టుకని సినిమాలను ఆ భాషలో అందించాల్సి ఉంటుంది.
ప్రపంచవ్యాప్తంగా చాలా సంకేత భాషలున్నాయి. వాటిని ప్రాధాన్యాన్ని గుర్తిస్తూ... వాటిపై ప్రజల్లో అవగాహన కలిగించేందుకు ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 23ను అంతర్జాతీయ సంకేత భాషా దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. అలాగే దివ్యాంగులు (చెవిటివారు) కూడా అన్ని విషయాలూ తెలుసుకోవాలి. అది వారి హక్కు.. అంటూ ఐక్యరాజ్యసమితి (United Nations) సంకేత భాషలను ప్రోత్సహిస్తోంది. ఈ క్రమంలో సినిమావాళ్లూ ముందడుగు వేసి మరిన్ని సినిమాలను ఈ భాషలో అందించాల్సిన అవసరం ఉంది.