టెర్రరిస్ట్ బ్యాక్ డ్రాప్ యోధా మూవీ రివ్యూ
x

టెర్రరిస్ట్ బ్యాక్ డ్రాప్ 'యోధా' మూవీ రివ్యూ

మరో టెర్రరిస్ట్-హైజాక్, దేశభక్తి డ్రామా ‘యోధా’ అయితే, హాలీవుడ్ సినిమా నుంచి స్ఫూర్తి పొందినట్లు కనిపిస్తుంది. ఆరంభం అదిరింది, ఉత్కంఠ చల్ల బడింది తర్వాత.ఇలా..


పాకిస్తాన్ దేశంతో సంబంధం ఉన్న మరో టెర్రరిస్ట్ బ్యాక్ డ్రాప్ డ్రామా " యోధా". గతంలో పాకిస్తాన్ తో మిలిటరీ ఆపరేషన్ నేపథ్యంలో వచ్చిన "యూరి", అదే దేశం మీద ఎయిర్ ఫోర్స్ దాడి ఆధారంగా వచ్చిన ఫైటర్ , దాన్ని తెలుగు వర్షన్ ఆపరేషన్ వాలెంటైన్ లాంటిదే యోధా సినిమా. అయితే ఇది ఒక హైజాక్ డ్రామా. ఇద్దరు యువ దర్శకులు సాగర్ అంబ్రే, పుష్కర్ ఓజా తీసిన సినిమా కొంచెం కొత్త పాయింట్ తో, ఒకటి రెండు ట్విస్టులతో ఆసక్తికరంగానే అనిపించినప్పటికీ కొన్ని సన్నివేశాలు ఎక్కువ సేపు చిత్రీకరించడం వల్ల కొంత నిదానించి, ఆసక్తిని తగ్గిస్తుంది. ఈ సినిమాలో ఒక ప్రేమ కథ కూడా కొంచెం సేపు నడుస్తుంది. అది కొంతవరకు ఓకే. గ్రౌండ్ లెవెల్ నుంచి, కథ ఏరోప్లేన్లోకి వచ్చిన తర్వాత మళ్లీ కొంత వేగంగా నడుస్తుంది. ఇంతకుముందు విక్రమ్ బత్ర జీవితం ఆధారంగా వచ్చిన "షేర్ షా" సినిమాలో నటించిన సిద్ధార్థ మల్హోత్రా, ఈ సినిమాలో కూడా ఒక కమాండో గా నటించాడు. యాక్షన్ సన్నివేశాల్లో మెప్పించాడు.

ఆ హాలీవుడ్ సినిమా నుంచి స్ఫూర్తి ??
ఈ సినిమా కథ 2014లో వచ్చిన లియాం నీసన్ హైజాక్ డ్రామా " నాన్ స్టాప్" ను పోలి ఉండడం యాదృచ్ఛికమేమీ కాదు. చాలా సన్నివేశాలు దాని ఆధారంగానే అల్లుకున్నట్లు అనిపిస్తుంది. ఈ సినిమా కథ గురించి చెప్పాలంటే ఇది "యోధ" అనే ఒక ప్రత్యేక టీం లో భాగమైన కమాండో అరుణ్ కాత్యాల్(సిద్ధార్థ్ మల్హోత్రా) కథ.అరుణ్ తండ్రి కూడా యోధా టీంలో ఒక కమాండో గా పనిచేసే అమరవీరుడై ఉంటాడు. ఒక అసైన్మెంట్లో అరుణ్ దుడుకుతనం వల్ల భారతదేశానికి చెందిన సైంటిస్ట్ ను ప్లేన్ హైజాక్ చేసిన టెర్రరిస్టులు చంపేస్తారు. దాంతో అరుణ్ టీం మీద ఒక ఎంక్వయిరీ వేసి, వాళ్ళని సస్పెండ్ చేస్తారు.
విమానంలో ఉత్కంఠ భరితంగా...
యోధా లో భాగం కావడం, దేశం కోసం ఏదైనా చేయడం అన్నది అరుణ్ లక్ష్యంగా ఉంటుంది. అయితే ఒక చిన్న తప్పిదం వల్ల యోధా ఉనికే ప్రశ్నార్ధకమవుతుంది. దాంతో యోధా అనే ఒక విభాగాన్ని క్లోజ్ చేయాలని ప్రభుత్వం భావిస్తుంది. తర్వాత పాకిస్తాన్ కు చెందిన టెర్రరిస్ట్ టీం మరొక పెద్ద ప్లాన్లో భాగంగా ఒక ప్లేన్ హైజాక్ చేస్తారు. అందులో యోధా సెక్యూరిటీ కమాండో గా ఉంటాడు. ఇక కథ మొత్తం ఒక విమానంలోనే నడుస్తుంది. ఎత్తుకు పై ఎత్తులు, ఊహించని ఒకటి రెండు ట్విస్టులు, ఫైట్ల తర్వాత భారీ క్లైమాక్స్ తో సినిమా ముగుస్తుంది. సిద్ధార్థ మల్హోత్రాకు ఇటువంటి పాత్రలు కొట్టిన పిండే. అలా చేసుకుంటూ పోయాడు. ముందే చెప్పిన ప్రేమ కథలో భాగంగా ఒక ఉన్నత స్థాయి అధికారి పాత్రలో ప్రియా (రాశి ఖన్నా) ఉంది. మరొక ముఖ్యమైన ఎయిర్ హొస్టెస్ (లైలా) పాత్రలో దిశా పటాని ఉంది.
ఆరంభం అదిరింది...కానీ
సినిమా ప్రారంభమే ఒక ఉత్కంఠ భరిత కమాండో ఆపరేషన్ తో మొదలయ్యి కొంత ఆసక్తిని కలిగిస్తుంది. కానీ దాని తర్వాత సినిమా సాధారణ సినిమాగా మారిపోతుంది. ఇంటర్వెల్ తర్వాత ఒకింత ధ్రిల్, కొంత సస్పెన్స్, ఒకటి రెండు టెస్టులు కలిసి సినిమా కొంత ఆసక్తికరంగా మారినప్పటికీ, మొత్తంగా సినిమా ఒక సాధారణ సినిమా గానే మిగిలిపోతుంది. నటన పరంగా సిద్ధార్థ మల్హోత్రా బాగానే చేశాడు. అలాగే కొంత వరకు రాశిఖన్నా పర్వాలేదు. దిశా పటాని పాత్ర ను సరిగ్గా మలుచుకోలేదు దర్శకులు. దాంతో అది తేలిపోయింది. దర్శకత్వ ప్రతిభ అక్కడక్కడ కనబడినా మొదటిసారి సినిమా తీస్తున్నందువల్ల, కథనం సరిగ్గా రాసుకోలేకపోవడం ఈ సినిమాకు మైనస్. అలాగే సినిమా నిడివి కూడా ఓ 30 నిమిషాలు తగ్గి ఉంటే కాస్త బాగుండేది. ఇక సంగీతం గురించి ఫోటోగ్రఫీ గురించి పెద్దగా చెప్పుకోవడానికి ఏమీ లేదు. ఉన్న ఒకటి రెండు పాటలు ఉన్నాయంటే ఉన్నాయి. ఇలాంటి కథల్లో లాజిక్ వెతకడం అనేది సరికాదు. ఒక ఊహ జనిత కుట్రతో రెండు దేశాల మధ్య జరిగిన సంఘటనలతో తీసిన ఈ సినిమా, హిందీ ప్రేక్షకుల వరకు కొంత ఓకే గాని. తెలుగు ప్రేక్షకులకు ఇది అంతగా నచ్చకపోవచ్చు. ఒక సెలవు రోజు మరీ ఖచ్చితంగా సినిమా స్క్రీన్ మీద చూడాలనుకుంటే, కొంత భరించి, మరికొంత ఓపిక చేసుకోగలిగితే దీన్ని చూడవచ్చు. అదైనా సిద్ధార్థ మల్హోత్రా కోసం, యాక్షన్ సన్నివేశాల కోసం మాత్రమే.
దర్శకత్వం: సాగర్ అంబ్రే,పుష్కర్ ఓజా
రచన: సాగర్ అంబ్రే
నిర్మాతలు: హీరూ యష్ జోహార్, కరణ్ జోహార్, అపూర్వ మెహతా,శశాంక్ ఖైతాన్
తారగణం: సిద్ధార్థ్ మల్హోత్రా, రాశి ఖన్నా,దిశా పటాని,రోనిత్ రాయ్,తనూజ్ విర్వానీ
సినిమాటోగ్రఫీ:జిష్ణు భట్టాచార్జీ
ఎడిటర్:శివకుమార్ వి. పనికర్
సంగీతం:విశాల్ మిశ్రా,తనిష్క్ బాగ్చి,బి. ప్రాక్,జాని,ఆదిత్య దేవ్,జాన్ స్టీవర్ట్ ఎడూరి
నిర్మాణ సంస్థలు: అమెజాన్ ఎం.జి.ఎం స్టూడియోస్,ధర్మ ప్రొడక్షన్స్, మెంటర్ డిసైపుల్ ఎంటర్టైన్మెంట్
విడుదల తేది: 15 మార్చి 2024


Read More
Next Story