తెలుగు సినీ క్రిటిక్స్ పట్టని సినిమా శ్రీకాంత్
x

తెలుగు సినీ క్రిటిక్స్ పట్టని సినిమా 'శ్రీకాంత్'

మన తెలుగు సినీ విమర్శకుల తీరును, అభిరుచిని తప్పుబట్టడం కాదు గాని... ఓ దివ్యాంగుడు, పదహారణాల తెలుగోడి స్ఫూర్తిదాయక జీవితాన్ని ఓ హిందీ డైరెక్టర్ తెరకెక్కిస్తే ఎందుకు ప్రశంసించలేకపోయాం?


మన తెలుగు సినీ విమర్శకుల తీరును, అభిరుచిని తప్పుబట్టడం కాదు గాని ఓ స్ఫూర్తిదాయక చిత్రం గురించి నాలుగు మాటలు రాయడానికి చేతులెందుకు రావడం లేదెందుకని అమెరికాలో ఉంటున్న ఓ మిత్రుడు నవీన్ అడిగినపుడు నిజంగానే నోరెళ్లబెట్టాల్సి వచ్చింది. నిజమే కదా.. ఆ తమిళ సినిమా బాగుందీ.. ఈ మళయాళి ఫిలిం సూపరంటూ ఫేస్ బుక్, వాట్సాప్, ఇన్ స్టా గ్రామ్ లో ఊదరగొట్టే మనం- ఓ దివ్యాంగుడు, పదహారణాల తెలుగోడి స్ఫూర్తిదాయక జీవితాన్ని ఓ హిందీ డైరెక్టర్ తెరకెక్కిస్తే ఎందుకు ప్రశంసించలేకపోయాం? అనిపించింది. ఆ శాంతి పెళ్లి అక్రమమా, సక్రమమా? విజయసాయిరెడ్డికున్న బంధమేంటీ? ఆ హీరోయిన్ ఫోర్ ప్లే ఏంటీ, ఈ హీరో అసలు ప్లే ఏంటంటూ గంటల కొద్ది చర్చలు సాగించిన మెయిన్ స్ట్రీమ్ మీడియాకి- చూపులేని ఓ వ్యక్తి సాధించిన అపూర్వ విజయం కన్పించకపోవడం నిజమే కదా, అసలు మీడియాను పక్కన బెట్టినా ప్రతి సినిమా మీద తీర్పులిచ్చే సోషల్ మీడియా వీరులేమయ్యారు? ఓటీటీలో ఆ సినిమా వచ్చిందీ, ఈవేళ ఇంత కలెక్షన్ వచ్చిందని చెప్పే సోషల్ మీడియా వెబ్ సైట్లు ఏమయ్యాయీ? నేనేమన్నా చూడలేదా, అమెరికా మిత్రుడేమైనా పొరబడ్డారా అని తొవ్విచూస్తే కనీస రెస్పాన్స్ కూడా కానరాలేదు.

అప్పుడు గుర్తుకువచ్చింది.. 2021 ఏప్రిల్ లోనూ, మేలోనో, సరిగా గుర్తులేదు. 'స్వతంత్ర' అనే ఛానల్ కి పని చేస్తున్నప్పుడు ఈయన్ని ఇంటర్వ్యూ చేసినట్టు... ఆయన పేరు శ్రీకాంత్ బొల్లా. అప్పటి మా ఎడిటర్ తోట భావనారాయణ రెండు రోజులు కష్టపడి ఆయనతో ఇంటర్వ్యూ ఫిక్స్ చేశారు. సికింద్రాబాద్ రాజ్ భవన్ లో రోడ్డులో ఆయన ఆఫీసు. సుమారు గంటకు పైగా ఇంటర్వ్యూ చేశాం. రాజకీయాల్లో చేరి ఏదైనా చేయాలనుకుంటున్నానని, అయితే అదంత సాధ్యం కాదని అర్థమవుతుందన్నారు. తన కుటుంబం తన ప్రేమికురాలి గురించి చెప్పుకొచ్చారు. 2022లో శ్రీకాంత్ తన ప్రేమికురాలు స్వాతితో పెళ్లి చేసుకున్నారు. అటువంటి వ్యక్తి మీద వచ్చిన బయోపిక్ ఇది. వందల కోట్లు ఖర్చు పెట్టి సినిమాలు తీసే తెలుగు నిర్మాతల దృష్టికి శ్రీకాంత్ రాలేదేమో గాని నలుగురు హిందీ నిర్మాతలు ఈ సినిమా తీశారు. 35 కోట్లు ఖర్చు పెడితే 63 కోట్లు వచ్చాయి. మొత్తం ఖర్చులో ఒక్క హీరోకే పది కోట్లు ఇచ్చినట్టు నిర్మాతలు చెప్పుకొచ్చారు. రెండు నెలల్లో సినిమా పూర్తయింది. 2022 నవంబర్ లో మొదలు పెట్టి అమెరికా, ఇండియా, ఆంధ్రప్రదేశ్ లో సినిమా తీశారు.

ఈ సినిమా చాలా గొప్పగా ఉందంటూ ప్రపంచవ్యాప్తంగా సినిమాలకు ర్యాంకింగ్ ఇచ్చే రాటన్ టమోటాస్ అనే వెబ్ సైట్ రాస్తే ఇదో స్ఫూర్తిదాయక కథ అంటూ ఐదుకి 4.5 రేటింగ్ ఇచ్చింది బాలివుడ్ హంగామా. ఇంగ్లీషు మీడియాకి పట్టిన మాత్రం కూడా తెలుగు మీడియాకి ఈ సినిమాను పట్టించుకోకపోవడం నిజంగా బాధాకరమే.

సినిమా పేరు - శ్రీకాంత్ (హిందీ)

జానర్ - బయోపిక్

ఓటీటీ- నెట్ ఫ్లిక్స్ (అక్కడక్కడా కొన్ని థియేటర్లలో)

ఇండియాలో చూపులేని వారు సుమారు రెండు శాతం. ఈ అందమైన ప్రపంచాన్ని కనులారా చూస్తున్న వారు. ఆస్వాదిస్తున్న వారు 98 శాతం మంది. అయినా మనల్ని సంతోషపెట్టడానికి ఈ రెండు కళ్లు చాలడం లేదంటుంటాం. కానీ కేవలం మనుగడ కోసం తాపత్రయపడే ఆ రెండు శాతం మంది మాత్రం తమను తాము నిరూపించుకునేందుకు, తమ విలువను ప్రపంచానికి చాటేందుకు నిరంతరం సవాళ్లను ఎదుర్కొంటూనే ఉన్నారు. దృష్టి లోపం ఉన్నవారి దుస్థితిని ఒక్కసారి కళ్లుమూసుకుని ఊహించుకోండి.

శ్రీకాంత్ బొల్లా. ఆరణాల తెలుగుబిడ్డ. పేదవాడు. పుట్టుకతోనే అంధుడు. ఈ లోపాన్ని అధిగమించేందుకు అతడు పడిన కష్టం ఒక్క ముక్కలో చెప్పలేం. అదో సాహసోపేత జీవితం. అడుగడుగునా కష్టాలే. దీనికితోడు పేదరికం. ఇక ఊహించండి. దాని బాధ ఎలా ఉంటుందో. ఆయన జీవితం ఆధారంగా వచ్చిన చిత్రం ఇది. శ్రీకాంత్ పోరాటం, అనుభవం, పట్టుదల, ఓటమిని అంగీకరించని తత్వం, తోడ్పడిన ఒకరిద్దరు మంచిమనుషుల ఆధారంగా తెరకెక్కిన బయోపిక్ ఇది. అతని పట్టుదలే ఆయన్ను బొల్లంట్ ఇండస్ట్రీస్ వ్యవస్థాపక ఛైర్మన్‌గా చేసింది.

సాంద్ కి ఆంఖ్, స్కామ్- 2003 చిత్రాలను తీసిన తుషార్ హీరానందని దర్శకత్వంలో వచ్చింది. ఆకట్టుకునే డైలాగ్‌లు, ఉత్తేజకరమైన సన్నివేశాలు, ఆకట్టుకునే కథనంతో మనం కళ్లను పక్కకు తిప్పకుండా తెరపైన అతుక్కుపోయేలా తీశాడు. దృఢ సంకల్పం, కష్టపడితే జీవితంలో ఏదైనా సాధించవచ్చు అంటుంటారు గాని అదెంత కష్టమో ఈ సినిమా చూస్తే అర్థమవుతుంది.

2022లో మొదలైన ఈ సినిమా ట్రైలర్ ఈ ఏడాది ఏప్రిల్-9 విడుదలైంది. ట్రైలర్ లాంచ్ కి శ్రీకాంత్ కూడా హాజరయ్యారు. ఈ సినిమా 2024 మే 10న అక్షయ తృతీయ సందర్భంగా థియోటర్లలో విడుదలైంది. జూలై రెండో వారం నుంచి నెట్ ఫ్లిక్స్ ఓటీటీలో స్ట్రీమ్ అవుతుంది.

టాలెంటెడ్ యాక్టర్ రాజ్‌కుమార్ రావు శ్రీకాంత్ బొల్లా పాత్రలో జీవించారు. హావభావాలు పండించారు. స్ట్రెయిట్ ఫార్వర్డ్ డైలాగ్ డెలివరీ మన మదిని మెలిపెడతాయి. శ్రీకాంత్ టీచర్ పాత్రలో జ్యోతిక ఒదిగిపోయారు. శరద్ కేల్కర్‌తో కలిసి అద్భుతమైన చిత్రానికి ప్రాణం పోశారు.

ఓవరాల్‌గా ఈ సినిమా శ్రీకాంత్ జీవితంలోని కష్టాలను ఎలివేట్ చేస్తుంది. అందరికీ స్ఫూర్తిదాయకమైన అంశం. శ్రీకాంత్ చెప్పినట్లుగా.. ఈ దేశంలో చూపులేని వారు రెండు శాతమే అయినా చూపుండి చూడలేని వారే అత్యధికులు. దివ్యాంగుల్ని సపోర్ట్ చేయమన్నది అందరూ చెప్పేదే ఆచరణే అసలు సమస్య. అలా సపోర్ట్ చూపుతున్న స్ఫూర్తిప్రధాత శ్రీకాంత్.

ఈ సినిమాని మనం తప్పక చూడాల్సిందే. వినోదం కోసం కాకుండా నేర్చుకునే దృక్పథంతోనైనా చూడాలి. ఈ ప్రపంచంలో ఎవరూ దివ్యాంగులు కాదు. ప్రతి ఒక్కరిలో ఏదో ఒక ప్రత్యేకమైన ప్రతిభ ఉంటుంది. దాన్ని కనిపెట్టి ప్రోత్సహించడమే శ్రీకాంత్ మిత్రుడు రవి పాత్ర. ఈ సినిమా ఆసాంతం చూసిన తర్వాత మనకు అన్పించేదేమంటే మనం ఎనాడైనా ఇలా ఏ ఒక్కరికైనా తోడ్పడగలమా అని.

ఇదో అసాధారణ సినిమా. మనసు మెలిపెడుతుంది. కళ్లంట నీళ్లొచ్చేలా చేస్తుంది. కథాంశం అనూహ్యం. సాదాసీదా సీన్లతో ప్రేక్షకులు శ్రీకాంత్ జర్నీతో సులువుగానే కనెక్ట్ అవుతారు. సినిమాటోగ్రఫీ విజువల్‌గా స్టన్నింగ్‌గా ఉంది. ప్రతి ఫ్రేమ్‌ని కథాగమనాన్ని మెరుగుపరిచేలా ఉంది. మ్యూజిక్ మరో హైలైట్. సినిమా ఎమోషనల్ టోన్‌ను సెట్ చేస్తుంది. శ్రీకాంత్ ప్రేమ, త్యాగం, వ్యక్తిగత ఎదుగుదల, తనను కనిపెంచిన వారి పట్ల ప్రేమ, తనకు మరో జీవితాన్ని ఇచ్చిన టీచర్ పట్ల ప్రేమాభిమానాలు, ఎదుగుదలకు ప్రోత్సహించిన మిత్రుడి పట్ల ఆపేక్ష, తనకున్న లోపాన్ని లెక్క చేయకుండా తనను జీవితభాగస్వామిగా చేసుకున్న వ్యక్తి పట్ల ఆత్మీయత వంటి ఇతివృత్తాలు అనేకం ఈ సినిమా ప్రత్యేకత. సెన్సిటివిటి పోకుండా సినిమా సాగుతుంది.

ఇంతకీ ఎవరీ శ్రీకాంత్..

ఉమ్మడి కృష్ణా జిల్లా బందరుకు సమీపంలోని సీతారామపురంలో 1992 జూలై 7న పుట్టారు. తల్లిదండ్రులు వ్యవసాయదారులు. పుట్టు అంధుడు. ఊళ్లోవారందరూ చెప్పినా వినకుండా ఆ పిల్లాణ్ణి పెంచి పెద్దచేస్తారు. చూపులేదనే తప్ప బడిలో శ్రీకాంత్ అందరికంటే చురుగ్గా వుండేవాడు. ఇంటర్ లో సైన్స్ గ్రూపులో సీటు ఇవ్వలేమని ఓ కాలేజీ యాజమాన్యం చెబితే కోర్టుకెళ్లి సీటు సాధించుకున్నారు. తోటి పిల్లల ఎగతాళితో చదువు మానేసి రెండేళ్లు ఇంట్లోనే ఉన్నారు. చదువు మీద ఆపేక్ష కొద్ది మళ్ళీ హైదరాబాద్ లోని ఓ దివ్యాంగుల పాఠశాలలో చేరి అక్కడా ఇమడ లేక బడివదిలేసి పారిపోతుంటే తనను ఆదరించే టీచర్ చెంపచెళ్ళుమనిపించింది. అది అతని జీవితాన్ని మారుస్తుంది. ఆ టీచర్ ఆడియో టేపుల్లో పాఠాలు చెబుతూ ఇంటర్ లో ఎంపీసీలో 98 శాతం మార్కులు సంపాయించేలా చేస్తుంది.

స్వదేశంలో ఐఐటీ వాళ్లు సీటు ఇవ్వకపోతే అమెరికా యూనివర్శిటీలకు పరీక్ష రాసి ఎంఐటీ (మాసాచుసెట్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, అమెరికా) లో చేరి ఎంఐటీ నుంచి పట్టా పొందిన తొలి దివ్యాంగునిగా రికార్డు సృష్టించారు. చదువు అయ్యాక అమెరికన్ కంపెనీలు ఉద్యోగాలు ఇస్తామన్నా శ్రీకాంత్ 'నో' చెప్పి ఇండియా వస్తాడు. హైదరాబాద్ సమీపంలో తమ మిత్రుడు రవి సహకారంతో బాల్లాంత్ ఇండస్ట్రీస్ అనే ప్యాకింగ్ మెటిరియల్ ఫ్యాక్టరీ పెట్టి దివ్యాంగులకు సాయపడుతున్నారు. నాచారంలో ఫ్యాక్టరీ, కార్పొరేట్ కార్యాలయం ఉంది.

అవార్డులు, రివార్డులకు లెక్కే లేదు. కాసులిచ్చి నలుగురి కళ్లలో పడేందుకు నానా తంటాలు పడుతున్న ఈ రోజుల్లో దివ్యాంగుల కోటాలో ఉత్తమ పారిశ్రామిక వేత్త అవార్డు ఇస్తానంటే తిరస్కరిస్తాడు. తనను మిగతా పారిశ్రామిక వేత్తలతో సమానంగా చూడాలంటారు. ఈవేళ ఆ ఇడస్ట్రీస్ టర్నోవర్ సుమారు 150 కోట్లు. దానికి శ్రీకాంత్ సీఇవో. శ్రీకాంత్ ఇపుడు సుమారు 300 మంది దివ్యాంగులకు ఉపాధి చూపిస్తున్నారు. 3వేల మంది విద్యార్థులను చదివిస్తున్నాడు.

సుమారు పదేళ్లపాటు తనను చాలా దగ్గరి నుంచి చూసిన వీర స్వాతిని 2022లో పెళ్లి చేసుకున్నారు. ఇప్పుడు వారికో కుమార్తె. హైదరాబాద్ గచ్చిబౌలిలో నివాసం.

Read More
Next Story