'కీచురాళ్లు' రేసీ థ్రిల్లర్ (ఈటీవీ విన్) మూవీ రివ్యూ!
అసభ్యత ఎక్కడా లేని ఈ సినిమా ఫ్యామిలీతో చూడచ్చు. అలాగే అమ్మాయిలు చూస్తే ఇలాంటి విషయాలపై ఓ అవగాహన వస్తుంది.
కొన్ని సినిమాలు టైటిల్, పోస్టర్ చూసి ఏం చూస్తాంలే అనుకుంటాం. కానీ ఒక్కోసారి అవే బ్రహ్మాండంగా ఉంటాయి. అలాంటి టెక్నికల్ రేసీ థ్రిల్లర్ ఇది. సినిమా ప్రారంభం నుంచి పరుగెడుతూనే ఉంటుంది. ముఖ్యంగా సమాజంలో నిత్యం ఎదుర్కొంటున్న ఓ సమస్య చుట్టూ అల్లిన కథ ఇది. మలయాళంలో సక్సెస్ అయ్యిన ‘కీడం’ (Keedam)కు డబ్బింగ్ ఇది. రజీషా విజయన్ ప్రధాన పాత్రలో దర్శకుడు రాహుల్ రిజీ నాయర్ తెరకెక్కించిన ఈ సినిమా ఎలా ఉంది. ఈ సినిమా కథేంటి? అనే ది చూద్దాం.
కథేంటి
సైబర్ సెక్యూరిటీ ఎక్స్ పర్ట్ గా రాధిక (రజీషా విజయన్)కు మంచి పేరు. ఎథికల్ హ్యాకింగ్ ద్వారా సైబర్ క్రైమ్ కి సంబంధించిన కొన్ని కేసులను పరిష్కరించడానికి పోలీస్ డిపార్టుమెంటువారు ఆమె సాయం తీసుకుంటూ ఉంటారు. అలాగే ఆమె తండ్రి ఒక సీనియర్ లాయర్ (శ్రీనివాసన్). తండ్రీ కూతుళ్లు మాత్రమే ఆ ఇంట్లో ఉంటూ ఉంటూ ఎవరి పనుల్లో వాళ్లు బిజీగా ఉంటారు. ఇక ఒక రోజున ఆమె ఫ్రిజ్ రిపేర్ కి సంబంధించి ఒక నెంబర్ కి కాల్ చేస్తుంది. అయితే అవతల వ్యక్తి కాస్త అసభ్యంగా మాట్లాడటంతో కాల్ కట్ చేస్తుంది. కానీ అవతలి వాడు అక్కడితో వదలడు.
తనలాంటి మరో నలుగురు గ్రూప్ తో కలిసి రాధిక వాయిస్ నచ్చడంతో, ట్రూకాలర్ ద్వారా ఆమె పేరు చూసి, ఫేస్ బుక్ లోకి వెళ్లి ఆమె ఎలా ఉందనేది చూస్తారు. ఆమె అంతంగా ఉండటంగా కనిపించడంతో ఆమెను కంటిన్యూగా కాల్ చేసి విసిగిస్తూంటారు. అంతేకాకుండా ఆమె నెంబర్ కు పోర్న్ వీడియోలు షేర్ చేస్తూ వేధించడం మొదలుపెడతారు. నెంబర్ బ్లాక్ చేస్తే వేర్వేరు నెంబర్స్ నుంచి రాత్రింబవళ్లూ కాల్స్ చేస్తూంటాడు. ఆమె పోలీస్ కంప్లైంట్ ఫైల్ చేస్తుంది. పోలీస్ లు ఆ కాల్ చేసిన అతన్ని పట్టుకుంటారు. అతని పేరు కిలి బిజూ. పోలీస్ స్టేషన్ కు తీసుకువచ్చినా లెక్క చేయడు.
పోలీస్ లు కూడా రాధికకు ఓ సలహా ఇస్తారు. ఈ కేసులు కోర్టులో నిలబడవు. ఆ ఫోన్ మిస్సైందంటారు. వేరే వాళ్లు ఎవరో కాల్ చేసారంటారు. ఆ చేసింది వీడే అని ప్రూవ్ చేయలేక ఇబ్బంది పడాలి అంటారు. ఇంత చదువుకుని, సెక్యూరిటీ ఎక్సపర్ట్ గా చేస్తున్న నేనే ఇలాంటి సమస్యను ఫేస్ చేయలేకపోతే ఇంక మామూలు అమ్మాయిలు పరిస్దితి ఏమిటి అని ఆమె పట్టుబడుతుంది. కేసుని సీరియస్ గా తీసుకోమంటుంది. అంతేకాకుండా తన పర్శనల్ సెక్యూరిటీలోకి తనకు సంభందం లేకుండా వచ్చి ఇబ్బంది పెడుతున్న వాళ్లను తను కూడా వదలకూడదనుకుంటుంది. వాళ్ల ఫోన్స్ హ్యాక్ చేస్తుంది.
అక్కడ నుంచి కొన్ని షాకింగ్ విషయాలు ఆమెకు తెలుస్తాయి. ఆ ఫోన్ చేసి విసిగించేవాడు లోకల్ మాఫియాలో పనిచేస్తూంటాడు. వాళ్లు పైకి స్క్రాప్ బిజినెస్ అని చెప్పుకుంటూ స్మగ్లింగ్ చేస్తూంటారు. మర్డర్స్ చేస్తూంటారు. అక్కడ నుంచి వాళ్లకి తెలియకుండా వాళ్ల కార్యకలాపాలకు అడ్డుపడుతూంటుంది. వాళ్ల బిజినెస్ దెబ్బ కొడుతుంది. ఆ విషయం వాళ్లకు ఎప్పుడు తెలిసింది. తెలిసిన తర్వాత వాళ్లు ఊరుకోరుకదా..ఏం చేసారు. చివరకు ఏమైంది అనేది మిగతా కథ.
ఎలా ఉందంటే...
కొందరు సోషల్ మీడియాలోనో మరో చోట అమ్మాయిల నెంబర్స్ పట్టుకుని ఫోన్ చేసి అసభ్యంగా ప్రవర్తించడం, బ్లాక్ మెయిల్ చేసి బెదిరించడం , బయిట ఎడ్రస్ పట్టుకుని ఇబ్బంది పెట్టడం వంటివి నిత్యం జరుగుతున్నాయి. వాటిని బేస్ చేసుకుని కథ రాసుకున్నారు. కథలోకి వెళ్లటానికి కాస్త టైమ్ తీసుకున్నా..ఒక్కసారి కథ మలుపు తిరిగాక పరుగులు పెట్టింది. ముఖ్యంగా ఇంట్రవెల్ తర్వాత సీన్స్ థ్రిల్లింగ్ గా సాగుతాయి. ఎక్కడా ఒక్క సీన్ కూడా ఎగస్ట్రా అనిపించదు. ఏం జరుగుతుందా నెక్ట్స్ ఎదురుచూసేలా చేసారు. అలాగే ఈ సినిమాలో ఎంతవరకూ కథకు అవసరమో ఆ పాత్రలు చుట్టూనే నడిపాడు.
విలన్ గ్యాంగ్ హెడ్ ఫోన్ లో వాయిస్ వినపడుతుంది తప్పించి వాడి జోలికి పోలేదు. ఆ క్రైమ్ నెట్ వర్క్ ని టచ్ చేయలేదు. కథకు ఓ రకంగా అది అనవసం కూడా. హీరోయిన్ ఆ గ్యాంగ్ లీడర్ ఎవరు అని ఎంక్వైరీ చేసి ఆ దిశగా కథ వెళ్లి ఉంటే దారి తప్పి ఉండేది. హీరోయిన్ ని ఇబ్బంది పెట్టిన వాళ్లకు ఆమె ఎలా బుద్ది చెప్పింది, ఎలా పట్టించింది అనే దిశగానే కథ నడిపారు. అయితే హ్యాకింగ్, టెక్నికల్ డిటేల్స్ కొందరకి అర్దం కాకపోవచ్చు. కానీ విషయం అయితే అర్దం అవుతుంది.
టెక్నికల్ విషయానికొస్తే..
సినిమాటోగ్రఫీ నీట్ గా ఉంది. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఈ కథకు తగ్గట్లు ఉంది. లెంగ్త్ తక్కువ కావటంతో అప్పుడే అయ్యిపోయిందా అనిపించింది. ఎక్కడా ల్యాగ్ అనిపించలేదు. రియాల్టికి దగ్గరగా సీన్స్ ,ఫైట్స్ అన్ని జాగ్రత్తగా చూసకుని తెరకెక్కించాడు డైరక్టర్. నటీనటుల్లో రజీషా విజయన్ యాప్ట్ గా చేసుకొచ్చింది. శ్రీనివాసన్ వంటి సీనియర్ గురించి ప్రత్యేకంగా చెప్పేదేముంది. అలాగే ఈ సినిమా డైరక్టర్ రాహుల్ రిజీ నాయర్ ..హీరోయిన్ కోలిగ్ గా కనిపిస్తారు.
చూడచ్చా
అసభ్యత లేని ఈ సినిమా ఫ్యామిలీతో చూడచ్చు. అలాగే అమ్మాయిలు చూస్తే ఇలాంటి విషయాలపై ఓ అవగాహన వస్తుంది.
ఎక్కడ చూడచ్చు
ఈటీవి విన్ ఓటిటిలో తెలుగులో ఉంది.
Next Story