రజనీకాంత్ ‘వేట్టయన్’లో చూపింది Byju స్కామ్ నా ? ప్రభుత్వం తో టై అప్ కూడా చూపెట్టాడే?
రజనీ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన ‘వేట్టయన్’విడుదలైంది. సక్సెస్ ఫుల్ చిత్రం ‘జైలర్’ తర్వాత ఆయన్నుంచి వచ్చిన పూర్తిస్థాయి సినిమా ఇదే .
రజనీ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన ‘వేట్టయన్’విడుదలైంది. సక్సెస్ ఫుల్ చిత్రం ‘జైలర్’ తర్వాత ఆయన్నుంచి వచ్చిన పూర్తిస్థాయి సినిమా ఇదే కావటంతో మంచి అంచనాలే ఉన్నాయి. దానికి తోడు ‘జై భీమ్’ ఫేమ్ జ్ఞానవేల్ దర్శకత్వం వహించడం... రజనీకి తోడుగా అమితాబ్ బచ్చన్, రానా దగ్గుబాటి తదితర తారాగణం నటించడంతో‘వేట్టయన్’పై మరిన్ని ఎక్సపెక్టేషన్స్ పెరిగాయి. మంచి ఓపినింగ్స్ తో ప్రపంచ వ్యాప్తంగా రిలీజైన ఈ చిత్రం రిలీజ్ తర్వాత ఓ కొత్త చర్చకు తావిచ్చింది. ఈ సినిమాలో చూపించిన స్కామ్ Byju స్కామ్ ని గుర్తు చేస్తోందంటూ సోషల్ మీడియాలో పోస్ట్ లు కనపడటం విశేషం. అయితే నిజంగానే ఈ పోలికలు ఉన్నాయా ?
భారతదేశంలోని ప్రముఖ ఎడ్-టెక్ స్టార్టప్‌లలో ఒకటి బైజూస్ . ఈ సంస్ద గత కొంతకాలంగా అనేక సమస్యలను ఎదుర్కొంటోంది. వ్యాజ్యాలు, ఆడిటింగ్ సమస్యలు, బోర్డ్ రూమ్ ఎగ్జిట్‌లు మరియు లేఆఫ్‌లు కంపెనీ ప్రతిష్టను దెబ్బతీస్తూ వచ్చాయి. బైజూస్ 22 బిలియన్ డాలర్ల విలువ… అంటే మన కరెన్సీలో దాదాపు లక్షా 75 వేల కోట్ల రూపాయల విలువతో ఒకనాడు చరిత్ర సృష్టించిన బైజూస్ సంస్థ విలువ నేడు అధఃపాతాళానికి పడిపోయింది.
‘వేట్టయన్’లో చూపెట్టింది ఇదీ...
ఇక ‘వేట్టయన్’లో కీలక అంశం ఓ ఎడ్యుకేషన్ యాప్ చుట్టు తిరుగుతుంది. రానా ఆ స్టార్టప్ కు అధినేత. ఎలాగైనా ఉన్నత స్దానానికి ఎదిగిపోవాలనే ఆశయంతో మోసాలు, నేరాలు, చివరకు హత్యలు కూడా చేస్తాడు. తన పలుకుబడిని ఉపయోగించి అన్నిటినుంచి బయిటపడవచ్చు అనుకుంటాడు. కానీ అది సాధ్యం కాదు.వాస్తవానికి ఈ కథలో చాలా డెప్త్ ఉంది. ట్రైలర్ లో చూపించినట్లు కేవలం ఎన్‌కౌంటర్‌పై మాత్రమే కాకుండా ప్రస్తుతం సమాజంలో జరుగుతున్న విద్య దోపిడిపై కూడా దర్శకుడు ఈ చిత్రంలో చర్చించటం చాలా మంచి విషయం. స్మార్ట్ ఎడ్యుకేషన్ పేరుతో ప్రైవేట్ సంస్థలు పేద విద్యార్థులను ఎలా దోచుకుంటున్నాయి? అనేది తెరపై కళ్లకు కట్టినట్లుగా చూపించే ప్రయత్నం చేసాడు. కానీ రజనీ కాంత్ వంటి స్టార్ ఉండటంతో తను అనుకున్నది ఫెరఫెక్ట్ గా తెరపైకి తేలాకపోయారనిపిస్తుంది. ప్రేక్షకులను ఎమోషనల్‌గా కనెక్ట్ అయ్యేలా చేయడంలో విఫలం అయ్యాడు.
ఇక సినిమా ఎలా ఉందనే విషయం ప్రక్కన పెడితే... Byju సంస్ద స్కూల్ పిల్లలకు ఆన్‌లైన్ పాఠాలు చెప్పే స్థాయి నుంచి, ఏకంగా మనదేశంలోని అత్యున్నత సివిల్ సర్వీసులకు, అంటే IAS, IPSవంటి పోస్టులకు నిర్వహించే UPSC పోటీపరీక్షలకు కూడా శిక్షణ ఇస్తామని బైజూస్ ప్రచారం చేసింది. ప్రకటనల పేరుతో ఎక్కడ చూసినా మారుమోగిపోయిన బైజూస్ సంస్థ…ఆచరణలో మాత్రం విఫలమైంది. దాంతో లాభాలు రాని వ్యాపారంగా మారిపోయింది.
బైజూస్‌లో పెట్టుబడి పెట్టిన పలువురు ఇన్వెస్టర్లు కూడా దాదాపు అంతా మునిగిపోయారని వార్తలు వచ్చాయి. వాళ్లంతా ఆ యాప్ వ్యాల్యూయేషన్ పెరిగిపోయి కోట్లలో లాభాలు తెస్తుందనే మాయలో మునిగిపోయి, వాస్తవ ప్రపంచానికి దూరంగా ఉండటం జరిగింది. అలాగే చాలా మంది పేద పిల్లలు సైతం బ్యాంక్ లు నుంచి లోన్ లు తెచ్చి మరీ వారి టాబ్ లు తీసుకుని ఈఎమ్ ఐ లు కట్టారు. కానీ చదువు మాత్రం వారికి అబ్బలేదనే కంప్లైంట్స్ వచ్చాయి. ఇదే విషయాన్ని యాజటీజ్ గా సినిమాలో చూపించారు దర్శకుడు. డబ్బులు కట్టలేక, నాశిరకం ట్యాబ్ లు తీసుకుని, వాళ్లు చెప్పే ఇంగ్లీష్ మీడియం పాఠాలు ఫాలో కాక చాలా మంది ఆత్మహత్యలు చేసుకునే విషయం ప్రస్తావించారు.
అలాగే మహేశ్‌బాబు, షారూఖ్‌ఖాన్, హృతిక్ రోషన్ లాంటి సినిమా స్టార్లను, మెస్సీ లాంటి దిగ్గజ ఆటగాడిని వారిని బ్రాండ్ అంబాసిడర్లుగా పెట్టుకుని, ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్‌కు టైటిల్ స్పాన్సర్‌గా భారీ మొత్తం చెల్లించిన బైజూస్ సంస్థ..వ్యాపార నిర్వహణలో మాత్రం సరిగ్గా చేయలేకపోయింది. ఈ సినిమాలోనూ మోడల్స్ ని తీసుకొచ్చి పబ్లిసిటీ చేయటం చూపిస్తారు.
అలాగే అప్పట్లో ఎడ్ టెక్ సంస్థ బైజూస్ తో ఏపీ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకున్న సంగతి తెలిసిందే. విద్యార్థులకు ఆన్ లైన్ ద్వారా విద్యను బోధించేందుకు ఈ ఒప్పందం కుదిరింది. దీనిపై జనసేన నేత నాదెండ్ల మనోహర్ విమర్శలు గుప్పించారు. బైజూస్ పేరుతో రూ. 700 కోట్ల స్కామ్ చేశారని ఆరోపించారు. వైసీపీ ప్రభుత్వ తీరు ఇదేనా అని ప్రశ్నించారు. ఇక ఈ సినిమాలోనూ రానా ..ప్రభుత్వం తో టై అప్ పెట్టుకుని నాశిరకం ట్యాబ్ లు పంపిణీ చేసి తను నష్టాలు నుంచి బయిటపడాలనుకుంటాడు. ఇలా చాలా విషయాలు సిమిలర్ గా ఉన్నాయని నెటిజన్లు అంటున్నారు.
ఇంతకీ ‘వేట్టైయాన్ - ది హంటర్’ ఎలా ఉంది
గతంలో రజనీ చిత్రాలుకు ఉన్నంత ఊపు అయితే లేదు. దానికి తగినట్లుగా టైటిల్ మార్చకుండా యధాతథంగా తమిళ టైటిల్ ఉంచేయడం పట్ల బాషా ప్రేమికుల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. సినిమాగా చూస్తే.. నేరస్తులు .. కోర్టులు .. పోలీసుల నేపథ్యంలో సాగే సన్నివేశాలను ఎక్కువగా టచ్ చేశారు. రజనీ మార్క్ డైలాగ్స్ తో .. ఫైట్లతో అదిరిపోతుందేమో అనుకున్నవారికే నిరాశ ఎదురైంది. ‘జై భీమ్’ తరహాలోనే మరోసారి డైరక్టర్ న్యాయం, విద్య సమానంగా అందాలనే ఓ బలమైన అంశాల్ని ఎంచుకుని ఈ చిత్రాన్ని మలిచారు. కథ చెప్పిన ఉద్దేశం, దాన్ని ఓ క్రైమ్ థ్రిల్లర్‌గా ఎన్‌కౌంటర్స్‌తో ముడిపెట్టి చెప్పిన విధానం బాగుంది కానీ కొంతదూరం వెళ్లాక మరీ మెసేజ్ ఓరియెంటెడ్ గా మారిపోయింది. రజనీకాంత్ ఇమేజ్‌కి తగ్గ కమర్షియల్ ఎలమెంట్స్ కానీ, ఇంట్రస్టింగ్ ట్విస్ట్ లు కానీ లేకపోవడంతో సినిమా ఒక దశ దాటిన తర్వాత సోషల్ కామెడ్ తో కూడిన ఓ డాక్యుమెంటరీలా అనిపిస్తుంది. దాంతో తెలుగులో ఈ సినిమా జస్ట్ ఓకే సినిమా అనిపించుకుంది. ఫస్టాఫ్ అదిరిపోయింది కానీ సెకండాఫ్ సోసో గా ఉందని తేల్చేసారు.