‘వేట్టయన్’ మూవీ రివ్యూ!
x

‘వేట్టయన్’ మూవీ రివ్యూ!

ఈ మధ్య సెకండాఫులు తేలిపోయి ఫ్లాపవుతున్న సినిమాల్ని వరసగా చూస్తున్నాం. కానీ ఈ మూవీ ఫస్టాఫ్, సెకండాఫ్ ఎక్కడా పట్టు తప్పకుండా గ్రిప్పింగ్‌గా ఉండడం ఒక రిలీఫే.


(సికిందర్)

2023 లో ‘జైలర్’ తో బంపర్ హిట్టిచ్చిన సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన ‘వేట్టయన్- ‘ది హంటర్’ తెలుగు వెర్షన్ ఈ దసరా సందర్భంగా తెలుగు ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఇది రజనీకాంత్ 170 వ సినిమా. సూర్యతో ‘జై భీమ్’ అనే హిట్ తీసిన టీజే జ్ఞానవేల్ దీనికి దర్శకుడు. పానిండియా మూవీగా విడుదలైన ఇందులో వివిధ భాషల నటులు అమితాబ్ బచ్చన్, ఫహద్ ఫాజిల్, రానా దగ్గుబాటి నటించారు. మంజూ వారియర్ హీరోయిన్. మరి ఇంత ఆకర్షణీయమైన తారాగణంతో భారీగా తెరకెక్కిన ఈ మూవీ ఎలా వుంది? ఇందులో ఏ సామాజిక సమస్య చెప్పాలనుకున్నారు? రజనీకీ, జ్ఞానవేల్ కీ ఇది మరో హిట్టేనా? ఈ వివరాల్లోకి వెళ్దాం...

కథేమిటి?

ఆదియన్ (రజనీకాంత్) కన్యాకుమారిలో ఎస్పీ గా ‌ఎన్ కౌంటర్ స్పెషలిస్ట్. నేరాలకి పాల్పడే ముఠాల్ని కాల్చిపారేస్తూంటాడు. మానవ హక్కుల నాయకుడు, లాయర్ సత్యదేవ్ (అమితాబ్ బచ్చన్) ఇది తప్పని వాదిస్తూంటాడు. ఆదియన్ మాత్రం పద్ధతి మార్చుకోడు. ఇతడికి కేసుల్లో సాయపడే బ్యాటరీ (ఫహద్ ఫాజిల్) అనే దొంగ ఉంటాడు. ఇలా ఉండగా, శరణ్య (దుషారా విజయన్) అనే స్కూల్ టీచర్ ఉంటుంది. ఈమె గంజాయి మాఫియాలు స్కూలుని అడ్డాగా మార్చుకుని దందా చేస్తూంటే కంప్లైంట్ ఇస్తుంది. ఆ మాఫియా వ్యక్తిని ఆదియన్ ఎన్ కౌంటర్ చేసేస్తాడు. ఈ ఉదంతంతో శరణ్యకి మంచి పేరు రావడంతో చెన్నైకి ట్రాన్స్ ఫర్ చేయించుకుంటుంది.

ఇప్పుడు చెన్నైలో గుర్తు తెలియని దుండగుడు శరణ్యని రేప్ చేసి చంపేస్తాడు. దీంతో ఉపాధ్యాయులు, ప్రజలూ తీవ్ర ఆందోళనకు దిగుతారు. వీళ్ళని శాంత పరచడానికి కన్యాకుమారి నుంచి ఆదియన్ ని పిలిపించి కేసు అప్పగిస్తాడు డిజిపి (రావు రమేష్). ఆదియన్ గుణ అనే యువకుడిని రేపిస్ట్- కిల్లర్‌గా నిర్ధారించి ఎన్ కౌంటర్ చేసేస్తాడు. ఇది బెడిసి కొడుతుంది. తాను ఎన్ కౌంటర్ చేసింది అమాయకుడినని తెలుసుకుని షాక్ అవుతాడు.

ఇప్పుడు ఆదియన్ పరిస్థితి ఏమిటి? గుణ ని చంపి ఓ పేద కుటుంబానికి అన్యాయం చేసిన తను దీనికి ఎలా ప్రాయశ్చిత్తం చేసుకున్నాడు? అసలు శరణ్య మీద అఘాయిత్యం తలపెట్టిందెవరు? దీంతో నాట్ అకాడమీ అనే ఎడ్యుటెక్ కంపెనీ నడిపే నటరాజ్ (రానా దగ్గుబాటి) కేం సంబంధం? ఇతను విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటూ భారీగా పాల్పడిన స్కామ్ ఏమిటి? ఇతడిని ఆధారాలతో సహా ఆదియన్ ఎలా పట్టుకున్నాడు? ఇదీ మిగతా కథ

ఎలా ఉంది కథ

ప్రభుత్వం చేతిలో ఉండాల్సిన విద్యారంగాన్ని కార్పొరేటీకరణ చేసి, ప్రతీ అడ్డమైన కోర్సుకి ఎంట్రెన్స్ టెస్టులంటూ పేద, మధ్య తరగతి విద్యార్థులు తప్పనిసరై అప్పులు చేసి కోచింగులు తీసుకునే, అప్పులు కట్టలేక ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితులు కల్పించి, భారీగా వ్యాపారం చేసుకుంటున్న ఎడ్యూటెక్ కంపెనీల వ్యవహారాన్ని కథగా తీసుకున్నాడు ‘జైభీమ్’ దర్శకుడు జ్ఞానవేల్. తన బ్రాండ్ సామాజిక సినిమాల సరసన దీన్ని నిలబెట్టే ప్రయత్నం చేశాడు.

భారీ ఉద్యమాలని, మెసేజుల్నీ ఒక ఫార్ములాగా డిమాండ్ చేసే ఇలాటి విద్యారంగం పాత కథకి యాక్షన్ తో కూడిన పోలీస్ ఎన్ కౌంటర్ల కథ జత చేసి, విద్యారంగం కథ పాత మూస టెంప్లెట్ లో పడిపోకుండా కాపాడడం తెలివైన పనే. దీంతో ఈ కథనం పోలీస్ ఇన్వెస్టిగేషన్ ప్రధానంగా సాగుతూ యూత్ అప్పీల్ కీ, మాస్ అప్పీల్ కీ న్యాయం చేసే యాక్షన్ థ్రిల్లర్ జానర్ లో కొత్త పుంతలు తొక్కిందేమో ప్రేక్షకులే నిర్ణయించుకోవాలి...

ఐతే ఇది ‘జైలర్’ లాగా రియలిస్టిక్ గా ఉండదు. రజనీ పాత్ర కూడా ‘జైలర్’లో లాగా వయసుకి తగ్గ, సాధారణ జీవితపు వాస్తవికతతో ఉండదు. రజనీ తన ఫ్యాన్స్ ని దృష్టిలో పెట్టుకుని పూర్తి మాస్ మసాలా యాక్షన్ హీరోగానే కనిపిస్తాడు. ఎస్పీగా విచ్చలవిడి ఎన్ కౌంటర్ లతో ప్రారంభమై, ఓ గ్రూప్ సాంగ్ వేసుకుని, ఓ కామెడీ చేసుకుని పరిచయమవుతాడు. మరోవైపు సమాంతరంగా అమితాబ్ బచ్చన్ లాయర్ ట్రాక్ నడుస్తూంటుంది. దీనికి సమాంతరంగా టీచర్ పాత్రలో దుషారా విజయన్ ట్రాక్ వస్తూంటుంది. మధ్యమధ్యలో ఫహద్ ఫాజిల్ కామెడీ ట్రాకు. టీచర్ హత్యతో కథ మలుపు తిరిగి ఇక రజనీ ఇన్వెస్టిగేషన్ తో పరుగులు తీస్తుంది. టీచర్ కేసులో తాను ఎన్ కౌంటర్ చేసింది అమాయకుడినని రజనీ తెలుసుకోవడంతో ఫస్టాఫ్ ముగుస్తుంది.

ఇక సెకండాఫ్ కూడా దాదాపు ముప్పాతిక భాగం అసలు హంతకుడెవరో తెలుసుకునే ఇన్వెస్టిగేషన్ కథ గానే మలుపులు తిరుగుతూ సాగి- ఎడ్యుటెక్ కంపెనీ ఓనర్ గా రానా తెరపైకి రావడంతో విద్యావ్యవస్థ కథ మొదలవుతుంది. అయితే కథకి ముగింపు అతి సాధారణంగా ఉండడమే గాక, రజనీ క్యారక్టర్ పరంగా కథలో ఉండాల్సిన టర్నింగ్ కన్పించదు.

ఈ మధ్య సెకండాఫులు తేలిపోయి ఫ్లాపవుతున్న సినిమాల్ని వరసగా చూస్తున్నాం. కానీ ఈ మూవీ ఫస్టాఫ్, సెకండాఫ్ ఎక్కడా పట్టు తప్పకుండా గ్రిప్పింగ్ గా ఉండడం ఒక రిలీఫ్. దీనికి తగ్గట్టు పాత్ర చిత్రణలు కూడా గ్రిప్పింగ్ గా ఉండుంటే –‘జైలర్’ లాగా మరో లెవెల్లో ఉండేది ఈ పాన్ ఇండియా మూవీ.

నటనలేమిటి? సాంకేతికాలేమిటి?

ఫ్యాన్స్ కోసం రజనీకాంత్ మళ్ళీ తన రెగ్యులర్ మ్యానరిజమ్స్ నే ప్రదర్శించాడు. సిగరెట్ ఎగరేయకపోయినా,కళ్లద్దాలు ఎగరేసి పట్టుకోవడం లాంటి ఎస్పీ స్థాయి పాత్రకి తగని గిమ్మిక్కులు చేశాడు. ఫాస్ట్ సగ్ లో మంజూవారియర్ తో మంచి కిక్ ఇచ్చాడు. అలాగే యాక్షన్ సీన్స్ కూడా తన రెగ్యులర్ బ్రాండ్ ని దృష్టిలో పెట్టుకునే చేశాడు.

అయితే పాత్ర పరంగా ఉండాల్సిన డెప్త్ లేదు. తాను అమాయకుడ్ని ఎన్ కౌంటర్ చేశాడన్న బాధ కాసేపే ఉంటుంది. హతుడి కుటుంబంతో అసలు హంతకుడిని పట్టుకుని మీ కొడుకు నిర్దోషి అని నిరూపిస్తానంటాడు. దీంతో ఈ ఇన్వెస్టిగేషన్ తో సాగిపోతాడు. అసలు ఎన్ కౌంటర్ పేరుతో హత్య చేసినందుకు సస్పెండ్ అవ్వాలి. ఇది జరగదు. ఇంకా ఇతడ్ని నమ్మి అసలు హంతకుడిని పట్టుకునేందుకు అనుమతిస్తాడు డిజిపి. తాను అమాయకుడిని చంపాడన్న అపరాధ భావంతో కూడిన పాత్ర చిత్రణ, దానికి ప్రాయశ్చిత్తం చేసుకునే ముగింపూ ఉండవు. చివరికి ఆ కొడుకు నిర్దోషి అని నిరూపించాక, నేను చంపానన్న బాధ ఉంది- ఎంక్వైరీ కొంసాగుతుంది- అని కుటుంబంతో అంటాడు. అంటే ఏంటో? తన మీద థాణె ఎంక్వైరీ వేసుకుంటాడా?

ఇలాగే అమితాబ్ బచ్చన్ పాత్ర కూడా నామ్ కే వాస్తే వుంది. ఆయన మానవ హక్కుల పోరాటం ఏం చేశాడో కన్పించదు. తనకీ రజనీకీ సంఘర్షణతో కూడిన కథ ఉంటుందనుకుంటే అదీ ఉండదు. అయితే ఫహద్ ఫాజిల్ కామిక్ పాత్ర కొనసాగింపు, దానికిచ్చిక షాకింగ్ ముగింపూ బాగున్నాయి. విలన్ గా రానా దగ్గుబాటి చివర్లో వచ్చే పాత్ర. రొటీన్ విలనీ, మంజూ వారియర్ కి పెద్దగా ప్రాధాన్యం లేదు గానీ, టీచర్ పాత్రలో దుషారా విజయన్ సానుభూతి పొందే ప్రయత్నం చేస్తుంది. కానీ ఆమె హత్య దృశ్యపు మాంటేజీలు పదేపదే వేయడం అనవసరం.

ఇక రజనీ ఎలా మూవ్ మెంటిస్తే అలా బీజీఎం ఇచ్చి అభిమానుల్ని ఫుల్ ఖుష్ చేశాడు అనిరుధ్ రవిచందర్. పాటల విషయంలో పెద్దగా శ్రద్ధ తీసుకోలేదు. కదిర్ ఛాయాగ్రహణం టాప్ క్లాస్. ఇతర సాంకేతిక విలువలు, యాక్షన్ దృశ్యాలు లైకా ప్రొడక్షన్స్ రేంజిలో వున్నాయి. మొత్తానికి రజనీ, జ్ఞానవేల్ లు కలిసి కమర్షియల్ సినిమాని ఓ కొత్త శైలిలో చూపించాలని చేసిన ప్రయత్నం, ఓ ఫర్వాలేదనే స్థాయిలో ఉందని చెప్పుకోవచ్చు.

రచన –దర్శకత్వం : టీజే జ్ఞానవేల్

తారాగణం : రజనీకాంత్, అమితాబ్ బచ్చన్, ఫహద్ ఫాసిల్, రానా దగ్గుబాటి, మంజూ వారియర్, రీతికా సింగ్, దుషార విజయన్ తదితరులు

సంగీతం : అనిరుధ్ రవిచందర్, ఛాయాగ్రహణం : ఎస్ ఆర్ కదిర్

బ్యానర్ : లైకా ప్రొడక్షన్స్

నిర్మాత : సుబాస్కరన్ అల్లిరాజా

విడుదల : అక్టోబర్ 10, 2024

రేటింగ్ : 2.5/5

Read More
Next Story