CISF మహిళా కానిస్టేబుల్‌కు మద్దతుగా పంజాబ్ రైతుల కవాతు
x

CISF మహిళా కానిస్టేబుల్‌కు మద్దతుగా పంజాబ్ రైతుల కవాతు

చండీగడ్ విమానాశ్రయంలో నటి కంగనాపై మహిళా కానిస్టేబుల్ ఎందుకు దాడి చేసింది.? దాడి చేసిన వ్యక్తికి పంజాజ్ రైతు సంఘాల నేతలు ఎందుకు మద్దతిస్తున్నారు?


చండీగఢ్ విమానాశ్రయంలో ప్రముఖ నటి, బిజెపి ఎంపి కంగనా రనౌత్‌పై ఓ మహిళా CISF కానిస్టేబుల్‌ దాడి చేశారు. ఆమె చెంపపై కొట్టిన వీడియో వైరలైంది. రనౌత్ ఫిర్యాదు మేరకు మొహాలీ పోలీసులు మహిళా కానిస్టేబుల్‌ కుల్వీందర్‌ కౌర్‌పై ఇండియన్ పీనల్ కోడ్ (IPC) సెక్షన్ 323 (స్వచ్ఛందంగా గాయపరిచినందుకు శిక్ష), 341 (తప్పుడు నిర్బంధానికి శిక్ష) కింద కేసు నమోదు చేశారు.

కౌర్‌కు మద్దతు..

ఇటు కౌర్‌కు మద్దతుగా రైతు సంఘాలు సంయుక్త కిసాన్ మోర్చా (నాన్-పొలిటికల్), కిసాన్ మజ్దూర్ మోర్చా నాయకులు సంఘీభావం తెలిపారు. కవాతు నిర్వహించారు. పంజాబ్‌ రాష్ట్రం మొహాలీలోని గురుద్వారా అంబ్ సాహిబ్ నుంచి వారు మార్ఛ్ నిర్వహించారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉండేందుకు పోలీసులు ముందు జాగ్రత్త చర్యలు చేపట్టారు.

రైతు నాయకుడు సర్వన్‌సింగ్‌ పంధేర్‌ విలేకరులతో మాట్లాడుతూ..ఈ వ్యవహారంపై నిష్పక్షపాతంగా విచారణ జరగాలని డిమాండ్ చేశారు. కౌర్‌కు ఎలాంటి అన్యాయం జరగకూడదన్నారు. పంజాబ్ ప్రజలను రెచ్చగొట్టే ప్రకటనలు చేశారంటూ రనౌత్‌పై కూడా మండిపడ్డ రైతులు కేసు విచారణ నిష్పక్షపాతంగా జరగాలని కోరుతున్నారు.

అసలు దాడికి కారణమేంటి?

గతంలో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాల్ని నిరసిస్తూ ఢిల్లీ సరిహద్దుల్లో ఆందోళనకు దిగిన రైతుల్ని అగౌరవపరిచేలా కంగనా మాట్లాడడమే ఈ దాడికి కారణమని తెలుస్తోంది. ‘రూ.100ల కోసమే రైతులు రోడ్ల మీద కూర్చొన్నారని కంగన మాట్లాడారు. మా అమ్మ కూడా నిరసన ప్రదర్శనలో కూర్చున్నారు. ఆమె వెళ్లి అక్కడ కూర్చోగలరా? అని కుల్విందర్ కౌర్‌ కానిస్టేబుల్‌ పేర్కొన్నారు.

Read More
Next Story