హారర్ కామెడీ:  ‘ది రాజాసాబ్‌’ రివ్యూ
x

హారర్ కామెడీ: ‘ది రాజాసాబ్‌’ రివ్యూ

స్కేల్ ఉంది… కానీ ఇంపాక్ట్ ఎక్కడ?

రాజు (ప్రభాస్)కు తన నాయనమ్మ గంగమ్మ (జరీనా వాహెబ్) అంటే ప్రాణం. అయితే ఆమె ఎప్పుడూ తనను వదిలేసి వెళ్లిపోయిన భర్త కనకరాజు (సంజయ్ దత్) జ్ఞాపకాల్లో బ్రతుకుతూంటుంది. అయితే ఆమె జ్ఞాపకాలు ఎక్కువ కాలం నిలిచే పరిస్దితి లేదు. ఎందుకంటే ఆమెకు అల్జీమర్స్ వ్యాథి. ఈ క్రమంలో తన తాతను ఎక్కడున్నా తీసుకొచ్చి ఆమె ముందు నిలబెట్టాలని తపిస్తూంటాడు రాజు. కానీ ఆయన బ్రతికున్నాడో లేదో తెలియదు. ఈ క్రమంలో ఓ రోజు హైదరాబాద్ లో అనుకోకుండా ఒకరు తీసిన ఫొటోలో తన తాత కనపడటం జరుగుతుంది. దాంతో ఆయన్ను వెతుక్కుంటూ బయిలుదేరతాడు.

అక్కడ రాజా తాత గురించి ఊహించని గతం బయిటపడుతుంది. షాక్ అయిన రాజా..ఆయన్ను అంతం చేయాలనుకుంటాడు. మరి ఇంతకీ ఆయన రాజా కు కనిపించాడా..ఆయన గతం ఏమిటి... ఎందుకు తన తాతను రాజా అంతం చేయాలనకున్నాడు. ఆయన ఎందుకు గంగమ్మని వదిలి వెళ్లిపోయాడు. ఈ క్రమంలో పరిచయం అయిన అక్కడ ఇద్దరు అమ్మాయిలు (నిధి అగర్వాల్, మాళవిక మోహనన్) ఎవరు..ఈ కథలో మరో హీరోయిన్ (రిద్ధి)పాత్ర ఏమిటి వంటి విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

విశ్లేషణ

వరస యాక్షన్ జానర్స్ లో దూసుకుపోతున్న ప్రభాస్‌ను హారర్–కామెడీ స్పేస్‌లో ఉంచడం ఒక ధైర్యమైన జానర్ షిఫ్ట్. మాస్ హీరోను సరదా, మైండ్-ట్విస్ట్, మిస్టిక్ ఎలిమెంట్స్‌తో నడిపించాలన్న ఆలోచనలో స్పష్టమైన “ఎక్స్‌పెరిమెంటల్ వాల్యూ” ఉంది. అయితే ఆ ఆలోచన సవ్యంగా తెరకెక్కలేదు. అంటే సమస్య ఐడియాలో లేదు. సమస్య ఆ ఐడియాను స్క్రిప్ట్ ఎలా మలిచిందనే దానిలో ఉందని అర్దం చేసుకోవాలి.

ఈ సినిమాలో హీరో కు అసలు తను ఎదుర్కోబోయే సమస్య తన తాత (సంజయ్ దత్) అని తెలిసే సరికే ఇంటర్వెల్ వస్తుంది. దాంతో అక్కడ దాకా హీరో జర్నీని పూర్తిగా ఫిల్ ఇన్ ది బ్లాక్స్ తరహాలో సీన్స్ వేసుకుంటూ వెళ్ళారు. కథలో కలవని ముగ్గురు హీరోయిన్స్, గ్లామర్ సెంట్రిక్ సీక్వెన్సులు, వీటితో కథను ముందుకు నడిపించని కామెడీ ట్రాక్‌లు ఇలా సీన్స్ వస్తూ పోతూ ఉంటాయి. ఈ సీన్స్, ఎపిసోడ్‌లు కథకి కారణం (cause) కావు, ఫలితం (effect) కూడా కావు. దాంతో ఫస్ట్ హాఫ్‌లో కథ ఏ దిశలో పోతుందో స్పష్టత ఉండదు. కాన్సెప్ట్ సెటప్ కావాల్సిన చోట, ఫార్ములా ఎంటర్టైన్మెంట్ ఆక్రమిస్తుంది.

సెకండాఫ్ లో కథ హారర్ కామెడీ జానర్ అని గుర్తు చేసుకుని ఆ మర్యాదను పాటిస్తూ ఓ భవంతిలోకి వెళ్తుంది. అక్కడ నెగటివ్ ఫోర్స్ హీరోను హిప్నటైజ్ చేయడం. అతను ఆ మిస్టిక్ మేజ్ నుంచి తప్పించుకోవడం “సప్త చక్రాలు” కాన్సెప్ట్‌తో స్పిరిచువల్–మైథలాజికల్ అండర్‌టోన్ ఇలా నడుస్తూంటుంది. నోలన్ సినిమా ఇన్‌సెప్షన్ (Inception) లాగ స్క్రిప్టు రాసే ప్రయత్నం చేసారా అనిపిస్తుంది. ఎక్కువగా మనస్సులో సీన్స్ జరుగుతూంటే. సినిమాలో ప్రీ క్లైమాక్స్ వచ్చేదాకా ప్రభాస్ పాత్ర అక్కడక్కడే తిరుగుతుంది. ఆ తర్వాతే “యాక్టివ్ ప్రోటాగనిస్ట్”గా మారుతుంది. అప్పటిదాకా అతను సంఘటనలకు స్పందిస్తూంటుంది. వాటిని ఎదుర్కొనే వ్యక్తిగా మారేసరికి సినిమా క్లైమాక్స్ కు వచ్చేస్తుంది.

ఫస్ట్ హాఫ్‌లోనే ఈ మిస్టిక్ కాన్సెప్ట్‌ను నాటివుంటే హీరోయిన్స్ కూడా కథలో భాగమయ్యేవారు, కామెడీ కూడా సిట్యుయేషన్ నుంచి పుట్టేది. హారర్–కామెడీ టోన్ సమతుల్యంగా ఉండేది.

టెక్నికల్ గా...

సెట్‌లు: ఖరీదుగా, గ్రాండ్‌గా ఉన్నాయి. ఇక ఇలాంటి సినిమాలకు అవసరమైన VFX: కొన్ని సీన్లలో బలహీనంగా ఉంది, అందుకే ఇంపాక్ట్ తగ్గింది. సినిమాటోగ్రఫీ బాగుంది. మ్యూజిక్ (థమన్): వినడానికి బాగుంది కానీ గుర్తుండిపోయేంత కాదు. ఎడిటింగ్/టోన్: రొమాన్స్, కామెడీ భాగాలు బోర్‌గా, క్రింజ్‌గా అనిపిస్తాయి.

నటీనటుల్లో ...

ప్రభాస్ తన పాత్రని కొత్తగా ట్రై చేసాడు. లైట్ స్పేస్‌లోకి వెళ్లినట్టు ఆయన నటనలో స్పష్టంగా కనిపిస్తుంది. ఇక ప్రీ–క్లైమాక్స్ భాగంలో తన లోని నటుడు పూర్తిగా కనిపిస్తాడు. కానీ: లుక్స్, మేకప్‌పై ఇంకా శ్రద్ధ అవసరం. డైలాగ్ డెలివరీలో కొన్ని చోట్ల అసమతుల్యత (inconsistency) కనిపిస్తుంది. అంటే నటనలో ఊపు ఉన్నా, టెక్నికల్ ఫినిషింగ్ ఆయన పాత్రను పూర్తిగా ఎలివేట్ చేయలేదు.

ఇక జరీనా వహాబ్ – తన పాత్రలో ఓకే అనిపిస్తారు, ప్రత్యేకంగా నిలిచే అవకాశం లేకపోయింది. సంజయ్ దత్ – నెగటివ్ ఫోర్స్‌గా లుక్, బాడీ లాంగ్వేజ్, పర్ఫార్మెన్స్‌లో బాగానే పనిచేశారు. బోమన్ ఇరానీ – చిన్న పాత్రే అయినా బలమైన ముద్ర వేస్తారు. ఆయన ఎంట్రీతో సన్నివేశాలకు వెయిట్ వస్తుంది. నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ధి కుమార్ – కథ పరంగా పరిమిత పాత్రలు. ప్రధానంగా విజువల్ అప్పీల్ కోసం మాత్రమే వాడినట్టు అనిపిస్తారు.

ఫైనల్ థాట్

థియేటర్ నుంచి బయిటకు వస్తుంటే ఓ అభిమాని తన స్నేహితుడుతో అన్న కామెంట్..ప్రభాస్ సినిమా అని,దెయ్యాల సినిమాకు తెచ్చావేంట్రా అని. అంటే ఈ సినిమాలో ప్రభాస్ ప్రభావం ఎంత తక్కువ ఉందో అర్దంచేసుకోవచ్చు. ‘ది రాజా సాబ్’కి మంచి ఐడియా, పెద్ద స్కేల్ ఉన్నాయి. అయితే సరైన ఎగ్జిక్యూషన్ లేకపోవడం వల్ల ఇది పూర్తిగా బోరింగ్ డ్రామాగా మారిపోయింది. ప్రభాస్ లాంటి స్టార్ చేయదగ్గ సినిమా అయితే ఇది కాదు.

Read More
Next Story